డాక్టర్ యేరుకొండ నరసింహుడు బిల్ల మహేందర్ ల సంపాదకత్వంలో వెలువరించిన దుఃఖ కావ్యం "వలస దుఃఖం." ఈ కవితా సంకలనంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ కవులు రాసిన 110 కవితలు ఉన్నాయి.
కష్ట జీవికి ఇరువైపులా వుండే వాడే కవి – శ్రీ. శ్రీ.
కాలం అంతే. ఎవరికీ అర్థం కాదు. ఊహకూ, అంచనాలకూ అందది. కదిలే కాలం ఆగది. ఆగిపోయిన బతుకులు కొత్తదనాన్ని ఆవిష్కరించలేవు. కాలాన్ని అర్థం చేసుకునే లోపల జరుగాల్సిన ప్రళయ విస్ఫోటనాలు జరిగిపోతాయి. విపత్తు వర్ణనకు అందదు. విధ్వంసం లెక్కకు దొరుకది.
బహుముఖాలు గలిగిన శత్రువుకు బహురూపాలు. ఏ రూపంలో, ఏ కోణంలో మృత్యువు వస్తుందో తెలియదు. బహువిధాలుగా అదృశ్యహస్తాలతో వొచ్చి ఎవరిని మాటువేసి మట్టు పెడతాడో తెలియని చిదంబర రహస్యం. శత్రువు కనబడడు. శత్రువును అర్థం చేసుకునే లోపల అంతం తేలిపోతుంది.
యుద్ధం కొనసాగుతుంటది. యుద్ధఛాయలే కనబడవు. శత్రుదుర్భేద్యమైన కోటలోకి, మనుషుల్లోకి ప్రవేశించి మనిషిని నిలువునా గడగడలాడిస్తున్న గడ్డుకాలం. పేద, ధనిక, కులం, మతం, వర్ణం, ప్రాంతం వివక్షలేవీ లేకుండా ప్రపంచాన్ని సమానత్వంతో కాలం కసాయిదై కాటేస్తున్నఘోర మృత్యువే కరోనా కాలం. మానవాళిని మహా భయంకరంగా బాధించిన మరో ప్రపంచ సంగ్రామాన్ని తలపించిన యుద్ధవాతావరణం. గుర్తుకొచ్చినప్పుడల్లా మనిషి రోమాంచితం అవుతున్నాడు.
భయానికి, ప్రాణ భయానికి ఎంత వ్యత్యాసం. మనిషి భయం సాటి వాళ్లను కూడా వైరస్ గా, వైరులుగా అనుమానిస్తూ, అవమానిస్తూ భౌతిక, సామాజిక దూరం పాటించడమే కాకుండా మానవత్వాన్ని కోల్పోయి మసలేలా వైవిధ్యాన్ని తెచ్చిపెట్టిన దుష్పరిణామం. ఒక ఉత్పాతం బంధాలను , బంధుత్వాలను కకావికలం చేస్తూ మిన్నయి విరిగి మీదపడ్డది. ఒకవైపు కన్నవాళ్ళ చావు. మరొకవైపు మరణంతో కొట్లాడుతున్న చివరి ఘడియల క్వారంటైన్. ఐసోలేషన్. దిక్కుతోచని దుస్థితిలో మనుష్యుడు కూరుకుపోతున్న ఒంటరి సందర్భంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రవేశపెట్టడం కూలీల చేతలకు సంకెళ్లు పడ్డాయి. కాలేకడుపుకు మండే గంజికూడా దొరుకకుంట చేసి కాపాడతున్నామనే నెపంతో ప్రభుత్వాలు.
