గౌరీపతి శాస్త్రి కవిత్వ సంపుటి 'వీరవతి కవితా ఝరి' పైన విశాఖపట్నం నుండి డా. కె.జి. వేణు రాసిన సమీక్ష ఇక్కడ చదవండి.
ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ఘనమైన చరిత్ర వుంది. కవిత్వమంటే ఒక అనుభూతి, కవిత్వమంటే ఒక రసానుభూతి, కవిత్వమంటే మేథస్సు చేసే అద్భుతమైన ఒక సాహసం. కవిత్వం మానవ వేదనలకు, మానసిక శోధనలకు అనువైన ఒక ప్రయోగశాల. మనిషి అభివ్యక్తీకరణకు కవిత్వాన్ని మించిన సాధనం మరొకటిలేదు. మనిషిని పశుత్వంనుంచి మానవత్వంవైపు నడిపించే ఇంద్రియాల ఇంద్రజాలమే కవిత్వం. మామూలుగా మనిషి ఊపిరికి వాసన వుండదు. కాని కవి రాసిన కవిత్వానికి ఒక పరిమళం వుంటుంది. ఆ పరిమళం ప్రజల పక్షాన రాసే కవిత్వంలో మరింతగా గుభాళిస్తుంది, రాతకు కలం, కాగితాలే కాదు, నిబద్ధతతో పాటు నిరంతర అధ్యయనం ఎంతో అవసరం. ఆలోచనలో నవ్యత, పదాల సంధింపులో నైపుణ్యత, వాస్తవాల చిత్రీకరణలో చిత్తశుద్ధి, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమస్యలపట్ల లోతైన అవగాహాన, అంతర్జాతీయ పరిణామాలపట్ల ఆర్థవంతమైన బుద్ధికుశలత... ఇత్యాదులు మంచి కవిత్వ నిర్మాణంలో ప్రధాన భూమికను పోషిస్తాయి.
కవిత్వం రాయటం ఒక తపస్సులాంటిది. సుధీర్ఘమైన ఈ తపస్సుకు ఓర్పు, నేర్పు, ఏకాగ్రత అవసరం. విత్తనాలు చల్లగానే కవిత్వం ఏపుగా ఎదగాలనుకోవటం గొప్ప ఫలితాలనివ్వదు. కవిత్వమనే పంట ఉత్పత్తిని మెచ్చుకోలుగా సాధించే ప్రతిభ కోసం నాలుగు దిక్కులు గాలించాలి. కాలం ఆకురాయి మీద మెదడును పదును పెట్టే కార్యక్రమం విరామం లేకుండా నిరంతరం కొనసాగాలి. శ్వాసలో సైతం కవిత్వం పట్ల ధ్యాస కలిగిన అంకితభావమే మంచి కవిత్వ సృజనకు దారులను సిద్ధం చేస్తుంది.
undefined
బాల్యంలోనే తెలుగుభాష పట్ల విపరీతమైన మక్కువ పెంచుకున్న వ్యక్తి కన్నేపల్లి వెంకట సన్యాస గౌరీపతి శాస్త్రి. ఈ భాషా ప్రేమికుడు తెలుగు సాహిత్యానికి సాష్టాంగ నమస్కారాలు చేసిన సందర్భాలు కోకొల్లలు. వీరవతి పేరుతో రచనలు కొనసాగించే ఈయనకు శ్రీ శ్రీ అంటే కొలవలేనంత గౌరవం. ఆ మహాకవి ప్రభావంతోనే ‘యువకుల్లారా... ఓ యువకుల్లారా / నా యుక్తిని మీ శక్తిని కలిపి కదలిరండి / నవజీవన కాంతిని విరజిమ్మగా రారండి... యువకుల్లారా' అంటూ తన తొలి రచనను ధీటుగా, ధాటిగా సంధించి కన్న తండ్రి ఆశీస్సులను నిండుగా పొందిన కవిత్వ సాధకుడు గౌరీపతి శాస్త్రి. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి పట్ల హిమాలయాల ఎత్తును మించిన పూజ్యభావాన్ని అడుగడుగునా ప్రకటించుకుంటున్న ప్రతిభాశాలి ఈయన. వారిరువురి కవిత్వాన్ని అభిమానించటమే కాదు, ఆరాధించటం కూడా తన దినచర్యలో ఒక ప్రధాన భాగంగా మలుచుకున్న సాహిత్య ప్రేమికుడు గౌరీపతి శాస్త్రి.
