గ్రామీణ స్థాయిలో పొద్దై పొడవాల్సిన కుల వృత్తులను ప్రపంచీకరణ దుష్పరిణామాలు ఎలా కుంగదీస్తున్నవో నల్గొండ నుండి సిస్టర్ అనసూయ రాసిన కథ "కుంగిన పొద్దు" లో చదవండి.
రోజు పొద్దుగాల లేచి, స్నానం చేసి, అంచు దోతి కట్టుకొని, ఇంటి వెనకాల ఉన్న లంద దగ్గరకు వెళ్లి అగరువత్తులు ముట్టిచ్చి పూజ చేస్తుంటడు నరసింహ. అప్పుడప్పుడు కొబ్బరి కాయలు కూడా కొడుతడు.
ఆ లందలోకి తొంగి తొంగి చూస్తు తన ముఖారవిందాన్ని చూసి తన్మయం పొందాడు సూర్యుడు. తండ్రి పక్కనే ఉండి చూస్తుంది ఏడేండ్ల కూతురు సమత.
"ఇక్కడ దేవుడేడ ఉండు నాన్న" అని అడిగింది కూతురు సమత.
అందుకు తండ్రి "మనకు ఈ లందేనమ్మ దేవుడు".
ఇక్కడ అంతా మురిగిపోయిన వాసన వస్తుంది. దేవుడు ఎట్లా ఉండు అని తన మనసులో అను కొని, "ఎందుకు నాన్న ఇక్కడే ఇంత వాసన వస్తుంది" అని అడిగింది కూతురు.
అందుకతడు "నిన్నగాక మొన్న మన జాగల కాడ ఒక ఎద్దు చనిపోయింది. దాని తోలు ఒలిచి సున్నం పూసి, ఈ లందలో తంగడి చెక్క వేసి ‘కర’ పెట్టాను. ఇప్పటికి మూడు రోజులు అయింది. అందుకే వాసన కొడుతుంది" అని అన్నడు.
"ఇంకా ఎన్ని రోజులు ఉండాలి నాన్న? అని అడిగింది కూతురు.
"ఇంకా అయిదారు రోజులు ఉంచాలి" అని అంటుండగానే; అతని భార్య శాంతమ్మ వచ్చి, "ఏంది తండ్రి బిడ్డ తీరిగ్గా కూర్చుని ముచ్చట్లేస్తుండ్రు పూజ చేయడం అయిపోయిందా? మీకోసం పటేల్ వచ్చిండు, అతనికి కిరుకు చెప్పులు కుడుతున్నా వంట?"
అవును చెప్పిన గాని తోలు లేదు. ఇంకా ఐదు రోజులు అయితే తోలు వస్తది. అప్పుడు చేస్తా అని అంటూ లేచిండు నరసింహ."
పటేల్ ను చూసి "దండాలయ్య" అని అన్నడు నరసింహ.
అతను "ఆ.. దండాలు" అని అంటూ "చెప్పులు కుట్టినవ" అని అడిగిండు. అందుకు నరసింహ "ఏడ పటేలా ఇంకా కుట్టలేదు. ఇదిగో నిన్ననే అంగడికి పోయి సంపటం తెచ్చి, చెప్పుల సైజు తీసుకున్న" అంటూ పని తట్టలో ఉన్న చెప్పుల సైజులు తీసి చూపించిండు నరసింహ.
"ఈ తట్ట నిండా ఏమున్నాయి నర్సిమ్మ?" అని అడిగిండు పటేలు.
"పనిముట్లన్నీ ఈ తట్టలోనే ఉంటవి పటేలా, ఇదిగో పని కత్తి, పని గూటం, ఆరే, కటారే, శాంచ, రంప చెప్పుల అచ్చులు, మిగ్గు కొమ్ము , దారంఉండ మొదలైనవి అన్ని దీనిలోనే ఉంటవి" అని నరసింహ చెప్తుంటే ...
"ఓ అవునా! ఈ తట్టలో ఇన్ని పనిముట్లు ఉన్నాయా!! అంటూ తన కాలుకు ఉన్న చెప్పు తీసి,
"ఈ చెప్పు ఉంగటం ఊడి పోయింది చూడు" అని చేతికందించాడు పటేల్. ఆ చెప్పులు తీసుకుని తిప్పి చూస్తే అంత పెండ అంటి ఉంది. వెంటనే అతడు తన బిడ్డ సమతను పిలిచిండు.
