అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ కవితా సంకలనం “ పరావలయం “ అందిస్తున్నారు వారాల ఆనంద్.
ఇటీవలే ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ రెండవ కవితా సంకలనం “ పరావలయం “ అందుకున్నాను. అది కూడా పోస్టులో కాకుండా పర్సనల్ గా అందుకోవడం ఆనందాన్నిచ్చింది. పుస్తకం ఇచ్చే నెపం మీద తనని కలుసుకోవడంతో నేనయితే సంతోషించాను.
అవును మరి ఎవరినయినా ఎప్పుడయినా కలుసుకోవడంలో వున్న ఆనందం ఫోన్లో మాట్లాడుకోవడంలోను, వీడియో కాల్ లోనూ వుండదు.. కల్సుకుంటే ఏం చేస్తాం కళ్ళూ కళ్ళూ కలుపుకుంటాం. కరచాలనం చేస్తాం. మరీ దగ్గరి వాళ్ళం అయితే ఓ హగ్గేసుకుని అలయి బలాయి తీసుకుంటాం. ఓ కప్పు చాయ్ తాగుతాం. అనేకానేక మాటలు మాట్లాడుకుంటాం... మొహమాటాలు లేకుండా. ఈ కలయికలకు ఈ మధ్య కరువొచ్చింది. కరోనా కాలంలో మరీ నల్ల పూసలం అయిపోయాం. అందుకే ఇద్దరు కలుసుకోవడంలో గొప్ప అనుభూతి వుంది. అదీ కవులూ కళాకారులూ ఆత్మీయులు కలిస్తే మనసు పురి విప్పి నాట్యం చేస్తుంది. అట్లా ఎన్నో మాటల మధ్య ప్రవీణ్ పుస్తకం అందుకున్నాను.
ఇది ఒద్దిరాజు ప్రవీణ్ రెండో కవితా సంకలనం. “దుఃఖానంతర దృశ్యం" తర్వాత వచ్చిన పుస్తకమిది. మొదటి పుస్తకానికి ఆయన ‘రంగినేని ఎల్లమ్మ’ పురస్కారం కూడా అందుకున్నారు.
“ఓ నాలుగు వాక్యాలు రాసి కవిత్వమని దబాయించలేను” అంటున్నాడు ప్రవీణ్. అంతే కాదు అక్షరాలకు రంగూ రుచీ వాసనా ఉంటాయని కూడా విశ్వసిస్తున్నాడు. దాన్ని ఆయన కమిట్ మెంట్ గా తీసుకోవాలి. ఆ కమిట్మెంట్ ని తన కవిత్వంలో నిలబెట్టుకోవడంలో కవి ప్రతిభను చూపాలి. ఆ క్రమంలో ప్రవీణ్ ఇట్లా అంటున్నాడు...
‘దీపం తలాపున నవ్వుతుంటే
సంధ్య వేళలు వెక్కిరిస్తున్నవి
గాలికి ఉడుక పోస్తుంటే
తరగతి గదులు తాళాలతో వేలాడుతున్నవి’ - అన్నాడాయన. అక్షరాలతో ప్రవీణ్ గారి సహచర్యం దశాబ్దాల నాటిది. అది తన రాతల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
జర్నలిస్టు కవి అయినప్పుడు, కవి జర్నలిస్టు అయినప్పుడు ఒక వెసులుబాటు వుంటుంది. కవితా హృదయంతో పాటు వర్తమాన సంఘటనలమీద, సమస్యలమీద అవగాహన పట్టు వుంటుంది. అది ప్రవీణ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయన కవిత్వంలో కవిత్వపు ఒడుపూ, సమకాలీన సమస్యల స్పందనా కలివిడిగా కనిపిస్తాయి.
‘నిన్నటి రాత్రి స్వప్నంగా మారి
నన్ను వెంటాడుతుంటే
వర్షం సాంబ్రాణి పొగలా
పొద్దటి పూలను కమ్ముకొని నన్ను హత్తుకుంటుంది’ - అని అనుభూతితో చెప్పిన కవి ప్రవీణ్ గారే
‘అక్షరం వికసించి
కవిత్వం రెప రెప లాడుతున్నప్పుడు
రాజ్యం గుండెల్లో చలి మొదలవుతుంది
ఎంతకూ నిద్రపట్టని అధికారం
పదే పదే తలుపు తడుతుంది
పుస్తకాల్లోని నల్ల రంగు చూసి బెదిరిపోతుంది’- అని కూడా అంటాడు.
ఇక్కడ మనకు చాలా విషయాలు బోధపడతాయి. ఇవ్వాళ ఒక ప్రముఖ తెలుగు కవి ఊచలు లెక్క పెడుతుండడం గుర్తు కొస్తుంది. వీ వీ గురించి మనసంతా వేదనతోనూ దుఖంతోనూ నిండి పోతుంది. కోపంతో గుండెలు రగిలి పోతాయి. ఏమీ చేయలేని నిస్సహాయత కుంచింప చేస్తుంది.
ఈ సంకలనం నిండా రైతులు, ఆమె, తెలంగాణా పైన అనేక కవితలున్నాయి.
‘స్వాప్నికుడు’ లో కవి ఇట్లా అంటాడు..
ఊరు మళ్ళా ముచ్చటయింది
సాయంత్రం పశుధూళితో
సాంబ్రాణి వేసిన దేవాలయమయ్యింది..
అని అంటూనే చివరికి
రైతుకు కావలసింది నీళ్ళు, కరెంటే కాదు
గిట్టుబాటు ధర కూడా’ అంటాడు.
ఇక నీటి మీద, చెరువు మీదా కూడా ప్రవీణ్ ఈ సంకలనంలో స్పందించాడు
చెరువు అంటే చనుబాల ధార
మత్తడి దునికితే పొలాల పులకరింత.. అంటాడు.
మరో చోట ‘నది అంటే నడుస్తున్న సంపద' అని కూడా అంటాడు.
ఇక తన ‘పరావాలయం’ కవితలో
నా కలలను ఎవరో ఎత్తుకెళ్ళారు
పున్నమి వెన్నెల్లో, పూదోటల్లో
పరిమళమై విహరిస్తున్న
నా కలలను ఎవరో ఎత్తుకెళ్ళారు....
నా కలల కన్నులను ఎవరో ఎత్తుకెళ్ళారు.- అన్నాడు.
ఇట్లా ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ కలల్ని కంటూ ఎవరు ఎత్తుకు పోతున్నారో గమనిస్తూ, ఆ కలల దోపిడీని ప్రతిఘటిస్తూ తన అక్షరాల్లో కలల్నీ వాస్తవాల్నీ ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు.. తన నుంచి మరింత మంచి కవిత్వాన్ని ఆశిస్తూ మనసార అభినందిస్తున్నాను.