Samanyudu :విశాల్ `సామాన్యుడు’రివ్యూ

By Surya Prakash  |  First Published Feb 4, 2022, 3:29 PM IST

విశాల్ కు ఇలాంటి పాత్రలు కొత్తా కాదు..చూసేవాళ్లకు అంతకన్నా కాదు కాబట్టి సోసో గా అనిపిస్తుంది. డింపుల్ హయాతి  హీరో లవర్ గా ఏదో ఉందంటే ఉందనిపించింది.  యోగిబాబు హీరో ప్రెండ్ గా కాస్త నవ్వించాడు. 


పందెంకోడి అనే ఒక్క సినిమాతో విశాల్ ఇన్నాళ్లుగా కెరీర్ లాగేస్తున్నాడనే మాట  నిజం అనిపిస్తుంది. అతని సినిమా చూసిన ప్రతీసారీ. ఆ కథలు విని సినిమాలు చేస్తాడో లేక నా కోసం వస్తారు కానీ కథలు కోసం వస్తారా జనం అనుకుంటాడో కానీ ...విశాల్ సినిమాల్లో విషయం అరుదైపోతోంది.అతని సినిమాల్లో కథ వెతకటం అంటే ఫ్లాఫ్ సినిమా మ్యాటినీకి మనుష్యులను వెతకటం లాంటిదే. ప్రతీ సారి ఓ యాక్షన్ ఎపిసోడ్ తో ట్రైలర్ కట్ చేయటం...ఈ సారి దుమ్ము రేగిపోతుందని స్టేట్మెంట్ ఇచ్చి థియోటర్ లో దూకేయటం...రొటీమ్ మాస్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిపోయాడు. అంతెందుకు ఈ సినిమా చూస్తూంటే మనకు బోలెడు ఎనభై,తొంభైల నాటి సినిమాలు గుర్తు వస్తాయి. విశాల్ కు గుర్తు రాలేదా...లేక అప్పటి జనం ఇప్పుడు థియోటర్ కు ఏమి వస్తారులే వాళ్లకు కొత్తగా అనిపిస్తుందిలే అనుకున్నాడో అర్దం కాదు.

కథ

Latest Videos

undefined

పోరస్ (విశాల్) ఓ మిడిల్ క్లాస్ మానవుడు. అతనికి తన తండ్రి(మారిముత్తు) లాగే పోలీస్ జాబ్ కొట్టాలని కోరిక. , తల్లి (తులసి), చెల్లి (రవీనా రావి)తో సామాన్యంగా బతికే పోరస్ (విశాల్) ..అందరి హీరోల్లా...సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించాలనుకుంటాడు. కానీ తండ్రి అలా చేస్తే ఏదో ఒక నేరంలో ఇరుక్కుంటావు..అది నీ పోలీస్ జాబ్ రావటానికి ఇబ్బంది పెడుతుందని హిత బోధ చేస్తూంటాడు. ఇక ఈ కథకో విలన్ నీలకంఠం(బాబూరాజ్). అతను ఎంపి అవ్వాలని కోరిక.

ఆ విలన్ కో కెమికల్ ఫ్యాక్టరీ. దాంతో జనాలకు ఇబ్బందులు. ఆ ఇబ్బందులు,కష్ట నష్టాలను అందరి ముందు పెట్టాలనకుంటాడు  పరిశుద్దం (ఇలంగో కుమరవేల్). అది మామూలుగానే విలన్ నీలకంఠానికి నచ్చదు. అతన్ని షరా మామూలుగా చంపేస్తాడు. ఈ లోగా  పోరస్ చెల్లికూడా హత్యకు గురి అవుతుంది. అప్పుడు పోరస్..పోలీస్ అవ్వకముందే తన చెల్లిన చంపినవారిని కనిపెట్టడం కోసం తనదైన శైలిలో తవ్వకాలు మొదలెడతాడు. ఆ క్రమంలో ఏం జరుగుతుంది. చెల్లిన చంపినవాళ్లు ఎవరు..ఎందుకు చంపారు...తన చెల్లిన చంపినవారికి పోరస్ బుద్ది చెప్పాడా...చివరకి పోలీస్ అయ్యాడా? మైథిలి (డింపుల్ హయాతి)తో ప్రేమ కథ ఏమిటం వంటి విషయాలు చుట్టూ తిరుగుతుంది మిగతా కథ.

