దాసరి మోహన్ తెలుగు కథ: జీవితం కొనసాగించాల్సిందే

By telugu team  |  First Published Jan 3, 2020, 2:33 PM IST

దాసరి మోహన్ రాసిన జీవితం కొనసాగించాల్సిందే అనే కథను పాఠకులకు అందిస్తున్నాం. తెలుగు కథ తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అది జీవితానికి అద్దం పడుతుంది.


 " మీ కవితా సంపుటి ఆవిష్కరణ ఎలా జరిగింది..?". కారులో కూర్చుంటూ అడిగింది  ఉమ.
    " బాగా జరిగింది.. మీరు లేకుండానే  మొదటి పుస్తకం ఆవిష్కరణ జరిగింది. మీరు వుంటే ఇంకా బాగుండేది."అన్నాడు కారు నడుపుకుంటూ రమేష్.
    " సారీ, రాలేక పోయాను"
   " ఫరవాలేదు.." అని రమేష్ 'కొత్త రెక్కలు'
 పుస్తకం ఉమకు అందించాడు.
    " థాంక్స్" అంది ఉమ.
   " చదివి మీ అభిప్రాయం చెప్పండి"
    " పెద్దవాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. నాకేం తెలుసని చెప్పేది." అంది ఉమ.
    " మీ అభిప్రాయం నాకు విలువైనది" అన్నాడు రమేష్.
  " సరే చెబుతాను.. బుక్ డిజైన్ బాగుంది."
 అని మొదటి పేజీ తీసి చదవ సాగింది ఉమ.
  'నాకు కొత్త రెక్కలు ఇచ్చి.. నా  కవితలకు ప్రేరణ అయిన ఆమెకు అంకితం.'... అని రాసి వుంది.
  "ఆమె కు అంకితం అన్నారు.. ఆమె ఎవరు?"అడిగింది ఉమ.
  " మీరే.. పేరు వ్రాయకూడదని... ఆమె అని రాశాను." అన్నాడు రమేష్
  " కొత్త రెక్కలు సరే.. కానీ కొత్త అనుమానాలు వస్తాయి కదా!"
  "ఇంట్లో తను నా పుస్తకాలు పట్టించుకోదు.. తను నా వస్తువులు ఏవీ ముట్టుకోదు కూడా... బయటి వ్యక్తులు అంటారా.. వూహించు కోనివ్వండి"
 "..  థాంక్స్.." అంది ఉమ.
  " మీ స్కూలు విషయాలు చెప్పండి." అడిగాడు రమేష్.
   " science exhibition కి పిల్లలను తయారు చేస్తున్నాను ."
   " ఆల్ ది బెస్ట్.."
   " థాంక్స్ .. క్రితం సారి సెకండ్ వచ్చాము..
ఈ సారి ఫస్ట్ ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్నాం.."అంది ఉమ
   కారు వై జుంక్ష న్ దాటి వెళ్తుంది.. మధ్యాహ్నం కాబట్టి రోడ్డు కొంత ఖాళీ గానే వుంది... వాహనాలన్నీ వేగంగా వెళ్తున్నాయి.
  " ఈ సమ్మర్ లో ఎటైనా వెళ్తున్నారా ?" అడిగాడు రమేష్.
   " షిర్డీ అనుకుంటున్నాము.. వారికి సెలవులు దొరకాలిగా.." అంది ఉమ.
  రమేష్ మరేదో మాట్లాడుతుండగా, ముందు వెళ్తున్న మున్సిపాలిటి లారీ సడన్ గా ఆగింది.
