ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ ఇక లేరు

By telugu team  |  First Published Feb 25, 2021, 5:30 PM IST

ప్రముఖ తెలుగు కథా రచయిత సింగమనేని నారాయణ కన్నుమూశారు. కరోనా వైరస్ నుంచి కోలుకుంటూ ఆయన మరణించారు. ఆయన మృతికి సాహితీలోకం దిగ్భ్రాంతికి గురైంది.


అనంతపురం: అనంత కథా పితామహుడు, మార్క్సిస్టు విమర్శకుడు, నిబద్ధత కలిగిన విశిష్ట సాహితీ వేత్త సింగమనేని నారాయణ (80) గురువారం మధ్యాహ్నం గం.12.30 లకు అనంతపురంలోని పావని ఆసుపత్రిలో కన్నుమూశారు.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సింగమనేని కోలుకుంటున్న దశలో కరోనా వైరస్ బారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 

సింగమనేని నారాయణ అనంతపురం పట్టణానికి సమీపంలో గల బండమీదపల్లి గ్రామంలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. అనంతపురంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన తిరుపతిలోని ప్రాచ్య కళాశాలలో విద్వాన్ చదివారు. అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాల ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండితుడిగా పనిచేచి 2001లో పదవీ విరమణ చేశారు. 

Latest Videos

ఆయన 43 కథలకుపైగా రాశారు. మొట్టమొదటి కథ న్యాయమెక్కడ 1960లో కృష్ణా పత్రికలో అచ్చయింది. జూదం, సింగమనేని నారాయణ కథలు, అనంతం, సింగమనేని కథలు అనే నాలుగు కథా సంపుటాలు వెలువడ్డాయి. తెలుగు కథ మొదలైన గ్రంథాలకు ఆయన సంపాదకత్వం వహించారు. ఆదర్శాలు - అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు అనే నవలలు రాశారు. 

సింగమేని మృతికి సాహితీవేత్తలు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, బండి నారాయణస్వామి, శాంతి నారాయణ,  "స్పందన" అనంతకవుల వేదిక బాధ్యులు చెంద్రశేఖర శాస్త్రి, రాజారాం తమ  ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.  ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సింగమనేని భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు. 

సింగమనేని పార్థీవ దేహాన్ని రేపు శుక్రవారం ఉదయం 9 గంటలకు కనగానపల్లి గ్రామంలో ఖననం చేస్తారు.  ఈ విషయం తెలుసుకున్న తెలుగు సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురయ్యింది.

సీమాంధ్రులు, విశాలాంధ్ర తెలుగు కథలు, తెలుగు కథకులు -కథనరీతులు గ్రంథాలసంపాదకుడు, కథావరణం, సమయమూ సందర్భమూ, సంభాషణ, తెలుగే ఎందుకు, మధురాంతకం రాజారాం వంటి అనేక గ్రంథాల రచయిత, గొప్ప వక్త సింగమనేని నారాయణ రచనలు.  ఆయన మృతికి ఆం.ప్ర. అరసం ప్రగాఢమైన సంతాపం ప్రకటిస్తున్నది. జూదం, సింగమనేని కథలు వంటి కథా సంపుటాలతో తెలుగు కథావికాసానికి దోహదం చేసిన సింగమనేని మరణం వల్ల తెలుగు సాహిత్యం పెద్ద దిక్కును కోల్పోయిందని అరసం అభిప్రాయపడింది.

click me!