రాజనీతి శాస్త్రంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న నీలిమ హైదరాబాద్ నుండి వంశీ కృష్ణ కవిత్వం 'రెప్ప వాలని రాత్రి' పై రాసిన ఆసక్తికరమైన సమీక్ష ఇక్కడ చదవండి.
కొంత నిరాశ, ఇంకొంత నిర్వేదం, మరికొంత వైరాగ్యం;
కొన్ని సుఖాలు, ఇంకొన్ని ఆనందాలు, మరికొన్ని ప్రేమలు; కొన్ని ధిక్కారాలు, కొన్ని తిరస్కారాలు, మరికొన్నిభావావేశాలు; ఇవన్నీ ఒకచోట కుప్పపోస్తే అదే వంశీ కృష్ణ కవిత్వం. ఇది వంశీ ఆరవ సంపుటి. దీనిని చదివితే మనకు కలిగే భావాలివి. అందుకేనేమో వంశీ కవితా వాక్యం బహుళ వ్యక్తీకరణలు అని నారాయణ శర్మ గారు అన్నారు.
ఆర్ధిక సంస్కరణలు లాటిన్ అమెరికాలో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాయో, అవి భారత దేశంలో ఎలాంటి ప్రకంపనలు కలిగించబోతున్నాయో 'డబ్బు పిట్ట', 'మీనింగ్స్'లలో కవిత్వం మాధ్యమంగా బలంగా వివరించిన వంశీ మధ్యలో 'కొన్ని నేను' లలో ఒక కొత్త కవిత్వాన్ని రాసాడు. 'ఒక దేశం రెండు పద ప్రయోగాలు' అంటూ ప్రయోగ వాద కవిత్వమూ రాసాడు. ఇప్పుడు 'రెప్ప వాలని రాత్రి'. ఈ ఆరు సంపుటాలు దేనికదే ప్రత్యేకం. రిపిటేషన్ ఉండదు. భాషలో కొంత బర్డెన్ ఆఫ్ సాంస్కృట్ ఉన్నప్పటికీ అది వస్తువును అనుసరించే ఉంటుంది. తన మొత్తం కవిత్వాన్ని చదివినప్పుడే ఈ విషయం అర్థం అవుతుంది. డబ్బు పిట్టలో భాష రెప్ప వాలని రాత్రి భాష ఒకేలా ఉండదు. మీనింగ్స్ భాష కొన్ని నేనులు భాష ఒకేలా ఉండదు. తరచి చూస్తే భాషతో తను చేసే ప్రయోగాలు అవగాహనలోకి వస్తాయి. ఇంతకీ ఈ కవిత్వంలో వంశీ ఏం చెప్పాడు ?
తన కవిత్వంలో ఒక తాత్విక చింతన ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే జె కే. రమణ మహర్షి, నీషేల చింతనా సారాన్ని కలేజ్ చేసినట్టు ఉంటుంది. ఉపమ అంటే నా కిష్టం లేదు విరోధా భాస పైనే నా మక్కువ అని అంటాడు అందుకే. అయితే అది తాత్విక గందరగోళం కూడా కాదు. లోపల ఉండ చుట్టుకుని ఊండ్ లా సలపరించే అశాంతి వేదన. అందుకేనేమో ఇలా మనల్ని
కోర్కె లేని శరీరాన్ని ఎప్పుడైనా చూశారా?
కాంక్ష లేని హృదయాన్ని ఎప్పుడైనా కన్నారా?
ఈప్సితమనే అంతర్యుద్ధాన్ని
జయించిన మనిషిని ఎప్పుడైనా విన్నారా?
అంటూ అంతులేని వైరాగ్యంలోకి నెట్టేస్తాడు.
అంతలోనే
పరిమళింపు విరుల రెక్కలు కట్టుకుని
గిరులు దాటి పయనించే తరువుని చూస్తే
జీవితంలోని ఏ దుఃఖ సముద్రాన్నయినా అలవోకగా దాటవచ్చని జీవితంపై అంతులేని ఆశని పుట్టిస్తాడు.