    రమేష్ బ్రేక్ వేసే లోపునే.. కారు లారీ వెనక బాగాన్ని గట్టిగా ఢీ కొట్టింది.
   రమేష్ కారు ఇంజన్ తో సహా లారీ వెనక  భాగం లోకి చొచ్చుకుని పోయింది.
   క్షణం లోపునే పెద్ద ఏక్సిడెంట్ జరిగిపోయింది.
   రమేష్ స్టీరింగ్ కి సీటుకు మద్య నలిగి పోయాడు.. ఉమ రమేష్ భుజం పై వాలి పోయింది.
   కలిసి బతకాలని అనుకున్నారు.. కుదరలేదు కాని .. కలిసి చని పోయారు..
   లారీ వెనక రాసి వుంది....' దేవత లారా దీవించండి' అని.....
  *.     *.      *.            **
    ఆఫీస్ లో, లంచ్ తరువాత సిస్టమ్ ముందు కూర్చుని లైవ్ టీవీ చూస్తున్నాడు కిరణ్.' కూకట్ పల్లి లో కార్ ఏక్సిడెంట్,.. మున్సిపాలిటి  లారీ నీ ఢీ కొని ఇద్దరు దంపతులు మృతి...' అని వస్తుంది..
    ' ఇసుక లారీ , మున్సిపలిటీ లారీ డ్రైవర్ లు యమదూతల్లా అయ్యారు' అని అనుకుంటూ మళ్లీ ఆఫీస్ వర్క్ లో నిమగ్నం అయిపోయాడు...
   ఇంతలో కిరణ్ మొబైల్ రింగ్ అయ్యింది.
   " హలో.."
    ' కిరణ్ గారా"
    " అవును చెప్పండి"
     " కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను... మీ మిస్సెస్ కు కారు ప్రమాదం జరిగింది ... వెంటనే  స్టేషన్ 
 కు వచ్చేయండి..."
     " హలో.. హలో.. మీరు ఎవరికి....."కిరణ్ అడుగుతుండగానే కాల్ కట్ అయ్యింది.
    కిరణ్ కి ఏమీ అర్థం కాలేదు.. ఫోన్ నెంబర్ తప్పయి వుంటుంది, పొరపాటున నాకు ఫోన్ వచ్చింది .... నా మిస్సెస్ స్కూల్ లో వుంటుంది కదా.. కార్ ఏక్సిడెంట్ అవడం ఎంటి.. ఈ పోలీస్ వాళ్ళు ఇంతే. భయపెడతారు. క్లారిటీ ఇవ్వకుండానే కాల్ కట్ చేశారు.' అనుకుంటూ మళ్లీ టీవీ లైవ్ చూడ సాగాడు..
   కూకట్ పల్లి ఏక్సిడెంట్ లో మృతి చెందిన వారు దంపతులు కాదు.. మరి ఎవరు..!?... దంపతులు కాని వారు ఒకే కారులో ఎక్కడికి వెళ్తున్నారు... మిత్రు లా... బంధువు లా.... ఇంకా సస్పెన్స్ వీడని ఏక్సిడెంట్...' ఛానెల్ యాంకర్ పదే పదే నొక్కి చెబుతుంది..
   ప్రమాదం గురించిన  వార్తను కూడా సంచలన సంఘటనగా చెబుతూ... దేశ సమస్య అయి నట్లు మానవత్వం కూడా లేకుండా.. ఇద్దరు వ్యక్తుల మృతి.. అందులోని నూ ఏక్సిడెంట్ ను ప దే ప దే  చూపెడుతున్నారు.
    మరో టీవీ చూస్తున్నాడు కిరణ్... ఇందులో  గుర్తింపు పత్రాన్ని చూపెడు తున్నారు

