నిర్మాణాత్మక విమర్శకు పర్యాయపదం "అంతరంగం"

By telugu teamFirst Published Jul 17, 2020, 4:59 PM IST
Highlights

గొప్ప భావుకత ఉంటేనే  ఎవరైనా సహృదయులు అవుతారు. సహృదయత ఉంటేనే విమర్శకుడుగా స్థిరపడతాడు. అలా విమర్శా రంగంలో స్థిరపడిన వారే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి.
       

సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను పరిశీలిస్తూ ఏ రచన అయినా సాహిత్యంగా పరిణమించడానికి కారణమైన శైలి-శిల్పం అంశాలను లోతుగా విచారించేది విమర్శ.  విమర్శ రాసేవారిని విమర్శకులు అంటాం. సాహిత్య విమర్శకుడు నిరాటంకంగా వ్యవహరిస్తాడు. గొప్ప భావుకత ఉంటేనే  ఎవరైనా సహృదయులు అవుతారు. సహృదయత ఉంటేనే విమర్శకుడుగా స్థిరపడతాడు. అలా విమర్శా రంగంలో స్థిరపడిన వారే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి.
          
ఏనుగు నరసింహారెడ్డి వచన కవి గా లబ్దప్రతిష్టుడు. రుబాయి ప్రక్రియలో ఆయనది అందెవేసిన చెయ్యి. అనువాదం తెలిసినవాడు. ప్రముఖ కావ్యాల లోతులను తరచి చూసిన సహృదయుడు. కథలు, నవలలు అంటే ఆయనకు విపరీతమైన వ్యామోహం.

ఇక వచన కవిత్వం సంగతి చెప్పనక్కరలేదు. ఎంతో నిష్టతో సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న ఈ కాలం వారిలో ఆయన ముందు వరుసలో ఉంటాడు. ఆయన చాలా కాలంగా అనేక పత్రికలకు విమర్శ వ్యాసాలు రాస్తున్నాడు. అనేక సాహిత్య సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేశాడు .తాను వివిధ సందర్భాల్లో రాసిన 26 వ్యాసాలను ఈ సంపుటి లో ఏర్చి కూర్చాడు. దానికి "అంతరంగం- ఆధునిక కవిత్వ విమర్శ" అని పేరు పెట్టాడు. సాహిత్యరంగంలో పేరు పొందిన లబ్దప్రతిష్టులతో పాటు ఇప్పుడిప్పుడే కవిత్వ రంగంలో తమదైన ముద్ర వేస్తున్న కవుల రచనలపై ఇందులో వ్యాసాలు కనిపించడం విశేషం.
         
వచన కవిత, పద్య కవిత, గేయ కవిత, పాట ,శతకం, గజల్, దీర్ఘ కవితలపై ఇందులో విమర్శా వ్యాసాలు కనపడతాయి.
ఇందులో ఏ వ్యాసాన్ని చదివినా ఏనుగు నరసింహారెడ్డి ఆ పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివినట్టు, అవగాహన చేసుకున్నట్టు , దానికి సంబంధించిన ఇతర పుస్తకాలను పరిశీలించినట్లు మనకు సులభంగా అవగతమవుతుంది.  సానుకూలత, సంయమనం, నిష్పక్షపాత ధోరణి ఈ వ్యాసాలలో కనబడతాయి.    అధిక పొగడ్తలు, అనవసర నిందలు ఎక్కడా అగుపించవు .  సమదృష్టి ఈ వ్యాసాలలో పరచుకుని పోయింది. అందుకే నేను  ఈ విమర్శను శ్రేష్ఠతమ విమర్శ అని అంటున్నాను. ఇది ఒక సహృదయుని అంతరంగం. ఇతర కవుల కవిత్వం లోతుల్లోకి వెళ్లి  వాటిని పరామర్శించిన సుమనస్కాంతరంగం.
       
ఈ వ్యాస సంకలనం లో 'శివారెడ్డి కవిత్వం పై విశిష్ట అధ్యయనం' అనే అధి విమర్శ ఉంది. సాహిత్య విమర్శపై వచ్చే విమర్శను అధి విమర్శ అని అంటారు.  అధ్యయనం,విశ్లేషణ, అనుభవం అన్న త్రిపుటి మూలం లోంచి ఎగజిమ్ముకొని వచ్చిన భావనలుగా ఈ వ్యాసాలు కనబడతాయంటే అతిశయోక్తి కాదు.
         
