చింతన 1: రూపమూ ప్రక్రియా- కవిత్వం

By telugu teamFirst Published Jan 14, 2020, 3:54 PM IST
Highlights

తెలుగు సాహిత్యంలో నారాయణ శర్మ ప్రసిద్ద విమర్శకుడు. తెలుగు సాహిత్య విమర్శలో ఆయనది అందె వేసిన చేయి. ఆయన కవిత్వ రూపంపై రాసిన వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాం

వచన కవిత్వం రూపమా ?ప్రక్రియా ? దీని మూలాలెక్కడ ఉన్నాయి?ఏ మైలురాళ్లను దాటి ఇది వొచ్చింది?.అన్న విషయం ఒకటి ఆలోచిస్తే కవిత్వంలోకి వెళ్లడం చాలా సులభం.ఈ మధ్య కాలంలో చాలామంది మాటల్లో వచన కవిత్వం ఒక ప్రక్రియ,పద్య కవిత్వం ఒక ప్రక్రియ,గేయ కవిత్వం,పాట,మధ్యలో వచ్చిన వచన గేయం,ఇంకా ఈ మధ్య వస్తున్న చిట్టి చిట్తి రూపాలన్నీ ప్రక్రియలేనన్న ఆలోచన.తీర్పు ఎక్కువైపోయింది."ప్రకృష్టా క్రియా"-(గొప్పగా చేయబడిన లేదా బాగా చేయబడిన పని)ఈ విశేషణాలు సాహిత్య ముఖమైనవి.ఈ పదాన్ని మనవాళ్లు మొదట ఉపయోగించింది రెండు విషయాలలో ఒకటి వ్యవసాయం(ఉణాది క్రియ అనేవారు అంటేనాట్లువేయడం లాంటిది)రెండు వ్యాకరణాది శబ్దౌత్పత్తిభాగాలు.దీనికి విశేష్ణంగా సాహిత్య అనేది చేర్చి సాహిత్య ప్రక్రియ అని ఊపయోగిస్తున్నాం.అంటే సాహిత్య సంబంధంగా ఒక నియత విధిలో విశిష్టంగా చేసేపని.ఈ పని చేయడానికి ఆశ్రయించే మార్గాలు రూపాలు.ఇవి క్రాఫ్టింగ్ అంటే చెక్కడం,తీర్చిదిద్దడం లాంటి శిల్పీకరణ వల్ల ఏర్పడుతాయి.రూపానికి ఆకృతి,ఆకారం లాంటి పర్యాయాలున్నా అవి స్వయంభూతాలు.రూపం అంటే తీర్చిదిద్దటం అనే క్రియాత్మక దృష్టితో అర్థం చేసుకోవాలి.తమిళంలో శెయ్యుళ్ అనేపదాన్ని కవిత్వానికి వాడుతారు.ఇదీ శిల్ప సంబంధమయిందే.

కవిత్వం అంటే శిల్పం చేయడం అలా చేసేవాడు కవి."కవతే జానాతి కవయతి వా"-(జ్ఞాముకలవాడు,కవితను చెప్పేవాడు )-"కౌతి శబ్దయతి ఉపదిశతి"-(శబ్దాలను ఊపయోగించేవాడు,ఉపదేశించేవాడు)అని కవికి ఉత్పత్తి.ఈ ఉపదేశించడం,శబ్దాదులను ఉపయోగించి,ఉత్పత్తిచేసి శిల్పం చేసేవాడని అర్థం.ఈ క్రియలన్నీ కళ.ఇలా ఈ ఉపదేశ,శిల్పీకరణలకు పెట్తుకున్న పేరు కవితా,ఇదే కవిత్వంగా రూపొందించుకున్నాం.అందువల్ల కవిత్వం ప్రక్రియ.ఈ ప్రక్రియను అనుసరించేవిషయంలో ఒకటికి మించిన మార్గాలున్నాయి.అవి రూపాలు.ఏ కళ అయినా అవసరంకోసం పుట్టవు.అవన్నీ నాగరికతా వికాసంలో వచ్చినవే.కవిత్వ రూపంకూడా అంతే.ఇవన్నీ క్రమ పరిణామాలే కాని వేరువేరు కాదు.కొన్ని పరిణామాలు యాదృచ్ఛికంగా కొన్ని తిరస్కారంతో రావొచ్చు ఇలా రూపంలో వచ్చిన పరిణామాలే ఇవన్నీ.అందువల్ల వచన కవిత రూపమే కాని ప్రక్రియ కాదు.

సంస్కృతంలో వచ్చిన అనుష్టుప్,త్రిష్టుప్ లాంటివాటితో కాకుండా ఉత్పలమాల లాంటి వృత్తాలతో తెలుగుకు సంపూర్తి సంబంధాలున్నాయి.సంస్కృతంలోని వాటికి ముందు ఏవో మౌఖిక రూపాలుండి ఉంటాయి.వాటి చర్చ మనకు లేదు.ప్రాకృతమ్నాటికి గాథలున్నాయి.ఆరూపాలు కూడా తెలుగు దాకా రాలేదు.అనువాద రూపంలో తప్పితే.వృత్తాలు,జాతులు,ఉపజాతులనే పద్య రూపాలన్నీ కవిత్వమనే ప్రక్రియలో మొదటిభాగాలు.వీటికీ లయనే మాతృక అనేది నిర్వివాదాంశం.అయితే మనకు దొరకటం లక్షణాల రచన తరువాత దొరికటం వలన లక్షణాల అధ్యయనం వల్లనేకవిత్వం సిద్ధిస్తుందనేదాకా అజ్ఞానం విస్తరించింది.లక్షణాలు గతాన్ని అధ్యయనం చేయడం కోసం ఏర్పరచుకున్నవే కాని,భవిష్యత్తునునిర్ధారించడానికి కాదు.అలా సూత్రీకరణ చేసినవాళ్ళ సూత్రీకరణలు ఎక్కువకాలం చర్చలో లేవు.తొల్లిటి పద్య రూపాలు ఇలా దొరికినవే.

సంస్కృతంనుంఛి తెలుగులోకి వచ్చిన రూపాలు,తెలుగులోనే (పూర్తి తెలుగు కాకుండా ద్రవిడ సంస్కృతితో)వచ్చిన రూపాలతో కలిసి తెలుగు పద్యకవిత మార్గకవితగా వెలిగింది.దీనికన్నా ముందే దేశీ ఉంటుందనేది తెలిసిందే.లిఖితంగా ప్రాచూర్యంలోకి రావడం ఒక కారణం.నన్నె చోడుడు ముందువాడని ప్రతిపాదనలొచ్చినా నిరూపించలేక పోయామనేది విషయం.సోమన నాటికి పూర్తి దేశీ రూపాలతో కవిత్వం వచ్చింది.ఇదీ ఛందస్సుతో కలసి ఉండడం వల్ల దేశీచందమనే రూపం అలావ్టులోకి వచ్చింది.తరువాతి కాలంలో దేశీలోని గాన యోగ్యతకల రూపాలను ఆనుకొని వచ్చింది గేయం.వీటికీ నిబద్ధ లక్షణాలుండడంవలన  కేవలం లయవలన ఏర్పడ్డ రూపం పాట.వీటికి కొన్ని కారణాలున్నాయి.జాయపసేనాని లాంటివాళ్లు దేశీ గురించి చెబుతూ మూడు లయలనే చెప్పారు.అది తిస్ర,చతురస్ర,ఖండ వరుసగా మూడు,నాలుగు,ఐదు మాత్రలు గలవి.బహుశః దేశీలో ఇవి మాత్రమే ఉండి ఉంటాయి. 