  అవును ఫోటో  ఉమదే.. ఓ మై గాడ్..  ఉమ కార్..లో.. ఏక్సిడెంట్.. సిస్టమ్ క్లోజ్ చేసి.. బాస్ కు చెప్పి కూకట్ పల్లి బయలు దేరాడు.
  బస్ లో నే స్కూల్ కు వెళ్లి.. బస్ లోనే ఇంటికి వచ్చే ఉమ  కార్ లో.. ఎవరితో... బంధువు లు కూడా ఎవరూ లేరుగా...
  కిరణ్ కి గుండె దడ ఎక్కువ అయ్యింది..
 అతనెవరో.. ఎప్పుడూ చూడలేదే.. ఉమ కూడా ఎవరి గురించి ఎప్పుడూ చెప్పలేదు.
   కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కి వెళితే.. గాంధీ హాస్పిటల్ కు వెళ్ళమన్నాడు.
  కిరణ్ కి టీవీ వార్త  నిజమని.. తన భార్య ఏక్సిడెంట్ లో చనిపోయింది అని అర్థం అయ్యింది..
  బండి పోలీస్ స్టేషన్ లోనే వదిలి క్యాబ్ లో గాంధీ హాస్పిటల్ చేరుకున్నాడు..
  అక్కడ వున్న పోలీస్ లతో 'అతను ఎవరో'    అని ముందు చెప్పినా... చనిపోయిన అతను ఎవరో తెలియదంటే ఇటు పోలీసులతో అటు టీవీ వాళ్ళతో కొత్త తల నొప్పులు వస్తయని, టీవీ వాళ్లూ వేదిస్తారని ....
  "ఇందాక గుర్తు పట్టలేదు.. దూరపు బంధువు '" అని పోలీస్ లతో చెప్పాడు..
  అతను తాలూకు బంధువులు ముందే రావడం... ప్రమాదం లో అక్కడికక్కడే చనిపోయిన సంఘటన కాబట్టి.. పంచ నామా కోసం గాంధీ హాస్పిటల్ కి పోలీస్ లే పంపించారు...
  కిరణ్ షాక్ లోనే .... ఫ్రెండ్స్ కి బంధువులకు  ఫోన్ చేసి చెప్పాడు.
  పోలీస్ లు కాగితాల మీద సంతకాలు తీసుకుని... సాయంత్రం వరకు. శవాన్ని అప్పగించారు..
   దహన సంస్కారాలు నిర్వహించారు..
  కానీ ప్రశ్న ప్రశ్న గానే మిగిలి పోయింది..
  ఎవరతను ..!?
   తనకు తెలియని వ్యక్తీ తో ఉమ స్నేహం చేస్తుందా... తనను కలవడానికి కోసమే ఉద్యోగం చేస్తుందా...!?
  ఇంతకీ అతను ఎవరు.. ఎలా పరిచయం...!!??
    *.       *.           *.        ***"
   " నాకు అన్యాయం చేసి పోయినాడు.. పిల్లల్ని ఎలా పెంచేది..!?" ప్రతి రోజు రమేష్ భార్య లక్ష్మి ఏడుస్తునే వుంది..
  ఇద్దరు అమ్మాయిలు.. ఉద్యోగం ( చేయ) లేని లక్ష్మి కి ఏడవడం తప్ప ఏమీ తోయటం లేదు.
  రమేష్ ఆఫీస్ నుండి మిత్రులు వచ్చి, రమేష్ కుటుంబానికి రావాల్సిన డబ్బులు మరియు కొన్ని  పేపెర్లు ఇచ్చి వెళ్లారు.
  " కవితలు.. పుస్తకాలు అంటూ తిరిగే వాడు.. మమ్మల్ని అ నాథల్ని చేసి వెళ్ళాడు.." ఎవరు పలకరించిన ఏడుస్తూనే వుంది లక్ష్మి..
  బంధువులు కూడా ఎక్కువ లేనట్టున్నారు.. వున్న కొద్ది లో ముందుకు వచ్చి ఆదుకునే వారు కరువయ్యారు..

