శ్రీరామోజు హరగోపాల్ కవిత్వ సంపుటి " కొండపొదుగు పాలు" పైన ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ రాసిన సమీక్షా వ్యాసం ఇక్కడ చదవండి
"మాగిన తియ్యటి పండ్ల వాసన వంటి నీడ
గారడీ పూల మొక్క వంటి మెరుపు
తీసీతీయని తెరవెనుక
పారేసుకున్న వెతుకులాట" హరగోపాల్ కవిత్వం నిండా కనిపిస్తుంది. మొగులు మీద జారిపోతున్న వెన్నెలజల హరగోపాల్ కవిత్వం. గడ్డకట్టిన హిమాలయాన్ని ఒడిలో పెట్టుకున్న బాధతో రాసిన కవిత్వం ఇది. బతుకు సాగు తెలిపే కొత్త సాలు ఈ కవిత్వం. పండిన వరి చేండ్ల ఒరాల మీద పిట్టల ముచ్చట్లు ఈ కవిత్వం. రోల్లు పగిలే ఎండలు, మంచురాళ్ళు హరగోపాల్ కవిత్వంలో నీటి పువ్వులై మనల్ని వాన నీటిలో బుడ్డపోరగాళ్ళను చేస్తుంది.
దిక్కులేని వాళ్ళే కాదు, వాళ్ళ ఆక్రోశాలకు, ఆక్రందనలకు, ఆందోళనలకు దిక్కులేని ఈ రాజకీయ వాతావరణంలో విప్లవ వసంతాలు ఎండిన గుండెల్లో జలధారలై ఉప్పొంగాలని జడివానై అంతరాల కరువును కడిగేయాలని కవి నిరీక్షిస్తున్నారు. వేపపూల మకరందాల సాక్షిగా నదిలో నీళ్ళు నింపే సాహసం చేస్తున్నాడు. ఊరికన్నా అడవిల బతుకుడే భద్రం అని అనుభవపూర్వకంగా చెప్తున్న కవి "వేటగాండ్లకు ఎదురు నడిస్తేనే ఊరుంటది" అని చెప్తుండు. జీవితపు బాటపొంటి జ్ఞాపకాల్లో కూడా ఊర్లో కన్నా అడవిలోనే ఉండాలనుకుంటున్నాడు కవి.
" దేశమంటే ఎవడబ్బ సొమ్మో / చింపి సొంత జెండా కుట్టించుకుంటాడు " మానవధర్మం తప్పిన చరిత్రను ప్రశ్నిస్తున్నాడు.
"చిరు నిద్రలో నీవు / పెను నిద్రలో దేశం / దొంగ నిద్రలో రాజ్యం / సైనికులు జీతానికి మరణించే వారే కదా / కానీ, వీరుని మరణం ఖరీదెంత ? / దేశమా ? ద్వేషమా ?? అంటూ వేదనతో నిలదీస్తున్నాడు.
"సముద్రం ధ్వనించే గొంతునెవరో / కమండలంలో కుక్కుతున్నారు / సూర్యోదయం అరుణకాంతి నెవరో / వొలిచి కషాయంగా నూరుతున్నారు / మానవ ధర్మం కళ్ళు పొడుచుకుంది / పారు వేట మళ్ళీ మళ్ళీ / ఎన్నిసార్లైనా తప్పనిది పోరే " - పోరు తప్ప మరోదారి లేదంటున్న హరగోపాల్ కవిత్వం మన చూపుడు వేలిమీద కన్నీటి బాటైతది. ఆకాశాన్ని లేఖ చేసి రాసుకున్న కాలంలోనివి ఈ సంపుటిలోని కవితలు.
మమతల కుంపట్లై తెల్లవారుజామున చలికాచుకుంటూ కాలిపోతున్న యాది కుంచె నుండి పెదవుల మీద, తడుల కనుకొనకుల్లో కన్నీటి నెలవంకలను గీస్తున్నాడు కవి. జల తరంగిణీ గీతమై మునిపంట అదిమిపట్టిన దుఃఖాన్ని కొంగుతో తుడుస్తున్నాడు. రెండు దిక్కుల వెలిగించిన కొవ్వొత్తికి వెలుగెక్కువ పద, కాలిపోదాం అంటున్న కవి జాతర్ల కాటగలిసిన ఊర్లను, గదుల్లో కట్టివేయబడిన సముద్రాలను కవిత్వీకరిస్తూ జాగ్రత్త ! తల తునకలైపోయేవు అని హెచ్చరిస్తున్నాడు చర్మం మొద్దు బారిన రాజ్యాలను.
నగరమంటే ఎవడి గోల వాడిదేలాగ ఉంటుందని చాలామంది కవులు వ్యక్తీకరించారు. కానీ హరగోపాల్ కు ఈ నగరంలో తుర్రెబాజ్ ఖాన్ తిరుగుబాటుతో తొక్కిడి తొక్కిడైన తొవ్వలు, ఆ తొవ్వల్లోని కొత్త పొద్దుల వెలుగు కనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికులను మనుషులుగా గుర్తించని తనాన్ని " ఎంతగనం సంఘసేవ / మనిషినని ఆధార్ కార్డేది ?" అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నాడు. అమ్మలను కొలిచేటి / గొప్ప గొప్ప మతస్తులార / నన్నెందుకు బలిపశువును చేసింరు ?? అని జోగిని వ్యవస్థపై చావు డప్పై మోగుతుండు. వర్ణాలు చెప్పిన మనువుకు స్త్రీ వర్ణం చెప్పరాలేదు అంటూ మనువును వెక్కిరిస్తున్నాడు. ఇక్కడ ఆడ పుట్టుకే అవమానమైపోయింది అంటూ పితృస్వామ్య వ్యవస్థపై నిరసన కవిత్వమై మైనారిటీ బాలికలపై జరుగుతున్న అకృత్యాలను చూస్తూ ఈ దేశానికి ఏమని చెయ్యెత్తి జై కొట్టాలె ? అని ప్రశ్నిస్తున్నాడు.
