అఫ్సర్ కవిత్వ ప్రయాణం: ఎక్కడి నుంచి ఎక్కడి దాకా...

By telugu team  |  First Published Sep 22, 2021, 9:28 AM IST

తెలుగు సాహిత్యంలో అఫ్సర్ ను ఎక్కడ నిలబడుతారనే ప్రశ్న ఉదయిస్తోంది. రక్తస్పర్శ నుంచి ఇప్పటి దాకా ఆయన చేసిన కవితా ప్రయాణం సుదీర్ఘమైంది. ఈ ప్రయాణంలో ఆయన స్థానం ఏమిటో చూద్దాం. 


ప్రముఖ కవి అఫ్సర్ నన్ను ద్రోహి అంటుంటాడు. అందుకు కారణం లేకపోలేదు. ఒక రకంగా నేను ఆయన కవిత్వానికి సరెండర్ అయి ఆ ముద్రను చెరిపేసుకోవాలనే ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటున్నాను. చివరకు లొంగిపోయే సందర్భం ఇన్నాళ్లకు వచ్చింది. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తన వినిర్మాణం గ్రంథంలో అఫ్సర్ కవిత్వాన్ని అంచనా వేయాల్సిన పని మిగిలే ఉందని అన్నారు. ఆ కారణంగా నేను గత రెండు మూడేళ్లుగా చేయాలనుకుంటున్న పనికి సందర్భం కల్పించుకున్నాను.  

తెలుగు కవిత్వంలోనే కాదు, సాహిత్యంలో ఊరేగింపు జరిపే రచయిత కాడు. ఆయన తన కవిత్వ ముద్రలను ఎప్పటికప్పుడు వేగంగానే అయినా నెమ్మదిగా, సున్నితంగా వేసుకుంటూ పోతున్నారు. తద్వారా ఆయన కవిత్వం వందల పేజీలు దాటింది. ఆ వందల పేజీల కవిత్వాన్ని అర్థం చేసుకుని దాన్ని అంచనా వేయడం అంత సులభమైన పనేం కాదు. అలాగే, అఫ్సర్ ను ఏదో ఒక పాయకు అంటగట్టడం కూడా సాధ్యం కాదు. నిలువ నీరులాగానో, ఉధృత జలపాతంలాగానో కాకుండా ఆయన కవిత్వం నిండు నదీ ప్రవాహంలా సాగుతుంది. 

Latest Videos

ఒడ్డు మీద నిలబడితే మైదాన ప్రాంతంలో నిండుగా ప్రవహించే విశాలమైన నదిని తలపిస్తుంది. మన కళ్లకు ప్రవాహం ