నూతనత్వం అభ్యుదయ కవిత్వోద్యమం

By Pratap Reddy KasulaFirst Published Mar 10, 2022, 5:36 PM IST
Highlights

అభ్యుదయ కవిత్వం, లక్షణాలు తెలుగు సాహిత్యం పైన దాని ప్రభావం గురించి సిద్దిపేట నుండి డా. సిద్దెంకి యాదగిరి అందిస్తున్న వ్యాసం ఇక్కడ చదవండి:

మనిషిని మనిషిగా చూడాలనే దృక్పథాన్ని కలగజేసి  సామాన్య మానవునికి సాహిత్య గౌరవం కల్పించిన వేదం అభ్యుదయవాదం. అభ్యుదయం అనే పదమునకు మంగళము, శుభము, పురోగమనం, ప్రగతి, ఆంగ్లంలో progress అని అర్థం కలవు.  తెలుగు సాహిత్యంలో ప్రగతిశీలమైన మార్పునకు ప్రధాన లక్షణంగా అభ్యుదయ కవిత్వం అవతరించింది.  అంతర్జాతీయంగా అభ్యుదయ కవిత్వం రాకముందే ఆ స్ఫూర్తిని పొందిన  కవులు తెలుగు సాహిత్యంలో ఉన్నారు.  తెలుగులో 1935కి ముందే అభ్యుదయ ఛాయలు కనబడతాయి.  శ్రీశ్రీ 1933 లో రాసిన తొలి గేయం విద్యున్మాలికలు.   నేను సైతం ప్రపంచాగ్నికి, ప్రపంచానికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను/ నేను సైతం భువన భవనపు భావుటానై పైకి లేచాను. అని తన జయాభేరి(1933) కవిత ద్వారలో శ్రీశ్రీ  తన ప్రాపంచిక దృక్పథాన్ని, సామాజిక బాధ్యతను తెలియజేశారు.

1934లో ఎన్ జి రంగ సంపాదకత్వంలో ‘రైతు భజనావళి’ గీతాలు ప్రచురించబడ్డాయి. 1934లో తొలి రైతు గీతం గిరిరాజ్ రామారావు, శెట్టిపల్లి వెంకటరత్నం ఇరువురు కలిసి తొలి రైతు గీతం రచించారు.

“ఆగునా జీవాలు - సాగునా లోకాలు, రాజుగా మన మెంచి రైతు చూడకపోతే
దేశాలు తలెత్తుతునా - దాస్యపు ప్రాణాలు తానీడునా?” అని ఎలుగెత్తి  పాడినారు.

1935లో  ‘ప్రభ’ సంకలనంలో తొలి ఎర్ర జెండా గీతం ప్రచురించబడింది.  ప్రభ సంపాదకుడు గద్దె లింగయ్య 1938లో క్రాంతి గీతాల సంకలనం కూడా వెలువరించారు.

1936 - 37 లో పెండ్యాల లోకనాథం గుంటూరు వారు తొలి కార్మిక గీతాన్ని అందించారు.  అందులో “కూలీలందరు ఏకమైతే కూటికి తరుగేమిరా, కూలి వాళ్లలోనే బలిమి కాలమందు నుండె రా, కూలి వాళ్ళ మైన మనకు కులములు ఎందుకు తెలుపరా, కూలి వాళ్ల మైన మనము కలిసి ఉందాం సోదరా అని ఎలుగెత్తి పాడాడు. 1938వ సంవత్సరంలో శిష్ట్లా ఉమామహేశ్వరరావు నవమి చిలక, విష్ణు ధనువును ప్రచురించారు.

