రథయాత్ర గురించి చెప్పుకున్నప్పుడు ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బాబ్రీ మసీదు కూల్చివేత గురించి...ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలనే తమ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతూ, వీహెచ్ పీ, బీజేపీ.వాటి అనుబంధ సంస్థలు 6 డిసెంబర్ 1992న 150,000 వాలంటీర్లతో మసీదు బయట ఒక ర్యాలీని నిర్వహించాయి.
ఎల్ కే అద్వానీ.. బీజేపీ సీనియర్ నేతగా, భారత మాజీ ఉప ప్రధానిగా, రాజకీయదురందరుడిగా సుపరిచితం. ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరిస్తోంది. ఈ నేపథ్యంలో లాల్ క్రిష్ణ అద్వానీ గురించి మాట్లాడుకుంటే.. ఒక తరానికి ఎల్ కే అద్వానీ అంటే రథయాత్ర.. రథయాత్ర అంటే ఎల్ కే అద్వానీ. 1980ల్లో పుట్టిన తరానికి అద్వానీ ఇలాగే పరిచయం. రాజజన్మభూమి సాధన కోసం చేపట్టిన రథయాత్ర, బాబ్రీమసీదు కూల్చివేత వీటి నేపథ్యంలోనే అద్వానీని ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. ఇంతకీ రథయాత్ర ఏంటి? ఎప్పుడు, ఎలా? ఎందుకు ప్రారంభించారు? అందులో అద్వానీ పాత్ర ఏంటి? ఆ వివరాలు చూద్దాం.
1990 సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు రామ్ రథ యాత్ర జరిగింది. ఇది రాజకీయ, మతపరమైన ర్యాలీ. దీనిని భారతీయ జనతా పార్టీ, దాని హిందూ జాతీయవాద అనుబంధ సంఘాలు నిర్వహించాయి. ఆ సయమంలో బీజేపీ అధ్యక్షుడిగా ఎల్ కే అద్వానీ ఉన్నారు. ఈ రథయాత్రకు అద్వానీ నాయకత్వం వహించారు . బాబ్రీ మసీదు స్థలంలో హిందూ ఆరాధ్యదైవమైన రాముడికి ఆలయాన్ని నిర్మించాలని విశ్వహిందూ పరిషత్ (VHP), సంఘ్ పరివార్, దాని అనుబంధ సంఘాల నేతృత్వంలోని ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి ఈ యాత్రను మొదలుపెట్టారు.
బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న.. శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్...
1980వ దశకంలో, విహెచ్‌పి, ఇతర సంఘ్ పరివార్ అనుబంధ సంస్థలు అయోధ్యలో బాబ్రీమసీదు స్థానంలో రామజన్మభూమి ఉందని.. ఆ ప్రదేశంలో రాముడికి ఆలయాన్ని నిర్మించాలని ఆందోళనను ప్రారంభించాయి. బిజెపి ఈ ఉద్యమానికి రాజకీయంగా మద్దతునిచ్చింది. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, బీజేపీ దేశవ్యాప్తంగా అయోధ్యకు రథయాత్రను ప్రకటించింది. ఈ యాత్రకు ఎల్‌కె అద్వానీ నాయకత్వం వహించారు. సంఘ్ పరివార్‌కు చెందిన వేలాది మంది కరసేవకులు ఇందులో పాల్గొన్నారు. యాత్ర 25 సెప్టెంబర్ 1990న సోమనాథ్‌లో ప్రారంభమైంది. వందలాది గ్రామాలు, నగరాల గుండా సాగింది. రోజుకు దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించారు అద్వాని. ఒకే రోజులో ఆరు బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రికార్డులున్నాయి. ఈ యాత్ర భారతదేశపు అతిపెద్ద ప్రజా ఉద్యమాలలో ఒకటిగా మారింది.
ఉత్తర భారతదేశంలోని నగరాల్లో ఈ రథయాత్రతో అల్లర్లు చెలరేగాయి. హింసకి దారితీశాయి. ఈ క్రమంలో యాత్ర బీహార్ లో అడుగుపెట్టినప్పుడు అద్వానీని బీహార్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 150,000 మంది అద్వానీ మద్దతుదారులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ అరెస్టులు జరుగుతున్నప్పటికీ పదివేల మంది కార్యకర్తలు అయోధ్యకు చేరుకుని మసీదును ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 20 మంది మరణించారు. ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా హిందూ-ముస్లిం అల్లర్లు చెలరేగడానికి కారణమయ్యాయి. ఇందులో వందలాది మంది మరణించారు.
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో ముస్లింలు ఎక్కువగా బాధితులయ్యారు. ఈ అల్లర్ల తరువాత, బిజెపి కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. 1991 పార్లమెంటరీ ఎన్నికలలో బిజెపి అయోధ్య ఆందోళనను తన ప్రచారంలో ముఖ్య సాధనంగా వాడుకుంది. ఈ వ్యూహం మే-జూన్ 1991 పార్లమెంటరీ ఎన్నికలలో బాగా పనిచేసింది. బీజేపీకి దేశవ్యాప్తంగా ఓట్ల శాతం పెరిగింది. దక్షిణాన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో అస్సాం వంటి రాష్ట్రాల్లో మంచి ఫలితాలను ఇచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత లోక్‌సభలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
బాబ్రీ మసీదు కూల్చివేత
రథయాత్ర గురించి చెప్పుకున్నప్పుడు ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బాబ్రీ మసీదు కూల్చివేత గురించి...ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలనే తమ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతూ, వీహెచ్ పీ, బీజేపీ.వాటి అనుబంధ సంస్థలు 6 డిసెంబర్ 1992న 150,000 వాలంటీర్లతో మసీదు బయట ఒక ర్యాలీని నిర్వహించాయి. ఈ ర్యాలీలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి , ఉమాభారతి సహా పలువురు బీజేపీ నేతలు మాట్లాడారు. ఈ సమయంలో క్రమంగా జనప్రవాహం పెరిగింది. అందులో నుంచి ఓ యువకుడు మసీదు భద్రతావలయాన్ని దాటుకుని మసీదు పైకెక్కి కాషాయజెండాను ఊపాడు. ఆ క్రమంలోనే జనాలు ఒక్కసారిగా పోటెత్తారు. మసీదును కూల్చేశారు. ఆ తరువాత ఏర్పడిన హిందూ-ముస్లిం హింసలో దాదాపు 2000 మంది దాకా మరణించారు.
కూల్చివేతపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి మన్మోహన్ సింగ్ లిబర్హాన్ రాసిన విచారణ నివేదికలో అనేక మంది బిజెపి నాయకులతో సహా 68 మందిపై కూల్చివేతలకు పాల్పడ్డారు. నివేదికలో పేర్కొన్న వ్యక్తులలో అద్వానీ, వాజ్‌పేయి, జోషి, భారతి, అలాగే అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఉన్నారు. ఏప్రిల్ 2017లో, ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు అద్వానీ, మురళీ మనోహర్ జోషి , ఉమాభారతి , వినయ్ కతియార్ లతో పాటు అనేక మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదు చేసింది. 2020లో కోర్టు అద్వానీ, సింగ్ లతో పాటు మొత్తం 30 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.