దాసరి మోహన్ కథ : తెలుగు అత్త - ఇంగ్లీష్ కోడలు

By Arun Kumar P  |  First Published Sep 22, 2022, 9:59 AM IST

తెలుగు భాషా పండితులు కూడా ఇంటిలో మమ్మీ డాడి అనే పిలిపించుకుంటున్నారు. మనం మూలాలను మరిచిపోయి... దూరంగా... వెల్లిపోతున్నమేమో... అనే బాధతో  దాసరి మోహన్ రాసిన  కథ  "  తెలుగు అత్త - ఇంగ్లీష్ కోడలు " ఇక్కడ చదవండి :


“నానమ్మ ... అమ్మ ఎక్కడ... అమ్మా... ఆకలవుతుంది" పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఆకలితో అరుస్తున్నారు.

“అమ్మ... అని పిలవొద్దు... మమ్మీ అనమని ఎన్నిసార్లు చెప్పాను" వంట గదిలో నుంచి వస్తూ వనజ కోపంగా అంది.

Latest Videos

“అమ్మా.. అని పిలిస్తే నష్టమేంటంట!" ముసలావిడ గునిగింది.

"స్టేటస్ అని చెబితే... అనకాపల్లి వారికి అర్థమవుతుందా!" వెటకారంగా అంది వనజ.

“మాకేం తెలుస్తుందిలే... మీవాళ్ళేమో పెద్ద సిటి వాల్లాయే.... మెమేమో పల్లెటూరి వాళ్లం కదా ముసలావిడ తగ్గేటట్టు లేదు.

"మా వాళ్ళను మాటలు అనకుండా మీకు పొద్దు పోయేటట్లు లేదు”... వనజకు కోపం ఎక్కువైంది.

"మొదలు పెట్టింది ఎవరు"... దీర్ఘం తీస్తూ అంది ముసలావిడ.

“మమ్మీ ప్లీజ్ ఆకలేస్తుంది" పిల్లలిద్దరు కోరస్ గా అన్నారు.

“గుడ్ అలా మమ్మీ అని పిలవాలి... ఉండండి రెండు నిముషాల్లో మీకు ఇష్టమైన మ్యాగి చేసి పెడతాను” పిల్లల నుండి ఇంగ్లీషు వచ్చేసరికి వనజ సంతోషంగా అంది.

"అమెరికా వాళ్ళు కూడ తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారంట. మనమేమో తెలుగువాళ్లం అయి ఉండి కూడా తెలుగులో పిలిస్తే కోపం చేస్తున్నాం.... అయినా మమ్మీ అంటే శవం అని అర్థం అంట కదా”... ముసలావిడ వనజను వదిలేటట్టు లేదు.

“అత్త గారికి టీవీ చూసి చాల విషయాలు తెలుస్తున్నాయి. జ్ఞానం ఎక్కువైతే ఆరోగ్యం చెడిపోతుందట.  కేబుల్ కట్ చేయించామంటారా... వనజ వార్నింగ్ ఇచ్చింది.

“వద్దులే... ఏదో ముసల్దాన్ని ఎటూ నడిచివెల్లలేనని... ఇంట్లో టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నాను.... నీ పిల్లలు... నీ ఇష్టం... నాకెందుకులే..."  అత్తగారు తగ్గిపోవాల్సి వచ్చింది.  ఒక్కపూట భోజనం లేకున్నా నడుస్తుంది. కానీ కేబుల్ లేకుంటే బతుకు బండి కదలదు.

"అలా ఉండండి మరి... నన్ను నా వాళ్ళను అంటే ఊరుకునేది లేదు... పిల్లలు ఇంగ్లీషులోనే మాట్లాడాలి... మీరేమి మధ్యలో రాకండి... " వనజ అత్తపై గెలిచిన ఆనందంలో అంది.