అంతర్జాతీయంగా వివిధ పరిణామాలు:

1905లో రష్యా పెట్టుబడిదారి విధానంపై తిరుగుబాటు చేసింది. 1917లో పెట్టుబడి శక్తులను పడగొట్టి సోషలిస్టు విప్లవం సోషలిస్టు వ్యవస్థకు పునాది వేశారు. 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆర్.ఎస్.సుదర్శనం మాటల్లో చెప్పాలంటే మానవతా సామ్య లౌకికవాద ప్రభావానికి కారణమైన అభ్యుదయ సాహిత్యోద్యమం తెలుగునాట విజృంభించడానికి అంతర్జాతీయ స్థాయి నేపథ్యం ఉంది.  1929- 35 మధ్యకాలంలో 14 దేశాల్లో సోషలిస్టు వ్యవస్థ అవతరించింది. 1930 ఆకలి దశాబ్దంగా ఆకలి బాధను తెలియజేసింది. 1934లోజర్మనీ లో – హిట్లర్,  ఇటలీలో ముస్సోలిని, జపాన్లో  - టు జో. మొదలగు నియంతలు అధికారంలోకి వచ్చారు.  ఆయా దేశాల్లో ప్రాంతాల్లో వీరి మీద చేసిన తిరుగుబాటు అభ్యుదయానికి బీజాలు వేసింది.  అంతర్జాతీయంగా వస్తున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని 1935లో పారిస్ నగరంలో  మాక్సిం గోర్కీ అధ్యక్షతన ‘సంస్కృతి పరిరక్షణ సదస్సు’  (అంతర్జాతీయ రచయితల సదస్సు) జరిగింది.  అదే సమయంలో కళ కళ కోసమే అనే నినాదాన్ని ఆస్కార్ వైల్డ్ ఇవ్వడం జరిగింది.  వివిధ దేశాలకు చెందిన రచయితలు హాజరయ్యారు.  భారతదేశం నుంచి చదవడానికి వెళ్లిన విద్యార్థులు లండన్ నుంచి పారీస్ నగరానికి వచ్చి ఈ సమావేశంలో హాజరయ్యారు.  వారిలో సజ్జద్, ముల్కరాజ్ ఆనంద్, కెఎస్ భట్ మొదలగువారు ఉన్నారు.

1936లో భారత అభ్యుదయ రచయితల ప్రణాళిక రూపొందించుకున్నారు. 1936 ఫిబ్రవరిలో ట్రిబ్యూన్ పత్రికలో ప్రచురించారు. 9, 10 ఏప్రిల్ 1936  లక్నో నగరంలో అఖిల భారత రచయితల మహాసభలు మున్షి ప్రేమ్ చంద్ అధ్యక్షతన నిర్వహించారు.  ఈ స్ఫూర్తిని గైకొన్న తెలుగు కవులు ఆంధ్ర వర్తమాన లౌకిక సంఘం వారి ప్రోత్సాహంతో తెనాలిలో 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో తాపీ ధర్మారావు అధ్యక్షతన అభ్యుదయ సంఘం ఏర్పడింది.  తొలుత ఈ సదస్సులో శ్రీ శ్రీ లేడు.
తెలుగునాట అభ్యుదయానికి మార్క్సిజమే పునాది. అభ్యుదయం అనగా  మంగళం, శుభము, పురోగమనం, ప్రగతి, ప్రోగ్రెస్ మొదలైన అర్థాలు ఉన్నాయి.

అభ్యుదయ కవిత్వం నిర్వచనాలు:

‘అభ్యుదయ రచన సమకాలికమైన జీవిత పరిస్థితులకు రాజకీయ వాతావరణానికి ఆర్థిక సమస్యలకు సమాజ సంఘర్షణలకు నైతిక సందర్భాలకు వైజ్ఞానిక విశేషాలు విశేషాలకు అనుగుణంగా అనుకూలంగా తగ్గినట్టే అవసరమైన మార్పులతో విలసిల్లాలని’ అభ్యుదయ కవిత్వం అభ్యుదయ పత్రిక మార్చి 1947 పుట 37లో పీవీ రాజమన్నారు అన్నాడు.

‘పీడింప పడేవాళ్ళు, పీడించే వాళ్లు ఉన్న ఈ వర్గ సమాజం ఉండాలని ఎవరూ కోరుకోరు రానున్న విధానంలో సాధారణ మానవుడే మకుటధారి.  పురోగమిస్తున్న లోకాన్ని ప్రతిఘటించే వారు ఎప్పుడు అభ్యుదయవాదులు కాజాలరు. ఈ ధనిక సమాజం పోవాలి అనుకోవడమే అభ్యుదయం. ఇది మనసులో పెట్టుకుని వ్రాసేది అభ్యుదయ రచన’ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి  తృతీయ అభ్యుదయ రచయితల మహాసభ అధ్యక్షోపన్యాసం చేశారు.

