దాసరాజు రామారావు కవిత: మామిండ్ల కాలం

By telugu teamFirst Published Dec 9, 2019, 3:36 PM IST
Highlights

తెలుగులో ప్రముఖమైన కవి దాసరాజు రామారావు. ఏషియా నెట్ న్యూస్ కోసం దాసరాజు రామారావు రాసిన కవిత మామిండ్ల కాలం మీకు అందిస్తున్నాం.

ఎన్ని కాలాల తీపి రుచులో
ఎన్నెన్ని కాలాల్ని ముంచెత్తిన తీపిరసాప్లావితాలో

ఏ చెట్టయినా అదే పేరు
ఒక్కొక్క పండుకు తీరొక్క పలుకు

శెంబు మామిడి పప్పుగుండి అంత
నల్ల మామిడి తీపుల కెల్ల రారాజు
సదాంకాయ నాము నాము
అదెప్పుడు పండవగా చూడలే

ఉపయోగపడని దేనికైనా ఉనికేలనో అనిపిస్తది
దాన్ని చూసినప్పుడు

జీడికాయ ఆవకు ఫస్ట్
పీసు కడక్
అల్లం మామిడిది నిండు చంద్రుని పోలికే
తరుగుడు తొక్కుకు కండ గల్గిన కాయల చెట్లు మస్తే
కోతిమూతి కాయకు మొదట ఎరుపు,
పేరనుకుంట పడి పడి నవ్వేది
పండిందో,తేనే సొంటి రసం
ఖర్జూర మామిడి  అంటం,
తోలు పలుచగ, రసం జాంబెడు

ఇస్కూల్లకు తాతీల్లనే తీపి మాటతో
మూడు మైళ్ల తీయని తోటకు దౌడు
రాలిన పాటువండ్లకై పడిన ఇక్మత్తులు
అన్నా యిన్నా !
పోయేటపుడు మాత్రం
వచ్చినోళ్ల  సంచులు నిండువడాలె

పటేల్ కర్నాల  తోట
కలె గలిసిన, కలె తిరిగిన చోటు
అరవై చెట్ల భువన లోగిలి
ఆత్మీయబంధాల హృదయవాసిలి

ఎవలు నాటిండ్రో
ఏమనుకొని పెంచిండ్రో
ఎవలు తిన్నా
సల్లవడేది వాండ్ల కండ్లే

గాలికో వానకో అంత పెద్ద తోట వుండేదేనా ? పండేదేనా?
కావలీ, నిగిరానీ
ఒక చెట్టు లాంటి మనిషిదే
అన్ని చెట్ల జాతకం నాల్క మీది దస్తూరే
మేం నిర్రందే, మామిండ్లన్ని  నిర్రందే
ఆ యమ  కంటిచూపు వైశాల్యంలో

కోవులున్న చెట్టుకు కాయలు తెంపడం
ఒక యుద్ద కళ
ఒంటికి బూడిద, పొడుగు ధాతి కట్టె
కాయ చెదరకుండ కింద జనుపతట్టు అడ్డు

తేనె పూసిన, విరబూసిన చెట్లో
రెండో మూడో
పూసేవి ,కాసేవి కావు
సూర్యకాంతిల ఆకుల సొగసు చూస్తుంటే
కంటికి రెప్ప ఆనేది కాదు

మూణ్ణెల్లకాలం మా యిండ్లల్ల,వాడల్ల
మామిడిపండ్ల వాసనే
ఎవలొచ్చినా చేతిల పండే

రుచుల థీసిస్  గణుతి కెక్కాక
భోజనంలో
మామిడిపండు పెట్టే
మనిషి ఏడి?

ఊరు కటీఫ్ అయింది
తోట కటాఫ్ అయింది
చేదెక్కిన యాల్లల్ల
ఆ పండుని  తలచుకుంట
నోట్లో నీళ్లూరుతయి
అవి తీపవుతయి

click me!