అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం కున్వర్ నారాయణ్ కవితా సంకలనం " నో అదర్ వర్డ్స్" ( NO OTHERWORDS) కవితా సంకలనాన్ని అందిస్తున్నారు వారాల ఆనంద్.
ఇటీవలే సుప్రసిద్ధ హిందీ కవి, రచయిత కీ.శే. కున్వర్ నారాయణ్ గారి “నో అదర్ వర్డ్స్” ( NO OTHER WORDS) కవితా సంకలనాన్ని అందుకున్నాను. అపూర్వ నారాయణ్ ఇంగ్లీష్ లోకి అనువదించిన గొప్ప కవితా సంకలనమిది. దాదాపు ఆరు దశాబ్దాల పాటు సాహితీ రంగంలో వున్నారు కున్వర్ నారాయణ్.
వర్తమాన హిందీ సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని గొప్పగా ప్రభావితం చేసారాయన. ఆయన వివిధ సాహిత్య ప్రక్రియల్లో రాసారు. కవిత్వం, కథలు,ఎపిక్, విమర్శ, వ్యాసాలూ, అనువాదాలు చేసారు. వాటితో పాటు సినిమా,సంగీతం, కళలు, మ్యూజింగ్స్ కూడా రాసారు.
undefined
‘జీవితం..కవిత్వంతో రూపొందింది’ అన్న BORGES మాటల ప్రభావం కున్వర్ నారాయణ్ కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆయన ఒక చోట
‘నేను జీవితాన్నుంచి
తప్పించుకోవాలుకోవడం లేదు
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను’... అంటాడు.
హిందీ నవ్య కవిత్యోద్యమంతో మమేకమయిన కున్వర్ నారాయణ్ తన సరళమయిన భాష వ్యక్తీకరణలతో హిందీ సాహిత్యంలో ప్రత్యేక ముద్ర వేసాడు.
ఆయన తన సాహిత్య ప్రస్తానాన్ని మొదటి సంకలనం ‘చక్రవ్యూహ్’ తో 1961 లో ఆరంభించారు. 19 సెప్టెంబర్ 1927న జన్మించిన కున్వర్ నారాయణ్ తన బాల్యాన్ని ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య-ఫైజాబాద్ నగరాల్లో గడిపారు. ఆ కాలంలో ఆయన కుటుంబాన్ని టీబీ తీవ్రంగా కలిచివేసింది. అనేక మంది మృత్యు వాత పడ్డారు. చివరికి కున్వర్ తల్లి, సోదరి కూడా వ్యాధికి బలయ్యారు.
అనంతరం కున్వర్ లక్నో నగరానికి చేరుకున్నాడు. ఆయన జీవితంలో తొలి రోజుల్ని ఆలోచనల్ని ఆచార్య నరేంద్ర దేవ్, ఆచార్య కృపలానీ తీవ్రంగా ప్రభావితంచేసారు. కున్వర్ నారాయణ్ లక్నో విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లో ఎం.ఎ. పూర్తి చేసారు. అప్పుడే ‘లేఖ్ సంఘ్’ అన్న సంస్థతో మమేకమయి పని చేసారు. తర్వాత విదేశాలకు వెళ్ళిన కున్వర్ కవిత్వం పైన పాబ్లో నెరుడా, నాజిమ్ హిక్మాట్ లాంటి అనేక విదేశీ సృజనకారుల ప్రభావం పడింది. పోలాండ్, జెకోస్లోవేకియా, చైనా, రష్యా లాంటి దేశాల పర్యటన కున్వర్ ఆలోచనా పరిధిని విస్తృతం చేసాయి. చక్రవ్యూహ్ వెలువడిన కాలంలోనే ఆయన ‘యుగ చేతన’ అన్న పత్రిక కు సహా సంపాదకుడిగా పని చేసారు. తర్వాతి కాలంలో ‘నయా పత్రిక్’, ‘చాయానాత్’ అన్న పత్రికలకు కూడా సహసంపాదక బాధ్యతల్ని నిర్వహించారు. ఏ పనిలో వున్నా ఎక్కడున్నా ఆయన తన రచనా వ్యాసంగాన్ని వదులుకోలేదు. తన సృజనని నిరంతరం నిలుపుకున్నారు. కవిత్వంతో పాటు అనేక కథల్నీ రాసారు కున్వర్.
2002లో ఆయన ‘ఇన్ దినో’ అన్న కవితా సంకలనం వెలువరించారు. తర్వాత ‘వాజస్రావాకే బహానే’ అన్న ఐతిహాసిక గ్రంధం ప్రచురించారు. అయితే ఆయనకు గొప్ప పేరుని అనేక అవార్డుల్నీ ఇచ్చిన పుస్తకం 1979 లోవచ్చిన “ కోయి దూస్రా నహీన్’. హిందీ సాహిత్య ప్రపంచంలో విలక్షణ కవిగా పేరుగడించిన కున్వర్ నారాయణ్ సృజనాత్మక ప్రభావం మొత్తం హిందీ బెల్ట్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆయనకు సాహిత్యంలో అనేక జాతీయ అంతర్జాతీయ విశిష్ట అవార్డులు లభించాయి. అందులో కెనడా సాహిత్య అకాడెమీ అవార్డు, జ్ఞానాపీఠ్ పురస్కారం, కబీర్ సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, లోహియ సమ్మాన్, సలఖ్ సమ్మాన్, వార్శా విశ్యవిద్యాలయ గోల్డ్ మెడల్, ఇటలీ ప్రెమియో ఫెరోనియాలు కొన్ని మాత్రమే.
