అమ్మ - ఒక తంగేడు పూల జ్ఞాపకం

By telugu team  |  First Published Oct 23, 2020, 3:20 PM IST

రంగరాజు పద్మజ అమ్మ... ఒక తంగేడు పూల జ్ఞాపకం అనే కథ రాశారు. అతి మార్దవమైన శైలిలో, పురాతన కథలను ప్రాతిపదికగా తీసుకుని ఆమె ఈ కథ రాశారు. చదవండి.


బీరువా తెరిచి చూస్తున్నాను. కంచిపట్టు, గద్వాల, ఆరణి, కశ్మీర్ సిల్కు, పోచంపల్లి, బెనారస్,కోటచీరలు, బెంగాలీ కాటన్, పల్లవి కాటన్, వాయిల్ చీరలు,షిఫాన్ రా సిల్కు.... ఒక్కటేమిటి... అరల నిండా రకరకాల చీరలు.... ఆ చీరలోని ఒక చీర తీసి కట్టుకుందామని బ్లౌజ్ తీసి తొడుగు దామంటే మోచేయి వరకు కూడా ఎక్కడం లేదు.. చాలా సంవత్సరాలుగా కట్టని చీరలు ఎన్నో ఉన్నాయి... అలా ఆ చీరలు చూస్తుంటే అమ్మ గుర్తుకు వచ్చింది.
    
అప్పుడు నా వయసెంతో గుర్తులేదు కానీ, బతుకమ్మ పండగ అని గుర్తు ఉంది. మా ఊర్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న మా జ్ఞాతుల ఇళ్లల్లో ఉన్న ఆడపిల్లలందరూ పండక్కు వచ్చారు. కొత్త బట్టలు కట్టుకొని హడావుడి చేస్తున్నారు...
 
 అమ్మా! నేను ఏం చీర కట్టుకోనూ ? అని అడిగితే... ఒక నీలం రంగు  కంచి పట్టుచీరకు ఎరుపు రంగు బార్డర్ ఉన్న చీర ఇచ్చింది... తొమ్మిది గజాల చీర అది..  దాన్ని ఎలా కట్టుకోవాలో తెలియడం లేదు... చివరకు ఎట్టాగో అట్లా కట్టుకొని బతకమ్మ ఆడడానికి బయలుదేరుతున్నాను.
    
అమ్మ కూడా నెమలి పింఛం రంగు పట్టుచీర కట్టుకున్నది. నాయనకు బొట్టుపెట్టింది. గడపకు బొట్టుపెట్టి... మజ్జిగ నాయన బొజ్జకు రాసి, చిన్న బతుకమ్మ మంగళ హారతి పట్టుకొని నేనూ,  వ్యవసాయపు నౌకరు పెద్ద బతుకమ్మ నెత్తిన పెట్టుకొని ముందు నడుస్తుంటే... ఫలహారాలు మూట, పసుపు కుంకుమ ఉన్న పంచపాళి పట్టుకొని అమ్మ నడుస్తుంటే అమ్మకు పనిలో సహాయపడే లక్ష్మమ్మ  అన్నది కదా!

అమ్మా! నేను ఇప్పుడే చెరువు కట్టకింద ఉన్న చలమ బాయికాడ  అందర్నీ ఒక పాలిచూసొచ్చిన!  అందరూ పట్టు చీరలు, మస్తు సొమ్ములు పెట్టుకొని వచ్చిన్రు అమ్మా!
    
అందరికంటే మీరు శానా బాగున్నారు అమ్మా! అని అన్నది లక్ష్మమ్మ.
   
చాలు సంబడం!  ఇవాళ నీకేమో కవిత్వం వస్తున్నది అని అన్నది అమ్మ!
    
అవును అమ్మ చాలా ఎత్తు.. ఎత్తుకు తగిన లావు ఉండి చామనచాయగా ఉన్నా కూడా కళ గల మొహంతో వెలిగిపోతుంది. ఒక్క లక్ష్మమ్మే కాదు.
మా ఊరిలో చాలామంది మాట అంటారు.
   
ఆ వయసులో అమ్మ అందం గురించి నాకు అంతగా తెలియదు.. కానీ రాను రాను నా హృదయ పరిణితి పెరిగిన కొద్దీ అమ్మ ఆ ఆకర్షణ ముఖం వెనుక మంచితనం యొక్క రిఫ్లెక్షన్( ప్రతిబింబం ) కనపడేది.
   