మాతృమూర్తికి నమస్సుమాంజలి, కన్న తండ్రికి అశ్రుతాంజలిలు సమర్పించుకుని తన కవితాఝరిని ప్రారంభించిన గౌరీపతి శాస్త్రి, సంస్కార పరిమళంతో తన స్థావరాన్ని సుస్థిరం చేసుకోవటం ఈ సంపుటి ప్రత్యేకత. భగవద్గీత సారాన్ని సిరాగా మార్చుకున్న వాస్తవానికి ఆయన కవితలు కొన్ని సాక్ష్యంగా సంతకాలు పెడుతున్నాయి. పరభాషా ప్రభావంతో జాతికి దూరమవుతున్న మాతృభాష దుస్థితి ఆయన కనురెప్పల మధ్య కదలాడే కన్నీళ్ల నీడల్లో ఒక తెరపడని చిత్రంగా 'తెలుగు - భాషాభిరుచి' కవితలో కదలాడుతూనే వుంది. అనుభవాలను చిరు చినుకులుగా, పేదల వేదనల్ని మెరుపులుగా, సమాజ ఉసురులే ఉరుములుగా, సిరా చుక్కల్ని దారాలుగా మార్చగలిగిన కవితావేశాన్ని ఆయన పదాల పొందికలో పట్టాభిషేకం చేసుకోవటం 'కవన పోరాటం' కవితలో అభినందించతగ్గ విషయం.
అవనికి తొలివలపు ఝరిగా మారే తొలి చినుకుల పలకరింపు, పాఠకుడి మోము మీద చిరునవ్వుల ఆవిష్కారానికి 'తొలకరి చినుకులు’ కవిత స్వాగతగీతాలు పాడుతోంది. అదే సందర్భంలో శాపగ్రస్తుడైన రైతన్న కష్టాల కంటి తడిని తన కవిత్వం చేతులతో తుడిచే ప్రయత్నం చేస్తున్నాడీ కవి. 'ఓటు నీ హక్కు' కవితలో ఓటును నోటుకు వురివేయవద్దని దేశ ఓటర్లను హెచ్చరించే ఆయన స్వరపేటికలోని ధ్వని, ఎన్నికల అక్రమ తతంగాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. కలం, కలం, గళం, గళం కలిపి నడవండంటూ కవులనందరిని ఒకచోట సమావేశపరిచే ఒక ప్రబోధ కవిత 'మేలుకోండి కవి వరులారా’. ఇందులోని భావాలు కవిత్వం రాసే ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి.
'సృష్టి కొరకు ఇల వెలిసిన దేవతామూర్తి...' మహిళలపట్ల అపారమైన గౌరవ పట్టాను రూపొందించిన ఆయన 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' కవితలోని భావాలు గులాభి పువ్వులై వనితల ముందు రాలుతున్నాయి. పచ్చని పైరుల వనాల హరిత పత్రాలను తన కవిత్వపు ముఖచిత్రాలుగా చిత్రీకరించుకుంటున్న ఈయన కవిత్వంలో పున్నమి చంద్రుడు, పండు వెన్నెల మనతో కరచాలనం చేయటం అక్షరాలకు అందని ఓ గొప్ప అనుభూతి. బాధ, దుఃఖం, కన్నీళ్లు మనుషులకే కాదు, చూడగలిగిన మనసువుంటే వృక్షాల విలాపాన్ని సైతం వీక్షించ వచ్చునని 'వృక్ష విలాపము' కవితలో నిరూపించన కవితా సేద్యకుడు గౌరీపతి శాస్త్రి.
అసంఘటితమై, ముక్కలు చెక్కలుగా మారుతున్న సామాజిక మాధ్యమ గమన రీతుల గురించి, బలంగా చిత్రీకరించిన కవిత 'సోషల్ మీడియా'. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో వెలువరించిన 'గణతంత్రం - రణతంత్రం' కవితలో గత వైభవాల కీర్తినే కాకుండా వర్తమానంలో ఆత్మవంచన ఎలా తన మోసపూరిత చర్యను దేశభక్తిగా ప్రకటించుకుంటుందో ఆ సత్యాలను అక్షరాల కొలువులో విచారణకు నిలబెట్టిన కవిత. ఈ కవిత ఏకంగా కవిని న్యాయమూర్తి స్థానంలో చూపెడుతోంది. ఆధ్యాత్మిక అంచుల్ని సైతం తన సొంతం చేసుకున్న గౌరీపతి శాస్త్రి రాసిన 'చేసిన పుణ్యం చెడని పదార్థము' కవితలో పాప, పుణ్యాలను బేరీజు వేసిన విధానం, పక్వానికి చేరిన కవి ఆలోచనా స్థాయిని సూచించే సూచికగా నిలుస్తోంది. వట వృక్షాలు నేలమీదే కాదు, మనుషుల మధ్యకూడా నిలుస్తాయి స్నేహం రూపంలో... అంటూ 'స్నేహబంధం' కవితలో స్నేహంపట్ల అక్షరాలతో కవి చేయించిన విన్యాసాలు చాలాకాలం పాఠకులకు గుర్తుండి పోతాయి.
