విలక్షణ నటుడు మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా. కొన్నాళ్ళకు నటనకు దూరంగా ఉన్న ఆయన ఫుల్ లెంత్ రోల్ లో సినిమా అంతా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ కు ముందే విపరీతమైన ట్రోలింగ్ కు గురైన చిత్రం ఏదైనా ఉందీ అంటే ఇదే. ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఏమో కానీ ట్రైలర్ ,టీజర్ చూసిన వాళ్లలో ఎక్కువ శాతం పెదవి విరిచారు. అందులోనూ సినిమా మొత్తం మోహన్ బాబు కనపడతారు అనటంతో కాస్త కంగారుపడ్డారు.మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయిన ఈ సినిమా కథేంటి...జనం అంచనాలు తప్పి హిట్ అయ్యే సరకు సినిమాలో ఉందా...మోహన్ బాబు చాలా కాలం తర్వాత చేసిన ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
ఎన్ ఎ ఐ ఆఫీస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు బాబ్జీ (మంచు మోహన్‌బాబు). ఆ టైమ్ లో సెంట్రల్ మినిస్టర్ మహేంద్ర భూపతి(శ్రీకాంత్) తో పాటు ఓ డాక్టర్ ప్రతిభాలాస్య, దేవాదాయశాఖ మంత్రి ( రాజా రవీంద్ర) కిడ్నాప్‌కి గురవుతారు. ఎన్ ఐ ఏ ఆఫీసర్ ఐరా (ప్రగ్యా జైశ్వాల్) తన టీమ్ (మంగ్లీ, పృథ్వి)తో కలిసి ఆ కేసు ఇన్విస్టిగేట్ చేస్తూంటుంది. ఆ విచారణలో ఆమెకు ఈ కిడ్నాప్‌లన్నీ చేసింది తన దగ్గర డ్రైవర్ గా చేస్తున్న బాబ్జీ పని తెలుసుకుంటుంది. ఓ మామూలు సాదా సీదాడ్రైవర్‌కి అంత పెద్ద వారిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? అతని వెనుక భాషా లాంటి ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా ఉందా...అతనికి ఎవరైనా సాయిం చేసాడా అని ఇంకొంచెం లోతుగా చూస్తే....బాబ్జీ అసలు పేరు అది కాదని విరూపాక్ష అని రివీల్ అవుతుంది. పదహారేళ్లు జైలు జీవితాన్ని గడిపిన విరూపాక్ష ప్లాష్ బ్యాక్ ఏమిటి? హోమ్ మంత్రి విరూపాక్షని చూసి ఎందుకు నమస్కారం చేశాడు?అతని ప్లాష్ బ్యాక్ లకు ఈ కిడ్నాప్‌లకి లింకేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎనాలసిస్..
ఆ మధ్యన తమిళంలో ఓ సినిమా వచ్చి బాగా పేరు తెచ్చుకుని, అవార్డ్ లు తెచ్చుకుంది. దాని పేరు...ఒత్త సెరుప్పు సైజ్ 7. ఓ మర్డర్ కేసు గురించి ఒక వ్యక్తిని లాకప్లో ఇంటరాగేషన్ చేయడమే కథ. ఆర్.పార్థిబన్ రాసిన ఈ కథలో ఒకే ఒక్క పాత్ర ఉంటుంది. దాన్ని ఆయనే పోషించారు. ఆయనే నిర్మించారు. ఆయనే దర్శకత్వమూ వహించారు. తన అద్భుత నటనకి టేకింగ్కి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సౌండ్ డిజైన్ విభాగంలో రసూల్ పూకుట్టికి కూడా జాతీయ అవార్డు వచ్చింది. ఒక వ్యక్తి ఆల్రౌండర్గా తీసిన ఈ చిత్రం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి కూడా ఎక్కింది. ఈ సినిమా చూస్తూంటే ఆ సినిమా గుర్తు వస్తుంది. అయితే ఆ సినిమాకు ఈ సినిమాకు పోలిక ఏంటంటే...ఏకపాత్రాభినయం.
వాస్తవానికి సన్ ఆఫ్ ఇండియా ఏమీ కొత్త తరహా కథ కాదు. తెలుగు తెర చాలా సార్లు చూసిందే. ఫ్లాష్ బ్యాక్ ఊహించగలిగేదే. మరి ఏమిటి ఈ సినిమా స్పెషల్ ..మోహన్ బాబు ని అంతగా ఎట్రాక్ట్ చేసిందీ అంటే ఈ సినిమాని తెరకెక్కించటానికి ఎంచుకున్న విధానం. అదీ మిగతా క్యారక్టర్స్ ని ప్రక్కన పెట్టి మోహన్ బాబు ఏకపాత్రాభినయంలా ప్రయోగాత్మకంగా నడిపించటం. సినిమా క్లైమాక్స్ దాకా మిగతా ఆర్టిస్ట్ లను చూపించకుండా లాక్కెళ్లటం. ఇది చాలా కష్టమైన ప్రయోగమే. కాకపోతే అదే సమయంలో మోహన్ బాబుని ఒక్కరినే సినిమా మొత్తం చూడటమూ కష్టమే. కాకపోతే వారి మొహాలు కనపడకపోయినా వారి డైలాగులు వినిపిస్తూంటాయి.