సాహిత్యంలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కవిత్వ రచనలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఎంతో అధ్యయన శీలత ఉంటే కానీ కవి శైలిని విమర్శకుడు పట్టుకోలేడు.  ఒకవేళ పట్టుకున్నా దానిని నిర్వచించడం చాలా కష్టం . కానీ ఏనుగు నరసింహారెడ్డి మాత్రం ఎంతో సులభంగా ఆయా కవుల కవిత్వ తత్వాన్ని ఒకటి రెండు  వాక్యాలలో నిర్వచించాడు. దానికి ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను.

*  "దాశరథిది ప్రకృష్టమైన పద్యం, హృద్యమైన గేయం, శుద్ధమైన వచనం"

* " సదాశివ ఏ వాదానికి పూర్తిగా పట్టుబడని మానవతా వాది .    బేనిషాన్ దర్దీ. రసవాది."

* " నందిని సిధారెడ్డి కవిత్వ లక్షణం సృష్టత . సంక్షిప్తం, సూటిదనం, భాషా సారళ్యం, తాత్త్వికత ఆయన కవిత్వ లక్షణాలు"

తెలంగాణకు సంబంధించిన  వచన కవిత్వాన్ని విమర్శించిన వ్యాసాలలో క్రియాంతాలుగా తెలంగాణ క్రియా పదాలను వాడిన నరసింహారెడ్డి పద్యకవిత్వంపై చేసిన విమర్శ లో శ్లిష్ట వ్యావహారికాన్ని  వాడాడు.

దాశరథి వచన కవిత్వాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేసిన ఏనుగు  ' దాశరథి వచన కవిత - వస్తువు, శిల్పం ' అనే ప్రామాణికమైన వ్యాసాన్ని మనకు అందించాడు. తానెంచుకున్న కవితలను అనేక ఉప శీర్షికల కింద వింగడించి చూపాడు . ఇది అంత సులభ సాధ్యం కాదు. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను.

* విశ్వమానవ దృష్టి , విశాల ప్రపంచ దృకృథం -

" తెలంగాణ లోని కోటి
ధీరుల గళధ్వనినె గాక
ఇలా గోళమందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను
నా పేరు ప్రజావాటి"

ఇలాంటి ఉప శీర్షికలను చాలా వ్యాసాలలో మనం చూడొచ్చును . దీనివల్ల పాఠకునికి సదరు కవిని సులభంగా అర్ధం చేసుకునే సౌలభ్యం కలిగింది. ఫలితంగా కవిత్వ తత్త్వంపై స్పష్టత లభించింది.
      
విమర్శకుడికి  ప్రతిభ, పాండిత్యం, బహు గ్రంథ పరిచయం అవసరం అన్నది అందరూ చెప్పేదే.   ఆ లక్షణాలన్నీ ఏనుగు నరసింహారెడ్డిలో పుష్కలంగా కనబడుతున్నవి. ఇలా అనడానికి ఈ పుస్తకంలోని ప్రతి పుట సాక్ష్యంగా నిలుస్తుంది.

'మనిషిని వెతికిన విల్సన్‌ రావు కవిత్వం' వ్యాసంలో   " ప్రతి మాటకూ ప్రాణముండాలి" కవిత లోని వినూత్న అభివ్యక్తిని సమీక్షిస్తూ ఒక ఆంగ్ల సూక్తిని ఉదహరించాడు. దానితో పాటు రామాయణంలో మంచి మాట తీరుకు ప్రతినిధిగా ఉన్న హనుమంతుడిని ఏనుగు ప్రస్తావించాడు. సందర్భోచితమైన యిలాంటి ప్రస్తావనల వల్ల కవి అంతరంగం మనకు తెలిసి పోయింది. ' విప్పి చెప్పేది విమర్శ' అన్నారు కదా! దానిని నిజం చేశాడు ఈ విమర్శకుడు.
       