అమ్మ అనే పదం... నామోషి అయ్యింది... మమ్మీ డాడీ అంటేనే గౌరవం, గొప్పవాల్లలాగా అనుకుంటున్నారు... తెలుగు భాషా పండితులు కూడా ఇంటిలో మమ్మీ డాడి అనే పిలిపించుకుంటున్నారు. మనం మూలాలను మరిచిపోయి... దూరంగా... వెల్లిపోతున్నమేమో... అని అనిపిస్తుంది.

* * *

“ ఏమండి... ఈరోజు చిన్నీ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది... గుర్తుందిగా... మీరు వెళ్ళాలి..."
 
“సరే వెళ్తానులే.....”

“చిన్ని తెలుగులో మాట్లాడిందట... స్కూల్లో ఫైన్ వేసారు... అది కూడా అడిగి ఫైన్ కట్టి రండి ". 
 
" చిన్నికి స్కూల్లో తెలుగు మాట్లాడవద్దని  ఎన్నిసార్లు చెప్పినా వినదేం.  ఇది మూడవసారి” రాకేష్ చిరాకుగా అన్నాడు.
 
" చిన్నికి కాదు చెప్పాల్సింది... మీ అమ్మగారికి చెప్పండి... మీ అమ్మగారి ఉపదేశాల ప్రభావం పిల్లల మీద బాగా పనిచేస్తుంది"... వనజకి భలే అవకాశం దొరికినట్లయ్యింది.

“సరేలే... నేను స్కూల్ వాళ్ళతో మాట్లాడతాను. ప్రతిదానికి, అత్త కోడల్లు పేచి పెట్టుకుంటారు..." అంటూ రాకేష్ వెళ్ళిపోయాడు.

రాకేష్ వెళ్ళిపోగానే ముసలావిడ ముందుకొచ్చింది.
“నేనన్నా... తెలుగన్నా... నీకు ఎంత అలుసైందే ... చిన్నది స్కూల్లో తెలుగు ముక్క మాట్లాడిందని... నన్ను ఇరికిస్తున్నావ్.”

“కొడుకు ఉన్నప్పుడు మాట్లడలేదు... వారు వెళ్ళగానే నాతో మాట్లాడడానికి వస్తున్నారు...” వనజకి కోపం వచ్చింది...

“అమ్మో!...నీతో మాట్లాడేంత ఓపిక నాకెక్కడిది...” అంటూ వెల్లి టివి పెట్టుకొని చూడసాగింది ముసలావిడ.

* * *

"తెలుగులో మాట్లాడితే ఫైన్ వేయడం ఏంటి సార్!... వేలల్లో ఫీజులు కడుతున్నాం కదా! " రాకేష్ స్కూల్ హెడ్ మాస్టర్తో అన్నాడు.

"ఇక్కడ సమస్య డబ్బులది కాదు, సార్.  మాది ఇంగ్లీష్ క్యాంపస్ స్కూల్.  మేము అడ్మిషన్స్ ముందే అన్నీ వివరంగా చెప్పాం” ఇంగ్లీష్ లో చెప్పాడు హెడ్ మాస్టర్.
 
“ఏదో ఒకసారి.... ఒక్క మాట మాట్లాడినంత మాత్రన ఫైన్లు, రూల్స్, పనిష్మెంట్లు ఏంటి ఇలా!..."

“అందరూ ఒక్కసారే అని అనుకుంటే... డిసిప్లెన్ తప్పుతుంది కదా!”

"తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ ఉందిగా... మరి ఎందుకు ఇలాంటి రూల్స్ పెడుతారు!”

“సారి రాకేష్ గారు... ఇది స్కూల్ మేనేజ్మెంట్ పాలసీీ. ఇటువంటి రూల్స్ వున్నాయి కాబట్టి... మా స్కూల్కి సిటీలో మంచి పేరుంది...”

“తెలుగువాళ్లం అయి ఉండి... పిల్లలకు తెలుగు మాట్లాడకూడదని ఎలా చేస్తామండి!"