‘తెలుగు సాహిత్యంలో అసలైన అభ్యుదయ భావనకు అంకురార్పణ చేసింది ఉన్నవ లక్ష్మీనారాయణ .  తెలుగులో అభ్యుదయ సాహిత్యం నిజానికి కవిత్వంతో మొదలు కాలేదు.  నవలతో మొదలైంది’ అని రామకోటిశాస్త్రి పేర్కొన్నారు.  అభ్యుదయ రచయితలు తెచ్చిన విప్లవం రసావిష్కరణకు రసాస్వాదనకు సంబంధించినది.  సాహిత్యం ఒక భోగ వస్తువుగా పరిగణించే విధానం మీద తిరగబడుతున్నారు.  నేటి రచయితలకు ప్రజలే ప్రమాణం.  కొన్ని కారణాల వల్ల సాహిత్యానికి దూరమైపోయిన ప్రజల జీవితాలను మళ్లీ  సారస్వతోన్ముఖంగా తిప్పటానికి నేటి రచయితలు పాటు పడుతున్నారని శ్రీ శ్రీ ‘తెలుగు తల్లి’ 1946 మార్చి పత్రికలో ‘అభ్యుదయ రచయిత- విప్లవ దృష్టి’ అనే వ్యాసంలో పేర్కొన్నారు.  చైతన్యమే పర్యవసానంగా కలది అభ్యుదయ సాహిత్యం అని వెల్చేరు నారాయణ రావు  నిర్వచించారు.

అభ్యుదయ కవిత్వ లక్షణాలు:

1. మానవ అభ్యుదయాన్ని కాంక్షించాలి.
2. ఆర్థిక అసమానతలు తొలగించి సామ్యవాద సమాజ  స్థాపన కోసం కృషి చెయ్యాలి.
3. పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయడం.
4. సమసమాజ స్థాపన.
5. వర్ణ వర్గ రహితమైన సమాజ స్థాపన
6. శ్రమదోపిడి లేని సమాజం కోసం
7. మిగులు విలువ పంపిణి
8. దేశ పారిశ్రామికీకరణ
9 నవ సమాజ నిర్మాణం కోసం
10. వ్యక్తి చైతన్యాన్ని సంఘ చైతన్యంగా వర్తింపజేయడం అనే లక్షణాలు అభ్యుదయ కవితా లక్షణాలుగా నిర్ధారించారు.

అభ్యుదయ కవిత్వం విస్తరించి ఉన్న కాలంలో అభ్యుదయవాదినని చెప్పుకోవడం ఫ్యాషన్ అయింది అని కాంచనపల్లి చిన వెంకట రామారావు  పేర్కొన్నారు.
అభ్యుదయ రచయితల సంఘం తొలి సభ 1943 ఏప్రిల్ 13,14 న తాపీ ధర్మారావు అధ్యక్షతన తెనాలిలో  జరిగింది.  రెండవ సభ 1944 తెలికచెర్ల వెంకటరత్నం అధ్యక్షులు, మూడో సభ 1945 దేవులపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షతన రాజమండ్రి లో జరిగింది. నాలుగవ సభ 1947లో పి.వీ. రాజమన్నార్ అధ్యక్షతన మద్రాసులో జరిగింది.  అయిదవ సభ1955 బెజవాడలో శ్రీశ్రీ అధ్యక్షతన, ఆరవదైన  చివరి సభ 1974లో ఒంగోలులో చాగంటి సోమయాజులు అధ్యక్షతన అరసం సభలు జరిగాయి.
అభ్యుదయ కవిత్వంలో వస్తున్న ధోరణిని సినారె ఏడు రకాలుగా వర్గీకరించాడు.
1. వర్గ సంఘర్షణ 2. విప్లవ 3. వీరగాధ కథలు 4. యుద్ధ విముఖత 5. సమాజ నిర్మాణం 6. తెలంగాణ విముక్తి
7. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం

(మిగతా రేపు : అభ్యుదయ కవిత్వానికి తోడ్పడిన పత్రికలు)

click me!