కూలీలు కడుపు నింపుకోవాలంటే కష్టం చేయాల్సిందే. ఆ కష్టమే లేకపోతే కడుపు నింపుకునేది ఎట్లా? కడుపు నిండేది ఎట్లా? పొట్టకూటి కోసం దేశాంతరాలకు వెళ్లి పొద్దటిదీ పొట్టకు, మాపటిది బట్టకు అన్నట్లు బతుకుతున్న వలసకూలీల బాధ సంపూర్ణంగా తీర్చుతుందా? కాలు బయట పెట్టవీల్లేదు. కడుపునిండే దిక్కు లేదు. చేతులు ముందు పెట్టుకొని కూర్చుండే తత్త్వం కూలీలకు లేదు. ఇరుకు గదుల్లో ఇముడుతూ మురికివాడల్లో బ్రతుకవచ్చు గాని కడుపులకే కాసిన్ని గంజి నీళ్లు లేకపోతే బతికేది ఎట్లా? బతుకాలంటే తినాలి. తిండిలేకుండా బతికేదెట్లా? ఆకలితో వల్లకాటికి చేరేకంటే వలస కూలీల ఆకలి నడిచొచ్చిన తొవ్వను వెతుక్కున్నది. దరిలేని బావిలకు దిగిన చందంగా బతుకు పెద్ద భూతద్దంలో భూతమై భయపెడుతుంటది.
ఆధునిక తెలుగు సాహిత్యంలో మామూలు మనుషుల బాధలు, కన్నీళ్ల కలతలే కావ్య వస్తువులు అయ్యాయి. కవులు, గాయకులు వలస కూలీల వలపోత దుఃఖాన్ని విషాదంగా విలపించారు. వచింపరాని మూల్గులతో ఆయాసపడ్డారు. కసికెడు ఆత్మధైర్యాన్ని నింపటానికి కన్నీళ్ల సిరతో అక్షరాలను ఆయుధాలు చేశారు. పదాలను పల్లవులు చేసి పాటలతో సమరాన్ని నూరిపోశారు. ఎవరికి వారు రాసిన ఎతలని తెలుగు సాహిత్య వాకిట్లో ఎండ వోసిన ఎండుగే డాక్టర్ యేరుకొండ నరసింహుడు బిల్ల మహేందర్ ల సంపాదకత్వంలో వెలువరించిన దుఃఖ కావ్యం "వలస దుఃఖం." ఈ కవితా సంకలనంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ కవులు రాసిన 110 కవితలు ఉన్నాయి. ప్రతి కవితలో మానవత్వం, సానుభూతి, ఓదార్పు పొడిచేటి పొద్దులా ఉదయిస్తుంది. బిల్లా మహేందర్ గతంలో ‘కాలాన్ని గెలుస్తూ’ అనే కవిత సంకలనం దివ్యాంగుల పైన తీసుకొచ్చాడు.
రవాణా సౌకర్యాలు ఏవీ లేవు. ఉన్నదంతా మొండి ధైర్యమే. కాళ్లకు బుద్ధి చెప్పి ధారాపాతంగా కారే కన్నీళ్ళను తుడుచుకుంటూ, పిల్లాపాపలతో ముల్లే మూటలతో బతుకు యాత్ర చేసిండ్రు. భానుడి భగభగలు. డాంబర్ రోడ్డు నిప్పుల గుండం తొక్కుతున్న కమిలి బొబ్బలెక్కిన పాదాలు. దాహం తీర్చని కన్నీళ్లు. అక్కడ ఔదార్యం పోసిన మంచినీళ్లు. వందల వేల మైళ్ల దూరం ఆత్మస్థైర్యం ముందు ఎంత? నడుస్తున్నారు. ధ్వంస చరితను తలకెత్తుకొని మొండి యాత్ర చేస్తున్నారు. మరణం వరించిన వాళ్లను మట్టిలో దాస్తూ దుఃఖాన్ని మూటగట్టుకుని సాగుతున్నారు. ఇన్ని బాధల్ని చూసిన కలతలే కవితలైనయి. పాటలైనాయి. వెరసి మొత్తంగా ‘వలస దు:ఖం’ కావ్యమైంది.