తన బతుకంతా ప్రేమ నిషానులైనోలనే కాదు తన మీద కారాలు, మిరియాలు నూరేటోల్లను కూడా అంతే కృతజ్ఞతతో తలుచుకున్నడు కవి హరగోపాల్ ఈ సంపుటిలో. మానవత్వం ఇంకిపోతున్న మార్కెట్ శక్తులకు రైతు దుఃఖభాజనుడు అవుతున్న విషాదం ఈ కవిత్వంలో కనపడుతుంది. మన చేతుల్లో బువ్వై మొలిచే రైతుల గాయంతో రక్తసిక్త గేయం కావాలనుంది అంటూ ఉద్యమం తప్ప మరోదారి లేదంటున్నాడు కవి. దేహం గాయాల పుస్తకమై తడిసిపోయిన అనుభవాల కవిత్వం "కొండపొదుగుపాల" నిండా ఉంది.
ఒక జాతి భంగపడ్డప్పుడు విముక్తి కోసం ఎత్తుకున్న జెండా స్వప్న సౌందర్యం పాఠకుడిని కవిత్వం నుండి పక్కకు తప్పిపోనివ్వదు. మట్టి జెండానె నా అజెండా అని మట్టిలేక తను బతకలేని అశక్తతను శక్తిమంతంగా కవి తనని తాను ఆవిష్కరించుకున్నాడు.
దండకారణ్యంలోని ఉద్యమాలను ప్రస్తావిస్తూ " సింగిడీలన్నీ రాలిన నెమలి పువ్వులే " అని ఆవేదనతో దిగులు దీపాలు ముట్టించి దిగూట్లపెట్టి కడపకు తలపెట్టి పండుకొని ఇల్లు విడిచి వెళ్ళి పోరుబాట పట్టిన కొడుకు అడుగుల సప్పుడు కోసం ఎదురు చూస్తున్న మనాది ఈ సంపుటి నిండా ఉన్నది. మనుషులను ఓట్ల లెక్క వాడుకుంటున్న నైజాన్ని, ఆ మనుషుల నవ్వులు పిడాత రాలిపోతున్న నిజాల్ని రాలిపోయిన నెమలీకల మీదుగా కవిత్వమై కన్నీరవుతున్నాడు కవి.
కులం కుతికి, మతం మతికి మనుషుల బంధాలు చిట్లిపోయి పిగిలిపోతుంటే మనం మనుషులమనే ఎరుకలో ఉన్నామా లేదా అని కవి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తే చావును బదులిచ్చే దేశంలో మిగిలిపోతున్న సమాధుల మీదుగా కవి వేల గొంతుకలై నినదిస్తున్నాడు. యుద్దాలు లేని భూమి కోసం, మనిషిని మనిషిగా బ్రతకనిచ్చే నేలకోసం కవి తపించీ తపించీ రెక్కలు తెగిన పువ్వుల దుఃఖమై పోతున్నాడు.
అడవి - మట్టి - నేల ఈ మూడింటికి సారూప్యమున్నప్పటికీ అర్థాలు వేరు. అడవి పోరాటానికి చిరునామా. పోరు మొలకెత్తేది మట్టిలో . నేల అంటే మైదాన ప్రాంతం. మైదాన ప్రాంతంలో ఎక్కువగా ఈ గొడవ అంతా మనకెందుకులే అనే బాపతు గాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు హంతక భాషలో సంభాషిస్తూ వలలు పన్నేవాళ్ళూ ఉంటారు. ఈ అవగాహన నుండే కవి ఇలా అనగలుగుతుండు.
" నాక్కొంచెం వీరుల పాదాల కింది మట్టినివ్వు
నిప్పు రాజేయడం నేర్చుకుంట
నాక్కొంచెం కత్తుల మీద నడవడం నేర్పు
మనుషుల కొరకే చావడం నేర్చుకుంట"
కాలం గడప మీదుగా జన సముద్రపు కెరటాల మీద అచ్చు వేస్తున్న మహాప్రస్థానం ఈ కవిత్వం.ఈ కవిత్వం చదివాక మనం మనసారా ప్రతి మనసును తాకే మాటవుతాము. బతుకంతా ప్రతిక్షణం పరిమళించే మనుషులమవుతాము.
నేల పొరల్లో దిగులుగా నిరీక్షిస్తూ చరిత్ర కందని మనిషి కథను తన గుండెలు తవ్వి తీసి ప్రపంచమంతటా మొలకెత్తిన బువ్వ కథే మనిషి చరిత్ర అని చెప్తున్నాడు కవి. అహం కోసం ముక్కలౌతున్న మనుషుల బంధాలను, చూపుడు వేలు చూపే తొవ్వలు కాటగలుస్తున్న కటిక చేదు నిజాలను ఈ కవిత్వంలో చూడవచ్చు. పుస్తకమై మిగిలిన మనుషుల కోసం సన్నజాజుల పరిమళాలతో, కొవ్వొత్తి వెలుగుల్లో అనంత ఆనంద దుఃఃఖపరవశాల కవిత్వాన్ని వినిపిస్తున్నాడు కవి శ్రీరామోజు హరగోపాల్.