అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం డా. నలిమెల భాస్కర్ “చలనాచలనం ఇతర అనువాద కథలు " అందిస్తున్నారు వారాల ఆనంద్.
ఇటీవలే ప్రముఖ అనువాదకులు కేంద్ర సాహిత్య అకాడెమి అనువాద పురస్కార గ్రహీత మిత్రుడు డా.నలిమెల భాస్కర్‘ చలానాచలనం’ ఇతర అనువాద కథలు అందుకున్నాను. తెలుగు అనువాద రంగంలో కానీ సాహిత్య రంగంలో కానీ భాస్కర్ గురించి నేనివ్వాళ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన ఆవసరం లేదు. సెప్టెంబర్ 2021లో వెలువడ్డ ఈ పుస్తకంలో భాస్కర్ గారి ఒక స్వీయ కథ ‘చలాచలనం’, ఇతర 17 అనువాద కథలున్నాయి. వాటిల్లో బెంగాలీ(2), కన్నడ(5), హిందీ(2), మళయాళ(4), తమిళ(4) కథలున్నాయి. ఆయనే తన ముందు మాటలో ‘1990 నుండి ఆంగ్లం, హిందీ లనుండి కాక నేరుగా ఆయా భాషలనుండి అనువాదాలు చేయడం మొదలెట్టాను’ అన్నారు. అంటే తన అనువాదాలు మూల భాష నుంచి నేరుగా చేసినవే తప్ప ఇంగ్లీషో హిందీనో కాదని అన్నారు. ఆయన కేవలం అనువాదాలే కాకుండా కవిత్వం, కథలూ, భాషా పరమయిన రచనలు చేసారు. 1993లో వెలువడ్డ ‘నూరేళ్ళ పది ఉత్తమ మళయాళ కథలు’ నాటి నుండి కొంత దగ్గరగానూ కొంత దూరంగానూ ఆయనను ఆయన సాహిత్య కృషిని చూసిన వాణ్ని. కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్. డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో కలిసి పనిచేసిన వాణ్ని. కొత్త అనువాద పుస్తకం తెచ్చినందుకు మొదట మనసారా అభినందిస్తున్నాను.
నిజానికి కవయినా, రచయితయినా ఏ కళాకారుడయినా ‘ఇరుగు పొరుగు’ భాషల్లో, ప్రాంతాల్లో వస్తున్న సాహిత్యాన్నీ కళారూపాల్ని తెలుసుకోకుండా అధ్యయనం చేయకుండా సంపూర్ణంగా ఎదగలేడు. ఈ చలనశీల సంక్షుభిత సమాజాన్నీ అర్థం చేసుకోలేడు. ‘ఇరుగు పొరుగు’ అంటే కేవలం మన దేశంలో వున్న భిన్న భాషలనే కాకుండా ప్రపంచ దేశాలలో వస్తున్న సృజన పట్ల కూడా కనీస అవగాహన అవసరమని నేను భావిస్తాను. ఇంకో విషయం ఏమిటంటే కవులు కవిత్వానికే, రచయితలు వచన రచనల అధ్యయనానికే పరిమితంకావడం కూడా వారి విస్తృతికి ఆటంకమే. సృజన శీలురు అయిన వాళ్ళు సంగీతం, పెయింటింగ్, సినిమాలతో సహా అన్నీ చూడడం అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని కూడా నేను భావిస్తాను. ఎందుకంటే కేవలం పెయింటింగ్ రంగంలోనే డాడా ఇజం, సర్రియలయిజం లాంటి అనేక కొత్త భావనలూ ప్రయోగాలూ వచ్చాయి. వాటి ప్రభావం సాహిత్యంలోనూ సినిమాల్లోనూ వుంది. అంటే అన్ని కళలూ పరస్పర ఆధారితాలూ ప్రభావితాలూ అని నేను అనుకుంటాను. మరి అన్ని భాషల్ని చదవడం ఎట్లా సాధ్యం అన్న ప్రశ్న ఉదయిస్తుంది. నిజమే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో 4-5 భాషలు తెలుసుకోవడమే గొప్ప(పాండిత్యం సంగతి అట్లా పెట్టండి). మరి అలాంటప్పుడు అనువాద రచనలే మనకు దారి చూపుతాయి. అనువాదం అనగానే అనేక సమస్యలు