Latest Videos

ఎవరి కుటుంబం వారిదే.. మగ వాళ్ళు ఉన్నప్పటి సందడి లేనప్పుడు వుంటుందా..
ఎవరి సమస్యలు వాళ్లకే వున్నాయి మరి..
 ఎవరో ఒక పెద్దావిడ మాత్రం లక్ష్మి తోనే వుంది..
  " నువు ఏడుస్తూ కూచుంటే ఎలా.. పిల్లలు బేజారు అయి పోతారు.. ధైర్యం తెచ్చుకుని.. పిల్లల్ని చూసుకో.." అంది పెద్దావిడ..
  " ఆయన దారిలో ఆయన పోయిండు..
 మాకు దిక్కెవరు పెద్దమ్మ.. మమ్మల్ని కూడా తీసుకెళ్తే బాగుండు..." లక్ష్మి పెద్దావిడ ను పట్టుకుని ఏడ్చింది..
  పెద్దావిడ కు కూడా లక్ష్మి ని ఓదార్చడం కష్టమే అయ్యింది..
  భరోసా లేని బతుకును ఏమని   ఓదార్చేది..!?
   అన్నీ తానై నడిపించే కథానాయకుడు...అర్ధాంతరంగా నిష్క్ర మిస్తే .. కుటుంబంకు దారి తోచడం కష్టమే కదా!
  కానీ జీవితం ఆగదు కదా..!
  కొత్త కథా నాయకుణ్ణి వెతుక్కోవాలి..
కొత్త దిశ లో పయనించాలి.. పయనిస్తూనే వుండాలి..
  *.       *.         ***
 సంవత్సరం గడిచింది .ప్రాక్టికల్ గా వుండే కిరణ్ జరిగిన సంఘటన నుండి తేరుకున్నాడు. ఇద్దరు మగ పిల్లలు వారి పనులు వారు చేసుకుంటున్నారు.. వంట మాత్రం కిరణ్ కి కొత్త బాధ్యత. కర్రీ పాయింట్ లతో కొంత నెట్టుకు వస్తున్నాడు కానీ ప్రతి పూట కష్టంగా మారింది.. ప్రతి రోజూ సాంబార్ పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉదయం పూట టిఫిన్.. మధ్యాహ్నం కోసం లంచ్ బాక్స్ లు .. హడావిడి లో ఆఫీస్ ఆలస్యం అవుతుంది
ఒక్కోసారి  లంచ్ బాక్స్ లో పచ్చడి పెట్టి
 పంపించాల్సి వస్తుంది.. ఈ పూట ఏం చేయాలన్నది అతి పెద్ద సమస్య.. హౌజ్ వైఫ్ అని చులకన చేసి మాట్లాడతాం కాని.. ఇల్లు ను మేనేజ్ చేయడం కంటే ఉద్యోగమే ఈజీ..

  పిల్లలకు షార్ట్ బ్రేక్ , లంచ్ బాక్స్.. ఇవన్నీ చేస్తూ ఉమ ఉద్యోగం చేసేది.. ఏనాడు విస్సుక్కోలేదు.. ఇంటిలో కిరణ్ సహాయం కూడా అడిగేది కాదు.. పైగా కిరణ్ రా సుకుంటున్నప్పుడు.. ఎన్ని సార్లు టీ అడిగిన ఇచ్చేది.... ఉమ పైన  కిరణ్ కు తను వున్నప్పటి కంటే, ఇప్పుడే గౌరవం పెరిగింది. ఉమ ప్రతి రోజూ పూజ చేసి దీపం ముట్టించేది..' బస్ కు లేటవ్వుద్దీ.. ప్రతి రోజు దీపం ముట్టించడం ఎందుకు ' అని కిరణ్ అనేవాడు. కాని ఇప్పుడు అదే దీపం వైపు దీనంగా చూస్తున్నాడు.' మళ్లీ ఆ దీపం ప్రతి రోజు వెలిగిస్తే బాగుండు' అని అనుకున్నాడు..

