హేతువాద అభ్యుదయ భావాల అనంతరం తాను మానవతావాదానికి కట్టుబడి వున్నానని ఆయన అంటున్నారు. మనిషి ఆనందం పొందడానికి భారతీయ సాహిత్యం సంస్కృతి ప్రధాన రహదారి అని శ్రీభాష్యం విజయ సారధి అంటారు.
మహామహోపాధ్యాయ విజయసారధి గారికి ఇటీవలే ధిల్లీలో భారత రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసారు. ఆయన అంతకు మించిన అర్హతగల వారు. వారి సృజన తర తరాలకూ నిలిచే అద్భుత సాహితీ భాండాగారం.
సంస్కృతమే తన భాషగానూ వ్యక్తీకరణగానూ నిర్దేశించుకొని నూటాయాభైకి పైగా గ్రంధాలు రాసి తన ‘మందాకినీ’ సంస్కృత గేయ కావ్యంతో దేశ వ్యాప్తంగా మన్ననలని అందుకున్న శ్రీభాష్యం విజయ సారధి గారు 1937 లో మార్చ్ 10 న కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో జన్మించారు. అమ్మ నుండి సంస్కృత భాష, సంగీతాలని నేర్చుకున్న శ్రీభాష్యం విజయసారధి తొలి రోజుల్లోనే అన్ని విషయాలను ప్రశ్నించడం మొదలు పెట్టారు. హేతువాదిగా ఒకింత తీవ్రంగానే వాదించేవారు. ఆ కాలంలో ఒక వైపు నిజాం పాలన మరో వైపు కమ్యునిస్ట్ ఉద్యమాలు ఉండగా ఆయన ప్రగతిశీలత వైపు హేతువాదం వైపు మొగ్గారు.
ఒకస్థాయిలో నిజాం పోలీసుల జాబితాలో కూడా చేరారు. అప్పుడు వారి అన్నగారు పార్థ సారధి అన్న మొదటి పేరును మార్చి శ్రీభాష్యం విజయసారధి అన్న పేరుతో వరంగల్ లోని శ్రీ విశ్వేశ్వరయ్య సంస్కృత కళాశాలలో చేర్పించారు. తన పదకొండు ఏండ్ల వయసులోనే శారదా పదకింకిని లాంటి గ్రంధాల్ని రాసారు. దేశవ్యాప్తంగా అనేక విశ్వ విద్యాలయాల్లో తన కవితా గానం చేసిన శ్రీభాష్యం విజయ సారధి అయ్యదేవర కాళేశ్వర రావు చేతుల మీదుగా మహాకవి బిరుదును, కలకత్తాలో యుగకవి బిరుదును, బిర్లా ఫౌండేషన్ వారి వాచస్పతి పురస్కారాన్ని అందుకున్నారు.
హేతువాద అభ్యుదయ భావాల అనంతరం తాను మానవతావాదానికి కట్టుబడి వున్నానని ఆయన అంటున్నారు. మనిషి ఆనందం పొందడానికి భారతీయ సాహిత్యం సంస్కృతి ప్రధాన రహదారి అని శ్రీభాష్యం విజయ సారధి అంటారు.
ఉర్దూ అధికార భాషగా వుండి విద్యాలయాల్లో ఉర్దూ మాధ్యమానికే పెద్ద స్థానం వేసిన నిజాం కాలంలో శ్రీ విజయ సారధి సంస్కృతం చదువుకుని, కావ్యాలు రాసి దేశ వ్యాప్తంగా గొప్ప కవిగా పేరు పొందారు. ముంబై, కొలకత్తా, ధిల్లీ, నాగపూర్ లాంటి అనేక చోట్ల కవితా గానం చేసి ‘మందాకినీ’ కవిగా నిలబడ్డారు.
