Article 370 అంటే ఎమిటి? ఎందుకు తీసుకువ‌చ్చారు? ర‌ద్దు త‌ర్వాత ర‌చ్చ‌.. పూర్తి వివ‌రాలు ఇవిగో

By Mahesh Rajamoni  |  First Published Dec 11, 2023, 11:11 AM IST

Article 370: ఆర్టికల్ 370 జ‌మ్మూకాశ్మీర్ ప్రాంతానికి ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని క‌ల్పిస్తుంది. అయితే, భార‌త్ లోని ఇత‌ర రాష్ట్రాల మాదిరిగానే ఉండాల‌నే క్ర‌మంలో ప్ర‌భుత్వం ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసింది. దీనిని స‌వాలు చేస్తూ సుప్రీంకోర్టులో అనేక‌ పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి.  
 


Article 370 complete details: 2019 ఆగస్టు 5న, భారత హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ల‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే స‌మ‌యంలో జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా రెండు ప్రాంతాలుగా విభ‌జించారు. అయితే, జ‌మ్మూకాశ్మీర్ కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని క‌ల్పించే ఆర్టిక‌ల్ 370, 35ఏ ల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత ప్ర‌జ‌లు, రాజ‌కీయ వ‌ర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ ర‌ద్దును స‌మ‌ర్థించేవాళ్లు ఉన్నారూ.. వ్య‌తిరేకించే వాళ్లూ కూడా ఉన్నారు. ఇదే విష‌యం గురించి ప‌లు రాజ‌కీయ పార్టీలు, ప‌లువురు ప్ర‌జ‌లు ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును ఎత్తిచూపుతూ.. అనేక అంశాలు, ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతూ న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించారు. అస‌లు ఈ ఆర్టిక‌ల్ 370 అంటే ఎమిటి?  దానిని ఎందుకు తీసుకువ‌చ్చారు? జ‌మ్మూకాశ్మీర్, ఆర్టిక‌ల్ 370కి ఉన్న సంబంధ‌మేంటి? ర‌ద్దు త‌ర్వాత ఇంకా ర‌చ్చ ఎందుకు కొన‌సాగుతోంది? అనే ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌లు మీకు వ‌చ్చే వుంటాయి. ఆ విష‌యాలు ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.. ! 

ఆర్టిక‌ల్ 370 అంటే ఎమిటి? దానికి వెనుకు వున్న చరిత్ర ఏమిటి? 

1947 లో భారత దేశం బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత దేశంలో ప‌లు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఆయా రాజ్యాలను భారత యూనియన్ లో కలుపుకోవడానికి ప్రభుత్వ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్ ను భారత్ యూనియన్ లో కలపడానికి అప్పటి ఆ ప్రాంత పాలకులు  కాశ్మీర్ మహారాజా, హరి సింగ్.. జమ్మూ కాశ్మీర్ ను భారత ప్రభుత్వంలో కలపడానికి కొన్ని షరతులు విధించారు. ఈ క్రమంలోనే మూడు విష‌యాల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తూ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్‌పై సంతకం చేశారు. అవి: 1. విదేశీ వ్యవహారాలు, 2. రక్షణ, 3. కమ్యూనికేషన్స్.

Latest Videos

మార్చి 1948లో,మహారాజా రాష్ట్రంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని నియమించారు. అప్పుడు షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రిగా ఉన్నారు. జూలై 1949లో షేక్ అబ్దుల్లా, మరో ముగ్గురు సహచరులు భారత రాజ్యాంగ సభలో చేరారు. ఈ క్ర‌మంలోనే జ‌మ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదాపై చర్చలు జరిపారు. జ‌మ్మూకాశ్మీర్ కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని క‌ల్పించే విధంగా ప‌లు అంశాల‌తో ఆర్టికల్ 370ని ఆమోదించారు. దీనిని షేక్ అబ్దుల్లా రూపొందించారు. ఆర్టిక‌ల్ 370 ఆమోదంతో జ‌మ్మూకాశ్మీర్ భార‌త దేశంలో క‌లిసింది. కానీ దానికంటూ ఆర్టిక‌ల్ 370 కింద కొన్ని ప్ర‌త్యేక అధికారాలు, ప్ర‌తిప‌త్తిని కల్పించారు. 

ఆర్టిక‌ల్ 370 లోని నిబంధ‌న‌లు ఎమటి? 