"సాహిత్య విమర్శకులకు సామాజిక సాహిత్య పరిణామాలు, రచయితల నేపథ్యం, సాహిత్య ప్రక్రియలు, క్రమ వికాసాలు తెలిసుంటే వాళ్ళ విమర్శ సాధికారికంగా ఉంటుంది'  అని ప్రముఖ విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి  అంటారు. ఈ దృష్టితో చూసినప్పుడు నరసింహారెడ్డి  సాధికారిక విమర్శకుడిగా దర్శనమిస్తాడు. ఒక కవి తత్వాన్ని అర్థం చేసుకోవడం, దానిని వ్యాఖ్యానించడం, దానిపై ఒక సాధారణ ప్రకటన చేయడం సులువు కాదని విమర్శ రంగంలో ఉన్న వాళ్లకు తెలిసిన విషయమే.    ఈ అంతరంగం విమర్శ సంపుటిలో కవిత్వానికి సంబంధించి నరసింహా రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తాయి. అవి కొన్ని సాధారణ వ్యాఖ్యలు. మరికొన్ని కవులపై, వారి కవిత్వం పై చేసిన వ్యాఖ్యలు గా ఉన్నాయి. ఒకటి రెండు ఉదాహరణలు చూడండి:

*భావాల లోతులతోనే కాక భాషనూ పదాలనూ ఎలా విరువాలో  సీతారాంకు తెలిసినంతగా తెలుగులో చాలా కొద్దిమందికే తెలుసు

*ఇన్ని ఉద్యమాలు, ఇంత ఘర్షణ సాహిత్య రంగంలో కొనసాగుతున్నప్పటికీ వీటితో నేరుగా కలిసిపోకుండా స్వతంత్ర వ్యక్తిత్వంతో సాహిత్య సృజన చేసే పండితులు ఉన్నారు.

*ప్రాచీన భారతీయ ఆలంకారికులు చెప్పినట్లు భావయిత్రి  వ్యాపారానికి కారయిత్రి  వ్యాపారానికి మధ్య నుండి రెడ్డి భావయిత్రి లోని రమణీయతను కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు .

* కాల్పనికత దాశరథిని కవిగా మహాన్నత స్థానంలో నిలబెడుతుంది.

నిజానికి పై వాక్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యాసంగా రాయదగినవి . సహజంగా వ్యాసానికి ఉండే పరిమితి చేత పరిమితంగా రాయవలసి వస్తుంది.
        
కవిత్వానికి ఇతర సాహిత్య ప్రక్రియలకు కూరెళ్ల విఠలాచార్య ప్రచారకర్తగా మారాడని, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ప్రత్యేక వాణి బాణి సృష్టించుకుని సినారె ఒకే ఒక్క ఆధునికుడు అయ్యాడని, సుంకిరెడ్డిది " మెజర్డ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎమోషన్స్" అనిపిస్తోందని, అభివ్యక్తి ,కవితలకు శీర్షికలు ఇవ్వడం, ముగింపు వాక్యాల మెళకువ విల్సన్ రావు ప్రత్యేకత అని, వస్తువుకు శిల్పానికి మధ్య సరి అయిన సమన్వయం సాధించిన ఉద్యమ కవి నందిని సిద్ధారెడ్డి అని "అంతరంగం" విమర్శ సంపుటిలో ఏనుగు నరసింహారెడ్డి  తేల్చేశాడు. పరిశోధన , పరిశీలన, అనుశీలన ఉంటే గానీ ఇలా చెప్పడం కుదరదు.
          
ఈ అంతరంగం విమర్శ వ్యాసాలలో ఎత్తుగడ అద్భుతంగా ఉంది. వచన కవిత్వ లక్షణాన్ని విమర్శా వ్యాసానికి ఆపాదించిన ఏనుగు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు.

*పాటకు తలలూపే పామును మనమెవరం చూడలేదు. అన్నమయ్య పాడితే వెంకన్న స్వామి పరదా జారి పడకపోవచ్చు. మీరాబాయి పాడితే రాళ్లు కరగడం అబద్ధమే అయి ఉండి ఉంటుంది .  కానీ మన కళ్ళ ముందు నడిచిన నడుస్తున్న ఉద్యమాలలో పాట ప్రజల్ని కదిలించిన తీరు చూశాక ఇతర  సాహిత్య ప్రక్రియలను అది ఎంత పూర్వపక్షం చేసిందో బి.ఎస్.రాములు బాగా దర్శించారు .ఇలాంటి ఎత్తుగడతో ఏనుగు పాఠకుడిని తన వ్యాసంలోకి నడిపిస్తాడు.  ప్రతీ వ్యాసం యిలాంటి ఎత్తుగడలతో మనలను ఆకర్షిస్తుంది.
       
