మన మాతృ భాష పైన పరాయి భాష చేస్తున్న దాడి, దాని పర్యవసానాలపై ఒబ్బిని రాసిన ఆసక్తికరమైన వ్యాసం ఇక్కడ చదవండి:
మనుషులు లేక పోతే భాష లేదు. భాష లేకపోతే మనుషులుండరు. భాష లేనిదే భావం లేదు. భావం లేనిదే కవనం లేదు, కార్య రంగం లేదు. అసలైన ఆత్మ మాతృభాష. ఇంకో భాష ఏది నేర్చుకున్నా అది రెండో స్థానంలో ఉంటుంది తప్ప మొదటి స్థానం మాతృభాషదే. “మాతృ భాషలో రచనలు చేసిన రచయితలు ఆ జాతి సాహిత్య సంపదను పరిపుష్టం చేస్తారు “జోష్ సరమాగో (1998 నోబెల్ బహుమతి విజేత).
“తెల్గు మాట్లాడోస్తుందో లేదో / నోర్లొంకర్లు పోతానయో ఎమో . అని “.....తెల్గోన్వని/ నీ పేరాజ్జేయ్యటాన్కోచ్చింది.”- దేవరాజు మహారాజు (ఊగా దుర్కొచ్చింది ) - ఈ పంక్తులు ఒక భాష మాట్లాడే జాతి సంస్కృతికి ఆనవాలు. ఆయా భాషలకి ఆయా పండుగలు, ఆచారాలు, నుడికారాలు, సామెతలు జీవన వ్యవహారాలు అనుసంధానించబడి ఉంటాయి. ఆ విధంగా ఒకానొక భాష కనుమరుగు అవుతుందంటే, ఆ భాష మాట్లాడే జాతి అంతరించుతున్నట్లే లెక్క. సమకాలీన కాలం భాషల అస్థిత్వాలకి చాలా ప్రమాదకారంగా మారింది. ఈ నేపధ్యంలో పలు రకాల చైతన్యాలతో పరి రక్షణ సంఘాలు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రముఖ స్థానాల్లో ఉన్నవారు కూడా తమ తమ అభిప్రాయాలూ మాతృ భాష పరిరక్షణలో భాగంగా వెలిబచ్చుతున్నారు. ఓ వార్తాంశాన్ని ఇక్కడ చూద్దాం.
“…………నేను అమెరికా వెళ్లినప్పుడు వివిధ కుటుంబాలను పరామర్శించే అవకాశం కలిగేది. తెలుగు కుటుంబాన్ని కలిసినప్పుడు అక్కడ చాలా సంతోషకరమయిన దృశ్యాన్ని చూశాను. కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రి భోజనం చేయాలని, భోజన సమయంలో తెలుగు భాషలో మాత్రమే మాట్లాడాలని నియమంగా పెట్టుకున్నట్లు వారు చెప్పారు. అక్కడ పుట్టిన పిల్లలుకు కూడా ఇదే నియమం. మాతృభాషపై ఉన్న ఈ ప్రేమ కారణంగా ఆ కుటుంబం నన్ను ఎంతగానో ప్రభావితుడుని చేసింది అని ప్రధాని గుర్తు చేసుకున్నారు……..”
ద్రవిడోద్యమం మాతృభాషని ఆయువు పట్టుగా చేసుకొని నడుస్తుంది. అప్పుడప్పుడు అతి స్వార్ధంతో అది పైచేయిగా ఉండాలని కూడా చేస్తుంది. ఆధిపత్య రాజకీయం నడపాలని కూడా చూస్తుంది. ఆ ఉద్యమం రాజకీయ పార్టీలతో జట్టు కట్టి కొత్త రాజకీయ కూటమి ఏర్పరచుకొని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉబలాట పడుతున్నా మన తెలుగు రాజకీయ నాయకులు, తమ మాతృభాషని మాత్రం కూకటి వేళ్ళతో పెకిలించడానికి కంకణం కట్టుకుంటున్నారు. ప్రైవేట్ కి ధీటు గా ...అంటూ, పైచేయిగా ఉండాల్సిన పాలక వ్యవస్థే, బలహీన స్వరాన్ని అందిస్తున్నారు. ఆత్మ న్యూనతా భావాలని వ్యక్తపరుస్తున్నారు.