భార‌త ప్ర‌భుత్వంలో క‌వ‌డానికి జ‌మ్మూకాశ్మీర్ కోసం ఆర్టిక‌ల్ 370ని తీసుకువ‌చ్చారు. దీని ప్ర‌కారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్ల విషయంలో మినహా రాష్ట్రంలో చట్టాలను వర్తింపజేయడానికి పార్లమెంటుకు త‌ప్ప‌నిస‌రిగా జ‌మ్మూకాశ్మీర్ ప్రభుత్వ ఆమోదం అవసరం. అంటే జ‌మ్మూకాశ్మీర్ లో భార‌త‌దేశ‌ ఏ చ‌ట్టం అమ‌లు చేయాల‌న్నా అక్క‌డి ప్రభుత్వం నుంచి ఆమోదం అవ‌స‌రం ఉంటుంది. అలాగే, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు కొన్ని ర‌క్ష‌ణ‌లు క‌ల్పించారు. జ‌మ్మూకాశ్మీర్ కు భార‌త రాజ్యాంగంతో పాటు దానికంటూ మ‌రో ప్ర‌త్యేక రాజ్యాంగం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ నివాసితుల పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కుల చట్టం భారతదేశంలోని మిగిలిన నివాసితులకు భిన్నంగా ఉంటుంది. ఆర్టికల్ 370 ప్రకారం, ఇతర రాష్ట్రాల పౌరులు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తిని కొనుగోలు చేయలేరు. ఆర్టికల్ 370 ప్రకారం రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కేంద్రానికి ఉండ‌దు.

ఆర్టిక‌ల్ 370 చుట్టు వివాదాలు ఎందుకు? 

భార‌త దేశం విడిపోయిన త‌ర్వాత పాకిస్థాన్ కూడా జ‌మ్మూకాశ్మీర్ ను త‌న‌లో విలీనం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ అవి ఫ‌లించ‌లేదు. పైన పేర్కొన్న ష‌ర‌తుల‌తో భార‌త్ లో విలీనం అయింది. అప్ప‌టి నుంచి భార‌త్-పాక్ ల మ‌ధ్య వైరం మ‌రింతగా ముదిరింది. ఇదే క్ర‌మంలో ఆర్టిక‌ల్ 370 ద్వార జ‌మ్మూకాశ్మీర్ కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని క‌ల్పించ‌డంతో భార‌త చ‌ట్టాలు అన్ని అక్క‌డ అమ‌లు చేయ‌డం కుద‌ర‌దు కాబ‌ట్టి చాలా మంది దీనిని వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు. దేశంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికీ ఒకే విధ‌మైన హ‌క్కులు, అధికారాలు ఉండాల‌నే వాద‌న‌లు వినిపిస్తూనే ఉన్నాయి. దీని కోసం జ‌మ్మూకాశ్మీర్ కు ప్ర‌త్యేకత‌ను క‌ల్పించే ఆర్టిక‌ల్ 370 స‌హా ఇత‌ర చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ వ‌చ్చింది. అలాగే, ఆర్టిక‌ల్ 370 జ‌మ్మూ అభివృద్ధికి కూడా అడ్డుగా ఉంద‌నేది మ‌రికొంద‌రి వాద‌న‌. 

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు.. దాని త‌ర్వాతి ప‌రిణామాలు ఏమిటి? 

సార్వాత్రిక ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలోకి వ‌స్తే జ‌మ్మూకాశ్మీర్ కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చింది. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌మ్మూకాశ్మీర్ ప్ర‌జ‌ల అభివృద్ధికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొంటూ ఆర్టికల్ 370 ర‌ద్దు నిర్ణ‌యాన్ని అమ‌లు చేసింది.  2019 ఆగస్టు 5న, భారత హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ల‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే స‌మ‌యంలో జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా జ‌మ్మూకాశ్మీర్, ల‌ఢ‌ఖ్‌ రెండు ప్రాంతాలుగా విభ‌జించారు. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడం అక్టోబర్ 31, 2019 నుండి అమల్లోకి వచ్చింది. 

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుపై భిన్నాభిప్రాయాలు.. న్యాయ‌స్థానాల్లో పిటిష‌న్లు.. 

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత జ‌మ్మూకాశ్మీర్ ప్ర‌జ‌ల నుంచి మాత్ర‌మే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల ప్ర‌జ‌లు, రాజ‌కీయ నాయ‌కులు, మేధావి వ‌ర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ర‌ద్దును కొంత‌మంది స్వాగ‌తించ‌గా, మ‌రికొంద‌రు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈ క్ర‌మంలోనే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును స‌వాలు చేస్తూ వివిధ అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ న్యాయ‌స్థానాల‌ను ఆశ్రాయించారు. ఈ అన్ని కేసుల‌ను క‌లిపి సుప్రీంకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో మొత్తం 23 పిటిషన్లు ఉన్నాయి. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, వివిధ అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ పిటిష‌న్లు దాఖ‌లు చేసిన వారిలో ప‌లువురు న్యాయవాదులు,  సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు కూడా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు మాత్ర‌మే కాదు, జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడాన్ని కూడా వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖ‌ల‌య్యాయి.

Read More: UPI యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపుల‌పై ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం

click me!