"ఏంది నాన్న" అని దగ్గరకు వచ్చింది కూతురు సమత.
"ఈ చెప్పును కడుక్కుని రా రా" అని అన్నడు తండ్రి.
ఆమెకు ఆ చెప్పును చూడగానే తిన్న అన్నం గొంతులోకి వచ్చినట్టయ్యింది. అందుకే తండ్రితో "ఈ చెప్పును కడగను నాన్న. నేను ఇప్పుడే అన్నం తిన్న" అని అన్నది.
అందుకతడు "సరేగాని ఈ పని తొట్టిలో నీళ్లు పోయి నేనే కడుగుతా" అని అంటూ
"మీ అమ్మ ఎటు పోయింది రా?"
"అమ్మ తంగడి కట్టెలు కొడుతుంది నాన్న."
ఆ తర్వాత నర్సిమ్మ ఆ చెప్పును చేతితో తేటగా కడిగి, చిన్న తోలు ముక్కను తీసుకొని సన్నగా కోసి, దానికి మీగ్గు పూసి సగం తెగిపోయిన ఉంగటానికి ఆరెతో ఇంకో ముక్కను ఎదురేసి కుట్టి,
"ఇదిగో ఇది నెలరోజులైనా తెగి పోదు" అంటూ చేతికందించి నెత్తి గోకుతూ "పొద్దుగాల బోని మీరే చేయాలి పటేలా."
అందుకతడు "నా దగ్గర డబ్బుల్లేవు ఇంటికి రా నర్సిమ్మ కొన్ని గట్టి గింజలు పెడతా."
ఎప్పుడు రమ్మంటావు పటేలా? అని అనగానే
"రేపు పొద్దుగాల రా" అంటూ వెళ్ళిపోయిండు పటేల్.
ఆ తర్వాత సమత తండ్రి దగ్గరకు వచ్చి "ఎందుకు నాన్న పెండంత అంటిన చెప్పులు చేతితో కడుగుతున్నావ్ అతన్ని కడుక్కోమని చెప్పకూడదా!" అని అడిగింది.
అందుకు తండ్రి "అవన్నీ నీకు తర్వాత చెప్తాను గాని బడికి పో తల్లి సాయంత్రం తండకు పోదాం" అని అన్నడు.
"అలాగే నాన్నా బడికి వెళ్తున్నా' అని అంటుండగానే, పక్కింటి శిరీష వచ్చి, "ఇయాల బడి లేదు సమత." "ఎందుకు లేదు?
"ఏమో నాకు తెలవదు నేను బడికి వెళ్లి చూస్తే పిల్లలు ఎవరూ లేరు" అని అన్నది శిరీష.
అప్పుడు సమత సంతోషంగా తండ్రి దగ్గరకు వెళ్లి "ఈ రోజు బడి లేదంట నాన్న ఇప్పుడు చెప్పు" అని అనగానే
తండ్రి నా బిడ్డ గొప్ప నాయకురాలు కావాలని మనసులో అనుకుంటూ "ఏం లేదు బిడ్డ , మన తాత ముత్తాతల కాలంలో మన బతుకులు గోరంగా ఉండేవి. అంబేద్కర్ పుణ్యమాని మన బతుకులు ఇప్పుడిప్పుడే ఓ దారికి వస్తున్నవి. మనలను మనుషులని గుర్తిస్తున్నరు.
చతుర్వర్ణ వ్యవస్థ వల్ల మన జాతి పాదాల నుండి పుట్టిన దనీ అంటరాని వారిగా చూస్తూ గుడికి బడికి దూరం చేసింరు ఈ మనువాదులు. ప్రతి మురికి పనిని మన తోటే చేపించే వాళ్ళు. వారి ఇళ్లలో చనిపోయిన ప్రతి పెంపుడు జంతువు కళేబారాలను మనమే తీసేయాలి" అంటూ అనేక విషయాలు చెప్పిండు.
ఆ తర్వాత తండ్రి బిడ్డ కలిసి కుమ్మరి పిచ్చయ్య ఇంటికి చెప్పులు ఇవ్వటానికి వెళ్లింరు. అప్పుడే పిచ్చయ్య భార్య చెన్నమ్మ ఇంట్లో నుండి తలుపు తీసుకుని బయటికి వచ్చింది. ఇంటి ముందు ఉన్న నర్సిమ్మను చూసి, "ఎప్పుడు వచ్చినవ్ అన్న ? ఈ పిల్ల నీ బిడ్డ నా నరసన్న" అని అడిగింది.
