జ్ఞాపకం: తెనుగు పత్రిక శతాబ్ది సంవత్సరం

By telugu team  |  First Published Aug 28, 2021, 10:42 AM IST

'తెనుగు పత్రిక'  తెలంగాణలోని ఒక కుగ్రామంలో మొదలై నేటికి సరిగ్గా వంద సంవత్సరాలు.   ఒకవైపు నిజాం పాలన మరొక వైపు సౌకర్యాల లేమితో ఆ పత్రిక ప్రస్థానం ఎలా కొనసాగిందో ఒద్దిరాజు సోదరుల మనుమడు సుభాష్ చంద్ర ఒద్దిరాజు జ్ణాపకాలను ఇక్కడ చదవండి.


వందేళ్ళ పత్రికకు వందనాలు . అది ఆగస్టు 27,1922 వ సంవత్సరము. పూర్వపు వరంగల్ జిల్లా మహబూబాబాద్ తాలూకాలోని ఇనుగుర్తి గ్రామము..ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడైన సీతారామచందర్ రావు తన తమ్ముడైన రాఘవరంగా రావు తో అన్నాడు.

“రాఘవా .. రాత్రంతా నిద్ర లేమి తో వున్నావు, అసలే లోతుగా వుండే నీ కన్నులు ఎర్రబడి మూసుకుని పోతున్నాయి.. కాసేపు విశ్రమించారాదు అలా ..”

Latest Videos

undefined

“అన్నయ్యా, నాకు తెలుసు నీవు ఎందుకంటున్నావో .. కాని ఈ రోజు మన పత్రిక విడుదల అయ్యే రోజు కదా.. ఇంకా చాలా పనులున్నాయి. నీవు కూడా అలసట ...”

“చాలు , మాటలలో పడి అసలు కార్యాన్ని వదిలేస్తున్నాము. పత్రిక ప్రూఫ్ రీడింగు పూర్తి అయిందా . ఇంకా కంపోజింగ్ ఏదైనా మిగిలి వున్నదా ?”

“ అంతా పూర్తి అయింది, పద్యావళి లో నీవు రాసిన ..
” అతుల మహాత్మ్యబ్బిన నబ్బనిమ్ము
పూర్నకవితయుగాల్గిన బోరయనిమ్ము
నిష్క కోట్లచే సంపద నేగడనిమ్ము
భవ్యమైన తంపంబుచే బ్రోలనిమ్ము .... పద్యానికి నీ పేరు కంపోజ్ అవుతున్నది ..”
“ రాఘవా ..అక్కడ నా పేరు కు బదులు ‘ మధుర కవి’ అని చేర్చు. అలాగే మన పత్రిక డిజైన్ బొమ్మ ఎలాగా వున్నది.  ఒకసారి చూసావా "

“నేను చూసాను అన్నయ్య మీరు కూడా ఒకసారి చూడండి”

ఇందులో నిజాం టోపీతో వున్నది సంపాదకీయం శీర్షిక కొరకు నిర్దేశించినది .
 
ఇదంతా ఒక ఊహా జనితము. వంద సంవత్సరాల క్రితం ఒద్దిరాజు సోదరులు ఎలాంటి ప్రాధమిక వసతులు కూడా లేని ఒక కుగ్రామం నుండి పత్రిక తీయడం ఎంత కష్టమో తేలిపే ప్రయత్నం మాత్రమే. అసలే అవి నిజాం రాజు పరిపాలిస్తున్న రోజులు, అందునా పత్రిక నడపడం ఎవరికీ అనుభవం లేదు. అయినా అధైర్య పడలేదు. ఎలా అన్న దిగులు చెంద లేదు. విషయ సంగ్రహణ నిమిత్తం మద్రాసు వెళ్ళారు. వారు అంతకు మునుపే ‘విజ్ఞాన ప్రచారిణి గ్రంధమాల ‘ అనే పేరుతో 1918 లోనే ఒక సంస్థను స్థాపించి అనుబంధంగా ఒక ప్రింటింగ్ ప్రెస్సును కూడా ఒనర్చుకున్నారు.  అందుండి వారి రచనలే కాక ప్రముఖుల రచనలు కూడా వెలువరించారు. ఆ ప్రెస్సులో వారే కూర్పు వారే ప్రూఫ్ చేసుకునేవారు.