ముఖంలో,నడకలో, పనిలో ఏదో ఒక ప్రత్యేకత కనబడేది.
   
అవును నాకు ఇన్ని చీరలు బీరువా నిండా ఉన్నాయంటే... నాకే కాదు నా కుటుంబ సభ్యులందరికీ ఉన్నాయంటే దాని వెనుక మా అమ్మ వితరణ గుణం  కారణం అనిపిస్తుంది.
  
చిన్నప్పటి నా దినచర్య గుర్తుకొస్తే నవ్వొస్తుంది. నేను బడి నుండి ఇంటికి రాగానే నాకు చాయ్ గ్లాస్ఇచ్చి,  చాయ్ తాగిన తర్వాత  మేర యాకయ్య ఇంటికి పోయి నేను కుట్టమని చెప్పిన  పుట్టు కూసాలు (అప్పుడే పుట్టినపిల్లలకు తొడిగే జుబ్బాలు) కుట్టాడా? కుడితే ఇవ్వమని అడిగి తీసుకొని రా! అని చెప్పేది. నేను నోటిమీద చెయ్యి పెట్టి... రైలు కూత వలె కూ...కూ.. కూత పెడుతూ  పరిగెత్తే దాన్ని... యాకయ్యా! అని గట్టిగా అరుస్తూ... అమ్మ ఇచ్చిన పుట్టు కూసాలు కుట్టినావా? కుడితే ఇవ్వు ! అని అరిచేదాన్ని.... మేర యాకయ్య ఒక ఆరు ఏడు జుబ్బాల వంటివి తెల్లటి గ్లాక్సో బట్టతో  కుట్టిన ఆరు ఏడు కుచ్చులు పెట్టి అందంగా కుట్టిన కుళ్ళాలు

ఆ జుబ్బాలతో  కట్టకట్టి ఇచ్చేవాడు.
    
అవి నేను పట్టుకొని ఇంటికి వచ్చేసరికి వాకిట్లో ఎవరో  ఒక ఆమె చిన్న పిల్లవాడిని అడ్డ పాపగా ఎత్తుకొని నిలబడి ఉన్నది. ఆమె పచ్చి బాలింతని ఆమె కట్టుకున్న నడికట్టు చీర, చెవిలో దూది, కాళ్లకు చేతులకు పసుపు నూనె రాసినట్టు కనిపించింది. నన్ను చూడగానే అమ్మ ఇంత ఆలస్యం ఏంటిది? యాకయ్య ఇల్లు పక్కనే కదా! అని  పాపం కాంతమ్మ నిలబడి చాలాసేపు అయింది. అని నా చేతిలోని బట్టల చుట్ట తీసుకొని లోపలికి వెళ్లి, అందులో నుండి ఒక జుబ్బా,దోశెడు  బియ్యం, ఒక ఎల్లిగడ్డ, కొబ్బరి కుడుక, నూనె తెచ్చి ఆ బాలింతకు ఇచ్చింది. బాలెంత వెంట వచ్చిన అత్తనో అమ్మనో  ఒక ముసలామె .. దొరసానీ ! దండం పెడుతున్నా! నీ కడుపు సల్లంగుండ" అని వెళ్ళింది.
     
దాదాపు ఇది అప్పడప్పుడు జరిగే సాధారణ దృశ్యం. "నీ కడుపు సల్లంగుండ" అంటే ఆ పదం అర్థం తెలుసుకోవడానికి నాకు 30 ఏళ్లు పట్టింది. ఓహో! అమ్మ కడుపు... అంటే అన్నయ్యలు, అక్కయ్యలు, నేను , తమ్ముడు అన్నమాట ! ఆ ముసలమ్మ మా అందరినీ బాగుండాలని దీవించింది అన్నమాట. అది కూడా ఏదో మాటవరసకు కాకుండా.... ముఖమంతా సంతోషంతో... తృప్తితో అన్నమాట... అంటే మా అమ్మ ఎంత పుణ్యనిధిని(  బ్యాంక్ ఆఫ్ పుణ్యం) మాకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వెళ్లిందో కదా! అని అనుకున్నాను అందుకే నాకు ఇప్పుడు బీరువా నిండా... తలుపు తీస్తే చాలు బిల బిల బిల కింద పడేన్ని  బట్టలు, మా అందరి పిల్లలు అందంగా, ఆరోగ్యంగా, విద్యావంతులై ప్రయోజకులై  అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు అనిపిస్తుంది.
   అవును దానగుణం పుట్టినప్పుడే వచ్చే స్వభావ గుణం. అది ఒకరిని చూసి అనుకరిస్తేనో, ఒకరు చెప్తేనో రాదు... మా అమ్మ ఎంత ముందుచూపు ఉన్నదో ఆమె పెట్టిన దోసిళ్ల బియ్యం తరతరాలుగా తరగని అన్నం మా పిల్లలకు... ఎవరో అజ్ఞాత ఆడవాళ్ళు పెట్టిన దీవెనలు మా అందరికీ...