"అవును చెల్లె" అని అనగానే
"అచ్చం నీ లాగానే ఉందన్నా." అందుకతడు మనసులో నవ్వుతూ, "బావ లేడా రా?"
"ఇంట్లోనే ఉండు లోపలికి రా అన్న" అని పిలిచింది చెన్నమ్మ.
అతడు లోపలికి వెళ్లగానే పిచ్చయ్య సారే తిప్పడం ఆపి, "ఏంది బామ్మర్ది పొద్దుగాల వచ్చినవ్" అని మరలా కర్రతో ఆ చక్రాన్ని తిప్పుతూ మధ్య మధ్యన కుండని సరి చేస్తుండు.
"ఏం లేదు బావ చెల్లెకు చెప్పులు చేసిన ఇద్దామని వచ్చిన" అని చెబుతుంటే ఆ చక్రం దిక్కు ఆశ్చర్యంగా చూస్తూ మా నాన్నేమో సచ్చిన పశువు చర్మాన్ని వలిచి తోలు తయారు చేసి చెప్పులు, పనసుంచులు ఎడ్ల మెడలో గంటలు చేస్తే ఇతనేమో మట్టితో కుండలు చేస్తుండు. మా నాన్న అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నడు అని మనసులో అనుకుంది సమత.
ఆ తర్వాత నర్సిమ్మ "ఇదిగో చెల్లె చెప్పులు తొడుక్కొని చూడు" అని చెప్పులను చేతికందించిండు.
ఆమె ఆ చెప్పులను కాళ్లకు తొడుక్కుని "చాలా మంచిగ కుట్టినవన్న. పోయినేడు మా జాగలు వేరే వాళ్లకు ఉండే. వాళ్లు నాకు చెప్పులు మంచిగా కుట్టలేదు" అని అంటుండగానే "మంచిది చెల్లె. ఈ చెప్పులకు డబ్బులు ఇవ్వు. పూట గడవడం చాలా కష్టంగా ఉంది. మీ వదిన కూడా ఇంటి దగ్గరే ఉంటుంది. ఆమె చిన్న పిల్ల తల్లి అని అంటుండగానే,
ఆమె ఇంట్లోకి వెళ్లి షేర్ సజ్జలు తెచ్చి నర్సింహ తువ్వాల లో పోసింది. "ఇంతేనా తల్లి ఇంకో షేర్ పెట్టరాదు" అని దీనంగా అడిగిండు.
ఈసారి ఇంతే అన్నా. మొన్ననే కదన్న రెండు కొత్త కుండలు తీసుకొని పోతివి" అని అన్నది చేన్నమ్మ.
అప్పుడతడు నాలుగు షేర్లు ఇస్తది అనుకుంటే ఒక షేరు పెట్టే అని మనసులో అనుకొని తువ్వాలలో పోసిన సజ్జలను మూటగట్టుకుని ఇంటికి బయలు దేరిండు.
కొంచెం దూరం నడవంగనే "కొద్దిసేపు ఆగు నాన్న ఎండ కొడుతుంది" అని చెప్పింది కూతురు. తండ్రి బిడ్డ కలిసి వేప చెట్టు కింద నిలబడి ముఖానికి పట్టిన చెమటను తుడుసు కుంటున్నరు.
అప్పుడు సమత తన తండ్రితో "నాన్న ఇంత కష్టపడి చెప్పులు కుట్టి వాటిని మోసుకొని పోయి వారికి ఇస్తున్నవ్ మంచిగానే ఉంది. కానీ నీ చెప్పులకు ఖరీదు ఇంతని చెప్ప లేవా?" అని అడిగింది బాధతో.
అందుకు తండ్రి "వీళ్ళ ఇల్లు మన జాగలకే ఉంది అని అనగానే
" జాగల అంటే ఏంటివి నాన్న."
"జాగల అంటే వాళ్లకు వ్యవసాయంకు సంబంధించిన అన్ని పనులు మనమే చేయాలి. తొండం మడవాలి. చెప్పులు మనమే కుట్టాలి. వాళ్ల ఇళ్లల్లో పెళ్లయినా చావైనా మనమే డబ్బు కొట్టాలి" అని చెప్పండి తండ్రి.