“తప్పదు రాకేష్ గారు.  తెలుగు టెన్త్ క్లాస్తోనే అయిపోతుంది. ఇంగ్లీష్ జీవితకాలం ఉంటుంది. మా స్కూల్ విద్యార్థులు విదేశాల్లో గొప్ప గొప్ప పొజిషన్స్ లో ఉన్నారు" హెడ్మాస్టర్ గర్వంగా చెప్పాడు.

'వీళ్లతో పోట్లాడలేం... మార్చలేం' అనుకొని ఫైన్ కట్టేసి రాకేష్ వెళ్ళిపోయాడు. 

భాషా, సంస్కృతిని పిల్లలకు నేర్పాల్సిన పాఠశాలలు 'ఇంగ్లీష్ వాదన' చేస్తే రాకేష్ మాత్రం ఏంచేస్తాడు మరి. తెలుగు నేలపైనే... తెలుగు తక్కువైపోతుంది... ప్రభుత్వమే తెలుగు మీడియం పాఠశాలలు మూసివేసి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతుంది.  ప్రజలు ఇప్పుడు అవే కోరుకుంటున్నారు.  'యథా ప్రజా - తథా రాజా' అని అనుకోవాలేమో! మన తాతలు ఇంగ్లీషు వాళ్ళను వెల్లగొట్టితే... మనం మాత్రం ఇంగ్లీష్ భాషను అందలమెక్కిస్తున్నాం.

* * *

“పొద్దస్తమానం టీవీ చూడడమేనా... కాసేపు నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా!” వనజ అత్తగారితో అంది.

“హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభలు మళ్లీ చూపిస్తున్నారే... కేసిఆర్ గారు తెలుగు పద్యం ఎంత చక్కగా చెప్పారో...ఆయన ఉంటే ఎంత సంతోషించేవాడో..." అత్తగారు కొంత విచారంగా తన భర్తను గుర్తు చేస్కుంటూ అంది.

"ఈ మధ్య మామగారు బాగా గుర్తుకొస్తున్నట్టున్నారు...” కొంచెం వెటకారంగా అంది వనజ.

“అవునే... వారు తెలుగు పండితులుగా... ఎన్ని సన్మానాలు జరిగాయో...”

“ఆ సన్మానాలతో శాలువాలు బాగానే మిగిల్చారు... ఏ ఇంగ్లీషు, లెక్కల మాస్టారో అయితే, ప్రైవేటు చెప్పుకొని కొంత డబ్బులు కూడబెడితే, కనీసం ఒక ఇల్లు అయినా కట్టివుంటే... మాకు నెలనెలా ఈ కిస్తీల బాధ తప్పేది...” వనజ.

"ఎప్పుడూ డబ్బుల ధ్యాసే నీకు... అప్పటికి మీ వాళ్ళు లక్షల కట్నం ఇచ్చినట్లు ఫోజు...”

"లక్షలు ఇవ్వనప్పుడు... ఎందుకు నా వెంటబడి నన్ను పెళ్లి చేసుకున్నాడో మీ కొడుకును అడగండి, మాట మాట్లాడితే... మా వాళ్ళను ఆడిపోసుకుంటారు..." అంటూ వనజ కోపంతో పడక గదిలోకి వెళ్లి తలుపేసుకుంది... ఒక్కసారి 'ధబ్ మని శబ్దం పెద్దగా వచ్చింది.

“ఏం పడేసిందో ఏమో... ఎప్పుడూ కోపమే దీనికి” అని అనుకుంటూ అత్తగారు టివిలో వస్తున్న 'కవి సమ్మేళనం చూస్తూ పరవశించి పోతుంది.

* * *

అసలేం జరిగింది ? ఎప్పుడూ పోట్లాటేనా !? అమ్మా నువ్ వనజను ఎందుకు ఎప్పుడూ ఏదో ఒకటి అంటావ్!” రాకేష్ తల్లిని మందలిస్తున్నాడు.

