ప్రపంచంలో, దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవాలనే ఆశయంతో తెలుగు కవిత్వం వెలువడుతోంది. బొడ్డు మహేందర్ కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తున్నవారిని ప్రశంసిస్తూ కవిత రాశారు.
కష్టమొస్తే గానీ నీలోని మనిషి రాడు
నష్టమొస్తే గానీ నీవాడనే మనిషి తేలడు
సంక్షోభంలోనే కదా దేవుడి సాక్షాత్కారం
సంక్షేమంనే కోరే వైద్యుడి చమత్కారం
జ్ఞానంలోనే ధైర్యముందని
త్యాగంతోనే సేవకి విలువని
మంచిని చేయుటే మానవ ధర్మమని
అది ఆచరించు వాడే ఆరోగ్య సేవకుడని
తను ముందుండి ఓ నాయకుడవుతాడు
నర్సు, కంపౌండర్ ల సేనాని అవుతాడు
మనసుని తడిమి మన వాడవుతాడు
మందులు పులిమి సేవకుడవుతాడు
నీ వారి కోసం తన వారిని దూరంపెట్టి
నీ సేవ కోసం తన ప్రాణం పణం పెట్టి
కరోనా అయినా, కలరా అయినా..
క్షయ, ఎయిడ్స్ లాంటి వ్యాధులేవైనా..
సెలవుకు సెలవు ఇచ్చి
మన ప్రాణానికి విలువిచ్చి
మన నవ్వుతో తన కష్టాన్ని మరిచే
నిత్య శ్రామికుడు, దేహ పారిశుద్ధ్య కార్మికుడు
శాస్త్ర సాంకేతిక మార్గదర్శకుడు
మనుషులలో మహనీయుడు
అతడొకడు కాదు..
అందరిలో ఒకడు.. అందరికి ఒకడు..
వైద్య సేవలో తరించే నిస్వార్థ సేవకుడు
అలాంటి సేవకులందరికీ ప్రణమిల్లుతూ..