Latest Videos

undefined

అమ్మ అంటే మేము తినే అన్నం... అమ్మ అంటే మేము కట్టే బట్ట... అమ్మ అంటే మా ఇంట్లో ఉన్న ధాన్యం... అమ్మ అంటే ఆమె చేసిన దానం, ధన రూపంలో మా ఇంట్లో... అమ్మ అంటే  ఇతరులను సంతోష పెట్టి... మాకు సంతోషపు మూటలు కట్టి ఇచ్చిన ఒక అందమైన రూపం... ఆమె నల్లగా ఉంటే నేమి? చామనఛాయ అయితే నేమి? ఆమె మనసంత అందం ఉంటే  ఒక కృష్ణుడికి మాత్రమేఉండొచ్చు. అంత అందమైన మనసు యొక్క వెలుగు ఆమె ముఖంలోను, శరీరం నిండా వ్యాపించి, కవులు వర్ణించే అందం అంతా ఆమె అందంలా కనిపించేది...
    
ఆమెకు ప్రతిదీ ఎవరికో ఇస్తేనే ఆమెకు సంతోషం... చాలామందికి డబ్బు దాచుకుంటే ఆనందం... ఆమెకు పంచుకుంటే ఆనందం.... మాటల్లో సాయం, పనిలో సాయం, విత్తంలో సాయం, విత్తనంలో సాయం... ఎంత అంటే...  మేము దుర్మార్గులుగా మారి, అమ్మా! ఎంతకని  ఇలా దానాలు చేస్తావమ్మా? చేసిన దగ్గరికి చాలు అని విసుక్కునే దాకా... పచ్చివి... ఎచ్చివి అన్నీ దాతృత్వమే !
    
అమ్మా ! ఎప్పుడూ నీ చేతల పచ్చిదనం... మా మనసులో ఎప్పుడూ పచ్చిగానే( ద్రవి స్తూ) ఉంటాయ్ అమ్మా! నీ జ్ఞాపకాలు....
  
ఇంకొకటి చెప్పకుంటే సగం చెప్పినట్టే ఉంటుంది...

కడుపు నొప్పి అనో, కాలు నొప్పి అనో, తలనొప్పి అనో ఎంతమంది పొద్దున్నే వచ్చినా, అటు..వంటకూ, పూజకు ఆలస్యమవుతున్నా... ఆ మందుల కాంబినేషన్లు కలిపి, పొట్లాలు కట్టి, వాళ్ళకి ఇచ్చి, ఒక డోసు అప్పుడే  నీ చేతుల మీదుగా వేసి, వేడినీళ్లు కాచి ఇచ్చి... ఎన్ని సేవలు చేసే దానివమ్మా... అవన్నీ ఊరికే పోయాయా? లేదమ్మా లేదు... మాకు ఆరోగ్యం అనే బిక్షగా  మళ్లీ మా ఇల్లు చేరాయి అమ్మా !
   
అక్షయ పాత్రకు సాతాని నంబెరుమాళ్ళు  వస్తే నీ దోసిలి బియ్యం ఆయన అక్షయ పాత్ర సగం నిండేదమ్మా !
     
ఆ అక్షయపాత్ర ఫలితమే ఈనాడు దేశవిదేశాల్లో అందరూ కడుపునిండా తిని, దానం చేసే స్థాయిలో అక్షయపాత్రై కూర్చున్నదమ్మా!
     
పాము కాటు, తేలు కాటు వైద్యాలు... మాకు విష పురుగుల నీడ కూడా కనపడకుండా చేసింది అమ్మా!

ఒక తరం గడిస్తే తప్ప.... మంచితనం అర్థం కాదమ్మా!

