దేవులపల్లి శ్యామ్ సుందర్ రావు రాసిన 'నవ్వుల-బాణం' (హాస్య గుళికలు) పైన విశాఖపట్నం నుండి డా. కె.జి. వేణు రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :
మనిషికి, మరో మనిషి చేసే మహోపకారాలలో 'నవ్వించటం' ఒకటి. ఆ ప్రక్రియలో అత్యంత నేర్పరితనాన్ని తన ఖాతాలో జమచేసుకున్న సాహితీ మిత్రుడు దేవులపల్లి శ్యామ్ సుందర్ రావు. బాల్యం నుంచి హాస్యాన్ని అమితంగా ప్రేమించిన ఆరాధకుడు ఆయన. ఎదుటి వారిని నవ్వించి, తాత్కాళికమైన ప్రయోజనాన్ని నమోదు చేసుకునే అతిసాధారణ వ్యక్తి కాదు ఈ మిత్రుడు. ఎక్కుపెట్టిన ప్రతిమాట ఒక ప్రయోజనాన్ని అందించాలనే తపన ఆయనిది. తన లక్ష్యాన్ని అక్షరాల రూపంలో అందరికీ అందించాలనే ప్రయత్న ఫలితమే వెలువడిన ఈ పుస్తకం 'నవ్వుల-బాణం'. ఈ బాణం చాలా బలమైనది. ఎవరిని తాకినా నవ్వుల నదిలో పుష్కరస్నానం చేయించే సత్తువ కలిగిన ఒక అపురూపమైన సాధనం ఈ పుస్తకం. ఈ రచయిత మానవ నైజాల అధ్యయనంలో సుదీర్ఘమైన తపస్సు చేసి తిరుగులేని ఈ నవ్వుల అస్త్రాన్ని పొందినట్లు, ఈ పుస్తకంలోని ప్రతి హాస్య సంభాషణ సాక్ష్యం పలకటానికి సిద్ధంగా వుంది. రచయిత ఆశించింది ఒక్కటే, ఈ పుస్తకాన్ని చదివిన ప్రతీ ఒక్కరు హాయిగా నవ్వుకోవాలి. ఆ నవ్వు వాళ్ల ఆనందపు ఆయుస్సును రెట్టింపు చేయాలి. అది ఫలించిన రోజు రచయితగా తన సంతృప్తి ఆకాశం అంచులుదాకా చేరుకుంటుంది.
సంస్కారపూరితమైన హాస్యానికి పూలరథాన్ని ఏర్పాటు చేసిన పుస్తకం ఇది. వ్యక్తిగతమైన వెక్కిరింపులు లేని పవిత్రతను పేజీలనిండా నింపుకున్న హాస్యపు తులసిమొక్క ఈ పుస్తకం. హాస్యాన్ని పండించటంలో ఆయా సన్నివేశాలలోని పాత్రలు, నిత్యం మన చుట్టూ తిరుగుతున్నవే. మన జీవితాలతో సంబంధ బాంధవ్యాలను కలిగివున్నవే. అందులో మన కుటుంబం వుంది, మన స్నేహితులు వున్నారు, మన సహచరుల రూపాలు వున్నాయి. భార్యాభర్తలున్నారు, భక్తుడు, భగవంతుడు వున్నారు. ఒక సందర్భంలో శ్రీశ్రీ మాటలు సైతం మనల్ని పలకరిస్తాయి. వెండితెర మీద రేలంగి, బ్రహ్మానందంల మధ్య సాగే గిలిగింతల మాటల సవ్వడులను మనం వినలేదు, కనలేదు. ఆ కొరతను తీర్చే క్రమంలో వాళ్లిద్దరిని తన పుస్తకంలోకి సాదరంగా ఆహ్వానించిన రచయిత ధన్యుడు. పురికోసతో కిటికీ చువ్వలకు ఉరివేసుకుని ఖైదీ చనిపోయిన సంగతి, అమాంతం పాఠకుడ్ని నవ్వుల జాతరలోకి లాక్కెళ్లు తుంది. అనుకోకుండా పాకీజాతో బాబుమోహన్ పండించిన హాస్యపు పంట, రాసులుగా మన మనసులను చేరుతుంది. వెంకటయ్య గారి మతిమరుపు కడుపుబ్బ నవ్విస్తుంది. కొడుకు గుండు కొట్టించుకోవాలని ముచ్చటపడితే, ఆ ముచ్చట తీర్చటానికి ఏకంగా తన పతిని నాలుగు రోజులు చావమని సలహా ఇచ్చిన ఇల్లాలు, మన నవ్వుల్లో సువాసగా మిగిలిపోతుంది.