   లక్ష్మి కి నిద్ర పట్టడం లేదు... కొంత భయం తో.. కొంత బెంగ తో.. రమేష్ ఆదివారం కూడా రవీంద్ర భారతికో.. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కో.. సాహితీ సభలకు వెళ్లేవాడు.. ఎంత లేటుగా వచ్చిన.. రమేష్ కు భోజనం పెట్టి పడుకుంటే నాలుగు గంటలు అయినా హాయిగా నిద్ర పట్టేది.. ఇప్పుడు భోజనం తినబుద్ది కావట్లేదు.. నిద్ర కూడా గగనం అయ్యింది.
    లక్ష్మి పరిస్థితి రోజు రోజుకూ కష్టంగా మారుతుంది. పెద్దావిడ తప్ప ఎవ్వరూ సహాయం చేయడానికి రావటం లేదు. పెద్దావిడ కూడా ఎప్పుడెప్పుడు తన పల్లెకు పోదామా అని ఎదురుచూస్తుంది... పల్లెలో ఆరుబయట ముచ్చట్లు .. అందరి పలకరింపులు... ఆమెకు పట్నం లో వుండవుగా.. ఇక్కడ ఎవరి పరుగు వారిదే..
  లక్ష్మి పిల్లలను తయారు చేసి పంపిస్తుంది కాని స్కూల్ విషయాలు, బయటి నుంచి అవసరమైన సామాన్లు తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది.. గడప దాటడం గగనం అయ్యింది తనకు... డబ్బుల లెక్కలు తనకు కొత్తగా ఇబ్బంది. బ్యాంక్ ఏటీఎం వెల్లి రావడం అంటేనే భయంగా వుంది.
     కిరణ్ మిత్రులతో కలిసి లక్ష్మి ఇంటికి వచ్చి వెళ్ళాడు.. పాత విషయాలు ఏమీ అడగలేదు.. పోలీస్  లు ఇచ్చిన పేపేర్లు.. హాస్పిటల్ రిపోర్ట్స్ ఇచ్చి. అవసరమైన సంతకాలు తీసుకొని వెళ్తున్నాడు.. ఎప్పుడు కూడా ఉమ రమేష్ ల ప్రస్తావన తీసుకు రాలేదు.
పెద్దావిడ తో మాత్రం లక్ష్మి  పరిస్థితి పిల్లల చదువుల గురించి తెలుసుకున్నాడు.
 'కొద్ది రోజుల తరువాత నేను వెళతాను.. లక్ష్మి కి పిల్లలను పెంచి పెద్ద చేయడం కష్టమే.. దగ్గరి వాల్లు కూడా ఎవరూ లేరు. అందరూ వూరి దాటి రారు'. అని పెద్దావిడ చెప్పింది.
 లక్ష్మి నీ ,ఆడపిల్లల్ని ఇలా  పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఒంటరిగా వుంచడం మంచిది కాదని ఇద్దరు అనుకున్నారు.
మిత్రులూ కూడా 'ముందు ముందు చాలా ఇబ్బందులు వస్తాయి 'అని చెప్పినారు.
  లక్ష్మి ఎక్కడికి వెళ్లనని చెప్పింది.. పెద్దావిడ నేను వెళతాను అని బెదిరించింది.. 'పిల్లలు ఎదిగాక ఎట్లా.. నీ తోని అన్నీ అయితయ. దొంగోడు వచ్చిన ముగ్గురు ఆడోల్లు ఎట్లా..
ఒంటరిగా ఉంటున్నట్లు తెలిస్తే పాడు బుద్దులు వూరు కుంటాయా,'.. అని చెప్పింది..
  లక్ష్మి కి ఏమీ పాలుపోలేదు.. ఏడ్చింది..
పెద్దావిడ మళ్లీ అన్నీ చెప్పి పిల్లలను కాపాడుకోవాలి అని ఒప్పించింది. నిజంగా లక్ష్మి కి ఏమి చేయాలో ఏమి చేయకూడదో.. ఎలా బతకాలో తెలియదు
    *.            *.             **.

   ఇద్దరు అమ్మాయిలు చదువుతున్న స్కూల్ దగ్గరలోని ఒక అపార్ట్మెంట్ రెండు ఫ్లాట్స్ రెంటు తీసుకు న్నాడు కిరణ్..  లక్ష్మి వాల్లు వుంటున్న ఇల్లు రెంట్ కి ఇచ్చేసి  ఒక ఫ్లాట్ లోకి లక్ష్మి వాళ్ళను షిఫ్ట్ చేయించాడు. మరో ఫ్లాట్ లోకి కిరణ్ కూడా మారాడు.
 ' అనుకోవడాల కంటే ముఖ్యం అమ్మాయిల చదువు , భవిష్వ త్..' అని నచ్చ చెప్పాడు కిరణ్ .
   అపార్ట్మెంట్ కొత్తది. అన్నీ సౌకర్యాలు ఉండేసరికి కొత్త లోకానికి వచ్చినట్లు వుంది లక్ష్మి కి.  పిల్లలకి స్కూల్ దగ్గర అయ్యేసరికి టైమ్ బాగా కలిసి వస్తుంది.. ఇంతకు ముందు పిల్లలు వచ్చేవరకు బెంగగా ఎదురుచూసేది.  లక్ష్మి కి భయం తగ్గింది. నలుగురు పిల్లలు కలిసి పోయారు. క్యారమ్ ఆడుకుంటున్నారు.
  లక్ష్మి అందరికీ వంట చేస్తుంది. కిరణ్ ఫ్లాట్ లో కూడా దీపం ముట్టించి పూజ చేస్తుందీ
కిరణ్ ఇంటిలోకి మళ్లీ వెలుగు వచ్చింది.

