వర్షించని మేఘం :‘డియర్ మేఘా’ రివ్యూ

By Surya Prakash  |  First Published Sep 4, 2021, 5:25 PM IST


`డియ‌ర్ మేఘ‌` కన్న‌డ‌ హిట్ చిత్రం `దియా`కి రీమేక్‌. దియా ఓ ఆర్థ్ర‌త నిండిన ప్రేమ క‌థ‌. తెలుగుకు వచ్చేసరికి ఆ ఆర్ద్రత అలాగే ట్రాన్సఫర్ అయ్యిందా లేదా చూద్దాం.


హిట్ సినిమాలు రీమేక్ చేయటంలో తెలుగు పరిశ్రమ బిజీగా ఉంది. ఎక్కడ ఏ భాషలో హిట్ వస్తుందో అని వెయ్యికళ్లతో చూస్తోంది. పెద్ద,చిన్న అనే తేడా అందరూ అదే బాటలో వెళ్తున్నారు. పెద్ద స్టార్స్ భారి బడ్జెట్ ల కోసం  మినిమం గ్యారెంటీ అంటూ రీమేక్ ల వెంట వెళ్లినా అర్దం ఉంది. చిన్న సినిమా వాళ్లు కూడా క్రియేటివిటీని ప్రక్కన పెట్టి ప్రక్క భాషా చిత్రలపై దృష్టి పెట్టి రీమేక్ లతో రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిన కన్నడ రీమేక్ ఇది. ఈ సినిమాలో అంత రీమేక్ చేసేటంత విషయం ఏముంది. అసలు చిత్రం లో కథ ఏమిటి?

కథ
కాలేజీ రోజుల్లో తన తోటి స్టూడెంట్ అర్జున్ (అర్జున్ సోమయాజులు) తో ప్రేమలో పడుతుంది మేఘ (మేఘ ఆకాష్) . కానీ అప్పుడు ఆమె చెప్పలేకపోతుంది. ఆ తర్వాత అతను ఆ కాలేజీ విడిచి జాబ్ లో సెటిల్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ మూడేళ్ళ తర్వాత ఇద్దరూ కలుసుకుంటారు. ఈ సారి అర్జున్ వచ్చి లవ్ ప్రపోజల్ పెడతారు.ఇద్దరు హ్యాపీ. కానీ దురదృష్టవశాత్తూ ఓ యాక్సిడెంట్ లో  మేఘ, అర్జున్ ను కోల్పోతుంది. ఆ బాధ నుంచి కోలుకుని జీవితంలో మూవ్ ఆన్ అయ్యి ఆది (అదిత్ అరుణ్)ను ప్రేమిస్తే సరిగ్గా అదే సమయంలో అర్జున్ తిరిగి వస్తాడు. ఇప్పుడు మేఘ ఏం చేస్తుంది? చివరికి ఎవరితో జీవిత ప్రయాణం పెట్టుకుంటుంది అనేది మిగతా కథ 

Latest Videos

undefined

ఎనాలసిస్ 
మనకన్నా కన్నడ వాళ్లు కొన్నేళ్లు సినిమా పరంగా వెనకబడి ఉంటారని చెప్తూంటారు. ఆ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా..కన్నడ సినిమాలు రీమేక్ అయ్యి తెలుగులోకి రావటం మాత్రం అరుదుగా జరుగుతూంటుంది. డబ్బింగ్ లు కూడా కేజీఎఫ్ లాగా హిట్టైనవి తక్కువే. అందుకు కారణం వాళ్లు మన కథలనే మార్చి మార్చి తీస్తూండటమే. అప్పట్లో కన్నడలో సంవత్సరం రోజులు ఆడిన ‘ముంగారుమలే’కు రీమేక్ గా తెరకెక్కిన ‘వాన’  చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన కన్నడ చిత్రం ‘దియా’కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా పరిస్దితి కూడా అలాగే అనిపిస్తోంది. అందుకు కారణం ఎన్నో సార్లు చూసిన ముక్కోణపు ప్రేమ కథ కావటం. గతంలో శ్రీకాంత్, సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన ప్రేమ ప్రయాణం దగ్గర నుంచి అనేక సినిమాలు ఇదే తరహాలో తెలుగులో వచ్చాయి. మనకు ఓ రకంగా  బోర్ కొట్టేసిన ఈ కాన్సెప్టు కన్నడ వాళ్లకు బాగా నచ్చేసింది.

