అక్షరం దృశ్యం : సినిమాలు మనవీ- వాళ్ళవీ

By telugu team  |  First Published Oct 18, 2021, 9:55 AM IST

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం సత్యజిత్ రే  అవర్ ఫిలిమ్స్ అండ్ దేర్ ఫిలిమ్స్ పుస్తకానికి వి.బి.సౌమ్య తెలుగు అనువాదం  “ సినిమాలు మనవీ- వాళ్ళవీ” అందిస్తున్నారు వారాల ఆనంద్.


బిభూతి భూషణ్ బెనర్జీ రాసిన “పతేర్ పాంచాలి” ఓ ప్రముఖ బెంగాలీ పత్రికలో సీరియల్ గా 1930ల్లో వచ్చింది. గ్రామీణ ప్రాంతంలో పుట్టి గ్రామీణ వాతావరణంలో ఎదిగిన రచయిత దాదాపుగా రాసుకున్న ఆత్మకథ ఇది. మొదట పలువురు ప్రచురణ కర్తలు పతేర్ పాంచాలి రాత ప్రతిని అచ్చు వేయడానికి తిరస్కరించారు. అసలు అందులో కథే లేదు  పొమ్మన్నారు. సీరియల్ గా ప్రచురించిన పత్రిక కూడా పాఠకుల నుంచి అనుకూల స్పందన రాకుంటే మధ్యలోనే ఆపేస్తామనే ఒప్పందం మీదే ప్రచురణకు స్వీకరించారు. కానీ మొదటి ఎపిసోడ్ నుంచే అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సత్యజిత్ రే ఆ నవల ఆధారంగానే తన మొదటి సినిమా రూపొందించారు. ఆ నవలని పతేర్ పంచాలి, అపరాజితో, అపూర్ సంసార్ మూడు భాగాలుగా ట్రిలోజీగా తీసారు. తర్వాత చరిత్ర మనకు తెలిసిందే. ఆయన సినిమాలు తీయడమే కాదు అనేక రచనలు చేసారు. వాటిలో కొన్ని

My years with Apu, The chess players : and other screenplays, Childhood Days- A Memoir,  Pather Panchali.  వీటితో పాటు అనేక ఫిక్షన్ నాన్ ఫిక్షన్ బుక్స్ కూడా రాసారు.  పిల్లల కోసం ప్రత్యేకంగా రాసారు. ఇట్లా బహుముఖీన మయిన సృజనాత్మక కృషి చేసిన సత్యజిత్ రే రాసిన అవర్ ఫిలిమ్స్ అండ్ దేర్ ఫిలిమ్స్ పుస్తకాన్ని వి.బి.సౌమ్య అనువాదం చేసారు. 

Latest Videos

గతంలోనే మూలం అనువాదం రెండూ చదివి ఉన్నప్పటికీ ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి రే ని చదవడం సరికొత్త దారిలో నడిచిన అనుభూతి కలిగింది. స్వచ్చమయిన చల్లని గాలి నా చుట్టూరా అలుముకునట్టయింది. ఇంతకు ముందే చెప్పినట్టు సత్యజిత్ రే గొప్ప దర్శకుడే కాదు రచయిత, చిత్రకారుడూ, సంగీతకారుడు, సినీ విమర్శకుడు కూడా. సినిమాల గురించి ఆయన రాసిన వ్యాసాల సంకలనమిది. భాష ఎంతో సరళంగా వుండి చక చకా చదివిస్తుంది.

“కళకీ సత్యానికీ మధ్య నెలకొంటున్న బంధం చివరికి ఫలితాన్నిస్తుందని నా నమ్మకం, ఆశ” అన్న సత్యజిత్ రే రాసిన ఈ వ్యాసాలు భారతీయ సినిమాతో పాటు ప్రపంచ సినిమా రంగం తొలి రోజులనాటి స్థితిగతుల్ని అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగ పడుతాయి.  నిజానికి ప్రపంచ వ్యాప్తంగా సినిమా దర్శకులు అతి తక్కువ మంది మాత్రమే సినిమాల పైన రాసారు.  కాని రే “ బెంగాల్లో వుండే కొన్ని ప్రత్యేక పరిస్థితుల గురించి నా అనుభవాలను రాస్తే బహుశా మన దేశంలో ఈ దారిలో నడవాలనుకుంటూ, ఇందులోని ఒడి దొడుకులు తెలీని వారికి పనికి రావచ్చు” ఈ ఆలోచనతో వ్యాసాలూ పుస్తకంగా తెచ్చారు.

‘సృజనాత్మక కళలన్నింటి లోకీ సినిమా తీయడం అన్నది అత్యంత శారీరక శ్రమతో కూడుకున్నది’ అన్న సత్యజిత్ రే ఈ వ్యాసాల ద్వారా సినిమా తీయడంలోని ఆనందానుభావాల్ని మీ తో పంచుకోగాలిగాననే అనుకుంటున్నాను అన్నాడు. ఈ పుస్తకంలో మొదటి భాగంలో భారతీయ సినిమాల గురించి, రెండవ భాగంలో విదేశీ సినిమాల గురించీ రే రాసారు.  సినిమాకు కావలసిన ముడి సరుకు జీవితమే అన్న రే నిజమయిన దర్శకుడు తన కళ్ళూ చెవులూ తెరిచి ఉంచుకోవాలంటాడు.

