'కాలం కడుపుతో ఉండి కవిని కంటుంది' అనే నానుడి సరిగ్గా మిట్టపల్లికి సరిపోతుంది. 'కాలికి బలపాన్ని కట్టుకొని' లోకమంతా తిరిగి, సమాజంపై తన బాధ్యతను మరువక సామాజిక మార్పును కాంక్షించే కసి తన సాహిత్యంలో మనకు కనిపిస్తుంది
"గో బ్యాక్ 2020" అంటూ నూతన గేయంతో యువతను ఉర్రూతలు ఊగించడమే కాక యువతీ యువకులను ఆలోచింప జేసిన నయా వాగ్గేయకారుడు మిట్టపల్లి సురేందర్. ట్రెండు ను ఫాలో అవడం కాకుండా ట్రెండ్ ను సెట్ చేస్తున్న దిశాలి. తన రచనల ద్వారా తెలంగాణ యువతను జాగృత పరిచి,తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన కవి నేడు యావత్ భారత పౌరుల బాధను తన కలంతో, కంఠంతో లోకం మొత్తం వినిపిస్తూ,ప్రశ్నిస్తూ,ఆలోచింపజేసేలా రాస్తూ రాబోయే తరానికి వచ్చే కవులకు దిశా నిర్దేశం చేస్తున్న వైతాళికుడు మిట్టపల్లి సురేందర్. రాతి బొమ్మల ఉన్న శివున్నే కాదు రాతి మనసులను సైతం కదిలిస్తూ ప్రపంచ దేశాల్లో ఉన్న భారత పౌరులను దేశ అభివృద్ధి లో భాగంకండని పిలుపినిస్తున్న యువకవి మిట్టపల్లి.
'కాలం కడుపుతో ఉండి కవిని కంటుంది' అనే నానుడి సరిగ్గా మిట్టపల్లికి సరిపోతుంది. 'కాలికి బలపాన్ని కట్టుకొని' లోకమంతా తిరిగి, సమాజంపై తన బాధ్యతను మరువక సామాజిక మార్పును కాంక్షించే కసి తన సాహిత్యంలో మనకు కనిపిస్తుంది. కవులు కేవలం పుస్తకాలు చదవడమే కాక సమాజాన్ని చదువాలి అని చెప్తాడు. తనకు వచ్చే పురస్కారాలను ఎంతో వినయంగా ఇవి వ్యక్తికి వచ్చినవి కావు, కేవలం సాహిత్యానికి వచ్చినవి మాత్రమే అనే వినయాశీలి. ఒక సాహిత్య వేదికలో తన తల్లికి అందజేసిన పురస్కారానికి కన్నీటి పర్యంతమై నాకు ఎంత పెద్ద గుర్తింపు వచ్చినా అది మొత్తం తన తల్లికే దక్కుతుంది అంటూ తనను పెంచి పెద్ద చేసిన తల్లిపై ప్రేమను కురిపిస్తూ 'ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునే' అంటూ ఎంతో ఒద్దికగా చెప్తాడు. 'నవ మాసాలు మోసిన తల్లీ ప్రేమకే నే దూరమా..' అంటూ తల్లి ప్రేమను మన కళ్ళ ముందు సాక్షాత్కరించి కంట తడి పెట్టించి ప్రేక్షకులను దాసోహం చేసుకున్న కవివర్యుడు. వ్యక్తిగత విమర్శలు దూషణలు చేస్తూ, కొంచెం గుర్తింపు రాగానే తెలుగు సాహిత్యంలో నాకంటే బాగా రాసే వాళ్లే లేరు అన్నంత గర్వం ప్రదర్శిస్తున్న నేటి చాక్లెట్ కవులు మిట్టపల్లిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