నువ్వు ఉన్నప్పుడే... ఇవన్నీ నీతో చెప్తే ఎంత బాగుండు. అప్పుడు అవన్నీ పిచ్చి పనులు గా తలచామమ్మా !
   
ఏ కమ్యూనిస్టు సిద్ధాంతాలు చెప్పని సమతా సిద్ధాంతం నీవు ఆచరించి చూపావమ్మా! కన్నవారికి,పెంచిన వారికి, చదువుకోను వచ్చిన వారికీ, అతిధులకూ, అభ్యాగతులకు అందరికీ ఒకే తీరు భోజనం సహపంక్తిలో.... అదే తీరు భోజనం చాకలి, మంగలి, నౌకర్లతో సహా ! అక్షరమే  తెలియని నీకు అమ్మా ! ఇన్ని సిద్ధాంతాలు, దాన,దయా,ధర్మగుణాలు ఎవరు నేర్పేరమ్మా ? మీ అమ్మేమో అతి పసివయసులో ఆ దేవుడిని చేరింది... నువ్వు పెరిగిందంతా పరుల పంచలో.... అతిపెద్ద కుటుంబ భారం... అతి పిన్నవయసులో ఎలా నిర్వహించావమ్మా ?  అదీ అందరి మన్ననలు మెప్పులతో...

నీ వయసుకన్నా పెద్దవారంతా నీకు సాష్టాంగ  నమస్కారాలు చేస్తూ ఉంటే మీ గొప్పదనం ఎందుకు అర్ధం కాలేదమ్మా?మాకు.
   
 భారత పఠనంలో కర్ణుడి లో నిన్ను చూస్తున్నాను..

బలిచక్రవర్తిగా భావిస్తున్నాను... శిబిచక్రవర్తికి చెల్లెలు వేమో అనుకుంటున్నాను...
    
అమ్మా !  ఎంతసేపే ? బట్టలు మార్చుకుంటానని బీరువా తీసి నిలబడి గంట సేపు అయింది అన్న నా బిడ్డ పిలుపుకు... ఆలోచనల నుండి ఇవతలకు వస్తే

ఏమైంది అని? అడిగితే ఇదంతా నా బిడ్డకు చెప్తే...  నాకు తెలియని విషయాలు మరికొన్ని చూడికుడు తక్కయ్య చెప్పింది.  అవి ఏంటంటే...
కంసాలి రామబ్రహ్మం కు ఒక్కసారే  వడ్లకళ్ళంలో ఒడ్లు కొలిచి...  అతనితో హనుమంతుని రాగి , వెండితో మూర్తి ఉన్న బిళ్లలు  తయారుచేయించి, అమ్మ  ఆ హనుమంతుని బిళ్ళకు పాలాభిషేకం చేసి, గాజుల నాగమ్మ దగ్గర మొలతాళ్ళు కొని, దొరసానీ! పిల్లవాడికి ఒళ్ళు వెచ్చబడ్డది ( జ్వరం వచ్చిందని)  వాంతులు, విరేచనాలు అవుతున్నాయి... గాలి సోకిందో ఏమో అమ్మా! అని మా ఇంటికి వస్తే... అమ్మ హనుమంతుని బిళ్ళ, మొలదారంతో కట్టి ఆ పిల్లవాడి మెడలో వేసేదట. రెండు రోజుల తర్వాత పిల్లవాడిని చంకలో వేసుకుని వచ్చి... మీ ఇంటికి వచ్చే దాకా  పిల్లవాడు మూసిన కన్ను తెరువలేదు... చన్ను నోట్లో పెట్టలేదు... పిల్లవాడి ఒంటినిండా దద్దులు ఉండే అమ్మ!అన్నిమాయమైనట్టు  పోయిందమ్మా అని చెప్పే దట....
   
బిక్కం సాయెబు  దగ్గర తాయత్తులు తెప్పించి ఇచ్చే దట అందరికి వాడికి కూడా వడ్లు కొలవడమే... అమ్మ ఇంకొక దొడ్డగుణం చెప్పకుంటే అసంపూర్తిగా ముగిసినట్టే...
    