అక్కడ వేరే వాళ్లు ఉన్నట్లు అనిపిస్తూంటుంది. స్టేజీపై ఏకపాత్రాభియనం అంటే ఓకే....తెరపై ఇలా సింగిల్ క్యారక్టర్ తో లాగాలాంటే చాలా కసరత్తు చేయాలి. చేసారు కూడా. కాకపోతే అది జనరంజకంగా లేదు అంతే. అయితే విరూపాక్ష కేరక్టర్ గురించి చిరంజీవి చెప్పే ఇంట్రడక్షన్, కథను నడపడానికి మధ్యమధ్యలో చిరు చెప్పిన మాటలు బావున్నాయి. రొటీన్ కథకు..అందులో ఇలాంటి ప్రయోగంకు స్క్రీన్ ప్లే మామూలుగా ఉంటే సరిపోదు మ్యాజిక్ చేయగలగాలి.అది పైన మొదట్లో చెప్పుకున్న పార్దీపన్ సినిమా చేయగలగింది. కాకపోతే అక్కడ ఇలాంటి కథలకు ఉంటే లిమిటేషన్స్ చూసుకుని కథ రాసుకున్నారు. ఇక్కడ అదే చేయలేదు.
మోహన్ బాబు నటన గురించి...
మోహన్ బాబు మంచి నటుడిగా మెప్పు పొందినవాడు. ఇప్పటికే ఎన్నో హిట్స్ తన ఖాతాలో ఉన్నవాడు కావటంతో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి అటెన్షన్ పొందగలిగారు. కానీ కథ ఆయనకు సహకరించలేదు. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే మోనాటినీ వచ్చేసింది. ఇలాంటి ప్రయోగాత్మకమైన సీరియస్ రోల్ లో మోహన్ బాబుని ఎప్పుడూ చూడక ...అదీ అంతసేపు ఒక్కడ్నీ అంతసేపు భరించలేక విసుగొస్తుంది వాస్తవానికి ఎన్నో వేరియేషన్స్ ఉన్న ఈ ఎమోషనల్ రోల్ కానీ స్టేజీ ప్లే ని తెరపై చూస్తున్నట్లు అనిపించి.. దాదాపు రెండు గంటల సేపు ఇబ్బంది కలిగించింది. అసలు ఆ పాత్రలో మోహన్ బాబుని ప్రేక్షకులు అంతసేపు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదాని కన్నా ఎలా భరిస్తారు అనేదే పెద్ద ప్రశ్న. ఆలీ, బండ్లగణేశ్, సునీల్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్, రాజారవీంద్ర , తనికెళ్ళ భరణి ఇంతమంది ఉన్నా లేనట్లే. మీనా కూడా ఒక్క సీన్ లోనే కనిపిస్తుంది.
టెక్నికల్ గా ...
ఈ సినిమాలో ఏమైనా బాగున్నాయా అంటే అది డైలాగులు రైటర్ కూడా తానే అయిన దర్శకుడు డైమండ్ రాసుకున్న పొలిటికల్ పంచులు, సొసైటీపై పేల్చిన కొన్ని సెటైర్స్. ప్రొడక్షన్ వేల్యూస్ చాలా దారుణంగా ఉన్నాయి. ఎడిటింగ్ లో చాలా బోరింగ్ సన్నివేశాలు తీసేయాల్సినవి మర్చిపోయారు. మంచి రైటర్ గా పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడుగా ఇలాంటి కథతో సినిమా చేస్తాడని ఊహించము.ఇళయరాజా సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అసలు ఆయనే చేసారా అనే డౌట్ కలుగుతుంది. కెమెరా వర్క్ సోసోగా ఉంది.
ఫైనల్ థాట్
మోహన్ బాబుతో ఈ టైమ్ లో సినిమా చేయటమే ప్రయోగం...మళ్లీ సినిమాలో మరో ప్రయోగమా?
రేటింగ్: 2 /5
ఎవరెవరు..
బ్యానర్: 24 ఫ్రేమ్స్, ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్;
నటీనటులు : మోహన్ బాబు, మీనా, పోసాని కృష్ణమురళి, రవిప్రకాశ్, శ్రీకాంత్, రాజారవీంద్ర, సుప్రీత్ రెడ్డి, నరేశ్, ఆలీ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రగ్యా జైస్వల్, బండ్ల గణేశ్ తదితరులు.
సంగీతం : ఇళయరాజా
సినిమాటోగ్రఫీ : సర్వేష్ మురారి
నిర్మాణం : లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
నిర్మాత : మంచు విష్ణు
స్క్రీన్ ప్లే : యం. మోహన్ బాబు
మాటలు: సాయినాథ్ తోటపల్లి, డైమండ్ రత్నబాబు
దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
విడుదల తేదీ: 18-02-22