ముందుకొస్తాయి. స్వేచ్చానువాదమా, యధాతధానువాదమా.. ఏది కరెక్ట్. అనువాదం మూల భాషనుంచి చేసినా ఇంగ్లీషో మరో భాష నుంచి చేసినా ఎంతో కొంత కోల్పోవడం అనివార్యమే కదా... ఇట్లా అనేక విషయాలు ఎంతగా చర్చకు వచ్చినా అనువాదకుడు ప్రతిభావంతుడు నిబద్దత కలవాడూ అయినప్పుడు ఈ ప్రశ్నలు పెద్దగా ఆటంకం కావు. ‘ఆదాన్ ప్రదాన్’ ఇచ్చి పుచ్చుకోవడం తోటే మనం ఎదుగుతాం. మన ‘సృజన సాంద్రతా’ పెరుగుతుంది. అయితే ఇక్కడే అనువాదకుడి కృషి పాత్ర ప్రధానమవుతుంది. ఇతర భాషల్లోంచి లక్ష్య భాషలోకి అనువాదానికి పూనుకున్నప్పుడు ఆయన ఆయా భాషా ప్రాంతాల సంస్కృతి జీవన విధానమూ స్థూలంగా నయినా తెలుసుకోవాల్సి వుంటుంది. ఆ నేపధ్యంలోంచే అనువాదాలు చేసినప్పుడు వాటి విలువ పెరుగుతుంది. అంతే కాదు అనువాదాల్లో చదివించే గుణం అన్నది మరో ప్రధాన మయిన అంశం. చదివించలేనప్పుడు అది విఫల ప్రయత్నం అవుతుంది. ధారగా చదివించగలిగి దాదాపు సొంత భాషా రచన అనిపించినప్పుడే చదువరి అనువాదాల పట్ల ఆసక్తి కనబరుస్తాడు.
కానీ ఇక్కడో విషయాన్ని కొంత కష్టమయినా అంగీకరించాల్సిందే. మన తెలుగులో అనువాద అవసరాన్ని అందరూ గుర్తిస్తారు కానీ అనువాదాలకు అంతగా ప్రాముఖ్యత వున్నట్టు కనిపించదు. అనువాదకుల కృషీ అంతగా గుర్తింపు అందుకోవడం లేదన్నది సత్యం. ఒక్కోసారి Translation is a thankless job.. అన్న మాటా వినిపిస్తుంది. ఆ పరిస్థితి మారాల్సి వుంది. అనువాద రచనలకు పాఠకులు పెరిగితే తప్ప ప్రస్తుత స్థితి లో మార్పు రాదు.
ఇక ప్రస్తుత డా.నలిమెల భాస్కర్ ‘చలానాచలనం’ ఇతర అనువాద కథల విషయానికి వస్తే దాదాపు అన్ని కథలూ వివిధ పత్రికల్లో ప్రచురితమయినవే. అనేక కథలు ఓ హెన్రీ కథల్ని గుర్తుకు తెచ్చాయి. కథ చివర ఊహించని మలుపు అనేక కథల ప్రధానలక్షణంగా కనిపించింది. ముఖ్యంగా ‘మతకల్లోలాలు’, ‘అవ్వ’, ‘విశ్వాసం’ లాంటి తమిళ కథలు. బెంగాలీ కథల విషయానికి వచ్చినప్పుడు ‘మలిపొద్దులో’ ఆధునిక పోకడలు అవకాశవాద లక్షణాలూ వున్న కోడలు, ప్రాచీన సనాతన జీవనశైలి వున్న అత్తలు వున్న కుటుంబ నేపధ్యంలో మానవ సంబంధాల్ని గొప్పగా చూపించిన కథ. ఇంకా ‘అక్కేర లేనోడు’, ‘ఇది మాకథ’, లాంటి కథలు హృద్యంగా వున్నాయి. ‘పెద్దల దయ’ లాంటి కథలో తాను పొందిన బాల్యాన్ని తన కొడుక్కు అందించాలని తపించే ఒక తండ్రి తన తండ్రికి రాసే ఉత్తరం చాలా బాగుంది.
‘టీనేజ్’ కథలో పిల్లల పెంపకం విషయంలో ఒక ఆధునిక తండ్రి HOW TO DEAL WITH YOUR TEENGER లాంటి పుస్తకాన్ని ఆశ్రయించి భంగపడ్డ విషయాన్ని సటైరికల్ గా చెప్పిన కథ. భాస్కర్ స్వీయ కథ ‘చలనాచలనం’ పరాయీకరణ అంశంగా తీసుకుని రాసారు. అది ఆయన 1992 లో రాసారు. మొత్తం మీద అయిదు భాషల్లోంచి నలిమెల భాస్కర్ ఎంపిక చేసి అనువదించిన ఈ కథలు గత రెండు దశాబ్దాలలో అయిదు భాషల్లో వెలువడ్డ కథలు.
నలిమెల భాస్కర్ గారికి మరోసారి అభినందనలు.