'నల్లాలం పూలు' పుస్తకం నన్ను ఆద్యంతం చదివించింది. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. నా అభిప్రాయాన్ని రాసేలా పురికొల్పింది. ఇలా "నల్లాలం పూలు" బడిపిల్లల కవిత్వంపై నా అనుభవాలను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నాను...కూకట్ల సాయిభారవి
హైదరాబాద్: కూకట్ల సాయిభారవి ఇటీవలనే కంప్యూటర్ సైన్స్ లో బి. టెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం టి.సి.ఎస్. లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. తొలిసారిగా పాఠశాల మేగజైన్ లో సాయిభారవి రచనలు అచ్చైనాయి. ప్రస్తుతం "నల్లాలం పూలు " పుస్తక సమీక్షతో సాహితీ లోకంలోకి ఆసియా నెట్ న్యూస్ అంతర్జాల పత్రిక ద్వారా వస్తున్నాడు. ఆసక్తి కరమైన ఈ పుస్తక సమీక్షను ఇక్కడ చదవండి :
"కవిత్వం రాయడమంటే పెరుగుని చల్లగా మార్చడమే కాదు. కుండెడు చల్లను గిలకొట్టి, కశ్కెడు కమ్మని వెన్న తీయడం లాంటిది" అని మా నాన్న కూకట్ల తిరుపతి నాకెప్పుడూ చెబుతుంటారు. నా చిన్నతనంలోనే ఆయన నాలో పుస్తక పఠనాభిలాషను పాదుకొల్పారు. పిల్లల బొమ్మల రామాయణం, భారతం, భాగవతం, పంచతంత్రం, బుద్ధ జాతక, చందమామ, పేదరాశి పెద్దమ్మ, మర్యాద రామన్న, అక్బర్-బీర్బల్, తెనాలి రామకృష్ణ కథలు మొదలైన బాల సాహిత్య పుస్తకాలను నాకు అందుబాటులోకి తెచ్చారు. తానే నాకు మాతృభాషా మాధుర్యాన్ని పంచారు. తెలుగు వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలను సైతం ప్రత్యేకంగా బోధించారు. నేను స్వీయ రచనలు చేయడానికి ప్రోత్సహించారు. నా పాఠశాల దశలోనే సృజనాత్మక రచనలకు గాను ఎన్నో బహుమతులు కూడా సాధించాను. ఆ పరంపరలో నేను రాసిన మొదటి పుస్తక సమీక్షావ్యాసం ఇది. ఈ పుస్తకం నన్ను ఆద్యంతం చదివించింది. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. నా అభిప్రాయాన్ని రాసేలా పురికొల్పింది. ఇలా "నల్లాలం పూలు" బడిపిల్లల కవిత్వంపై నా అనుభవాలను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నాను.
ఇపుడు వెలువడుతున్న బాల సాహిత్యాన్ని ప్రధానంగా రెండు రకాలుగా చూడవచ్చు. మొదటిది పిల్లల కోసం పెద్దలు రాసింది. రెండవది పిల్లలు తమ కోసం తాము రాసుకున్నది. ఈ రెండో రకం రచనలను "నల్లాలం పూలు" బడిపిల్లల వయ్యిలో చూడవచ్చు. ఇందులో ఆరు నుండి పది తరగతులకు చెందిన 58 మంది విద్యార్థుల కవితలు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సాహితీ రంగ ప్రవేశానికి ముందడుగుగా నిలిచిందీ పుస్తకం. తన శిష్యులలో నిక్షిప్తమై ఉన్న సృజనాత్మకత రచనాశక్తిని వెలికి తీయడంలో మాతృ భాషోపాధ్యాయులుగా కూకట్ల తిరుపతి గారు సఫలమైనారని, ఈ సంకలనం ద్వారా చెప్పవచ్చు. పల్లె పరిసరాలు, చెరువు తరువులు, వాగు వంకలు, గురువు గరిమ, బడి గుడులు, స్నేహ బంధం, కుటుంబ, మానవ సంబంధాలు మొదలగునవి ఈ పిల్లల కవితాంశాలు.
"గరిక పచ్చ మైదానాల్లోనూ/తామర పూవుల కోనేరులలో/పంటచేలలో,బొమ్మరిళ్ళలో/తండ్రి సందిటా, తల్లి కౌగిటా/దేహధూళితో, కచభారంతో/నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ/ఎక్కడ చూస్తే అక్కడ మీరై/విశ్వరూమున విహరిస్తుండే/పరమాత్మలు/ఓ చిరుతల్లారా!"
అని మహాకవి శ్రీశ్రీ శైశవగీతం ఆలపించినట్టూ, పిల్లలు ప్రతి దినం ఊరూవాడలన్ని అమాయకత్వంతో కలియ తిరుగుతారు. ఆ చిన్ని మదుల్లో ఇంత లోతైన పరిశీలన ఉంటుందా? అని ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ఆశ్చర్యపోతాము. వారి అమలినమైన ఆలోచనలకు, ఊహాశక్తిని జోడించి, కూర్చిన కవితలతో సమాజానికి గొప్ప సందేశాన్ని అందించారు. పిల్లల అనుభవానికి తగిన పదజాలం, చేసిన వాక్య నిర్మాణం, పాటించిన ప్రాసలు, వ్యక్తీకరించిన స్పష్టమైన తీరుకెవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు.