ఎనాలసిస్ ...

ఈ సినిమా స్క్రిప్టు గురించి మాట్లాడుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. చాలా సాదా సీదాగా..సామాన్యమైన స్క్రిప్టు. రొటీన్ కే రొటీన్ గా సాగే స్క్రీన్ ప్లే. ఇంత రొట్ట కొట్టుడు కథ విశాల్ కూడా ఈ మధ్యన చెయ్యలేదు. ఓ ట్విస్ట్ కానీ, హై ఇచ్చే ఎలిమెంట్ కానీ ఎక్కడా ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసారు. విశాల్ స్వయంగా నిర్మాత కూడా. తనకే విపరీతంగా నచ్చేసి సినిమా చేసాడో లేక ఇలాంటి కథపై పెట్టుబడి పెట్టేవారు లేక చేసాడో కానీ తీసిన వాడికి చూసిన వాడికి వృధా ప్రయాశ అనిపిస్తుంది. ఈ సినిమాలో చెప్పుకోదగనివి ఏమైనా ఉన్నాయి అంటే అవి ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్...క్లైమాక్స్ సీన్స్ ..అంతకు మించి ఏమీ లేదు.  విశాల్  యాక్షన్ చేసుకుంటూ పోతాడు కానీ అందుకు తగ్గ బ్యాక్ స్టోరీ పడకపోవటంతో విసుగెత్తిస్తుంది.

దర్శకత్వం మిగతా డిపార్టమెంట్స్

దర్శకత్వం జస్ట్ ఓకే అన్నట్లుంటుంది. సినిమాలో ఉన్న ఒకే ఒక్క పాట  ‘మత్తెక్కించే కళ్ళే…’యావరేజ్.   యువ‌న్ శంక‌ర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..విషయం లేని సీన్స్ లో కూడా ఏదో ఉందనిపిస్తుంది. `’రైజ్ ఆఫ్ ఏ కామన్ మేన్…’ థీమ్ మ్యూజిక్ బాగుంది. కెవిన్ కెమెరా వర్క్ బాగుంది.  ‘ఒక నేర‌స్థుడు ఎలా పుడ‌తాడు? త‌న‌ను కాపాడేవాడు ఒక‌డున్నాడు అన్న ధీమా ఉన్నప్పుడే’,  ‘నేనొక సామాన్యుణ్ణి. ఎదురు తిర‌గ‌క పోతే న‌న్నూ చంపేస్తారు’ వంటి డైలాగ్స్ డబ్బింగ్ అయినా బాగా రాయటంతో  జీవం తెచ్చుకున్నాయి.

నటీనటుల్లో విశాల్ కు ఇలాంటి పాత్రలు కొత్తా కాదు..చూసేవాళ్లకు అంతకన్నా కాదు కాబట్టి సోసో గా అనిపిస్తుంది. డింపుల్ హయాతి  హీరో లవర్ గా ఏదో ఉందంటే ఉందనిపించింది.  యోగిబాబు హీరో ప్రెండ్ గా కాస్త నవ్వించాడు.  

ఫైనల్ థాట్

టైటిల్ 'సామాన్యుడు' అని కాకుండా 'అతి సామాన్యం' అని పెడితే బాగుండేది..అప్పుడప్పుడూ 'అతి'...మిగతాదంతా 'సామాన్యం'

--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

ఎవరెవరు...

నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, మారిముత్తు, తులసి, రాజా, బాబూరాజ్, ఇలంగో కుమారవేల్, రవీనా రాజ్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: కావిన్ రాజ్
 ఎడిటర్: ఎన్ బి శ్రీకాంత్;
కళ: ఎస్ఎస్ మూర్తి
రచన, దర్శకత్వం: తు.పా. శరవణన్
నిర్మాత: విశాల్;
విడుదల తేదీ:ఫిబ్రవరి 4, 2022.

 

click me!