ఆయన 150 కి పైగా గ్రంధాలు రాసారు. భిన్నమయిన సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసారు. సుప్రభాతాలు, స్తోత్రాలు, దేశభక్తి రచనలు, అధిక్షేప కవితలు, విమర్శ, ఆప్త లేఖలు ( లేఖా సాహిత్యం), ఖండ కావ్యాలు, ప్రహేళికలు, విమర్శ, వర్ణనా కావ్యాలు, అనువాదాలు రాసారు. తనకు రాయడం చదవడమే జీవితం అంటారు. అట్లే తన జీవితాన్ని అవిశ్రాంతంగా గడుపుతున్నారు.
శ్రీభాష్యం విజయ సారధి రచించిన ‘మందాకినీ’ కావ్యం పాడుకునేందుకు వీలయిన రచన. అది సంస్కృతంలో నూతన ఒరవడి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘మందాకినీ’ ఆలవోకగా వచ్చినకావ్యం.
మందాకినీ అంటే గంగా ప్రవాహం. అందులో శ్లోకాలుండవు. అంతా మాత్రా ఛందస్సు. ఆ కావ్యం ఇట్లా మొదలవుతుంది..
‘ఆకతి మందాకినీ...చకతి మందాకినీ.. మధురేన పూరేన..’
గంగా ప్రవాహంలో ఎన్ని గతులు ఉంటాయో అవన్నీ మందాకినీలో ధ్వనిస్తాయి. నది పర్వతం నుంచి దుమికినప్పుడు ఎట్లా వుంటుంది, సమతలంలో పారినప్పుడు ఎట్లా వుంటుంది, మలుపులో ఎట్లా ధ్వనిస్తుంది ఈ గతులన్నీ కావ్యంలో వినిపిస్తాయి. ఇందులో 200 ధాతువులు ఉపయోగించారు. ఇందులో ఆయన వాడిన ధాతు ప్రయోగాలు విశేషమయిన విలక్షణతను సంతరించుకున్నాయి. మందాకినీ రచన కేవలం 48 గంటల్లో పూర్తయింది. 2000 లైన్లున్నాయి. అందులో ప్రధానంగా మూడు కథలున్నాయి. జల కథ, నాయికా నాయక కథ, మూడవది యోగ శాస్త్రం. అట్లా ఒక ఊపులో సాగే మందాకినీ సంస్కృతంలో దేశ వ్యాప్త ప్రాచుర్యాన్ని పొందింది.
ఇక ఆయన రాసిన ‘భారత భారతి’ లో సామాజిక అంశాలని ప్రధానంగా తీసుకున్నారు. వర్తమాన సామాజిక పోకడల్ని అందులో ప్రధానంగా ఆయన విశ్లేషించి విమర్శించారు. కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచించారు. అరవై శ్లోకాలతో భారత భారతి సాగుతుంది. దేశ స్వాతంత్రాన్నీ సమగ్రతను పరిరక్షించుకోవడానికి అందరూ ముందుండాలని భారత భారతి లో ఆయన చెప్పారు. అది రాసి ఇంత కాలమయినప్పటికీ ఇప్పటికీ దేశంలో అవే పరిస్థితులున్నాయని ఆయన బాధ పడుతూ వుంటారు. రాజకీయాలనే కాదు, దాదాపు అన్ని రంగాల్లో పరిస్థితులు దిగజారాయని ఆయన ఆవేదన చెందుతారు..
మనుషులు ఆనందం పొందడానికి భారతీయ సాహిత్యం, సంస్కృతి ప్రధాన రహదారులని వివరించే ఆయన హింసలేని సౌభ్రాతృత్వం కలిగిన సమాజం ఏర్పడాలని ఆకాంక్షిస్తున్నారు.
తెలంగాణా ప్రాంతం నుండి ఎదిగి తన సృజనతో జాతీయ స్థాయిలో నిలబడ్డ శ్రీభాష్యం విజయ సారధి గారు ఆయురారోగ్యాలతో మరెన్నో రచనలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
వారి సృజనకు సేవా నిరతికి తల వంచి ప్రణమిల్లుతూ సెలవు.