అపర ప్రజ్ఞాపాటవాలతో, మేధోసంపత్తితో, విజ్ఞాన విషయాలతో మానవాళి సుఖమయ జీవితం కోసం ప్రకృతి మీద ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నాడు. ఎంతో పైచేయి సాధించానని మురిసిపోతుంటాడు.
భ్రమ పడుతున్నాడనే విషయం మహమ్మారులై చెప్పేదాకా అజ్ఞానులమన్న విషయం తెలియదు. బాధింఛే క్రిమిని నేనున్నానని వివరించే దాకా తెలియదని ఆచార్య ఎన్.గోపి కవిత 'మథనం.'లో 'మనిషికేమి తెలియదని / ఓ క్రిమి వచ్చి చెప్పేదాకా తెలియలేదు/ ఇది అఖండ నాగరికతకు ఒక గర్వభంగం' అని మానవ మేధస్సును భంగ పరచిన విధానాన్ని హెచ్చరిస్తాడు. ఒక కవిగా వ్యథల్ని వ్యక్తీకరించడానికి 'ఇప్పుడు కవిత్వం రాయడానికి/ కొత్త మాటల్ని వెతుక్కోవాలి' అని కవిలోని అంతరంగాన్ని ఆవిష్కరిస్తాడు.
ఇంట్లో ఉండి మనకు మనమే బంధించుకునేది కొత్త రకమైన యుద్ధపద్ధతి. ఈ యుద్ధంలో గెలవాలంటే అందరూ సంసిద్ధమవ్వాలని శేషు కొర్లపాటి తన 'ఈసారి సంచి సద్దితే' కవితలో 'ఇది యుద్ధం/ఆకలితో పోరాడుతున్న జనం/గెలిస్తే బతుకు ఓడితే చావు/ఇది ప్రయాణం/ సావుకూ సొంతూళ్లకూ మధ్య/ సగం చచ్చిన జనం' అని వలస తిరుగు ప్రయాణమైన కార్మికుల వలపోత పయనం చావు బతుకులను వివరించి చెబుతాడు.
కరోన ఎంత ప్రభావితం చేసిందో తెలియాలంటే కరోన ముందు, తర్వాత అనే విధంగా స్థిరపడిపోయింది. జీవిత నిర్వచనం, కొలమానం మారుతుంది. నోవల్ కరోన పుట్టుక స్థానమగు చైనా చేసిన నిర్వాహకాన్ని దెప్పిపొడుస్తూ రామాచంద్ర మౌళి ‘మేడిపండు పగిలిన తర్వాత’ కవితలో ఒక ‘వూహాన్’ నగరం అదృశ్య విషవిస్పోటనాన్ని పుక్కిలించిన తర్వాత / దేశాలకు దేశాలే.. దు:ఖ ప్రళయాలు’అని విచారం వ్యక్తం చేస్తాడు.
బలుసాకు తిని బతకాలె. ఆకలితో చచ్చేకంటే ఎట్లయిన బతుకాలనే కాంక్ష నింపుకోవాలే. మీరంతా పల్లెకు రావాలని పల్లె చేతులు చాపుతుందనీ, దిక్కు లేని పచ్చులైపోయిన తన పిల్లలు ఆహ్వానిస్తున్న తల్లి హృదయాన్ని ఆవిష్కరిస్తూ 'వలస వనవాసము నుంచి' కవితలో సిరికి స్వామినాయుడు పల్లె ఎదురుచూస్తుందంటాడు. 'సల్లగా నువ్వింటికొత్తే ఎల్లమ్మ తల్లికి ఏడు కొమ్ములపోతు ఏటకిత్తాను/.../దిగులు సీకట్లు నిండిన ఇంటిలో దీపం పెడుదువు రా!!' అని పిలుస్తుంటాడు.