తిశ్ర,చతురశ్రలను కలిపి మిశ్రను,చతురశ్ర ఖండలను కలిపి సంకీర్ణను లక్షణకారులు తయారుచేసి ఉంటారు.వీటి నిర్మాణమూ పేర్లూ అలాగే ఉన్నాయి.ఇప్పుడు పాట పేరుతో వాడుకలోఉన్న రూపాల్లోనూ ఈ మూడే కనిపిస్తాయి.ఇక్కడే పాట,గేయం వేరవుతున్నాయి.గేయం కొంత స్వేచ్చాచందో రూపం కాని పూర్తిగా కాదు.దానికీ కొన్ని లక్షణాలున్నాయి.అంటే లక్షణ రహితం కాదు.అందులోనూ సంకీర్ణ లాంటిదాన్ని అనుసరించిన గేయకవులు తక్కువ.అసలులేరు అనేంత.పాటకు లయ మినహాయించి ఈ లక్షనాలేవీ లేవు.పైగా ఆనందానికి కారణాలైన దరువుల లాంటివాటిని అనుసరించడం ఎక్కువ.గోరటి వెంకన్న లాంటివాళ్ళ పాటల్లో ఇలాంటివాటిని గమనించొచ్చు.అయితేఒక్కోసారి లయను నిర్దిష్టంగా అనుసరించడంవల్ల సంపూర్ణ గేయలక్షనాలూ కనిపిస్తాయి.వీటిని ఆయా సాహిత్యాలననుసరించి నిర్ణయించుకోవలసిందే కాని,ఒక గాటన కట్టివేయడానికి అవకాశంలేదు.అసాధ్యం కూడా.ముఖ్యంగా నియతమైన ఛందో లక్షనాలకు మూలం ఆదిమ జాతులు.లక్షణ సాహిత్యం కొన్నీటిని నియతం చేసి కొన్నీటిని వదిలివేస్తుంది.అలా కాని భాగం లక్షణేతరంగా కనిపిస్తుంది.నాగార్జునసాగరం లాంటి కావ్యాల్లో సి.నారాయణరెడ్డి ఇలాంటి ప్రయోగాలను చేశారు.ఇవి లక్షణేతరాలు.లక్షణాన్ని అధ్యయనం చేయడానికి ఉన్నంత సుళువైన మార్గం లక్షణేతరాన్ని చేయడానికి దొరకవు.దీనినుంచి లయను తీసుకుని భాషలో గ్రాంథీకం నుంచి సులభగ్రాంథీకాన్నీ కూడా దాటుకుని వచనగేయం ఒకటి అలవాటులోకి వచ్చింది.దాశరథి,కాళోజీ,నారాయణ రెడ్ది లాంటివాళ్ళు,శ్రీశ్రీ వీటిని అనుసరించారు.అయితే దీని లక్షణాలను నిర్ణయించుకునేంత కాలం కూదా ఇది వెలుగులో లేదు.ఈ వచనగేయాన్ని అంటే అందులోని గానయోగ్యమైన లయను దాటుకుని భావార్థప్రాతిపదికన వచ్చింది వచనకవిత.

నిర్దిష్టమైన నిడివి,భాషా సంప్రదాయం.వాక్య నిర్మాణంలాంటి లక్షణాలను వదిలి ప్రకటనకు,అభివ్యక్తికి,చెప్పేతీరుకు ప్రాధాన్యతనిస్తూ వెలుగులోకి వచ్చింది.వీటన్నిటిలోనూ కవిత్వం చెప్పడమే ప్రధానం,అందుకని ఇవన్నీ కవితా రూపాలు వికాసంలో వచ్చిన క్రమ పరిణామాలే కానివేరు వేరు వ్యష్టి ప్రక్రియలు కాదు.అలాగే వచన కవిత తరువాత పొట్టి,పొడుగు రూపాలవలన ఏర్పడ్డ కొత్త రూపాలు కూడా.వీటికి దీర్ఘ కవిత అని,చిన్న వాటికైతే నానీలు,నానోలు లాంటి పేర్లు కూడా ఉన్నాయి.  వీటిని ప్రక్రియలనుకోవడం తెలియకపోవడమే కాని మరొకటి కాదు.రచనా మార్గానికి,లక్షనానుసరణకు,రూపంలో ప్రధానంగా జరుగుతున్న పనికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోవడమే తప్ప మరొకటి కాదు.లేక్కకు మించిన రూపాలు రావడం అవసరం కావొచ్చు,అత్యుత్సాహము కావొచ్చు.

చాలావరకు రూపం పరిపూర్ణతవంవైపు వెళ్లడానికే మార్పులు చెందింది.అందుకు కావలసిన అనివ్బార్యతలేర్పడ్దాయి.ఇది ఖాళీని పొరించుకునే గమనమే తప్ప.మరొకటి కాదు.ఒకదాని నుంచి ఒకటి మార్పు చెందాయికాని,ఒకదానిని ఒకటి చంపెయ్యలేదు.అది అసాధ్యం కూడా.ఎదిగిన నాగరికతకు మూలాలు అనాగరికతగా మనమనుకునే నాగరికతతొలిదశలోనే ఉన్నాయన్నది బహుశః మరచిపోయాం.అందువల్లే ఈ గజిబిజి.అందువల్ల కవిత్వం ఒక ప్రక్రియ ఇవన్నీ రూపాలు.

click me!