"అన్ని వృత్తుల కన్నా మన వృత్తికే ఎక్కువ కష్టం ఉంది నాన్న" అని అంటుంటే,
"ఇదంతా నీకు ఎందుకు బిడ్డా. నువ్వు మంచిగా చదువుకో , పెద్ద ఉద్యోగం తెచ్చుకో. అప్పుడు మన బతుకులు బాగుపడతయి తల్లి" అన్నడు.
కొంతకాలం తర్వాత కొత్త కొత్త చెప్పుల కంపెనీలు వచ్చి నవి. అందరూ వాటినే కొంటున్నరు . కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టుగా నర్సిమ్మ చేస్తున్న చెప్పుల మీద మోజు తగ్గిపోయింది. అందరూ కంపెనీ చెప్పులు వాడుతున్నరు. నర్సిమ్మకు పని లేకుండా అయ్యింది. పని తట్ట మూలకు పడింది. అదే సమయంలో నరసింహ భార్య శాంతమ్మకు బాలింత గుణం వచ్చింది. దవఖాన్ల చూపెడ్తామంటే చేతిలో ఒక్క పైస లేదు. పిల్లలు ఏడుస్తున్నరు. నరసింహకు ఏమి చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నడు.
కూతురు సమత వచ్చి "లే నాన్నా అమ్మను దవఖానకి తీసుకు పోదాం లే నాన్నా . అమ్మ ఒణుకుతుంది ఎట్లనో చేస్తుంది" అని చెప్పింది.
అందుకతడు " మన దగ్గర డబ్బులు లేవు బిడ్డా. కిరాయికి కూడా లేవు, ఎట్ల తీసుకుపోదాము" అంటుండగానే "మొన్న రెండు జతల చెప్పులు కుట్టినవు కద నాన్న. వాటిని మా ట్యూషన్ సారు కావాలన్నాడు. తీసుకొని పోయి ఇచ్చిరా. పో నాన్న. సార్ ఇచ్చిన పైసలతో అయినా పోదాం." అని ఏడ్చుకుంటూ లేపింది తండ్రిని.
అతడు కంటినీరు తుడుచుకొని ట్యూషన్ సార్ ఇంటికి వెళ్లి చెప్పులను చూపిస్తుండగానే, "వద్దు నర్సిమ్మ నిన్ననే కంపెనీ చెప్పులు తెచ్చుకున్న" అని అన్నడు సారు. ఉన్న ఒక్క మెతుకు గంజిలో పోయినట్టయింది. కొండంత ఆశతో వచ్చిన నర్సిమ్మకు నిరాశ ఎదురయ్యింది. ఎవరిని అడిగినా ఎవరు కూడా పైసా సహాయం చేయలేదు. చివరకు నరసింహ బిక్క మొహంతో తిరిగి వస్తూ ఈ కంపెనీల వల్ల నా చేతులకు పని లేకుండా పోయింది. ఇక ఆలస్యం చేయొద్దు. నా ఇల్లు అమ్మి అయినా సరే నా భార్యను బతికించుకుంట అని మనసులో అనుకుంటూ ఇంటికి పోయిండు.
అదే సమయంలో అతని భార్య మేనమామ పీటరు అక్కడికి వచ్చి కోడలు పడుతున్న బాధను చూడలేక తన బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న డబ్బులను నర్సిమ్మకు ఇచ్చి దవాఖానకు పంపిండు.
ఆమెకు ఆరోగ్యం బాగయ్యింది కానీ చేతిలో పైసా లేదు. పని లేకుండా పోయింది. ఇంటిల్లిపాది పస్తులుండే రోజులు వచ్చే అని బాధపడుతుండు. తర్వాత పీటర్ సహాయంతో కుటుంబమంత పట్నం పొయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంరు. నర్సిమ్మకు పుట్టిన ఊరును వదిలి పెట్టేందుకు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ భార్యా పిల్లలను పోషించేందుకు ఊర్లో పని లేదు. అతడు ఆ పని తప్ప వేరే పని ఎన్నడూ చేయలేదు. భార్యా పిల్లల కోసం మనసు చంపుకొని పుట్టెడు దుఃఖంతో పట్నం బయలుదేరిన నర్సిమ్మ కుంగిన పొద్దైండు. తర తరాలుగా తన హక్కు అయిన చెప్పులు కుట్టే పనికి ఇప్పుడు అతడు కూలి అయ్యిండు.