అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం డాక్టర్ మచ్చ హరిదాసు ‘అష్టాదశ’ అందిస్తున్నారు వారాల ఆనంద్.
కాలం నిరంతరం మారుతూ వుంటుంది. కాలగమనంతో పాటు సమాజమూ ఎప్పటికప్పుడు మార్పునకు గురవుతూ వుంటుంది. ఫలితంగా సమాజాన్ని అద్దం పట్టే అన్ని కళలూ మార్పులకు లోనవుతాయి. పరిణామం చెందుతాయి. సాహిత్యం అందుకు భిన్నం కాదు. ప్రాచీన సాహిత్యం నుంచి వర్తమాన ఆధునిక సాహిత్యం దాకా పరిశీలిస్తే రూపం లోనూ సారంలోనూ సాహిత్యంలో వచ్చిన మార్పు స్పష్టమవుతుంది. ప్రాచీన ఆధునిక సాహిత్యాలు మొత్తంగా ఏవీ సంపూర్ణంగా గొప్పవీ కావు అట్లని పనికి రానివీ కావు. దేని స్థాయిలో దానికి బలాలూ బలహీనతలూ వున్నాయి. అవి అత్యంత సహజమయినవి. నిరాకరించలేనివి.
అయితే అసలు అధ్యయనమే అరుదయిపోతున్న వర్తమాన సాంకేతిక ప్రసార యుగంలో సాహిత్యంలోని లోతు పాతుల గురించి అందులోనూ ప్రాచీన సాహిత్యం గురించి రాసేవారు తక్కువ. రాసినా చదివే వారు ఇవ్వాళ అరుదు. కేవలం అకాడెమిక్ అవసరాల కోసం చెప్పేవారు చదివేవారు ఉన్నారని అంటే కొంత కష్టం అనిపించవచ్చు. కానీ అది అక్షర సత్యమని అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ విద్యావేత్త, అధ్యాపకుడూ, సాహితీ వేత్త డాక్టర్ మచ్చ హరిదాసు తన ‘అష్టాదశ’ సాహిత్య విమర్శ వ్యాసాలతో ముందుకొచ్చారు. ఇందులో ప్రధానంగా ప్రాచీన, లక్షణ గ్రంధాలు, శతక సాహిత్యం, యాత్రా చరిత్రలూ, కొన్ని ఆధునిక కవితా సంపుటాల మీద హరిదాసు గారి విశ్లేషణాత్మక వ్యాసాలున్నాయి. దాదాపు అన్ని వ్యాసాలూ సరళంగానూ, చక చకా చదివించే లక్షణం తోనూ వున్నాయి. కేవలం సాహిత్యవిద్యార్తులే కాకుండా మామూలు పాఠకులు కూడా హాయిగా చదువుకునేలా వుండడం హరిదాసు గారి శైలి. సరళత తో పాటు సాహిత్య లోతుల్ని కూడా వదిలిపెట్టకుండా రాశారాయన.
మచ్చ హరిదాసు గారి మొట్ట మొదటి రచన ‘ తథ్యము సుమతీ’. ఆయన తంజావూరు సరస్వతీ మహల్ గ్రంధాలయంలో తాళ ప్రతుల సేకరణ కృషిలో భాగంగా ‘తథ్యము సుమతీ’ రాసారు. తర్వాత పరిశోధనా రంగలోకి వెళ్లి అప్పటికే ఎవరూ స్ప్రుశించని ‘యాత్రా చరిత్రలు’ అంశాన్ని ఎంచుకుని ‘తెలుగులో యాత్రా చరిత్రలు’ అన్న విషయం మీద మౌలిక మయిన పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. 1989లో వెలువడిన ఆ పరిశోధనా గ్రంధం ప్రామాణిక మయిన రచనగా పేరు తెచ్చుకుంది. తర్వాత తన పరిశధనకు కొనసాగింపుగా యాత్రా అంశం మీదే “ఏనుగుల వీరాస్వామి జీవిత చరిత్ర”, ‘యాత్రా చరిత్రలు’, ‘తెలుగులో యాత్రా చరిత్రల సూచీ’ లను వెలువరించారు. ఈ అంశం మీద తెలుగులో హరిదాసు గారు చేసిన కృషి UN-PARALLEL అందుకే ఆయన అష్టాదశలో కూడా నాలుగు వ్యాసాలూ రాసారు. ‘తెలుగులో యాత్రా సాహిత్యం’, ‘భూభ్రమణ పారాయణుడు-ఆదినారాయణ’, ‘డాక్టర్ గోపీ విదేశీ సాహిత్యం’ లాంటి అంశాల మీదా ఆసక్తికరమయిన వ్యాసాలూ రాసారు.
ఇక తెలుగులో మొదటి లక్షణ గ్రంధం ‘ మల్లియ రేచన రాసిన “కవి జనాశ్రయం “, తొలి సంకలన గ్రంధమయిన ‘ సకలనీతి సమ్మతం” లాంటి వ్యాసాల్లో నిర్దిష్టమయిన అభిప్రాయాల్ని వ్యక్తం చేసారు. తాను నమ్మిన అంశాల్ని సాధీకారికంగా చెప్పారు.
ఇక ఆధునిక కవిత్వ విశ్లేషణలో భాగంగా డాక్టర్ మచ్చ హరిదాసు మందరపు హైమవతి “ నిషిద్దాక్షరి “ ని గురించి విపులంగా రాసారు. కుటుంబ వ్యవస్థ లోని పురుష స్వామ్య కాఠిన్యానికి , దురహంకారానికి, ఎదురాడలేక మూగ వేదన అనుభవించే స్త్రీల హృదయాంతరంగ కథనమే ఈ కవితల ఇతివృత్తమని అన్నారు. ఇట్లా శతక సందేశం, దాశరథీ శతకం, పద్మా రెడ్డి పద్యాలు, వృషాధిప శతకం, త్రిజట కావ్య పరిశీలన మొదలయిన అనేక అంశాలతో కూడిన వ్యాస సంకలనమిది.
ఈ ‘అష్టాదశ’ కు ముందు మాట రాసిన డాక్టర్ నందిని సిద్దారెడ్డి “ హరిదాసు గారు రచనా ధర్మంతో పాటు రచనా బాధ్యత తెలిసిన విమర్శకుడు” అన్నారు. ఆమాట నిజం.
మంచి సాహిత్య విమర్శా వ్యాసాల్ని అందించిన ఆత్మీయుడు డాక్టర్ మచ్చ హరిదాసు గారిని మనసారా అభినందిస్తున్నాను.
- వారాల ఆనంద్
ప్రతులకు :
‘అష్టాదశ’ ( సాహిత్య విమర్శా వ్యాసాలూ)
డాక్టర్ మచ్చ హరిదాసు
CELL: 9849517452
INDU PABLICATIONS, KARIMNAGAR