'చెల్లీ నీ ఆడజన్మకో చరిత ఉన్నదమ్మా' అనే పాటలో ఆడపిల్లలందరికి తానే పెద్దన్నై భారత సంస్కృతిని,సాంప్రదాయాలను వివరిస్తూనే, 'ఈ వయసులోన నీ మనసులోన ప్రేమన్న మాట సహజమే' అంటూనే ప్రేమ పేరుతో పార్కుల్లో, సినిమా హాళ్లలో, రాత్రంతా ఛాటింగ్, వీడియో కాలింగ్ ల పేరు మీద చదువును, బాధ్యతలను మరిచి తిరుగుతున్న చెల్లెల్లకు భద్రంగా ఉండమని చెపుతాడు. 'కలల ప్రపంచం కల్లోల ప్రపంచం' పాటలో ఫోన్ లు , ఇంటర్నెట్ ,సోషల్ మీడియా ల అతి వాడకం వల్ల జరుగుతున్న హానిని తెలంగాణ మాండలికంలో 'అభివృద్ధికి కట్టుకున్న సైబర్ మెట్టు అరచేతిలో చుట్టుకుంది నాశన కాలం' వంటి భాణీలతో చమత్కరిస్తాడు. 'రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా' అనే పాటలో 'నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా చిన్న చీమైన కుట్టదురా శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా నా కొడుకుపై నీ మతి ఏమైందిరా..?'అని బిడ్డను కోల్పోయిన తల్లి ఆక్రోశాన్ని వివరించిన తీరు అత్యద్భుతం. ఉద్యమంలో ఊపిరినిడిసిన ఉద్యమకారుణ్ణి స్తుతిస్తూ రాసిన 'తొలి పొద్దు పొడిసింది నేలపై రాలింది వెలుగు నీయరా మా అన్నా' అంటూ దళిత, బహుజన, విప్లవ దృక్పథంతో రాసిన పాట ఒక ఉన్నత శిఖరం. బతుకుదెరువు లేక పల్లెను విడిసి వెళ్లలేక వలస పోయే బతుకు జీవుల వెతలను చెప్పే పాట 'పండు వెన్నెల పల్లె నిండ రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడి రానంటది' అని విషాద భరితంగా సాగే పాట మట్టి మనసులను అక్కున చేర్చుకుని ఓదార్పునిస్తుంది. 'ఇసుక తిన్నలలో గౌరమ్మా తొలి ఇలావేలుపు నీవమ్మా' అంటూ సాగిన బతుకమ్మ పాట 'నన్నూ కన్న తల్లీ నా జన్మభూమి నిన్ను మించి దైవం మాకున్నదేమీ...' అంటూ జననీ జననీ జననీ జై తెలంగాణ అంటూ సాగే పాట తెలంగాణ బతుకమ్మ పాటల్లోనే అగ్రగామిగా నిలిచింది.
తెలంగాణ ఉద్యమంలో ఆశలు ఉడిగి ఆత్మహత్యలు చేసుకుంటున్న యువకులను చూసి చలించి రాసిన గేయం ' ఎందుకు చస్తవ్ ఎందుకు చస్తవ్ పిరికితనంగా భయపడి ' అంటూ సాగే పాటలో 'మరణం కాదురా మనిషికి మార్గం బతుకంటేనే నిత్యం యుద్ధం' అని తెలంగాణ పోరాటంలో చావడం పిరికితనం అని బతికి పోరాడాలని యువతకు మార్గనిర్దేశనం చేసిన పాట అజరామరము. కాల చక్రంలో ఇరుక్కొని కాలగర్భంలో కలిసిపోతున్న కవులు ఎందరో ఉన్న నేటితరంలో, కాలాన్ని తనతో పరిగెట్టిస్తున్న కవి మన మిట్టపల్లి. తెలంగాణలో మిట్టపల్లి బతుకమ్మ పాట లేని దసరా పండగే జరగదంటే అతిశయోక్తి కాదు.. గల్లీ నుండి గల్ఫ్ దేశాల వరకు ఎక్కడైనా తెలంగాణ మహిళలు బతుకమ్మ ఆడేది సురేందర్ బతుకమ్మ పాటతోనే. అందరూ దసరా సెలవుల కోసం ఎదురుచూస్తే తెలంగాణ మహిళా లోకం మిట్టపల్లి బతుకమ్మ పాట ఎప్పుడు విడుదల వుతదా అని ఎదురుచూస్తుంటారు. మొన్నటి దసరా పండుగకు విడుదలైన 'పచ్చిపాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగుపూల తోటలు పచ్చి పసుపు కొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగేడు కొమ్మలు' అంటూ సాగే బతుకమ్మ పాట యువతులను అలరించింది.
'సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్లా చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి' అంటూ తెలంగాణ యాసతో సాగే బతుకమ్మ పాటను 'తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే.. వటే/ పాల సంద్రం పూలే.. పూల సంద్రాలయ్యే" అంటూ బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాడు. 'కాలిగజ్జె ఘల్లుమంటే పల్లె తల్లి మేలుకుంటదో ఓ ఓ..మా అమ్మలారా అక్కలారా డోలు డప్పు ఘోల్లుమంటే ఊరువాడ దుంకుతుంటదో' అనే 'రాజన్న' సినిమాలోని పాట తెలంగాణ పల్లె సంస్కృతికి అద్దం పడుతోంది. 'జార్జి రెడ్డి' సినిమాలోని "వాడు నడిపే బండీ రాయల్ ఎన్ ఫీల్డూ.. వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండూ.." అనే పాట జార్జి రెడ్డిపై యువతకున్న క్రేజీని రెట్టింపు చేసింది. అప్పట్లో 'ధైర్యం' సినిమాకు 'బైపీసీ బద్మాషి పోరి బాగుంది మామో ఏం తెలియని ఎంపీసీ పోరి ఏముంది మామా' అనే పాట కుర్రకారు మతిపోగొట్టేసింది.
న్యూ ఇయర్ జోష్ లో యువత మొత్తం సంబరాల్లో మునిగి బాధ్యతను మరిచిన వేళ తాను బాధ్యత తీసుకొని యువతను మేల్కొలిపేలా రాసిన గీతమే గో బ్యాక్2020. 'గో బ్యాక్2020 మా ఇండియాలో నీకు నో ఎంట్రీ' అంటూ నా దేశంతో నీకు పనేంటి అని కాలాన్నే ప్రశ్నించిన ఘడుసున్న రచయిత మిట్టపల్లి. గో.. గో.. బ్యాక్ అంటూ కాలాన్ని తరుముతున్న తీరు వీక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. 'అంతులేని ఆకలుండి పేదరికం పెరుగుతుంది వంద కోట్ల మంది ఉన్న ఇండియాలో..' అని గద్గద స్వరంతో గొంతెత్తి ఘర్జిస్తాడు. 'ఒకరికొకరు తోడుకాని భారతీయులం సిగ్గులేని భావిపౌరులం' అంటూ ఆవేదన చెందుతూనే,ఆలోచనలో పడేస్తాడు. తెలుగు పాటలు అంటే కేవలం ప్రేమో, విరహమో,విషాదమో, విప్లవమో, ఉద్యమమో అన్న చులకన భావం వున్న పరిస్థితుల్లో, ప్రస్తుత యువత పాప్ కల్చర్ కు దాసోహమైన వేళ, యువత నాడి తెలిసిన కవిగా తెలుగు పాటలో ఇంగ్లీష్ లిరిక్స్ ను జోడించి ఆద్యంతం ఆసక్తిగా పాటను అల్లిన మేటి మన మిట్టపల్లి. సమకాలీన అంశాలైన మహిళా అత్యాచారాలు ఆపైన జరిగుతున్న క్రూరమైన హత్యలకు చలించిన కవి, మానవత్వం మరిచిన జనాలను తన స్వరంతో జాగురుత పరుస్తాడు.
రైతు ఆత్మహత్యలకు, కార్మికుల కష్టాలకు,కన్నీళ్ళకు స్పందిస్తూ 'మార్పు రాని జీవితాలకు ఎవరు కారణం..?' అన్న ప్రశ్నను సందిస్తూనే ప్రేక్షకులు తెరుకోకముందే 'ఎవడు మారమన్న మారదు మా కంట్రీ..' అంటూ దుఃఖాన్ని వెళ్లగక్కుతాడు. రచయితగా,గాయకుడిగా తన మార్కును నిరూపించుకున్న యంగ్ డైనమిక్ మిట్టపల్లి సురేందర్, జార్జి రెడ్డి సినిమాలో 'వాడు నడిపే బండీ రాయల్ ఎన్ ఫీల్డు...' అంటూ యువతుల మనసులు కొల్లగొట్టాడు. సామాజిక అంశాలపై యువ భారతాన్ని చైతన్య పరచే పనిని తన భుజ స్కందాలపై వేసుకున్నాడు. సామాజిక వెనుకబాటును, అచేతనమైన వ్యవస్థను, ఛిద్రమైన మానవ విలువలను,శ్రమ దోపిడీని,తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో గేయాలను లిఖించడంలో తనకు తానే పోటీగా నిలుస్తూ, కొత్త ఒరవడిని అందిపుచ్చుకొని ప్రజల మనసులు చూరగొంటున్న యువ కవీంద్రుడు భవిష్యత్తులో ఇంకా మరెన్నో సందేశాత్మక గీతాలు రాయాలని మనసారా కోరుకుంటున్నాను.....
- ముఖేష్ సామల