తరవాత ప్రత్రికా ప్రచురణకు పూనుకున్నాక గ్రామం లోని కొంత మంది ఆసక్తిగల యువకులకు ఇందులో తర్ఫీదు ఇచ్చారు. అందుకోసం పత్రిక నడపగలమని ధైర్యం వచ్చింది.  పత్రిక కొరకు వార్తలు, వ్యాసాలూ కథలు, పద్యాలు కావలసిన అన్నిటిని సేకరిoచారు. అదే రోజుల్లో శ్రీ కాశీనాథుని నాగేశ్వర్ రావు గారు ‘ ఆంద్ర పత్రికా’ కార్యాలయాన్ని మద్రాసు నుండి బొంబాయికి మారుస్తున్నారు.  వారిని కలిసారు సోదరులు.  వారు పత్రిక నడపడంలో మెళుకువలు సాధకబాధకాలు వివరించారు. చివరన అడిగారు వారు . “మీరు ఎక్కడినుండి మీ పత్రిక నడుపుతున్నారు అని -  సమాధానం విని “ఒక పల్లెనుండి పత్రిక నడుపుతారా!?  చెన్నై నుండే నేను బొంబాయి మారుస్తున్నాను. ఒక పల్లె నుండి అదీ నైజాంలో ..” అన్నారు. 

అక్కడినుండి వారు బందరు వెళ్ళారు,  అక్కడ వారి చిరకాల మిత్రులు సన్నిహితులు అయిన ముట్నూరు కృష్ణారావు గారిని కలిసి వారి సలహాలు, ఆశీర్వాదం పొందారు. ఆ విధంగా పత్రిక ఎలా ఉండాలో ఒక నిర్దేశానికి వచ్చారు. పత్రిక ప్రతీ ఆదివారం వెలువడే విధంగా పన్నెండు పేజీలు ఉండేలా సంవత్సర చందా    3-12-0  గా నిర్ణయమయింది. అందులో ఒక పేజి తమ ప్రకటనలు, తమ విజ్ఞాన ప్రచారిణి గ్రంధమాలలో అచ్చయిన పుస్తకాల వివరాలు ఉండేలా చూసారు. ఆరవ పేజిలో సంపాదకీయం రాసారు. అదే పేజీలో సూర్యుని బొమ్మపై నిజాం రాజు టోపీ ఉన్న  ముద్రికను (emblem) చేర్చారు .  పత్రిక టైటిల్ పేజిలో  “ తెనుఁ గు పత్రిక ” అని పేరుతో పాటు  పైన Registered Nizam’s No. 4 . Registered No. M. 1921, క్రింద ప్రతి ఆది వారం ప్రకటించబడును అని చేర్చారు. అదే బ్లాకులో మహాభారతంలోని ఈ పద్యాన్ని పెట్టారు.

“ఆ.వె. వార్తయందు జగము వర్తిల్లుచున్నది అదియు లేని నాడ యఖిల జనులు
అంధకార మగ్నులగుదురు గావునా వార్త నిర్వహింపవలయు పతికి ..”

సంపుటి, సంచికలతోపాటు ఇనుగుర్తి , నామ సంవత్సరం, నెల, వారం కలదు .  ఆ విధంగా నల్లగొండ నుండి ప్రచురింపబడిన “ నీలగిరి “ (24-8-1922) తరవాత మూడు రోజులకు అనగా దుందుభి నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పంచమి ఆదివారం అనగా సరియగు తేది 27-8-1922 రోజున తెనుగు పత్రిక వెలువడింది.  కాని అప్పటివరకు తపాలా (పోస్టు ఆఫీసు) సౌకర్యం కూడా లేని రోజులు.   సోదరులే తమ సైకిల్లపైన గ్రామాలు తిరిగి వాటి ప్రతులను పంపిణీ చేసేవారు.    

వీరి కోరికపై గ్రామానికి 1927 లో పోస్ట్ ఆఫీసు వచ్చింది.  కాని వీరినే పోస్టు విధులు నిర్వహించామన్నారు. 500 ప్రతుల పంపిణి వారే చేసుకున్నారు. తరవాత ప్రతుల సంఖ్య వెయ్యికి పెరిగింది. దాదాపు ఏడు సంవత్సరాల కాలం నడిచిన పిదప   బంధువుల, మిత్రుల వత్తిడిమేరకు పత్రికని ప్రెస్సు యుక్తంగా వరంగల్లు పట్టణానికి మార్చారు సర్క్యులేషన్ బాగాపెరుగుతుందని, అవకాశాలు మెండని.  కానీ విధి వశాత్తు అక్కడినుండి పత్రిక ఒక్క సంచిక కూడా వెలువడ కుండానే ప్రస్తానం ముగిసింది.     

click me!