ఇట్లా హిందీ సాహితీ ప్రపంచంలో తనదయిన గొప్ప స్థానాన్ని పొందిన కున్వర్ నారాయణ్ ఎంపిక చేసిన కవితల్ని ఆయన కుమారుడు అపూర్వ నారాయణ్ ఇంగ్లీష్ లోకి ప్రతిభావంతంగా అనువదించారు. మూల రచనని యధాతతదంగా కాకుండా, భావం చెడకుండా చాలా గొప్పగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేసారు. అనువాదంలో అనేక మంది లాగా అకాడెమిక్ ఇంగ్లీష్ భాషను కాకుండా సృజనాత్మక ఆంగ్ల భాషను ఉపయోగించి ఈస్తటిక్ ఫీల్ ని చివరంటా కొనసాగించారు. అది అనువాదకుని ప్రతిభకు నిదర్శనం. ఈ సంకలనంలో అనువాదకుడు అపూర్వ మూల కవిత్వాన్ని “ EARLY MEDITATIONS, ROUGH ROADS OF HISTORY, JOURNEYS,THE RIVER DOES NOT GROW OLD, TREES, MITTORS AND SHADOWS,REMEMBERANCES, HUMANESQUE” విభాగాలుగా ఎంపిక చేసి కూర్చారు. చాలా గొప్ప కూర్పు.
1927లో జన్మించిన కున్వర్ నారాయణ్ తన 90 ఏళ్ళ వయసులో 15 నవంబర్ 2017 న పరమపదించారు.
ఆయన కవిత్వం అందరూ ముఖ్యంగా కవులూ సాహిత్యకారులూ తప్పకుండ చదవాలని నేను అభిలషిస్తున్నాను. ఈ సందర్భంగా కున్వర్ నారాయణ్ స్మృతికి నివాళులు అర్పించుకుంటూ, అనువాదాన్ని అందించిన అపూర్వ నారాయణ్ కి ధన్యవాదాలు
మీకోసం నేను చేసిన కున్వర్ నారాయణ్ కవిత్వ అనువాదాలు కొన్ని......
1) కొత్త మార్గం
నేను జీవితాన్నుంచి
తప్పించుకోవాలుకోవడం లేదు
అందులో భాగమవ్వాలనుకుంటున్నాను
జీవితపు ఊహాత్మక ఇరుసుపైన
కవిత్వానికి
అనుమానాస్పదంగా వున్న
స్థలాన్ని ఓ కుదుపు కుదపాలి
అందుకు మొదట
జీవితపు శక్తి మూలాల్ని
క్రియాశీలం చేయాలి
తర్వాత ఆ శక్తిని
బతుకు కక్షకున్న ఇరుసుకు
జత చేయాలి
అప్పుడు
గతంలో లాగా
‘యాంత్రికత’ లేని
‘మానవత్వం’ వైపు మరలిన
కొత్త మార్గం ఆరంభమవుతుంది.
హిందీ: కువర్ నారాయణ్
ఇంగ్లిష్: డేనియల్ వేయిస్ బోర్ట్
తెలుగు: వారాల ఆనంద్
2) ఓ వింతయిన రోజు
నేను రోజంతా గాయి గాయిగా తిరిగాను
ఎలాంటి ప్రమాదమూ సంభవించ లేదు
అనేకమంది మనుషుల్ని కలిసాను
ఎక్కడా అవమానం ఎదురుకాలేదు
నేను రోజంతా సత్యమే మాట్లాడాను
ఎవరూ తప్పుగా స్వీకరించలేదు
నేనివాళ అందరినీ విశ్వసించాను
ఎక్కడా మోసగింప బడలేదు
అద్భుతమయిన విషయమేమిటంటే
నేను ఇంటికి చేరుకోగానే
తిరిగొచ్చింది ఇంకెవరో కాదు
నేనే అని కనుగొన్నాను .
హిందీ మూలం: కుంవర్ నారాయణ్
ఇంగ్లిష్: అపూర్వ నారాయణ్
తెలుగు: వారాల ఆనంద్
3)ఎనిమిదవ అంతస్తు పైన
నేను ఎనిమిదవ అంతస్తులోని
ఓ చిన్న ఫ్లాట్ లో
ఒంటరిగా నివసిస్తున్నాను
ఆ ఫ్లాట్ కు బయటకు తెరుచుకునే
రెండు కిటికీ లున్నాయి
అవి నన్ను తీవ్రంగా భయపెడతాయి
కిటికీలకు బందోబస్తుగా
గట్టి గ్రిల్స్ బిగించాను
బయటనుంచి ఏదో ఉపద్రవం
ముంచు కొస్తుందని కాదు
ఇంత ఎత్తులోకి చొచ్చుకొచ్చే
ధైర్యం ఎవడు మాత్రం చేస్తాడు
ప్రమాదమల్లా నా లోపలే వుంది
చుట్టూ ఈ ఒంటరితనం ఈ విసుగూ
భయ భ్రాంతులని చేసే ఆ అంశాలు
ఏదో ఒక రోజు నన్ను
ఈ కిటికీల్లోంచి బయటకు దూకే
ఒత్తిడి చేస్తాయేమో.
హిందీ మూలం: కుంవర్ నారాయణ్
ఇంగ్లిష్: అపూర్వ నారాయణ్
తెలుగు: వారాల ఆనంద్