ఇస్రో పుష్పక్ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ (ఆర్ఎల్వీ) ఎల్ఈఎక్స్ 02 ల్యాండింగ్ ప్రయోగాన్ని నేటి ఉదయం విజయవంతంగా నిర్వహించింది. 7.10 గంటలకు కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఈ ప్రయోగం జరిగింది.
అతి తక్కువ ఖర్చుతో విజయవంతమైన ప్రయోగాలకు నిలయంగా మారిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. పుష్పక్ రీయూజబుల్ ల్యాండింగ్ వెహికల్ (ఆర్ఎల్వీ) ఎల్ఈఎక్స్ 02 ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో శుక్రవారం ఈ ప్రయోగం జరిగింది.
భారత అంతరిక్ష సంస్థ నిర్వహించిన ప్రయోగాల పరంపరలో ఆర్ఎల్వీ ఎల్ ఈఎక్స్ 02 ల్యాండింగ్ ప్రయోగం రెండోది. మార్చి 22వ తేదీన శుక్రవారం ఉదయం 7.10 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించినట్టు ఇస్రో అధికారికంగా వెల్లడించింది. ‘‘ఆర్ఎల్వీ-ఎల్ఈఎక్స్-02 ప్రయోగం: రెక్కలున్న పుష్పక్ (ఆర్ఎల్వీ-టీడీ) అనే వాహకనౌక రన్ వేపై కచ్చితత్వంతో ల్యాండ్ అయింది’ అని ఇస్రో తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.
Pushpak captured during its autonomous landing📸 pic.twitter.com/zx9JqbeslX
— ISRO (@isro)
గత ఏడాది పూర్తయిన ఆర్ఎల్వీ-ఎల్ ఈఎక్స్-01 మిషన్ తర్వాత ఆర్ ఎల్వీ-ఎల్ ఈఎక్స్-02 చినూక్ హెలికాప్టర్ నుంచి తనకు తానుగా ల్యాండిగ్ అయ్యిందని ఇస్రో పేర్కొంది. మరింత క్లిష్టమైన అమ్నోవర్లను చేపట్టడం, క్రాస్ రేంజ్, డౌన్ రేంజ్ రెండింటినీ సరిదిద్దడం, పూర్తి అటానమస్ మోడ్ లో రన్వేపై ల్యాండ్ అయ్యేలా ఆర్ఎల్వీని రూపొందించారు.
ప్రయోగం ఎలా జరిగిందంటే.. ?
పుష్పక్ ను భారత వైమానిక దళం చినూక్ హెలికాప్టర్ ద్వారా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అక్కడి నుంచి విడుదల చేసింది. అది భూమిపైకి వేగంగా వచ్చి రన్ వై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. తనను తాను నియంత్రించుకునేందుకు ప్యారాచూట్ ను ఓపెన్ చేసుకుంది. గేర్ బ్రేకులు, నోస్ వీల్ స్టీరింగ్ సిస్టం సాయంతో ఆగిపోయింది. అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్న ఆర్ ఎల్ వీ అప్రోచ్, హైస్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను ఈ మిషన్ విజయవంతంగా అనుకరించిందని ఇస్రో తెలిపింది.
దీనిపై ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ మాట్లాడుతూ.. ఈ మరో విజయం ద్వారా ఇస్రో టెర్మినల్ దశ వ్యూహరచన, ల్యాండింగ్, శక్తి నిర్వహణను పూర్తి అటానమస్ మోడ్ లో ప్రావీణ్యం సాధించగలదని తేలిందని, ఇది భవిష్యత్ ఆర్బిటల్ రీ-ఎంట్రీ మిషన్ల దిశగా కీలకమైన దశ అని అన్నారు.