ఊరంటే ఉత్త ముచ్చట కాదు. తాళపత్ర గ్రంథమని నామాల రవీంద్ర సూరి తన కవితలో చెప్తున్నారు. చదవండి.
అన్ని సినిమాలు ఒకలా ఉండనట్టుగానే
అన్ని ఊర్లు ఒకలా ఉండవు
ఊరు ఊరుకో పేరు
పేరు పేరుకో చరిత్ర
మా ఊరి చరిత్ర ఎవరో రాసింది కాదు
ఎవరికి వారు శిల్పులై చెక్కుకున్నారు
-- అదే చిల్పకుంట్ల--
*
ఊరు గూర్చి చెప్పడం అంటే
ఉత్త కూతలు కూయడం కాదు
ఊపిరి పోసిన అమ్మ తో సమానం ఊరు
ఊరంటే....
కన్నబిడ్డల వెచ్చని కౌగిలింతల్లాంటి
పచ్చని జ్ఞాపకాలు
ఊరంటే....
అష్టైశ్వర్యాలు ఉన్నా, అష్ట కష్టాలు పడుతున్నా
ఎప్పటికీ పాతబడని కొత్త జ్ఞాపకం
తోబుట్టువుల అనుబంధం
*
సగం సంతోషాలు
నిండు దుఃఖాలతో
ఊరిలో ఉండలేక
ఎటెటో ఎగిరిపోయారు
రెక్కలొచ్చిన పిల్ల పక్షులు
తల్లిని అంటిపెట్టుకొని ఉంటాయా
ఐదేళ్లు లోపలికి వెళ్లడానికి
నాలుగు దిక్కులు కాపలాకాస్తున్నాడు మనిషి
అందరూ ఉన్నచోట
అపరిచితుడు గానే బతికేస్తున్నాడు
కానీ,
ఊరు ఉన్నచోట
ఉత్సవంలా బతికేయొచ్చని
రేపటి తరానికి ఇదో తాళపత్ర గ్రంధం
*
తరాలు అంతరిస్తున్నా
తల తెగిన తల్లి ముత్యాలమ్మ
కట్ట మొదట్లో ఉండి
ఊరును కన్నబిడ్డలా చూస్తుంది
కొస కట్టలో కంఠ మహేశ్వరుడు
గుడి లేకున్నా ఊరును
గుండెల్లో పెట్టుకు చూస్తున్నాడు
*
ఎన్నెన్ని ప్రయాణాలు చేస్తూనో
ప్రతిరోజు నూతనంగా
నూతనకల్ నుండి మొలకెత్తుతాడు
మా ఊరి సూరీడు
ఆయన పసిడి చూపులకే
పచ్చదనం ప్రణామం చేస్తుంది
*
మాట్లాడే మనసుండాలే గానీ
మన ఊరి మట్టి ముద్దలు
సగం విరిగిన గూనపెంకలు
అలకని గోడలపై మొలిచిన పిడకలు
బొలగానోళ్ల ఈదులు
డొంకలో గుంపుగా వస్తున్న
కోడెదూడల డెక్కలతో లేచిన ధూళి సైతం
గుండె నిండుగా మాట్లాడుతుంది
*
చదువుతోపాటు, సకల తత్వాలు చెబుతూ
రోగాలకు మందులు ఇచ్చి,పత్తెమ్ చెప్పేది
ఊరంతటికీ బుచ్చయ్య సార్ ఒక్కడే..
చిత్రలహరి వస్తుందంటే
ఉప్పల్ సోమయ్య ఇల్లు ఊరయ్యేది
డప్పుకొట్టే బొజ్జ మంగయ్యే
మా ఊరి ఏఆర్ రెహమాన్
చినుకు పడిందంటే
కమ్మరి శంకరికి కంటిమీద కునుకు ఉండదు
కొలిమిల నిప్పారదు
గొంతులో సారా సుక్కాగదు
పనే పని
*
కందాలోళ్ళ ఇంటి ముందు
బాగోతం ఆడుతుంటే
అమాసైనా, అర్థరాత్రైనా
దీపం బుడ్డి ల చీకటి వెలుతురు లో
ఊరంతా ఒక దగ్గర కూర్చునేది
వరుసైన పడుచు పోరగాల్లకు
పరదాల చాటునే తెల్లారేది
కాల్చిన చింత గింజలు
రాత్రిని కళ్ళముందే కరిగిపోయేలా చేసేవి
మరునాడు..
బొంతలు, చాపల తో
ఎక్స్చేంజి ఎదుర్కోళ్ళు గమ్మతుండేది
*
ఏనెళ్ల ఎత్తు మీద కూసోని
ఆకాశం వంక చూస్తే
కొండ మా ఊరికి గొడుగైనట్టు ఉండేది
చేపలకై ఎర్రల కోసం వేట
జెండమర్రే మా రచ్చబండ
డంగు చుట్టూ సీసం గోలీలాట
బుగ్గలు బూరెలయ్యేలా పిన్నీసులాట
పిచ్చి బంతి, ఒంగి దూకుడు
టైరాట, పిక్కలాట
ఉప్పు బస్తా, ఉబ్బేరా
బజారులన్నీ సువ్వాట ఆడుకునేవి
చెరువు నిండి అలుగు పోస్తే అదో ఆనందం
చెరువు ఎండి నెర్రెబాస్తే
జిల్లగోనె కి అదే ఈడెన్ గార్డెన్
*
పండుగకో, పబ్బానికో కాకుండా
ఏకాంతం తొలిచేస్తున్న సమయంలో
దుఃఖపు గుటకను మింగినప్పుడు గుర్తుకొస్తుంది
ఊరంటే మరేమీ కాదు
మనకు జన్మనిచ్చిన అమ్మ అని
ఓట్ల కోసమో, భూమికి ఇచ్చే సర్కారు నోట్ల కోసమో కాకుండా
బువ్వ ముద్ద సరాన పడినప్పుడు గుర్తుకొస్తుంది
ఊరంటే ఇంకేమీ కాదు
మీ ఉనికికి చిరునామా అని,
ఉన్నఊరంటే
నువ్వు ఎదుగుతుంటే సంతోషిస్తుంది
నువ్వు జరిగిపోతే
తన మేని పై నీకు ఇంత జాగా ఇస్తది ...