గ్రామాలకు వెళుతున్న వేలాది మంది ఆకలి వెతలను చూసిన బిళ్ళ మహేందర్ తన కవిత 'గూడూను చేరనివ్వండి'లో నడకను చిత్రిస్తూ 'ఈ దేశపు ముఖచిత్రాన్ని నిలబెట్టిన నడక ....మట్టిలో తెల్లవారక ముందే వాళ్ళ గడపను చేరుకోనివ్వండి /బతుకు పాఠంలో మళ్ళీ కొత్త కలలకు ఊపిరి పోసుకోనివ్వండి' అని ఒక ఆశావాద దృక్పథాన్ని కలుగజేస్తాడు. కరోనాను అరికట్టాలంటే నిత్యం సబ్బుతో చేతులు కడుక్కోవాలే. మూతికి మాస్క్ కట్టుకోవాలనీ డాక్టర్లు మొదలుకొని అరిగిపోయిన పాత రికార్డోలె అందరు చెప్పిందే చెప్పుడు. విరక్తి కలిగి వ్యవస్థను శాలువాల చెప్పుపెట్టి కొట్టినట్లు తగుల్ల గోపాల్ శాపనార్థాలతో ‘వెయ్యేండ్ల మొదలుగల్గనీ’ వ్యక్తీకరిస్తాడు. ‘ఏ రోగమొచ్చినా / చేతులునలుచుకోవడం దప్ప కడుక్కోవడం తేలీనోళ్ళం/ సబ్బునీళ్లు ఎక్కడినుంచి వొస్తవి ప్రభూ ?/ ఒంటిమీద బట్టలేనోళ్ళం గదా / మూతికి బట్టెట్ట కట్టుకుందుము నాయినా?’ అని డెప్పుతాడు. దేశమంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే పరిశ్రమలు.
దేశానికి కొత్త నిర్వచనాన్నిస్తూ దేశం గురించి గురజాడ నిర్వచనాన్ని స్పురింపచేసేలా కొత్తగా నిర్వచిస్తూ దేశమంటే ఏమిటో నారాయణ శర్మ తన కవిత 'macula' కొత్త నిర్వచనం చెప్పుతూ 'దేశమంటే మట్టి కాదు / దేశమంటే మనుషులూ కాదు / దేశమంటే పరిశ్రమలన్న ఎరుకకు ధన్యవాదాలు' అని ఉక్రోషాన్ని ప్రదర్శిస్తాడు. మరొక అడుగు ముందుకేసి ఆకలి అవుతున్న లోలోపల చావాలి కానీ బయట పెడుతదా? అని వ్యంగంగా ‘ఈ రోడ్డు ఏందిరా బై / దేశ రహస్యాలన్నీ బయట పెట్టేసింది.’ అని పాలకుల మనోగతాన్ని వివరిస్తాడు. అంటిటితో ఆగకుండా ‘ఆకలైనా అన్నం లేకున్నా / దేశభక్తి చూపించాలి అన్న మినిమమ్ మానర్స్ లేదు/ ఆకలి భారతం వికసిస్తున్నా/ మూటల్తో ముల్లెలతో రోడ్డుమీదికొచ్చి / నడవడం నిజంగా నేరమే’ అని గుడిపల్లి నిరంజన్ ‘రోడ్డును నిందిద్దాం రండి’ అంటాడు.
రోడ్లు ప్రసవించినట్లు ఎటుచూసినా జనం. బారులుగా, పాదాచారులుగా జనం. ఊరికి నడిచే ఈ జనమే ప్రభంజనమనీ ‘మహా ప్రస్థానమనీ’ నినదించే గొంతు డా. వాణి దేవులపల్లి ‘ఊరు ఊపిరై/ ఊపిరి నడకై/ నడకే గమ్యమై/ .... ఓ మహా ప్రస్థానమై పయనం’ అని చిత్రిస్తుంది. వలస కూలీల మీద ఏ మాత్రం శ్రద్ధ చూపని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తమ సంక్షేమం కోసం తిరుగుబాటు చేస్తే ఇలాంటి విపత్కర సంక్షోభాల్లో కనీసం ప్రాణమైన నిలుపుకునే వాళ్ళు అనే ఉద్దేశంతో 'దుఃఖనదీ తీరాన... కవితలో ఎన్ వేణుగోపాల్ 'ఇది దుఃఖ యాత్ర కాకపోతే ఎంత బాగుండును / ఇది దోపిడీపై దండయాత్ర అయితే/ ఇది పీడనపై జైత్రయాత్ర అయితే ఎంత బాగుండును.' అనే అభివ్యక్తి గొప్పగా ఉంది.
