రమేష్ నాయకు తెలుగు కవిత: చెకుముకి రాళ్లు

By telugu teamFirst Published Jan 28, 2020, 4:40 PM IST
Highlights

తెలుగు సాహిత్యంలో కవిత్వానిదే పెద్ద పీట. రమేష్ నాయక్ రాసిన చెకుముకి రాళ్లు అనే కవితను ఏషియానెట్ న్యూస్ తెలుగు పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాం.

1.

 కిటికీ దగ్గర ఎన్నో పటిక రాళ్లు  
విశ్రాంతి తీసుకుంటున్నాయి

 ఎవరు నన్ను గమనించనప్పుడు 
నేను ఆ రాళ్లను నాకుతాను
కానీ ఏ తీపి నా హృదయాన్ని తాకదు 
యే సువాసనా నా ముక్కుకి  తగలదు

 కోయిల రెక్కల చుట్టూ 
వసంతం మూగుతూ ఉంటుంది

 నా అమాయకత్వం తో 
కిటికీ ఊచలు ప్రకృతి దృశ్యాల్ని  ముక్కలుముక్కలుగా చేస్తాయి

 వసంతపు తపస్సుని భగ్న పరచడానికి 
ఆ పటిక రాళ్లను బయటికి విసురుతాను

2.

 ఓ రోజు నానమ్మ తన ఘున్గ్టో  కుట్టడం లో మునిగిపోయింది 
తన పక్కనే ఆ పటిక రాళ్లను  పెట్టుకుని 
దారం గుచ్చిన సూదిని పదును కోసం 
రాయికి రాస్తూ ఉంది

 మెల్లిగా ఆమె పక్కన 
ఆ రాళ్లను చూస్తూ కూర్చున్నాను
 చీకటి వెలుతుర్లు దాగుడుమూతలాడుతున్నాయి 
 రాయి నుంచి పొడుచుకు వస్తున్న పదునైన వెలుతురుని చూసి ఆశ్చర్యపోయాను

 మా నానమ్మ గుడ్డలోని పూసలు 
దొర్లడం పాడడం ఆపేసాయి 

 పదునైన సూది ఘున్గ్టో ఆనందాన్ని 
రాయి పై లికిస్తున్నది

 నానమ్మ నన్ను చూసింది 
తన నీడని నాకు కాపలా పెట్టి 
పటిక రాళ్ల కధల్ని చెప్పడం మొదలెట్టింది 

3.

 మరణం ఎరుగని ప్రపంచపు మరకల్ని 
ఒళ్ళంతా పూసుకొని 
నీ తల్లి గర్భంలోని  
సముద్రాన్ని ఖాళీ చేసి 
నీ తల్లికి నీవు విముక్తి పరిచినప్పుడు 

 నల్లని రాయ్ ఒకటి నీ బొడ్డు తాడుని కోసింది
 అప్పటినుండి ఆ రాయి కి జ్వరం పట్టుకుంది ఓరోజు అది మన గుడిసెని కూడా కాల్చేసింది

 నీ రండేల్లప్పుడు పాలతో పిండి చేసిన గోరుముద్దల్లోకి 
చంద్రుడు తొంగి చూసినప్పుడు 
నువ్వు గుక్కపెట్టి ఏడుస్తున్నావు 

 అప్పుడు మీ తాతయ్య 
ఎర్రని రాళ్ల  రాపిడితో ఓ పాట పాడాడు 
వింత ప్రపంచం లోకి జారిపోయి 
ఎర్రని రాళ్ల పడకపై ఆదమరిచి నిద్రపోయావు  నువ్వు

 నీ ఐదేళ్ళప్పుడు 
రుతుపవనాల పిలుపు విని 
మనం వలస వెళుతూ అడివిలో ఇరుక్కుపోయాం
ఆకలి,  చీకటికి భయపడి నువ్వు  ఏడుస్తున్నప్పుడు

 మాంసం రంగుల రాళ్లు చీకటిని మింగేసి 
నీకోసం కొన్ని ఉల్లిగడ్డల్నీ కాల్చి ఇచ్చాయి 

 నీ ఎనిమిదేళ్లప్పుడు
 చంద్ర గ్రహణాన్ని చూడాలని ఆశ పడినప్పుడు
 పట్టిక రాయి  ఒకటి గ్రహణాన్ని 
నీ కళ్ళకి దగ్గరగా తెచ్చింది

4.

సిలుమెక్కిన గతంలోంచి
మనం మన అస్తిత్వం నుండి వేరయ్యాము
తాబేలు చిప్పల్లో బతుకుతూ జింక కొమ్ముల పై జీవితాన్ని వేలాడదీసి కాలాన్ని నెట్టుకొస్తున్నాము

ప్రపంచం రాల్లనాన్నింటినీ కుప్ప పోసి, దానిని బంజారాల జాతరగా మార్చేసింది

జాతరలోనీ రాళ్ళు ఇప్పుడు
అపూర్వమైన కథలతో పేలడానికి సిద్దంగున్నాయి

మరింత తెలుగు సాహిత్యం కోసం...https://telugu.asianetnews.com/literature

click me!