సంవేదన సంఘర్షణల్లో ‘కురిసి అలసిన ఆకాశం’

By telugu team  |  First Published Nov 1, 2021, 2:26 PM IST

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం పద్మావతి రామభక్త  "కురిసి అలసిన ఆకాశం” అందిస్తున్నారు వారాల ఆనంద్.


తన ‘కొత్త వేకువ’ కవితా సంకలనంతో పరిచయమయిన పద్మావతి రామభక్త ఇటీవలే తన “కురిసి అలసిన ఆకాశం” కథా సంకలనం పంపించారు. అటు కవిత్వము ఇటు కథలు రాస్తున్న పద్మావతి గారి నుంచి కొత్త కథా సంకలనం అందుకోవడం ఆనందం కలిగించింది. సృజనకు సృజన కారుడికి హద్దులు లేవన్నట్టు ఎవరయినా రాయగలిగితే కవిత్వమూ, కథలూ, నవలలూ కూడా రాయొచ్చు. ఎలాంటి ఆక్షలూ వుండవు. అయితే ఏ అంశాలు ఏ రూపానికి సరిపోతాయోనన్నది ఆ రచయితలు గుర్తించాల్సి వుంటుంది.  అంతే కాదు తాము రాయబోయే ‘సాహిత్య రూపం’ తాను చెప్పదలుచుకున్న సారాన్ని సంపూర్ణంగా అందించ గలుగుతున్నదా అన్నది కూడా ఆలోచించుకోవాల్సి వుంటుంది. తెలుగులో Poetic prose/ prosaic poetry  రాసిన వాళ్ళున్నారు. పద్మావతి గారు చిన్నప్పటినుండీ తనకు సాహిత్యంతో పరిచయం లేదని తన మాటలో రాసారు. కానీ ఆమె రాసిన వచనం, కవిత్వంలో చేయితిరిగిన రచయితల ప్రతిభ కనబడుతుంది. దానికి కారణం తను మంచి చదువరి కావడం అనుకుంటాను. ఎందుకంటే బాగా శ్రద్ధగా విస్తృతంగా చదివిన వాళ్లకి తమకు తెలియకుండానే తమను తాను ప్రకటించే భాష ధోరణి అలవడుతాయి. అందుకే రచనలు చేయాలనుకునే వాళ్ళంతా విస్తృతంగా చదవాలని అంటాను.

పద్మావతి  కథా సంకలనం ‘కురిసి అలసిన ఆకాశం’ లో 17 కథలున్నాయి. వాటిల్లో చదివించే గుణం నాకు చాలా నచ్చింది. ఇక శీలా సుభద్రా దేవి గారన్నట్టు ఈ సంకలనంలో  “కథలకు పెట్టిన కవితాత్మక శీర్షికలు ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ కథల్లో స్త్రీల పాత్రలని గమనిస్తే స్వాభిమానం గల పాత్రలుగా మలచిన తీరులో రచయిత్రి ఆధునిక ఆలోచనా విధానం అర్థమవుతుంది”.

Latest Videos

అనేక వర్తమాన అంశాల్ని తీసుకుని కథలు రాసి సంకలనం చేసిన పద్మావతి రామభక్తని మొదట అభినందిస్తున్నాను.

‘అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు..’ అన్న కథ నుంచి మొదలు తెలుగులో లెక్కలేనన్ని కథలు వచ్చాయి. అవన్నీ మౌఖికంగానూ, లిఖితంగానూ మన మధ్య తరతరాలుగా తిరుగుతూనే వున్నాయి. లిఖితరూపంలో వచ్చిన తెలుగు కథలు వాటి పుట్టుక, చరిత్ర అందరికీ తెలిసిందే. అదట్లా వుంచి కథల్ని నిశితంగా పరిశీలిస్తే కథలు ‘ప్రధాన స్రవంతి కథలు’, ‘ప్రత్యామ్నాయ కథా స్రవంతి’ కథలుగా కనిపిస్తాయి. అంతేకాదు ‘కాలక్షేప కథలు’, ‘కలకాలం నిలిచే కథలు’ గా కూడా కనిపిస్తాయి.