అక్షర జ్ఞానం లేకున్నా వారి జీవితమే పఠనీయ గ్రంథమని వ్యక్తీకరిస్తూ రాసిన కవిత 'ఆ పాదాలు' లో మార్పు కోసం 'ద్రోహాలతో గాయపడి ఆగ్రహించిన ఆ పాదాలు / పాలకుల మీద యుద్ధంలో బరి మీద నాటిన కొడవళ్ళు' అని రేపటి తిరుగుబాటుకు సంకేతంగా అరణ్యకృష్ణ వివరిస్తాడు ఊరి మీద ప్రీతితో ఉరి వడుతూ ఊరికి పోతున్నోళ్ళ మనోగతం వివరిస్తూ అన్నవరం దేవేందర్ 'ఊరి దిక్కు' కవితలో 'ఊరికి చేరేదాకా నడకనే నడక/ పడుకున్నాక ఏమన్నా అయితే మా దేహాలనన్నా ఇల్లకు చేర్చండి అని వారి దీనత్వాన్ని కళ్ళకు కట్టి చూపుతాడు. ఆకలిని చిత్రిస్తూ వొచ్చిన కవితల్లో నడుస్తున్న జనంలోని ఆకలిని ఎంత అద్భుతంగా చిత్రించాడో చదివితే మనసులో దయ పుట్టాలిసిందే. కొద్దిసేపైన ఆలోచించేలా ఒక్క పట్టాన మనసున పట్టనియ్యదని తంగిరాల సోనీ ‘సాక్ష్యం’ మెలిపెడుతుంది.. పాఠకుల మనోఫలకాలపై సుస్థిరంగా నిలుపుతుంది. ‘రోడ్డు కిరువైపుల ఎండిన గుంటలు / పాలురాని తల్లి స్తనాలను చీకుతున్న చిన్నారి / చెంపలపై కారిన కన్నీళ్లు / కొన్నివేళ సంవత్సరాల చరిత్రను చెబుతున్నాయి’ దు:ఖ చరిత్రను ఎతలని ఎత్తిపోస్తాడు.
పెనిమిటికి రాసిన ఉత్తరంలో చచ్చిన పెండ్లం రాసిన బాధ. ఈతి బాదలనీ వెళ్లబోస్తూ ‘లోకాన్నొదిలేసిన నేను/ నా శవం కూడా ఏడుస్తుంది./ డొక్కల్లో మెతుకులేదు / రెక్కాడిస్తేనె బతుకు / సూడాలొకపారి నిన్ను/ అయినా నువురాలేదు / ప్రాణం పోయిందయ్యా.’ అని వాహేద్ ఏడిపిస్తాడు. ‘ఆకలి అవసరాలు / అడ్డామీద బేరాలైనాయి’ అని పత్తిపాక మోహన్ వ్యక్తీకరిస్తాడు. పొన్నాల బాలయ్య నూతన దృక్కోణంలోంచి రాస్తాడు. బతుకును వ్యాఖ్యానిస్తూ ‘శిక్కం’ కవితలో ‘కత్తికి సావు బాసింగమై వూగులాడుతుంది బతుకు’,ఈ నడక నిర్వచనం చూడండి ‘సుక్కలను సూపుకు గుజిగుచ్చి సిక్కటి రాత్రులైన నడక’ అని ఎంత చక్కని అభివ్యక్తో. రోగం గురించి ‘సరం తప్పిన గొంతుకల సల్పుతున్న భీమారీ తాపం’, ‘ఆకలి గునుపం గుండెల గుచ్చుకొని / ఒడ్డుకు చేరని బుర్రకాయ శాత్రం’ అని విషాదీకరిస్తాడు. ఈ దేశం గీసిన ఆకలి చిత్రాన్ని చూసి కలత చెందిన జి.వి. రత్నాకర్ ‘నడక ఆగింది’ కవితలో చంపేస్తున్నా ఆకలి బాదల్నీ అక్షరీకరిస్తూ జీవంలేని తల్లితో మాట్లాడుతున్న మాటలు గుండెల్ని మెలిపెడుతాయి. ‘అమ్మా లే... / ఆకలేత్తంది... నూ లేవకపోతే / రేపుట్నుంచి నాకు కూడెవురు పెడతారే...’ అని కుమిలే ఎతల్ని ధారాపాతంగా కుమ్మరిస్తాడు.
