అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం కోడం పవన్ కుమార్ వ్యాసాల సంపుటి “కరోనా@ లాక్డౌన్360” అందిస్తున్నారు వారాల ఆనంద్.
కోరోనా సంక్షోభంతో సమస్త మానవాళి మనుగడ ప్రశ్నార్థకమయిన నేపధ్యంలో అందరిలాగే మిత్రుడు కవి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కోడం పవన్ కుమార్ కలిచివేతకు గురయి స్పందించి రాసిన వ్యాసాల సంపుటి “కరోనా@ లాక్డౌన్.360” అందుకున్నాను. వివిధ పత్రికల్లో అచ్చయిన ఈ వ్యాసాల్ని అన్నీ కాకున్నా అనేకం అప్పుడే చదివి వున్నాను. సంపుటిగా ఒక్క చోట చూడడం ఒకే సారి చదవడం మంచి అనుభవం. నిజానికి ఈ సంపుటి ఒక సంక్షోభ కాలపు చరిత్రను రికార్డ్ చేసింది. జర్నలిస్టుగా పవన్ చరిత్రకారుడి పాత్రను పోషించాడనే చెప్పాలి. తనకు మొదట ఆత్మీయ అభినందనలు.
కోడం పవన్ అనగానే దాదాపు నాలుగు దశాబ్దాల జ్ఞాపకాలు ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి. వేములవాడ, కరీంనగర్ సైన్సు వింగ్, సిరిసిల్ల, మద్రాస్, హైదరాబాద్ ఇట్లా ఎన్ని వూర్లు .....కలదిరిగామో కలగలిసి పొయామో...అంతేనా అన్ని సంతోషాల్లో సంక్షోభాల్లో... గ్లోబల్ ఆసుపత్రి, ఖైరతాబాద్ కిరాయి ఇల్లు, పత్రికాలూ, పుస్తకాలు, ఫిలిం సొసైటీ కార్యక్రమాలూ ఒకటా రెండా “ అనుభవాలు చిన్నవే కావచ్చు కానీ జ్ఞాపకాలు చాలా పెద్దవి’.
పవన్ ప్రధానంగా కవి. మినీ కవితల కాలం నుంచి విరివిగా కవిత్వం రాసిన వాడు. ఆ రోజుల్లో ఒక కవి సమ్మేళనంలో కవిత చదవడానికి వేదికనెక్కి శీర్షిక ‘జీవితం’ అని చెప్పి ఒక్క క్షణం ఆగి గాలి అని దిగిపోయాడు. మినీలో అంత మినీ కవిత చెప్పిన వాడు పవన్.
తర్వాత ఈనాడు, వార్త, మన తెలంగాణా పత్రికల్లో జర్నలిస్టుగా 30 ఏళ్ళు పని చేసిన తర్వాత ప్రస్తుతం ఫ్రీ లాన్సర్ గా రాస్తూ వున్నాడు. అట్లా రాసిన వ్యాస సంపుటి ఈ పుస్తకం.
కోవిడ్ ప్రపంచం ఎప్పుడూ ఊహించని ఉపద్రవం. వీరు వారని లేకుండా ప్రజానీకమంతా భయం నీడన, చీకటి గుప్పిట్లో బందీ అయిపోయారు. అయినా మనిషి గొప్ప ఆశాజీవి ఆపత్కాలాలకు ఎదురొడ్డి పోరాటం చేసిన యోధుడు. అందుకే --
తెరిపి దొరకని కష్టముండదు
చూసావా ఇవ్వాళ
లోకాన్ని ఆవరించిన చీకటికి
ప్రహారీ గోడల్లేవు
అలుపెరుగకుండా విస్తరిస్తున్న చీకటికి సరిహద్దుల్లేవు
శవాల్ని బుజానేసుకుని నిలబడ్డ
ఈ చీకటి ఎక్కడ మొదలయిందో తెలీదు
పట్టుకుందామంటే దొరకదు
ఎన్ని వలలు విసిరీ దొరక బుచ్చుకోలేము
అదంతే
కడుపు చించుకుంటే
కాళ్ళ మీద బడుతుంది
దట్టంగా ముసురుకున్న ఈ మబ్బులు
ఎప్పటికయినా ఒళ్ళు విరుచుకుని వెళ్లి పోతాయా
చీకటి కమ్మిన ఈ లోకం
బయలు బయలవుతుందా
ఒకింత తెరిపి దొరుకుతుందా
. . .