దేశంలో అడుగడుగునా రాక్షసత్వం చేస్తున్న చర్యలకు శ్రీకారం చుట్టుతున్న కర్కష దృశ్యాలలో ఒక చిన్నారి బాలికపై అత్యాచారం, ఆపై గొంతుకోసిన కిరాతక చర్యను నిరసిస్తూ 'ఛీ'ద్రమవుతున్న చిన్నారి బ్రతుకులు' కవితలో పొలికేక పెట్టిన కవి భావాలలోని శబ్దాలు, ప్రతి హృదయాన్ని కదిలించి, కరిగించి, ఆలోచింపజేస్తున్నాయి.
'దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్..' గురజాడ మాటల్ని మరోసారి గుర్తుచేస్తూ రాసిన 'రోదనా భారతం' కవితలో 'నా భారత స్వాతంత్ర్యమా వర్థిల్లు / అవినీతి నేతలకు చెల్లు చీటీ పెట్టు...' అన్న కవి విన్నపంలోని మాటలు ఈ దేశ ప్రస్తుత దౌర్భాగ్యానికి అవినీతి ఎలా కారణమో వివరించిన తీరు ఒక సాహిత్య ప్రయోజనానికి ఆకాశంలో ఎగిరే జెండాలా నిలిచిపోతోంది. నేటి ప్రపంచంలో ప్రతి దేశాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన అంశం కాలుష్యం. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి రాసిన 'ఓ! మానవ మేలుకో - ప్రపంచాన్ని ఏలుకో' కవితలో నినదించిన కవి కలం ఘోష, ముఖ్యంగా పాలకుల దృష్టి వరకు వెళ్లాలి. పాలకులే కాదు, సామాన్యులు సైతం బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం ఆసన్నమైనదని కవిత్వ రూపంలో గుర్తుచేసిన కవియొక్క సామాజిక బాధ్యతను అందరం కలిసి స్వాగతిద్దాం. ప్రకృతి అంటే వికృతిలా ముద్రవేసుకున్న మనుషుల మూర్ఖత్వపు వికారాన్ని తన 'ప్రకృతి - మనిషి' కవితా అద్దంలో చూపిస్తూ 'ప్రకృతి అంటే పంచభూత ఆవరణమని, మనిషి జననం, పయనం, మరణం సమస్తం ప్రకృతి ఒడిలోనేనన్న' సత్యాలను గుర్తుచేస్తూ, ప్రకృతి ధర్మం పాటించమని, ప్రజ్ఞాన ప్రపంచాన్ని సృష్టించమని ఒక గీతాబోధన చేస్తున్న కవి హృదయం ఈ కవితలో స్పష్టంగా ఒక గురుస్థానంలో కనపడుతోంది.
శ్రీ శ్రీని గౌరవించటం, పూజించటం అందరూ చేస్తారు. కాని శ్రీ శ్రీ భావాల్ని సంపూర్ణంగా తనలో జీర్ణింపజేసుకుని కవిత్వం రాస్తే ఎలావుంటుందో గౌరీపతి శాస్త్రి రాసిన 'రావోయీ శ్రీ శ్రీ' కవితలో పాఠకుడు గమనిస్తాడు. ఆ కవితలో 'గతి తప్పిన సమాజం / మతి తప్పిన జనం / ఎటు చూస్తే అటు మోసం / టెక్నాలజీల విధ్వంసం..' అంటూ కల్తీ మోసాల గురించి, రక్షణలేని మహిళలను గురించి, రాజకీయ వ్యభిచారాల గురించి, రేకెత్తుతున్న ఉగ్రవాదం గురించి, యుద్ధాల గురించి, మనిషి మనిషిలో పేరుకుపోతున్న ద్వేషాలను గురించి... చిన్న చిన్న పదాలలో అనంతమైన అర్థాలను స్పురించే రీతిలో ప్రదర్శన గావించబడిన కవితలో అంతర్లీనంగా శ్రీ శ్రీ గొంతుక వినిపించటం కవి సాధించిన సాహిత్య విజయాలలో ఒకటి. ఇదే సందర్భంలో యువతను మేల్కొల్పుతూ రాసిన కవిత యువకుల నిద్రమత్తును పటాపంచలు చేసేదిలా వుంది. ఈ కవితలో 'నీ వీర్యం, శౌర్యం, ధైర్యం నిస్తేజమవుతున్నాయని, నీ బ్రతుకును తాకట్టు పెడుతున్నారని, నీ భవిత సమాధి అవుతున్నదని, నిద్ర వదిలి సింహంలా మారకుంటే నీ బ్రతుకు ప్రశ్నార్థకమవుతుందని..’ యువకుల ముందు దండోరా మ్రోగించిన కవి అక్షరాల ధ్వని తప్పకుండా యువతరానికి ఒక స్పూర్తిగా మిగులుతుంది. 'పరమేశుని ఢమరుక నాదం, మహార్షుల దర్శన రూపం, జగతికి అందిన మహాభాగ్యం...' అక్షరమంటూ అక్షరాలను కీర్తించిన కవిత 'మధురాక్షరం' మళ్లీ, మళ్లీ పాఠకులను పలకరిస్తూనే వుంటుంది.