కరచాలనాలకు దూరమైన సంస్కృతి ఇప్పటిదికాదు. వేల సంవత్సరాల నుండి వస్తున్నది. లోగుట్టును నిషిద్ధ మానవులుగా చిత్రించిన చరిత్రను గాజోజు నాగభూషణం ‘వాళ్ళు ఇల్లు చేరాలి’లో మూతికి ముంత – ముడ్డికి తాటాకు కట్టిన చేతులే’ అని నిజాన్ని స్వభావోక్తంగా వివరిస్తాడు. ‘ఆకలి తరిమే వేటలో నడక ఆగేదేప్పుడు?/ ఆకలి లేని లోకానికి సాగిపోతున్న / కొత్త దారుల్ని ఈ పాదాలకెవరైనా పరిచయం చేస్తారా ?’ అని పాలకుల్నీ, మానవత్వాన్ని ప్రశ్నిస్తాడు. తనువులు తాకట్టుపెట్టి రకరకాల పనులు చేసిన వలస కార్మికులు లాక్డౌన్ ఇబ్బందులవల్ల వారి బతుకులు ఎంత దుర్భరమయ్యాయో ఆకలి బాధలనీ, వివరించి చెప్పే జూకంటి జగన్నాథం ‘ఆకలియాత్ర’లో ‘మా చావు మేము చస్తామని / బేమాన్ మనిషి ముఖం మీద / తుపుక్కున ఊంచి / రోడ్డుపైన గోస గోసలే / మినుకు మినుకుమనే ఆశఆశోలే / సుదీర్ఘ ఆకలి యాత్రకు బయలుదేరారు.’ అని వివరిస్తారు.
సంతతి కాపాడుకోవాలనీ ప్రతి జీవికి ఉంటుంది. బతుకు యాత్ర కొందరికి సందయాత్ర అవుతుందనీ చావుకళ్ళ గద్గద స్వరంతో మూల్గుల చిత్రణ. కన్నీళ్లపై కత్తులు దూయడం కవికే చెల్లుతుంది. పాదయాత్రలో భార్య చనిపోయింది. రాళ్లు కరుగుతున్న ఎండలో తను ఆవిరి అవుతానని ఆమె ప్రసవించిన శిశువును కాపాడుమని వేడుకొన్న దీనగాధను చిత్రిస్తూ 'తావు' కవితలో 'అయ్యలారా! మీలో ఎవరైనా బతికుంటే ఈ పసికందును మనుషులు బతికున్న తావుకు చేర్చండి'అని వారి ఆశల రేపటి తరాన్ని బతికించాలి అనే కోరికతో దేశపతి శ్రీనివాస్ రాశాడు. రకరకాలుగా వలస కూలీల నిర్బంధం. తిరిగొచ్చిన కూలీల మీద స్ప్రే చేసి పునీతం చేయడం అధికారానికే చెందింది. కొత్త జైలులా ఆవిష్కరించడం చూసి కలత చెందిన కవి డాక్టర్ నూకతోటి రవి కుమార్ . స్వతంత్ర భారత దేశాన్ని తీసుకునే ఆహారంతో పోలుస్తూ ఉదారగుణాన్ని ఎత్తి పొడుస్తాడు. పురాణ ప్రతీక లక్ష్మణరేఖను ఆపాదిస్తూ వ్యంగ్యంగా 'సీతని కాపాడలేకపోయిన లక్ష్మణరేఖ / వలస కార్మికుల నుదిటిన లాక్ డౌన్ బలి వితర్ది మీద భారతదేశం'.