సన్నాసికి, సన్యాసికి మధ్యగల తేడా చాలాకాలం గుర్తుండి పోతుంది. హిప్నాటిస్టు డా. నాగేశ్ జవాబుకు ఖంగుతిన్న కుర్రాడి ముఖం నవ్వుల ద్వారాలను తెరుస్తోంది. సత్యవంతుడు, సావిత్రిల సన్నివేశం సరిక్రొత్తగా వుండటమే కాదు, చాలామంది భార్యాభర్తల మనస్తత్వాలకు నవ్వుల వేదిక మీద అద్దం పడుతోంది. ఇల్లు కట్టుకోవటానికి కారణమైన శత్రువులను పూజించే వెనకనున్న విషయం నవ్వునే కాదు, ఆశ్చర్యాన్ని సైతం కలిగిస్తుంది. పళ్ళ మధ్య సందులు పూడ్చుకోవటానికి గోడలకు వేసే సిమెంటును వాడటానికి సిద్ధపడ్డ శాల్తీ మన పెదాలమీద నవ్వుల కిరణమై వెలుగుతాడు. శవంమీద చల్లుతున్న పైసల్ని పండిత మదన్ మాలవ్యా ఏరుకుంటున్న దృశ్యం చనిపోయిన వాడి పీనాసితనాన్ని గుర్తుచేసిన విధానం ఈ రచయిత రచనా చమాత్కారానికి కాశ్మీర్ శాలువ కప్పినట్లుంది. సాహిత్యపు చమత్కారాలు కూడా ఇందులో చోటు చేసుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది. తామర అంటే పుష్పం, అందం అనే అర్థాలు తెలియని ఒక వాజమ్మ, తామర అనగానే గజ్జి, దురద అనుకుని అసహ్యాన్ని ముఖంనిండా ప్రదర్శించటం ఒక వినోదానికి వేదికగా మారింది.
భార్యాభర్తల నేపథ్యంలో వచ్చిన హాస్యాలు ఈ పుస్తకంలో అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పూర్వజన్మలో చేసుకున్న పాపాలే భర్త రూపంలో వచ్చి వెంబడిస్తాయని ఒక కూతురుకు, ఆ తల్లి బోధించిన నిర్వచనం చక్కిలిగింతలు పెడుతుంది. ఉత్తర, దక్షిణ ధృవాలంటే సఖ్యతలేని భార్యాభర్తలుగా పరిచయం చేసిన సన్నివేశం, సహజత్వానికి చాలా దగ్గరగా వుంది. రాజకీయాలకు ఎలాంటి వాడు పనికివస్తాడో తమ్ముడు తన అక్కతో చెప్పిన సన్నివేశం రాజకీయనాయకుల్ని వరుసల్లో నిలబెట్టి కడిగేసినట్లుగా వుంది. ఆగస్టు 15వ తారీఖున వచ్చి, జనవరి 26 తేదీవరకు వుండిపోయే అల్లుల్ల సంగతి చదివినప్పుడు, ఆ నీడల్లో చాలామంది సిగ్గులేని అల్లుల్ల ముఖాలు కుక్కమూతి పిందెల్లా కనిపిస్తున్నాయి. ఆఫీసులో సుఖంగా నిద్రపోయి, ఇంట్లో నిద్రపట్టటం లేదని బాధపడే శేషాచలంలాంటి ప్రబుద్ధులు మనచుట్టూ చాలామంది వుంటారు. తన భార్య క్షేమం కోరి తన ఇంట్లో టి.వి. పని చేయకుండా చేయమని భగవంతుడ్ని ఒక భక్తుడు అడిగినప్పుడు, ఆ సంగతి తన భార్యను అడిగి చెప్పుతానని దేవుడు అనటంలో హాస్యమే కాదు, ఒక వాస్తవం సజీవంగా మనముందు వచ్చి నిలబడి పక, పక నవ్వుతుంది. ఒకసారి పార్లమెంటు సమావేశాల్లో వాజ్ పాయ్ గారిని ఏదో అనబోయి, తాను చేసిన నిర్వాకాన్ని ఎవరో గుర్తు చేసేసరికి, దానిని సైతం సమర్థించుకుని చప్పట్లు కొట్టించుకున్న లాలూప్రసాద్ యాదవ్ కడపారా నవ్వుకోవటానికి మరోసారి మనముందుకొస్తాడు.