ఇంటికి కావలసిన సామాన్లు అన్నీ కిరణ్ తెచ్చి పెడుతున్నాడు. పిల్లల స్కూలు కెల్లి టీచర్ తో చదువు గురించి తెలుసుకుంటుంన్నాడు. లక్ష్మి కి పిల్లల రక్షణ, చదువు భయం పోయింది. కాని అప్పుడప్పుడు ఒక్కత్తే.. ఒంటరిగా ఏడు స్తుంది..
    గాయాలు మానాలంటే కొంత కాలం పట్టక తప్పదు కదా!?

  " ఈ రోజు మమ్మీ పుట్టినరోజు" అని పిల్లలు కిరణ్ కు చెప్పారు.
 కిరణ్ అందరినీ సాయంత్రం బిర్లా మందిరం తీసుకుని వచ్చాడు. పిల్లలు నలుగురికి బిర్లా ప్లానటోరియం లో షో కి టికెట్స్ కొనిచ్చి ' షో అయ్యాక ఇక్కడే వుండండి.. ఈ లోపు మేము టెంపుల్ కు వెళ్లి వస్తా ము' అని చెప్పి లక్ష్మి నీ టెంపుల్ తీసుకెళ్ళాడు.
  దేవుని దర్శనం అయ్యాక , గుడి బయట పాలరాతి పై ఇద్దరు కూర్చున్నారు.
  ఏమి గుర్తుకు వచ్చిందో.. లక్ష్మి కళ్ళు తుడుచుకోవడం కిరణ్ గమనించాడు.
  " చూడండి.. జీవితం ఎప్పుడు మన చేతిలో వుండదు.. భగవంతుడు పరీక్ష పెడతాడో, మన ఖర్మ నో.. తెలియదు కానీ.. కొన్ని సంఘటనలు జరిగి పోతాయి.. మనం ప్రతి పరిస్థితిని ఎదుర్కోవలసిందే... బంధాలు దూరం అయిపోతాయి కాని బాధ్యతలు మాత్రం ఎల్లప్పుడూ మిగిలి పోతాయి.. మిగిలిన వాళ్ళం తప్పించుకోలేం .. బాధ్యతల్ని మోయాల్సిందే... అందుకు.. జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం వుంది.. పిల్లల భవిష్యత్ కోసం.... మీరు మళ్లీ మామూలు మనిషి కావాలి.. పిల్లలను జీవితం లో ఉన్నత స్థానంలో చూడాలి. అందుకొరకు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. మీరు అందర్నీ చూసుకోవాలి .. తప్పదు.. మళ్లీ ఎప్పటి లాగే పిల్లలలో కలిసి పోయి వాళ్ళ బాగోగులు చూసుకోవాలి.." కిరణ్ చెప్పాడు.
  లక్ష్మి మనస్సులో దేవుణ్ణి.. రమేష్ ను తలచు కుంది. కొంగు తో కళ్ళను తుడుచుకుంది.. ఇప్పుడు దారి స్పష్టంగా కనబడుతుంది లక్ష్మి కి.
  " పదండి.. ప్రసాదం కొనుక్కుని వెళదాం.. మన పిల్లలు ఎదురు చూస్తుంటారు.."లక్ష్మి అంది.
   లక్ష్మి మన పిల్లలు అనేసరికి.. కిరణ్ కి సంతోషం కలిగింది..
 లక్ష్మి మొదటి అడుగు వేసినట్లే అని అనుకున్నాడు.. అందరూ కలిసి కామత్ హోటల్ లో డిన్నర్ చేసి ఇంటికెళ్ళారు..
  దారి కఠినం అయినప్పుడు... కలుసుకుని... కలుపుకుని... పయనించాలి..
   జీవితం కొన సాగించాల్సిందే... అన్నీ వేళలా..
 

click me!