వలస కార్మికులు సొంత గ్రామాలకు వెళుతున్న వైనాన్ని చూసి నగరం తల్లడిల్లుతున్నదనీ సాబీర్ తన 'అంతే 'కవితలో ఆవిష్కరిస్తూ 'నగరం నిర్భయ మృతదేహంలా వణికి పోతుంది'అంటాడు. నడిచొచ్చిన బిడ్డను చూసిన గ్రామం ఆ పల్లె తల్లి మనస్సుతో ఆహ్వానిస్తూ ఎంత దూరం నడిచినవో గాని /జరంత జల్ది రా బిడ్డా/నడిసి నడిసి పగిలిపోయిన నీ కాళ్ళకు మలాం పెట్టాలె అని 'యాడున్నవో బిడ్డా' కవితలో ఖాజా అఫ్రిది అంటాడు. వలస కార్మికులు ఎందుకు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు? వివరించే కవిత బండారి రాజ్ కుమార్ 'లేబర్ జనం'లో 'పుట్టినూరును, అక్కడి మనుషుల్ని సూత్తెనన్న/ పానం లేసొచ్చినట్టయితదని బైలెల్లినోల్లం' అని ఊరి ప్రేమను చిత్రిస్తాడు.
కూలీల అవస్థలను అర్థం చేయించడానికి వడ్డెబోయిన శ్రీనివాస్ 'ఆకలి చెమట వాసన' కవితలో అనేక ప్రతీకలతో వినూతనంగా ఆవిష్కరిస్తాడు. 'ఇవ్వాళ / ఈ దేశం/ కరోనా గీసిన ఆకలి చిత్రమైంది' అని ఒకవైపు చెప్తూనే మరొకవైపు దేశభక్తి వాళ్ళందరిపైన ధర్మాగ్రహం ప్రకటిస్తూ 'థూత్తెరి/ఈ దేశభక్తికి/ చెమటచుక్కంత మానవత్వం లేదు' రేషం లేని వ్యవస్థ మీద తుపుక్కునుంచుతాడు.
ఊళ్ళకు సాగుతున్న బతుకవోయినోల్ల మీద పోలీస్ జులుం ఉండకూడదని, లాటీ చార్జీ వద్దనీ వలసగొంతై పలుకుతాడు ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ‘మా నడకకు విరామం కావాలి / మా దుఃఖానికి లాఠీ దెబ్బలు కాదు/ కొంచెం ఉపశమనం కావాలి’ కోరుతాడు. తోవలో నడిచిన వాళ్లు ఇంటికి చేరారా? లేదా? అనే యోగక్షేమాల నిమిత్తమై రాసిన ఉత్తరం. నూతన అభివ్యక్తితో 'ఒక వార్త చెప్పండి' కవితలో ప్రసాదమూర్తి 'ఎవరైనా ఒక వార్త చెప్పండి/ వాళ్లంతా ఇళ్ళకు చేరుకున్నారని' క్షేమాన్ని ఆకాంక్షిస్తాడు.