“నేనేం అనలేదురా.  నన్ను 'అస్తమానం టీవీ చూస్తున్నావని'  కోపంతో వెళ్లి గట్టిగా తలుపేసుకుంది. తరువాత చప్పుడయితే ఏదో పడేసిందనుకున్నాను. అయినా కింద పడితే నన్ను పిలవచ్చు కదా!” ముసలావిడ తన ధోరణిలో చెప్పింది.

“నాకు ఫోన్ చేసినా ఆఫీసు నుండి వచ్చి వెంటనే నిన్ననే హాస్పిటల్ తీసుకెళ్లే వాడిని.  ఇప్పుడు చూడు ఎంత వాపు వచ్చిందో.  నయం డాక్టర్ ఫ్యాక్చర్ కాలేదన్నాడు...” రాకేశ్ చెబుతున్నాడు బాధతో... మందులు ఎప్పుడెప్పుడు ఎలా వేసుకోవాలో వనజకి చెప్పి రాకేష్ బయటికి వెళ్లిపోయాడు.

రాకేశ్ వెళ్ళిన తరువాత “కోడలా... ఒక్కసారి ఇది విను.”  అంటూ ముసలావిడ మొబైల్ ఫోన్లో ఏదో వెదకసాగింది. 

 “ఇప్పుడు పాటలు వినిపిస్తారా... నాకు నొప్పిగా ఉంటే నీకు తమాషాగా వుందా!”  కోడలు నీరసంగా అంది.
 
“ముందు... విను... నీకే... తెలుస్తుంది...” అంటూ మొబైల్ను వనజ దగ్గరికి తీసుకువచ్చింది.

'అమ్మా... అమ్మా... అమ్మా.. అమ్మా... ' మొబైల్లో రికార్డింగ్ శబ్దాలు వినిపిస్తున్నాయి.  వనజ చిరాకుపడి -  " అత్తగారు నన్ను సాధిస్తున్నారా!” అంది.

“ ఇవి ఎవ్వరి మాటలనుకున్నావ్! "

“ ఏమో నాకేం తెలుసు! ”

“ నీవు గుర్తు పట్టలేదా...”
 
“నావా!...” వనజ ఆశ్చర్యంగా అంది.

“రాత్రంతా నీతో పాటే  నేను పడుకోలేదు. నువ్వేమో తెల్లార్లు అమ్మా... అమ్మా... అమ్మా అని మూలిగావు -  ముసలావిడ చెప్పింది.

"నిజమా!"
 
“అవును. నీ మాటలే సుమ. బాధ కలిగినా, ఆకలి అయినా అమ్మా అని వస్తుంది అంతే కాని ఇంగ్లీషులో ఏడవలేం... అర్థమయిందా!" అత్తగారు (గెలిచినట్లు) చెప్పింది.

“సరే అత్తగారు... నన్ను వదిలిపెట్టండి.." వనజ ఒప్పుకుంది.

“మరి నువ్వు నన్ను,  తెలుగును" ఏమి అనవు కదా!...“

" అవును... మిమ్మల్నీ తెలుగుని గౌరవిస్తాను..."

“మా మంచి కోడలు... తెలుగు కోడలు" అంది అత్తగారు.

“తెలుగునే కాదు మన సంస్కృతినీ సంప్రదాయాల్ని ఈ ఉగాది నుండి (మన) పిల్లలకు నేనే చెబుతాను " వనజ ఆనందంగా అంది.

మరక మంచిదే అన్నట్లు దెబ్బ వనజని బాధపెట్టినా అత్తా కోడళ్ళను (తెలుగును) కలిపింది.
" మందులు వేసుకోవాలి కదా! నీళ్ళు తెస్తానుండు "
అత్తగారు వనజతో అంది.  ఇక గొడవలు తగ్గిపోయి భాషా చర్చలు మొదలయ్యాయి.

click me!