పిల్లలు ఎక్కువగా పాటలు వినడానికి, కథలు చదువడానికి మొగ్గుచూపుతారని మనకు తెలుసు. మరేంటో కానీ ఈ బడిపిల్లలు మాత్రం వారి భాషాజ్ఙానానికి మించిన వచన కవితారచన చేపట్టారు. సరళమైన పదాలలో సులువైన కవితలల్లి పాఠకులను మెప్పించగలిగారు. విద్యార్థులకు పాఠశాలలో మాతృభాషా మాధ్యమంలో విద్య అందిడం వల్లనే వారి సృజనాత్మకశక్తి బయటికొచ్చిందని నేను భావిస్తున్నాను. ఏ ఇంటర్నేషనల్ స్కూల్లోనో, ఆంగ్ల మాధ్యమంలోనో చదివితే, వారి భావాలను ఇంత స్వేచ్ఛగా, స్వచ్ఛంగా తెలియజెప్పేవారుగాదేమో? అనిపించింది. తెలుగు భాషా బోధకులైన కూకట్ల తిరుపతి స్వయంగా కవి కావడం వల్ల పాఠశాల పిల్లలకు వివిధ సాహితీ ప్రక్రియలను పరిచయం చేయడం, వారిని రచనలు చేసే దిశగా ప్రోత్సహించడం సహజంగా జరిగి ఉంటుంది. ఇలా అంకితభావంతో పనిచేసే మాతృభాషోపాధ్యాయుల మూలంగానే పిల్లలు సంస్కృతీ సంప్రదాయాలను తొందరగా అలవర్చుకుంటారు.
ఈ పిల్లలు ఎంచుకున్న కవితా వస్తువుల్లో మొదటి స్థానం అమ్మదే -
"సద్బుద్ధిని అద్ది సద్గురు వైనావు/అన్నపూర్ణివై ఆకలిని తీర్చావు" అని ఒకరు.
"అనురాగాన్ని చిలికించి/ మమకారాన్ని పలికించేది" అని మరొకరు -
ఇలా అమ్మ ఋణం తీర్చుకోలేనిదని చెప్పుకొచ్చారు. అమ్మ గురించి రాసిన ప్రతి కవిత ఉటంకించ తగినదే. ఇంకా నాన్న, అక్క, రైతు, కవి, కలం వంటి వస్తువులను మనోహరమైన కవితలుగా మలిచారు. సాధారణంగా పిల్లలు స్మశానం అంటే భయపడతారు. కానీ ఒక పిల్లవాడు కాలుతున్న శవాన్ని చూసి జీవిత సత్యాలు గ్రహించానని, వైరాగ్య భావంతో కూడిన రచన చేయడం నన్ను విస్మయానికి గురిచేసింది.
నల్లాలం ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన ఒక గడ్డిజాతి మొక్క. ఇది పల్లె ప్రజల గాయాలకు యాంటిబయటిక్ గా పని చేస్తుంది. ఈ నల్లాలం పసరును కట్టెబొగుతో కలిపి, రోట్లో మెత్తగ నూరి, బ్లాక్ బోర్డుకు గట్టిగా పట్టిస్తారు. దీంతో నల్లబల్లపైన ఉన్న చారకలు,గీతలు మాయమై నిగనిగలాడుతుంది. అప్పుడు దానిపై రాసిన ప్రతి అక్షరం స్పష్టంగా కనబడుతుంది. ఈ పుస్తక ముఖచిత్రం కూడా ఇదే సన్నివేశాన్ని ప్రతిబింబిచేలా చిత్రకారులు భూపతి గారు చక్కగా గీశారు. పాఠశాల విద్యార్థులతో ఇలాంటి కవితా సంకలనాలు రావడం చాలా అరుదు.
ఉపాధ్యాయకవి, సంపాదకులు కూకట్ల తిరుపతిగారి కృషి అభినందనీయం. ఈ చిరు ప్రయత్నం ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తుంది.
“అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని పొదగడమే కవిత్వమని” పాల్కురికి సోమన ఏనాడో చెప్పారు. ఈ లక్షణాన్ని పిల్లలు అనుసరించేలా ప్రయత్నం చేయడం మదావహం. పసి వయసులోనే వచనకవితా రచనా మెళకువలను వొంట బట్టించుకొని, చేయి తిరిగిన కవుల వోలె కవిత్వం రాసిన పిల్లలందరూ అభినందనీయులే. మునుముందు కూడా ఇలాగే బడిపిల్లల సృజనలోకం విస్తరించాలని విశ్వసిస్తున్నాను. ఎంత మంది కవులు తయారైతే అంత ప్రయోజనం సమాజానికి కలుగుతుందనే భావనతో భావి భారతానికి కవులను తయారు చేస్తున్న కూకట్ల తిరుపతి గారికి కృతజ్ఞతలు.
ప్రతులకు :
కూకట్ల లక్ష్మి, ఇం.నం. 8-3-207/4/2/E/1,
వాసుదేవ కాలని, కట్టరాంపూర్,
కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం - 505001.