ఆ కాలంలో సినిమాలూ వగైరాలుండేవి కావు. సరదాలకు నాటకాలు మాత్రమే గత్యంతరం.. అలా ఊర్లోకి సురభి నాటకసమాజం, శారద నాటకసమాజం వచ్చి నెలల తరబడి  చుట్టుపక్కల ఊళ్ళల్లో నాటకాలు వేస్తూ... ఇనుగుర్తిలో మకాము  పెట్టేవి.  సురభి నాటక సమాజం ఇనుగుర్తికి వచ్చినప్పుడు... అందులో స్త్రీ పాత్ర వేసే అబ్బూరి కనకమ్మ వెంట ఆకతాయి గుంపు వెంటపడి అల్లరి చేస్తుంటే... ఆమెను తన ఇంట్లో ఒక గది ఇచ్చి రక్షణ కల్పించింది... ఆమె దృష్టిలో ఆమె నాటకసమాజానికి చెందిందా? కులమా ?గోత్రమా? అనే ఆలోచన లేదు.

ఒక ఆడపిల్ల.... ఆ అమ్మాయికి రక్షణ కల్పించడం తనవంతు బాధ్యతని మాత్రమే ఆమె దృష్టి... ఇది ఎంత మందికి ఉంటుంది?  ఈ విషయం కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు.... దయామతి అక్కయ్య వివరించి చెప్పేదాకా...
    
ఇటువంటిదే ఇంకొక సంఘటన... ద్రౌపది పాత్రదారి నాటకానికి వేషం వేసుకొని తయారై బయటికి వచ్చేసరికి... అమ్మ చూసిందట... ఆమె ద్రౌపది  పాత్ర కదా!  కానీ కట్టుకున్న చీర వెలసి పోయి, పాతబడి వెలవెలబోతున్నదట... నువ్వు ఎన్ని పద్యాలు చదివినా... నాటకం రక్తి కట్టదు

... రాణించదు ఈ చీర కట్టుకో !అని వెంటనే తన పట్టుచీరలలో నుండి ఒక పట్టుచీర ఆమెకు ఇచ్చి కట్టుకోమన్నదట.. ఆ చీర కట్టుకున్న తరువాత ఆమె అచ్చు ద్రౌపతి వలెకనిపించిందట...
ఆమె నాటకం నుండి వచ్చి చీర తిరిగి అమ్మకి ఇవ్వబోయిందట... కానీ వద్దు! నువ్వు నాటకాలు వేసే దానివి... నీకు ఉండాలి! నీ దగ్గరే ఉండనీ అన్నదట... ఎంతో కృతజ్ఞతగా నమస్కరిస్తూ వెళ్లిపోయిందట.
     
మా ఆడబిడ్డ కొడుకు పెండ్లికి నేను కోదాడకు వెళ్ళాను.సాయంత్రం నుండి 'ఎదురు కోళ్ళ ' ఉత్సవం చాలా హడాహుడిగా ఉంది.అప్పుడు నేను కూర్చున్న చోటికి ఒకరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు.నన్ను చూస్తూ ఎంతో ఆప్యాయంగా " మాది ఆకు పాముల ఊరు నేను రాఘవ రంగారావు గారి సెడ్డకుడి కుమారుడిని నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారి ఆత్మీయత ఇప్పటికీ మరచిపోలేను. మీరు ఈ పెళ్ళికి తప్పక వస్తారని మిమ్మల్ని కలవాలని అనుకున్నాను.మిమ్మల్ని నేను చూడలేదు.మిమ్మల్ని ఎలా గుర్తు పట్టాలంటే పెళ్ళి కూతురు తండ్రి హనుమంతరావు గారు మిమ్మల్ని పరిచయం చేస్తానని నన్ను చూడగానే గబగబా వచ్చి మిమ్మల్ని పరిచయం చేశాడు.అని చెబితే అసలు నాకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. కానీ ఆయన మనసు నిండా అమ్మ పట్ల ఆరాధన భావం ఉందని గమనించాను.ఆ రోజంతా వారి కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ... ఎక్కువ సమయం నాతో గడిపారు.అంత పెద్దాయన నన్ను అలా గౌరవిస్తూ ఉంటే నాకెలాగో ఉంది.కానీ అమ్మను నాలో చూసి తృప్తి పడుతున్నారని గ్రహించాను.అమ్మ ఆత్మీయత అలా ఉండేది.
    
అదీ !  అమ్మంటే!  శతకోటి వందనాలు అమ్మకు!

- రంగరాజు పద్మజ

click me!