ప్రధాన స్రవంతి కథలు దాదాపుగా అన్ని వార, మాస పత్రికల్లో విరివిగా అచ్చవుతూ వుంటాయి. వాటిల్లో మధ్య తరగతి, ఉన్నత వర్గాల జీవితాలూ, కలలూ, ఆశలూ, ఊహలూ ప్రధాన అంశాలుగా వుంటాయి. ముఖ్యంగా సమస్యల మూలాలలోకి వెళ్ళకుండా ఉపరితలంలో స్పృశించి ఆసక్తికర ముగింపుని ఇస్తాయి. చదువరులను కొంత సేపు ఊహల్లో ముంచెత్తి ఆహ్లాద కథలుగానో, ‘హ్యాండ్ కర్చీఫ్’ కథలుగానో మిగిలిపోతాయి. ఆ కథలు నాలుగు కాలాల పాటు పాఠకుల మదిలో నిలిచి పోవడం జరగదు. పాఠకుల్లో సమాజం గురించీ, సమస్యల గురించీ ఆలోచింపజేసే పనినీ ఆ కథలు నిర్వర్తించవు. అయితే ఆ రచనల్లో వుండే సరళమయిన భాష, చదివించే గుణాలని ఆ కథలకున్న గొప్ప లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు అధిక శాతం కథలు సంభాషణల మీదే నడవడం వాటి మరో లక్షణం. ఇట్లా ప్రధాన స్రవంతి కథలు విరివిగా వచ్చాయి, వస్తున్నాయి భవిష్యత్తులో వస్తాయి కూడా. పాఠకులకు మంచి కాల క్షేపాన్ని కూడా మిగులుస్తాయి.. అవన్నీ కేవలం కాలక్షేప కథలుగా, పాప్ కార్న్ రచనలుగా మిగిలిపోతాయి.

ఇక ప్రత్యామ్నాయ కథా స్రవంతి గురించి మాట్లాడుకుంటే ఆ కథల్లో సమాజం కనిపిస్తుంది. సమాజంలోని సమస్యలు ప్రతిబింబిస్తాయి. సమాజంలోని మనుషులు, వారి భావోద్వేగాలూ, సమాజంపై తీవ్రంగా ప్రభావం చూపే రాజకీయ ఆర్ధిక పరిణామాల విశ్లేషణ ఆవిష్కృతమవుతుంది.

అట్లా ఈ రెండు రకాల కథలూ మనకు తెలుగులో కనిపిస్తాయి. ఇవి రెండే కాకుండా ఈ రెంటికి నడుమ నిలబడే కథలూ వున్నాయి. అంటే ప్రధాన స్రవంతి కథల లక్షణాలతో చుట్టూ వున్న వర్తమాన సమాజాన్ని కాన్వాస్ గా చేసుకున్న కథలు. వాటిలో మనిషి, మనుషుల నడుమ వుండే ప్రేమలూ అనుబంధాల్ని, కొన్ని విలువల్నీ ఉన్నతీకరిస్తూ రాసిన కథలవి. వాటిని మధ్యస్థ కథలు అనవచ్చు. ఆ కథలు చదవగానే మంచి కథలు అనిపిస్తాయి చదివిస్తాయి కాని మూలాలలోకి వెళ్ళకుండా, మౌలిక అంశాల్ని తడమకుండానే ముగుస్తాయి.

ఇట్లా తెలుగులో మనం మూడు రకాల కథా ధోరణుల్ని గమనించ వచ్చు.  ఈ నేపధ్యంలో పద్మావతి రామభక్త ‘కురిసి అలసిన ఆకాశం’ కథల్ని చదివినప్పుడు  కొత్తగా రాస్తున్న రచయిత్రి మంచి వాక్య నిర్మాణంతో చదివించే లక్షణంతో కథలు రాసారు అనిపించింది. తాను చూసి చదివి తెలుసుకున్న విషయాల్ని కథాంశాలుగా చేసుకుని ఈ కథలన్నీ రాసినట్టు మనకు తెలిసిపోతుంది. దాదాపు అన్ని కథల్లోనూ వర్తమాన సమకాలీన అంశాల్ని సమస్యల్నీ రీడర్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసారు రచయిత్రి. చాలా కథల్లో మధ్య తరగతి ప్రజలు ముఖ్యంగా నగర మహిళల్లోని సంక్లిష్టతలే ఇతివృత్తాలుగా తీసుకున్నారు. కురిసి అలసిన ఆకాశం కథలో ఒంటరి తల్లి సంవేదన, ఆమె పడ్డ సంఘర్షణ కనిపిస్తే, ఉనికి కథలోని దీప, ఎంపిక కథలోని శ్రీ వల్లి పాత్రలు ఆత్మవిశ్వాసాన్ని తోడుగా చేసుకుని జీవితంలో నిలబడడాన్ని చూపించింది.

ఇట్లా తనకు తెలిసిన తాను అర్థం చేసుకున్న మనుషుల్నీ, పరిమితుల మేరకు తాను అర్థం చేసుకున్న సమాజాన్ని గురించీ పద్మావతి రామభక్త ఈ కథలు రాసారు. మంచి చదివించే  గుణం కలిగిన వచనంతో రాసిన కథలివి. పద్మావతి రామభక్త కవిత్వంతో పాటు కథల్నీ రాయడాన్ని అభినందించాలి. మరిన్ని మంచి కథలు, కవిత్వం ఆమె నుంచి ఆశిస్తూ.. సెలవ్.

click me!