మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించడం ఆ కూటమిలో సెగలు రేపుతున్నది. ముఖ్యంగా నితీశ్ కుమార్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత నమోదవుతున్నది.
INDIA Bloc: విపక్ష కూటమి సమైక్యంగా బరిలోకి దిగడానికి అనేక ఆటంకాలు, అడ్డంకులు, సవాళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీల మధ్య విభేదాలు పెను సవాలును విసురుతున్నాయి. ఇంకా సీట్ల సర్దుబాటు వ్యవహారంపై నిగ్గు తేలనే లేదు, ప్రధాని అభ్యర్థి విషయమై ఎడమొహం పెడమొహంగా పరిస్థితులు మారాయి.
బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నప్పుడే ఆయన ప్రధానమంత్రి కావాలనే కోరిక తీరడం లేదనే ఈ నిర్ణయం తీసుకున్నాడని కమల దళం నేతలు విమర్శించారు. ఈ ఆరోపణల్లో ఎంతో కొంత నిజం లేదని చెప్పలేమనే అభిప్రాయాలు ఇప్పుడు బలపడుతున్నాయి. విపక్ష కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గేను టీఎంసీ, ఆప్ ప్రతిపాదించగానే నితీశ్ కుమార్ పార్టీ అగ్గిమీద గుగ్గిళం అవుతున్నది.
విపక్ష కూటమి కోసం పార్టీలను ఏకతాటి మీదికి తేవడానికి, ఒక సంయుక్త సమావేశాన్ని నిర్వహించడానికి నితీశ్ కుమార్ శ్రమించాడనేది అందరూ అంగీకరించే విషయమే. కానీ, అందుకు ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలనేది ఎవరూ అంగీకరించరు. సొంత పార్టీ జేడీయూ ఎంతో కొంత ఆశించడంలో తప్పేమీ లేదు. అందుకే మల్లికార్జున్ ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా అనుకోవడం ఏమిటంటూ ఆ పార్టీ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 29వ తేదీన జేడీయూ నేషనల్ కౌన్సిల్ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించాలని అనుకుంటున్నది. విపక్ష కూటమి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసేలా నితీశ్ కుమార్‌నే పీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ డిమాండ్ చేయవద్దని, పీఎం అభ్యర్థిని అభ్యర్థులందరి సమ్మతంతో నిర్ణయించుకోవాలనే కామెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నది.
Also Read: Hijab: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. హిజాబ్ బ్యాన్ నిర్ణయం వెనక్కి తీసుకుంటాం: సీఎం సిద్ధరామయ్య
మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్.. విపక్ష కూటమి పీఎం అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపాదించగానే.. సంక్షోభాన్ని అనుమానించిన రాహుల్ గాంధీ వెంటనే నితీశ్ కుమార్‌తో మాట్లాడారు. ఈ సంక్షోభం ముదరకుండానే ఖర్గే నిరాకరించిన విషయం తెలిసిందే.
నిజానికి నితీశ్ కుమార్ తనకు సవాల్ కాంగ్రెస్‌లో చూడటం లేదు. తన అభ్యర్థిత్వాన్ని తక్కువ చేసి చూసే ఇతర కూటమి సభ్యులపైనే అసంతృప్తి ఉన్నది. టీఎంసీ, ఆప్ వంటి పార్టీలపై ఆయనకు అసంతృప్తి కొనసాగుతున్నది. అయితే, చిలికి చిలికి ఈ అంశం చివరికి ఎక్కడిదాకా దారి తీస్తుందనేది వేచి చూడాలి. ఎందుకంటే.. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు కూటమిలో చేరడానికి తర్జనభర్జన పడి.. ఆ తర్వాత కూడా విమర్శలు చేసిన వారే. వీరు కాంప్రమైజ్ అయ్యే అవకాలు చాలా తక్కువ. దీంతో ఈ వ్యవహారమంతా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నది.