అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం డాక్టర్ రొంపిచర్ల భార్గవి ప్రచురించిన “చలం లేఖలు తారకానికి ” అందిస్తున్నారు వారాల ఆనంద్.
ఇటీవలే “చలం లేఖలు తారకానికి” పుస్తకాన్ని అందుకున్నాను, అపురూపంగా ఆనందంగా అభిమానంగా. అది ఖచ్చితంగా చలం ప్రేమికులకో ప్రేమ కానుక. అభిమానులకు దాచుకోవాల్సిన సంచిక. తెలుగు సాహిత్యానికో గొప్ప వేడుక. చలం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పటికి అచ్చుకాని ఆయన లేఖలు చదవడం అవి కూడా చలం స్వీయ దస్తూరిలో చదవడం గొప్ప అనుభవం. అంతేనా అరుదయిన చలం ఫోటోలు ఇంకా ఎన్నో తెలియని విషయాల సమాహరం ఈ “చలం లేఖలు తారకానికి”. ఇంత అద్భుతమయిన కానుకను అందజేసింది డాక్టర్ రొంపిచర్ల భార్గవి గారు. ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎన్నిసార్లు ధన్యవాదాలు అన్నా తక్కువే.
ఒకసారి చలాన్ని చదివింతర్వాత ఆయనతో ప్రేమలో పడని వారు అరుదు. తెలుగు సాహిత్య నిర్మాతల్లో చలం ముఖ్యుడు. నవల, కథానిక, నాటక ప్రక్రియలకు సరికొత్త రూపాన్ని ప్రవాహాన్నీ పఠనీయతనూ అందించిన వాడు చలం. తెలుగు వచనానికి పరుగునూ కావ్యశిల్పాన్ని అద్దిన వాడు చలం. నవల, కథానిక, నాటకాలతో పాటు చలం రాసిన మ్యూజింగ్స్, ఆయన రాసిన లేఖలు తెలుగు సాహిత్యంలో ముఖ్యమయిన స్థానాన్ని పొందాయి.
undefined
నిజానికి తెలుగు సాహిత్యంలో లేఖా సాహిత్యం తక్కువ. తెలుగులోనే కాదు భారతీయ ఏ భాషల్లో చూసినా తక్కువేనని చెప్పుకోవాలి. లేఖలు అనగానే మనకు ప్రముఖంగా గుర్తొచ్చేవి నెహ్రు ఇందిరకు రాసిన ఉత్తరాలు. శరత్ లేఖలు కూడా గుర్తొస్తాయి. అయితే కేవలం ఉభయ కుశలోపరి లేఖల్ని లేఖా సాహిత్యంగా చూడలేం. సాహిత్య సాంస్కృతిక గౌరవాన్ని పొందిన లేఖల్ని లేఖా సాహిత్యంగా గుర్తిస్తున్నాం. అట్లా గొప్ప లేఖలు రాసిన రచయితగా చలం ప్రసిద్దుడు. ఆయనతో పోల్చదగిన లేఖా రచయితలు అరుదు. వారిలో ‘జానపదుని జాబులు’ రాసిన భోయి భీమన్న, ‘గీరతం’ రాసిన రచయితలు తిరుపతి వేంకట కవులు, ’పోస్ట్ చేయని ఉత్తరాలు’, ‘ఉభయకుశలోపరి’లను రచించిన త్రిపురనేని గోపీచంద్ ప్రముఖులు. ఇక తెలుగులో అందమయిన కళాత్మకమయిన ఉత్తరాల రచనలో డా.సంజీవ్ దేవ్ ది అందెవేసిన చేయి. ఆయన లేఖల సాహిత్య స్థానం కూడా గొప్పది. సంజీవదేవ్ ప్రేరణతో ఇటీవల దర్భశయనం శ్రీనివాసాచార్య ‘పలకరింపు’ ఉత్తరాల సంపుటిని వెలువరించారు.
ఇక చలం చింతా దీక్షితులు గారికి రాసిన లేఖలు విలువయినవి. అవి చలం ఆధ్యాత్మిక ప్రస్థానానికి అడ్డం పడతాయి. ఇక చలం రాసిన ‘ప్రేమలేఖలు’ నా అభిప్రాయంలో unparallel writings. అయితే అవి ఎవరికోసం రాసారో వాటిని ఎవరు అందుకున్నారో తెలీదు. కానీ చలం జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి.
చలం లేఖలు, ప్రేమలేఖల తర్వాత ఇన్నేళ్ళకి ‘చలం లేఖలు తారకానికి’ వెలువడింది. తారకం గారి అసలు పేరు కంభంపాటి రామశాస్త్రి అనీ ఆయన చలానికి దగ్గరి స్నేహితులనీ వారిద్దరి అనుబంధమూ జీవించినంత కాలం కొనసాగిందని భార్గవి గారు రాసారు. కాకినాడ పి.ఆర్. కాలేజీకి ప్రిసిపాల్ గా పనిచేసిన రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి గొప్పతనాన్ని గురించీ భార్గవి గారు ఈ పుస్తకంలో వివరంగా రాసారు.
ఈ ఉత్తరాల్లో తారకంతో ఎన్నో విషయాలు మాట్లాడిన చలం “ ఎంత ఆప్టిమిస్టో తారకం. లోకం ఇప్పుడు నడుస్తున్న రీతులు చూస్తుంటే తారకం, చలం, ధర్మసాధని( తారకం నడిపిన పత్రిక) పదేళ్ళ తర్వాత వినపడతాయా అనే గట్టి అనుమానం. ఒకవేళ ఈ పేర్లు మిగిలినా two big fools ఎకనామిక్ అవుల్స్ అనే హేలనతో నవ్వుకుంటారు. అప్పుడు ధర్మసాధని అనే పదానికి ఏ అర్థం వుంటుందో ఏ డిక్షనరీ వెతుకుతరో’ అంటాడు. ఇట్లా అనేక విషయాల్ని చలం తనదయిన భావ వచన వేగంతో రాసారీ పుస్తకంలో.
ఈ పుస్తకాన్ని వెలువరించిన డాక్టర్ రొంపిచర్ల భార్గవి గారు తెలుగు సాహిత్యానికి మరో ఆభరణాన్ని తొడిగారు.
ఇక చలం లేఖల ప్రవాహంలో కొట్టుకు పోతూనే తెలుగులో మరో గొప్ప లేఖా రచయిత సంజీవదేవ్ గుర్తొస్తున్నారు. ఆయన లేఖలూ గుర్తొస్తున్నాయి. అంతే కాదు నాకు అత్యంత సన్నిహితుడు అయిన దర్భశయనంకు సంజీవదేవ్ రాసిన లేఖల్లోని కొన్ని వాక్యాలు మీతో పంచుకోవాలనిపిస్తున్నది.
‘జీవితాన్ని సజీవంగా జీవించడమే ఆనందం, ఆనందమే జీవనావగాహన’.
‘చిరకాలమైన ఏకైక లక్ష్యం ఏ మనిషికైనా ఒకటే – బాధల నుండీ, దుఃఖాల నుండీ బయటపడి ఆనందంలో జీవించాలని, లేక ఆనందం తనలో జీవించాలని. కనుక మానవులందరికీ ఏదైనా ఒక లక్ష్యం మాత్రమే ఉన్నదనుకుంటే అది Release from sorrow and suffering, living in peace and bliss. మానవ జీవితపు చరమలక్ష్యం, పరమలక్ష్యం ఆనందం అన్నమాట.’
అలాంటి ఆనందాన్ని చలం లేఖలు, రచనలు అందిస్తాయి.