నిరాశా నిస్పృహల్లో మునిగిపోతున్న వాళ్లకు మనోధైర్యాన్ని పుష్కలంగా అందించే ప్రయత్నంలో కవి వెలువరించిన ‘విజయ బావుటా' కవితలో ఎగిరే పక్షిని, నీటిలో ఈదే చేపను, ఆకాశంలోని చుక్కలను స్పూర్తిదాయకంగా చూపించి మనుషుల్ని ఉత్తేజపరచిన కవిత్వ విధానం ప్రశంసనీయంగా వుంది. అంతేకాదు ఇందులో హెచ్చరికలు కూడా వున్నాయి. అవి మామూలు హెచ్చరికలు కాదు, జీవితాలను వొడ్డుకు చేర్చే ఘనమైన సూత్రాలు. అందులో అమ్ముడు పోయే గుణం మానుకోమంటాడు, నిన్ను అంగడి సరుకుగా మార్చబోతున్నారు, కావున ఎదిరించి నిలబడితే, విజయం నీదేనని, విజయబాటా ఎగురవేయటానికి సహకరించే అంశాలను గురించి కవితలో ప్రస్తావించిన తీరు, కవితను తేరులో కూర్చోపెట్టి ఊరేగించినట్లుగా వుంది. వాస్తవాలను ధైర్యంగా కవిత్వీకరించటంలో కవి అడుగులు పరుగుల్లా మారిన 'నిజాలు నిద్రపోతున్నాయి' కవితలో 'నిజాన్ని భరించలేని ఇజాల / ఒడిలో నిజాలు నిద్రిస్తున్నాయి....' ఈ మాటల్లో చాలా అర్థాలున్నాయి, అలాగే చాలా చురకలున్నాయి. చరిత్ర పుటల్ని పరిశీలిస్తే ఇజాల పాత్ర ఏ పరిణామ క్రమంలోకి దొర్లిపోయిందో స్పష్టమవుతుంది. ఈ చారిత్రాత్మక విషయాలను కూలంకషంగా అధ్యయనం చేసిన కవి కలం కదిలించిన నిజాలు ఈ కవితలో అగ్నిగోళాల్లా మండుతున్నాయి.
ఈ కవితా సంపుటిని వెలువరించిన గౌరీపతి శాస్త్రి గొప్ప పరిశీలకుడు కూడా. సమస్యలను కవితల్లో ప్రస్తావించటమే కాదు, ఆ సమస్యల మూలాలను బహిర్గతం చేసి, కర్తవ్యాన్ని బోధించటం కూడా ఒక బాధ్యతగా స్వీకరించిన సాహిత్య ఆరాధకుడు శాస్త్రి. నింగి నుంచి నేలదాకా విస్తరించిన పలు విషయాలను కవిత్వ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రయత్నంలో తన ఖాతాలో శుభ విజయాలనే నమోదు చేసుకున్నాడు. కవిగా తన సత్తా నిరూపించుకున్న సందర్భాలను ప్రశంసా పత్రాల రూపంలో దాఖలు చేసిన తీరు చాలా ముచ్చటగా వుంది. శాస్త్రి తన ప్రచురణలో తొలి అడుగు ఈ కవితా సంపుటి. ఈ తొలి అడుగు ముద్ర, మరెన్నో వందల, వేల అడుగుల ముద్రలకు ద్వారాలు తెరిచేదిలా వుంది. భవిష్యత్తును శాసించే సాహిత్య శిఖరాలను చేరుకోవటానికి తన సాహిత్య సాధనను, అధ్యయనాన్ని, పరిశీలనను, వ్యక్తీకరణను, కవిత్వ నియమాలను నిరంతరం పదును పెట్టుకుంటూ, అడుగు తీసి, అడుగు వేసే ప్రతిసారి, తనను తాను ప్రశ్నించుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ, తన ముద్రను కాపాడుకుంటూ, విశాఖపట్టణం నేలమీద మరో సాహిత్య కిరణంలా కలకాలం గౌరీపతి శాస్త్రి నిలిచిపోవాలని సాహితీలోకం తరుపున అభినందనలు తెలుపుతూ కోరుకుందాం.