చీకటిలో బతకడమూ
సహజీవనమూ నేర్చుకుంటూనే వున్నాం
కానీ
అనూహ్య మరణ మృదంగాల్ని తట్టుకోవడమే
ఊపిరి ఆగిపోయేంత కష్టంగా వుంది
లోన ఎదో కదుల్తూ మెలిదిరుగుతోంది
. . .
కష్టం ఇవ్వాళ కొత్త గాదు
కాష్టమూ కొత్త గాదు
కలరా మలేరియా ప్లేగు
ప్రపంచ యుద్ధాలూ ఒకటేమిటి
లక్షల మరణాలని దాటేసి వచ్చాం
స్మృతిలో దాచేసి ముందుకే నడిచాం
. . .
మిత్రమా
ఎప్పటికయినా
బయలు బయలుగాని మబ్బులుండవు
ముగింపులేని ముసురుండదు
తెరిపి దొరకని కష్టముండదు
ఇప్పుడు నాకయినా నీకయినా
గొల్లు గొల్లుమనే రోదనకంటే
ఆగమాగం కాని నిలకడ కావాలి
ఆత్మ ధైర్యం పునః ప్రతిష్ట జరగాలి
(వారాల ఆనంద్ )
సరిగ్గా ఈ ఆశ తోటే కొడం పవన్ ఈ వ్యాస సంపుటిని తెచ్చాడు. ఒక విజయవంతమయిన ప్రయత్నం చేసాడు.
సంతోషంలోనూ వేదనలోనూ మనుషులంతా ముఖ్యంగా సృజన కారులంతా గొప్పగా స్పందిస్తారు. అదే రీతిలో ఈ కరోనా సంక్షోభ కాలాన్ని కూడా తమ తమ సృజనాత్మక రంగాల్లో విరివిగా స్పందించారు. ముఖ్యంగా కవులూ రచయితలయితే విరివిగా రాసారు. ‘SINGING IN THE DARK’ లాంటి గ్లోబల్ ఆంగ్ల కవితా సంకలనాలూ, తెలుగులోనయితే దీర్ఘ కవితలతో పాటు వందల సంఖ్యల్లో కవితలొచ్చాయి. కవి అయిన పవన్ నాన్ ఫిక్షన్ ప్రక్రియను ఎంచుకుని ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణా పై ప్రత్యేక దృష్టితో అనేక వ్యాసాలు రాసాడు. కాల పరీక్షల వైరస్లు - ఆ నాడు ప్లేగ్ .. ఈ రోజు కరోనా. చిన్న పరిశ్రమలు చితికి పోతున్నాయి. కరోనాకు మత్తెక్కించిన మద్యం, చిత్రసీమకు చేదు మాత్ర.. ఇట్లా అనేక అంశాల మీద రాసిన ఈ వ్యాసాల్లో భిన్న కోణాలు భిన్న అనుభవాలు మనకుకనిపిస్తాయి. ఇందులో మొత్తం 59 వ్యాసాలున్నాయి
“జర్నలిస్టుల కలం ఎప్పుడూ నిద్ర పోకూడదు. ఎదో ఒకటి రాస్తూనే వుండాలి’ అన్న టంకశాల అశోక్ మాటల స్ఫూర్తితో ఈ వ్యాసాలూ ఇతర వ్యాసాలూ రాస్తున్నాని పవన్ చెప్పుకున్నాడు. నిరంతరం రాస్తూ వస్తున్న పవన్ హైదరాబాద్ చరిత్రపై , చేనేత స్వరూపం పై కూడా రాస్తున్నాడు. ఆ క్రమంలో “కరోనా@ లాక్డౌన్. 360”.
అనేక వివరాలతో లెక్కలతో కూడిన ఒక విశిష్టమయిన రచన. ఎంతో ఆర్ఖైవల్ ప్రాధాన్యత వున్న రచన.
“కరోనా@ లాక్డౌన్.360” పుస్తకానికి ప్రముఖ రచయిత శ్రీ ఆడెపు లక్ష్మీపతి రాసిన ముందుమాట ఎంతో బలాన్నిచ్చింది. “ HUMAN HISTORY BECOMES MORE AND MORE A RACE BETWEEN EDUCTION AND CATASTROPE” అన్న H.G. WELLS మాటలతో మొదలయిన ఈ ‘చరిత్రలో ఓ కొత్త విషాద కోణం అన్న ముందుమాట మానవ జీవితమూ, ఆపత్కాలాలూ, మనుషుల మనస్తత్వాలూ, వారి జీవన సాఫల్య వైఫల్యాలూ అన్నింటినీ స్పృశిస్తూ సాగింది. చాలా మంచి ముందుమాటల్లో ఒకటిగా నిలిచింది.
ఆత్మీయుడు కొడం పవన్ ని మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.