మమ్మల్ని మావోళ్ళకి అప్పగించండని దీనత్వంతో పలికే బతుకుపలుకులు ‘ఏం తెలువనోళ్ళం’ తండ హరీష్ గౌడ్ ‘తప్పిపోయిన మా పాదాలను / జరభద్రంగా / మా ఇంటోళ్ళకు అప్పజెప్పండి’ అని వలస కూలీల గొంతై వేడుకుంటాడు. వలస కూలీలు చేసే నడక గురించి మహెజబీన్ ‘లాంగ్ మార్చ్’ లో ‘ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ/ వ్యవస్థ మీద ఓ నిరసన చూపు విసిరి / వాళ్ళు మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.’ అని విషాదంగా విలపిస్తుంది. నడక గురించి ‘జనావాసాల మధ్య దారి తప్పిన నడక/ క్రొత్త దారులను అన్వేషిస్తున్నది/ఒక కదలికతో వలసపోతున్నది.’ అని ‘నడక’ లో పొట్లపల్లి శ్రీనివాసరావు అంటాడు.
ఇంతకీ వాళ్ళూరికి ఎందుకు నడుస్తున్నారు? అనే ప్రశ్నకి సమాధానమిస్తూ కవి యాకూబ్ ‘వాళ్ళు నడుస్తున్నారు’లో ఒక్క ఓదార్పు కోసం/ ఒక్క ఊరట కోసం / నా అనే అనుభూతి కోసం /ఎండిన నదిలో పగిలిన నేలలాంటి పాదాలతో / సాగిపోతున్నారనీ’ పల్లెర్ల నడుస్తున్న గాయాలను అంతరంగావిష్కరణ చేస్తాడు.
వలస కార్మికులే ఈ దేశ నిర్మాతలు. కలల సౌధాలు కట్టే గోపురాలు. వాల్ల చరిత్రే చరిత్ర. అంటూ డా. ఏరుకొండ నరసింహుడు ‘అనంత ప్రస్థానం’ లో ‘వాళ్ళు నడుస్తున్న బాట ఒక చరిత్ర/వాళ్ళొక వర్తమానం / ఆ గత, వర్తమానాలతో సంఘర్శిస్తూ .... వాళ్ళు ఈ దేశం భవిష్యత్తు.’ అని వాస్తవంతో ముగిస్తాడు. నిజమే కదా!
ఈ సంకలనంలో పేరుపొందిన లబ్ధ ప్రతిష్టులైన కవులతో పాటు, అప్పుడే ఉదయిస్తున్న కవుల రవుల్నీ ఈ పుస్తకాకాశం కవితా వెలుగులు వెదజల్లేలా తోడ్పడింది. సంశయం లేదు. సంధిగ్ధం లేదు. ఆకలి, నడక, దేశం, వర్తమానం మొదలైన సాంఘీక సమకాలీన ఆర్థిక స్థితి గతుల్నీ ప్రతిబింబించిన కావ్యం . ‘వలస దు:ఖం’ కవితా సంకలనంలో ఎన్ని కోణాల్లో దర్శిస్తారో అన్ని కోణాల్లో వారనుకున్నది దృక్కోణం తప్పకుండా కనబడుతూ ఉంటది. కాలంతో కలబడుతూ ఉంటది కన్నీళ్లను కత్తులుచేస్తూ...
మానవాభ్యుదయం కోసం మనందరం నడుం కట్టాలి అని డా. కత్తి పద్మారావు ‘వారు నడుస్తూనే ఉన్నారు...’లో ‘మానవాభ్యుదయానికి నడుం కట్టండి / ప్రేమవృక్షాలు నాటుదాం / కరుణ పరిమళాలు వెదజల్లుదాం /.. నూత్న సమాజాన్ని నిర్మిద్దాం’ అన్న పిలుపును వలస దు:ఖం మనకిస్తున్న మార్పుతెచ్చే గొప్ప శాశ్వత సందేశం నిలిచిపోతుంది.
-డాక్టర్ సిద్దెంకి యాదగిరి