విమర్శ వ్యాసం అనగానే పాఠకునిలో ఒక ఆత్రుత మొదలవుతుంది. తాను విమర్శకులు ఎంచుకున్న రచనలో విమర్శకుడు ఏవైనా లోపాలు పసిగట్టాడా? పసిగడితే వాటిని ఎలా వ్యక్తీకరించాడు? మొదలైన ప్రశ్నలు ఈ ఆత్రుతకు కారణం. ఇలాంటి విమర్శలు ప్రతివిమర్శలు  తెలుగు సాహిత్యంలో చాలా కాలం నుండి ఉన్నవే. అయితే అంతరంగంలోని విమర్శ వ్యాసాలలో నిర్మాణాత్మక సూచనలు కనిపిస్తాయి.             ఆ సూచనలలో ఉపయోగించిన భాషలో సున్నితత్వం కనబడుతుంది.   స్నేహశీలిగా  నరసింహా రెడ్డి సలహా ఇచ్చాడు కానీ విమర్శక భయంకరునిలా  కవిని భయపెట్టలేదు.

* సుధామ చెప్పిన స్థాయికి కవిత్వం దొరకాలంటే జనార్ధన మహర్షి మరో సంకలనం వేయాల్సిందే .
* తాత్విక కవితలుగా హోటల్లో బరంపురం, పరాయీకరణ, బతకటం లాంటి కవితలను చేర్చి చర్చిస్తే బాగుంటుంది .

సీతారాం కవిత్వంపై  శ్రీదేవి చేసిన విమర్శను ఎంతో సున్నితంగా సోదాహరణంగా ఏనుగు పరాస్తు చేసిన వ్యాసం ఆయన అధి విమర్శాశక్తికి ఉదాహరణ .
     
ఈ మొత్తం వ్యాసాలను చూసినప్పుడు ఆయా కవుల శిల్పాన్ని దాంతోపాటు వస్తువును నరసింహారెడ్డి  సమీక్షించారు అని నాకనిపించింది. ఏనుగు నరసింహారెడ్డి లో అపారమైన  చంధో పరిజ్ఞానం కూడా దాగి ఉంది. అందువల్లనే సదాశివ,  దాశరథి, కూరెళ్ళ ,గంగుల శాయి రెడ్డి రచించిన పద్య సాహిత్య విశేషాలను మనకు అందించగలిగారు. పద్యం మీద పట్టు ఉంది కాబట్టే సదాశివ రచనలలోని సాంప్రదాయ ముద్రను కావ్యాల వారిగా చూపగలిగాడు.గేయ కవిత్వంపై ఆయన రాసిన రెండు వ్యాసాలు కూడ అమూల్యమైనవే.

' రోజూ కనబడే నక్షత్రాల్లోనే
రోజూ కనబడని కొత్తదనం చూచి
రోజూ పొందని ఆనందానుభూతి
పొందడం అంటేనే కవిత్వం'----- దాశరథి

ఈ కవితా వాక్యాలు నరసింహా రెడ్డి విమర్శకు వర్తిస్తాయి . మనం యింతవరకు చదివిన అనేక కవుల కవిత్వ తత్వాన్ని మనకు కొత్తగా ఆయన చూపగలిగారు. తద్వారా మనను ఆనందానుభూతికి లోను చేశారు.

"తెలుగు సాహిత్య విమర్శ విస్తారంగా ఉన్నట్లు అనిపిస్తుంది . కానీ, సాధికారిక విమర్శ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది "  అని వాపోయిన నరసింహారెడ్డి తాను ఆ కొరతను కొంత తీర్చినట్లు మనం భావించవచ్చు. లబ్దప్రతిష్టులైన  వారి కవితా తత్వాన్ని ఎంతో గౌరవంగా పరామర్శించాడు. నూతన కవులను అంతే స్నేహపూర్వకంగా వెన్ను తట్టాడు. ఈ విమర్శ సంపుటిలోని గొప్ప లక్షణం ఇది.  వైద్య పరిభాషలో చెప్పాలంటే ఈ విమర్శ మ్యాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్. ఇంత మంది కవుల అక్షరాలను ఆలింగనం చేసుకుని వాటి హృదయనాదం  తాను విని మనకు వినిపించిన ఏనుగు నరసింహారెడ్డి తెలుగు సాహిత్య విమర్శకు మంచి చేర్పు . ఆయనకు హృదయపూర్వక అభినందనలు.

- సంబరాజు రవి ప్రకాశ రావు

click me!