అందుకే వంశీ కవిత్వం ఒక వైరాగ్యం, అంతలోనే అంతులేని ప్రేమ.
.....
మళ్లీ అంతలోనే
అవున్లే
నీకు మాత్రం ఏం తెలుసు
ఇంటి మీద తెల్ల తోలు తప్ప మరేమీ లేదు కదా
గొంతు మీద కాలేసి తొక్కటం తప్ప
పాల్ రాబ్సన్ సంగీతమో
బాబ్ డైలాన్ గీతమో
మార్టిన్ లూథర్ కింగ్ జ్ఞానమో
నీకెప్పటికీ అందని చందమామే కదా -
అని జాతి వివక్షత మీద తన ధిక్కారాన్ని ప్రకటిస్తాడు. అందుకే వంశీ కవిత్వం అణచివేతపై ధిక్కారం.
ఇకపోతే -
ఇసుకలో కట్టిన పిచ్చుక గూళ్లు
పెరటి చెట్టు ఏకైక జాంపండుకీ చేసిన కాకి ఎంగిళ్లు
మిత్రుడితో ఆడుకున్న వంగుడు దూకుళ్లు
ఎప్పుడు గుర్తొచ్చినా గుండె పట్టని జ్ఞాపకాల చలి నెగళ్లు
(తలుపు తీసి)
నీ అణువణువునూ నాలోలోన నింపుకోవాలన్న
నీ అణువణువులో నేను నిండి నిలిచి పోవాలన్న
ఆదిమ అనాది కాంక్ష ఏదో నన్నొక ఉన్మత్తుడిని చేసింది
( మొదటిసారి నిన్ను చూసాక)
ప్రతిరోజూ ఒక సతత హరితారణ్యాన్ని సృష్టించి
హృదయ స్పందనలు కోల్పోయిన
ఎడారి సమాజానికి కానుకగా ఇస్తాడు ( అతడు కవి)
ఈ కవితలు చదివాక ఒక్కసారిగా వంశీ కవిత్వం ప్రాకృతిక సౌందర్యంలోకి పారిపోయినట్టు అనిపిస్తుంది. కానీ అది పారిపోవడం కాదు. మనిషి ప్రకృతిలో ఒక భాగం కనుక తన దుఃఖంలో ప్రకృతిని సంలీన పరచుకోవడం అది.
.......
ఇక ఈ కవితా సంపుటిలో నన్ను బాగా ఆకర్షించిన అంశం విభిన్న వస్తువులని ఒకే జానర్లో చెప్పటం (నిద్ర పట్టని ఒంటరి రాత్రి). ఒకే వస్తువుని వివిధ జానర్లలో చెప్పటం(వాన,కార్తీక). ఈ విషయంలో వంశీ ప్రతిభ అనన్య సామాన్యం. ఈ సిరీస్ లలో వంశీ భావ కవిత్వపు అంచులని మనం చూస్తాం.
తోవ ఎక్కడ సోనియా అన్న సత్ సంశయము. లోపలి దుఃఖానికి లోపలే సాంత్వన వెతుక్కునే అంతర్ ముఖత్వము రెండూ ఉంటాయి. నిద్ర పట్టని ఒంటరి రాత్రి సిరీస్ లో ఈ దుఃఖ చాలనం మనం చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రపంచీకరణ తర్వాత ఆర్థిక పరిణామాల నేపథ్యంలో కవిత్వం రాసిన తొలి సృజన కారులలో వంశీ ఒకరు. అందుకే ఆ భావ జాలాన్ని ఒదులుకోలేనితనం రెండు మామిడి పళ్లు, యుద్ధం నా భాష కాదుల రూపంలో మనకి అంతర్లీనంగా కనపడుతుంది.
తెలుగు కవిత్వం భవిష్యత్ లో తిరగ పోయే హరిత మలుపుకి కవి ఈ 'రెప్ప వాలని రాత్రి' తో దారి వేస్తున్నాడు అనుకోవచ్చేమో.