 అక్కడ జనాలకు నచ్చటానికి కారణాలు ఏమైనా..మనవాళ్లకు నచ్చకపోవటానికి కారణం మాత్రం కొత్తదనం లేకపోవటమే. దానికి తోడు మెల్లిగా నత్త నడక నడిచే నేరేషన్. లవ్ స్టోరీలు స్లోగా తీయాలనే రూల్ ఎవరైనా పెట్టారేమో తెలియదు కానీ మన వాళ్లు మాత్రం ఫాలో అయ్యిపోతూంటారు. స్లో గా ఉంటే క్లాస్ గా ఉంటుందనే ఆలోచన కావచ్చు. ఇద్దరు అబ్బాయిలతో ఓ అమ్మాయి సాగించే ఈ ప్రేమకథ అనుకున్నంత ఆసక్తికరంగా మాత్రంగా లేదు.  ఇలాటి కథలకు ఆక్సిజన్ లా ఉండే ఫీల్ పూర్తిగా మిస్సయింది. లవ్ సీన్స్ లో  గాఢతను లేదు. ప్రేమికులిద్దరూ కూడా ట్విస్ట్ లకు లోబడి తమ హావభావాలతో ప్రేమను వ్యక్తం చేసుకుంటూ కూర్చున్నారు.  కాకపోతే హీరోయిన్ ఓరియెంటెడ్  ప్రేమ కథ కావడంతో కొత్తగా అనిపిస్తుంది.   మదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా బాగానే పండాయి. అంతకు మించి సినిమాలో చెప్పుకునేందుకు ఏమీ లేదు. ఏదైమైనా పాత కథ చెప్పేటప్పుడు...డైరక్టర్  స్క్రీన్ ప్లే విషయంలో మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సింది.
 
  
టెక్నికల్ గా...

ఈ సినిమా కాన్సెప్టు బాగా పాతకాలం నాటిది అయినా టెక్నికల్ గా మాత్రం మంచి స్టాండర్డ్స్ లో తీసారు. అయితే కథకు ఇచ్చిన ట్రీట్మెంటే బోర్ గా ఉండటంతో అవేమీ మనకు ఎక్కవు. ఇక ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ప్రధానంగా హైలైట్ అయ్యాయి. పాటలు చాలా బాగా తీసారు. కాలేజ్ ఎపిసోడ్స్ ను కూడా నీట్ గా డీల్ చేసారు. మ్యూజిక్ మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. ఎడిటింగ్ సెకండాఫ్ లో నీరసం తెప్పించింది.  
  
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ విషయానికి వస్తే.. మేఘ ఆకాష్ ను తీసుకున్నందుకు తన స్పెషాలిటీ చూపించింది. ఆమె తన పెర్ఫార్మన్స్ తో అంత బోర్ కథని లాక్కొచ్చే ప్రయత్నం చేసింది. అదిత్ అరుణ్ స్పెషల్ గా ఉన్నాడు. ఎమోషనల్ సీన్స్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అర్జున్ సోమయాజులు కూడా బాగా చేసాడు. పవిత్ర లోకేష్ ఎప్పటిలాగే తల్లి గా అదరకొట్టింది. 
 
ఫైనల్ థాట్
కన్నడంలో ఆఢిన ప్రతీ సినిమా కేజీఎఫ్ లా ఫీలవకూడదు. డబ్బింగ్ ,రీమేక్ లు చేసేయకూడదు
Rating: 2.5

తెర వెనక...ముందు
న‌టీన‌టులు: మేఘా ఆకాష్‌, అరుణ్ అదిత్‌, అర్జున్ సోమ‌యాజులు, ప‌విత్ర లోకేష్ తదితరులు
సంగీతం: హ‌రి గౌర;
 సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ; 
నిర్మాత‌: అర్జున్ దాస్య‌న్‌;
 ద‌ర్శ‌క‌త్వం: ఎ.సుశాంత్ రెడ్డి;
రన్ టైమ్: 2 గంటల 1 నిముషం
విడుద‌ల తేదీ: 03-09-2021

click me!