తెనాలి రామకృష్ణ కవికి సంబంధించిన కథలన్నీ హాస్య గులికలే. అలాంటి ఒక కథ ఈ పుస్తకంలో చోటు చేసుకోవటం హాస్యానికి పరిమళం తోడయినట్లుగా వుంది. భార్యాభర్తలను ఏడేడు జన్మలు కలిసి జీవించమని దీవించిన సన్యాసిని ఎందుకు ఆ భార్యాభర్తలు చితక్కొట్టారో ప్రతి భార్యా, భర్తకు తెలిసే వుంటుంది. వెరసి హాయిగా నవ్వుకోవటానికి ఇది ఒక టానిక్ లా పని చేస్తోంది. ప్రఖ్యాత కవి గాలిబ్ గారికి ఈ పుస్తకంలో సముచితమైన స్థానం కల్పించటం రచయిత సంస్కారానికి ఒక కొలమానం. స్వాతంత్ర్య సమరయోధుడు ముట్నూరి కృష్ణారావు ఎప్పుడు సంభాషించినా హాస్యం పాలపొంగులా ఎదురువచ్చేది. చివరికి తన చివరి దశలో తన స్థితిని చూసి భార్య బావురుమంటే 'అపుడే రిహార్సల్స్' మొదలు పెట్టావా? అంటూ అందర్ని నవ్వించిన దృశ్యం ఈ పుస్తకంలో చోటు చేసుకోవటం జీవనది గంగ నేరుగా మన ఇంటికి వచ్చి ప్రవహించినట్లుగా వుంది. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీఅహ్మద్ విసిరే చలోక్తులకు అవతలివాడి దిమ్మ తిరిగి పోయేది. ఈయన వ్యవసాయ శాఖామాత్యులుగా వున్నపుడు ఎం.పి, పీల్ మోడి, ఆయనను ఇరుకునపడేసే ఒక ప్రశ్నను సంధించినప్పుడు, దానికి సమాధానంగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఇచ్చిన జవాబుతో ఆరడుగుల భారీకాయుడైన మోడీ అంగుళం ఎత్తుకు కుదించుకు పోయాడట. ఆ సందర్భంలోని వ్యంగ్య బాణాలను ఈ పుస్తకంలో చదవండి.
హాస్యం మనుష్యుల మధ్యే కాదు, పండించే వాడు గొప్ప రైతయితే ఆ హాస్యాన్ని రెండు ఈగల మధ్యకూడా పండించవచ్చునని ఈ రచయిత నిరూపించాడు. తెలివిగల భర్త తన భార్య నోటిని ఎలా మూయించాడో తెలియజేసే గుళిక హాస్యాన్నే కాదు, గొప్ప కిటుకుల్ని సైతం భర్తలకు అందిస్తుంది. ప్రక్కింటి ఆవిడ భర్త వెధవ అయితే, తన భర్త అంతకంటే డబుల్ అని గొప్పగా చెప్పిన ఇల్లాలి అమాయకత్వానికి నవ్వు ఒక్కటే జవాబు. పాము కరిస్తే మనిషి చావలేదు, ఆ కరిచిన పాము వెంటనే చచ్చిపోయిన దృశ్యం మళ్లీ, మళ్లీ గుర్తుకొచ్చి నవ్వులు మల్లెపువ్వుల్లా విరబూస్తున్నాయి. నాలుగు కాలాల పేర్లు చెప్పమంటే...ఇన్ కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్, మిస్డ్ కాల్, వీడియో కాల్... అని ధీమాగా జవాబు చెప్పిన విద్యార్థి తెలివి తేటలకు నాలుగు రోజులకు సరిపడ నవ్వు ఖాతాలో చేరిపోయింది. ఈ పుస్తక రచయితను మనసారా ఎందుకు అభినందిస్తున్నానంటే మన కవుల మీద, సాహిత్యం మీద ఎనలేని గౌరవ మర్యాదలు ఆయనకున్నాయి. హైదరాబాదులో రవీంద్ర భారతీలో జరిగిన ఒక అద్భుత అష్టావధాన కార్యక్రమాన్ని సైతం మన మధ్య ఒక సింహాసనం మీద అధిరోహింపజేసి, కంద, సీస పద్యాల ప్రస్తావనతో కూడిన చమత్కారాలను మన దోసిళ్ళలోకి గుమ్మరించటం విశేషమైన ఆయన ప్రతిభకు నిదర్శనం. కూరపాటి వేంకటకవి హాస్య ధీరణిని సైతం పరిచయం చేసిన రచయిత అభిరుచికి కరచాలనం చేస్తున్నాను.