అంతకు ముందు ఎన్ని సినిమాలు చూసి ఉన్నప్పటికీ, ఎన్ని సినిమా పుస్తకాలు చదివి ఉన్నప్పటికీ  అసలు సినిమా తీయడం మొదలు పెట్టాక మనకు మూడు విషయాలు తెలుస్తాయంటాడు. అవి

1) మనం అనుకున్న దానికంటే మనకు చాలా తక్కువ తెలుసు అని,

2) పుస్తకాల్లో అన్నింటికీ జవాబులు ఉండవని,

౩) మనం సినిమా తీసే పద్దతులు ఎక్కడినుంచో అరువు తేచ్చుకోకూడదని ఆ పద్దతులు మన మట్టిలో పుట్టి పెరిగిన సంస్కృతీ సాంప్రదాయాల నుంచి మొలకెత్తాలని.     

ఇవి రే సినిమాల గురించి చెప్పాడు కానీ కవిత్వంతో సహా అన్ని సృజనాతక రంగాలకూ వర్తిస్తాయని నేననుకుంటాను.

‘కళను నిర్వచించేది కళాకారుడి వ్యక్తిత్వమే’ తప్ప వేరేదీ కాదని అన్న రే మన చిత్రాలతో సమస్యలు అన్న అంశం గురించి మొదలు పెట్టి అనేక భారతీయ సినిమా అంశాల్ని తన కోణంలోంచి అనుభవంలోంచి వివరిస్తాడు. నిజాయితీగా ఒక సినిమా తీయడానికి ఒక కళాత్మక దృష్టి గల దర్శకుడి కష్టాలూ, ఆనందాలూ అన్నీ వివరిస్తాడాయన. ఇక న్యువేవ్ దర్శకుల సినిమాల గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి మొహమాటాలు లేకుండా కుండబద్దలు కొడతాడు రే. కేవలం విలక్షణ మయిన ధోరణి వల్ల కాకుండా తనదయిన శైలి, స్ఫూర్తి, ధృక్కోణాల వల్లనే నిజమయిన కళాకారుడు గుర్తించ బడతాడని అంటాడు. శ్యాం బెనెగల్, మృ ణాల్ సేన్, కుమార్ సహానీ, మని కౌల్ ల సినిమాల్ పై సునిశిత పరిశీలానాత్మక వ్యాఖ్యలు చేసాడు రే. ఇక విదేశీ సినిమాల గురించి రాసినప్పుడు తాను చూసిన ఇటాలియన్ సినిమాలూ, హాలీవుడ్ సినిమాలు, బ్రిటిష్ సినిమా, జపనీస్ సినిమాలపై విశ్లేషనాత్మకంగా రాస్తాడు. ముఖ్యంగా చార్లీ చాప్లిన్ గోల్డ్ రష్ గురించి, కురుసోవా రషోమాన్ గురించి గొప్పగా రాసాడు.  ఇక బైసికిల్ థీవ్స్ సినిమాను సినిమా ప్రక్రియలోని ప్రాథమిక అంశాలను మరోసారి ఆవిష్కరించుకునే సినిమాగా వర్ణిస్తాడు రే.

ఇట్లా సినిమాకు సంబందించిన అనేక మౌలిక విషయాల గురించి ఈ OUR FILMS AND THEIR FILMS లో చర్చిస్తాడు.  ప్రత్యేక అంశాల్ని మన ముందుంచుతాడు. ప్రపంచ వీక్షణం చేస్తూనే భారతీయ దర్శకుడు జీవితం వైపు వాస్తవికత వైపు నడవాలంటాడు.

“నా అభిప్రాయంలో ఏ కళాత్మక రంగం నుండయినా ఇంకో కళాత్మక రంగంలోకి మరలడం అంత కష్టమయిన పనేం కాదు” అన్న సత్యజిత్ రే అనేక సృజనాత్మక రంగాల్లో కృషి చేసి తనదయిన ముద్రను మిగిల్చాడు.

కానీ మన తెలుగులో అంతటి వైవిధ్యమున్న సృజన చేసిన వాళ్ళు కనిపించరు. అట్లా కొందరు కృషిచేసే ప్రయత్నం చేసినా గుర్తింపు తక్కువే ననిపిస్తుంది. తెలుగులో కవిత్వం,సినిమా, సంగీతం, చిత్రలేఖనం వాటి సృజన వేర్వేరు అన్నట్టు కనిపించే ధోరణి నాకయితే ఎంతో ఆందోళన కలిగిస్తుంది.

ఈ OUR FILMS AND THEIR FILMS ని వి బి సౌమ్య తెలుగులోకి అత్యంత సరళంగా సూటిగానూ అనువదించారు. ఇవ్వాళ సృజన రంగంలో కృషి చేయాలనుకుంటున్న వాళ్ళంతా చదవాల్సిన పుస్తకమిది.  ఇంకా ముఖ్యంగా సినిమా రంగంలోకి వెళ్ళాలనుకుంటున్న యువతీ యువకులంతా చదవాల్సిన పుస్తకమిది. రే వివరించిన అనేక అంశాలు కళాత్మక రంగానికి సంబదించి అనేక కోణాలని ఆవిష్కరిస్తాయి. సౌమ్య గారికి  మనసారా నా అభినదనలు.

click me!