అసలు విధానాలే పాలనకి పునాది అని, విధానాలతోనే ప్రజల రకరకాల సంక్షేమం ముడిపడి ఉంటుందని మర్చిపోయి వ్యవహరించడం జరుగుతుంది. మూడు దశాబ్దాలుగా వ్యక్తి సంపదని పెంచే విధంగా, సామాజిక మనుగడని క్షీణింపజేసే విధంగా ప్రపంచీకరణ వాణిజ్య విధానాలతో ఇక్కడ పాలన సాగుతుంది. స్వాతంత్ర్య పోరాటాల స్ఫూర్తి, ఆదర్శాలు అడుగంటిస్తున్నారు. వ్యవస్థాపరంగా ప్రభుత్వ రంగంలోని సంస్థలు సాధించిన సంపదని, ఇప్పుడు కొందరు వ్యక్తుల చేతుల్లోకి ధారబోయడం జరుగుతుంది. ఆ ప్రభుత్వ రంగంలో నియమితమైనవారు అందరూ తమ తమ మాతృభాషల్లో చదువుకొని వచ్చిన వారే. అలాగే మన తెలుగు వారైన భారత ప్రధాన న్యాయమూర్తి, భారత ఉపాధ్యక్షులు సందర్భానుసారంగా వాళ్ళ మాతృభాష నేపధ్యాన్ని కొనియాడుతూ ఉపన్యసిస్తున్నారు కూడా .
అలాగే నేటి కాలంలో ఎక్కువగా స్థానికత అంశం ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నాయి. నూటికి 90 శాతం దాకా స్థానికులకే రిజర్వేషన్స్ అన్న నినాదాలతో పరిమిత జీతాల ఉద్యోగాలవి. ఈ పరిమిత జీతాల ఉద్యోగులంతా స్థానిక భాషలలోనే మచ్చిక అయి ఉంటారు. ఈ రకం ఉద్యోగాలు కూడ ఉన్నత చదువుల ప్రాధాన్యతగాని, ఉన్నత సాంకేతిక ప్రావీణ్యతగాని అవసరం లేనివి. అలాంటప్పుడు స్థానిక ప్రజల తల్లి భాషలని వాళ్ళకి దక్కకుండా జేయడమంటే అసలు ఊహకే అందని దాష్టీకంగా ప్రజల అనుభవానికి వస్తుంది. అయిన ఇప్పుడు నడుస్తున్న ఆర్ధిక వ్యవస్థలో ఎక్కువ చిల్లర ఉద్యోగాలే సంతరించుకుంటున్నాయి. అయినా కూడా అభివృద్ధి చెందిన నేటి సాంకేతికత కూడా మాతృభాష రక్షణలో సహాయకారిగానే మసలుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే అన్ని రకాల , ఆఖరికి కళా రంగాలతో సహా ఘనా వ్యాపార వర్గాలు తమ దృష్టిని స్థానిక భాషల మీద ప్రసరిస్తున్నాయి. అలాంటప్పుడు అధికారంలో ఉన్న వ్యవస్థకి వెసులు బాటు ఎక్కువగా ఉంటుంది తల్లి భాషలని కాపాడడంలో.
ఈ మధ్యనే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తమిళ భాషకి పట్టం కట్టే భాగంగా మధురైలో ఓ మహా గ్రంధాలయాన్ని నిర్మించ తలపెట్టారు. ఈ చర్య వాళ్ళ మాతృ భాషకి సమర్పించే ఘన నైవేద్యంగా చెప్పుకోవచ్చు. అయినా మనసున్న మనుషులు ఎవరూ తమ మానాలు అవమానించబడుతుంటే చూస్తూ ఊరుకోరు గదా. పౌరషాగ్ని రగులుతుంది కదా. ప్రపంచీకరణ నేపధ్య మార్కెట్ స్వభావాల మూలంగా ఈ మానాభిమానాలు కూడా మూగబోతున్నాయా అనిపిస్తుంది. వర్తమాన దృశ్యాలని అవలోకించినట్లైతే, తన బిడ్డలందరికి సమానంగా దక్కాల్సిన భూదేవి సహజ సంపద అంతా - ఖనిజాలు, బొగ్గు, నీరు, గ్యాస్, తైల ఇంధనాలు , ఇలా మరికొన్ని – ఆరబోసిన ధాన్యాలని, పంటలని అదే పనిగా కొన్ని పక్షులు తినేస్తున్నట్లుగా, మన కళ్ల ముందే చూస్తున్నాము. ఆ చర్యలకి ప్రతి చర్యగా కనీసం గొంతుతో అదిలిస్తాం గదా. కనీసం అందుకోసమైనా మనకు గొంతులు కావాలి కదా. భాషల లోగిళ్లు గొంతులు మనం నిలుపుకోవాలి కదా. మానాలు నిలిబడేది మన తల్లి భాషలతోనే. అలాగే జాతుల గుర్తింపు కూడా . ఆచారాలు, ఆదాయాలు, జ్ణానాలు, యజ్ణాలు, సంస్కృతి సంప్రదాయాలు, విలువల వలువలు అన్నీ కూడా మన మాతృభాషలతోనే సాధ్యం.