అత్యంత తెలివైన విద్యార్థినులను పరిచయం చేస్తూ, టైపు రైటర్ కు రిబ్బన్ వుంటుంది కాబట్టి అది స్త్రీ లింగమని నిర్ధారించిన తీరు హాస్యామృతాన్ని కురిపించింది. 25 సంవత్సరాలు కాపురం చేశాక పులినోట్లో తల పెట్టగలిగిన ధైర్యం ఎలా వస్తుందో తెలియజేసిన సంభాషణ నవ్వుల కిరణాలను వెదజల్లింది. దేవదాసు, రామదాసు, హరిదాసు... ఈ ముగ్గురు కొత్త జంటను ఎలా దీవిస్తారో తెలియజేసే సన్నివేశం చమత్కారపు సువాసనతో గుప్పుమంది. పంచభూతాలు అంటే ఎవరండి అని భార్య అడిగిన ప్రశ్నకు, భర్త చెప్పిన జవాబు ఒక పూర్తి నిడివి కామెడీ సినిమాను చూసిన అనుభూతిని కలిగిస్తుంది. బ్రతికుండగానే తన అంత్యక్రియలను మతగురువు పర్యవేక్షణలో జరిపించుకున్న ఒకప్పటి జర్మనీ అధినేత అయిదవ ఛార్లెస్ విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కవి సమ్మేళనాల మీద తనదైన శైలిలో సంధించిన వ్యంగ్య బాణాలు చాలా సూటిగానే తగిలాయి. అవధాని శ్రీ మాచిరాజు శివ రామరాజు అవధానాలలో వృచ్ఛకుడు అడిగిన కొంటె ప్రశ్నలకు ఆయన సంధించిన చమత్కారాల సమాధానాలు పాఠకులను తప్పనిసరిగా ఆకట్టుకుంటాయి. ఉరిశిక్షపడిన ముద్దాయి తన ఆఖరి కోరికగా తన ఉరిశిక్ష ఫిబ్రవరి 30వ తారీఖున ఖరారు చేయండని కోర్టు జడ్జీని కోరుకున్న సన్నివేశం, ముద్దాయిలకు కూడా మహోత్తరమైన తెలివి తేటలుంటాయని తెలిసి మనసారా నవ్వుకోవటానికి అవకాశమేర్పడింది. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవటం తన భార్య మరచిపోయిందని, బాగా నిద్రపోతున్న తన భార్యను తట్టిలేపి స్లీపింగ్ టాబ్లెట్స్ అందించిన ఒక భర్త అమాయకపు ప్రేమ, మనం హాయిగా నవ్వుకోవటానికి ఒక సాధనమయింది. కాకులచేత సైతం గొప్ప హాస్యాన్ని కురిపించిన దృశ్యాలు ఈ పుస్తకంలో మనల్ని మనసారా పలకరిస్తాయి. చరిత్రలో శ్రీ కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ కవి...వీళ్లద్దరి మధ్య సాగిన సంభాషణలో అరచేతిలో వెంట్రుకలు ఎందుకుండవు? అని రాయలు అడిగిన ప్రశ్నకు, నవ్వు తెప్పించిన రామకృష్ణుడి జవాబు పండగరోజు పాయసం తిన్నంత ఆనందంగా వుంది.
‘నవ్వుల-బాణం’ పుస్తకంలోని ప్రతి సంభాషణ, సంభావనలు స్వీకరించటానికి పూర్తి అర్హత కలిగిన నవ్వుల రాసులే. విస్తారంగా ఇంతటి నవ్వుల పంటను పండించటానికి తన మనసులో గొప్ప ఆలోచనకు స్వాగతం పలికిన రచయిత శ్యామసుందర్ కు పాఠకలోకం తరుపున హృదయపూర్వక అభినందనలు. రచనలో హాస్యం, వ్యంగ్యం పోటీపడి తమ ప్రతిభను ప్రదర్శించుకునే పోటీలలో ఉమ్మడి విజేతలుగా నిలవటం వెనక రచయిత విశేషమైన కృషి ప్రధానపాత్ర వహించచిందని తెలుస్తోంది. ఇలాంటి నవ్వుల బాణాల్ని భవిష్యత్తులో మరిన్ని ఆయన సంధించాలని, నవ్వులతో మానవ హృదయాలను సుసంపన్నం చేయాలని, కన్నీటిని చేతులు తుడిస్తే, అసలు ఆ కన్నీటిని పన్నీటిగా మార్చగల శక్తి ఒక హాస్యానికి మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించిన పుస్తకం 'నవ్వుల-బాణం'.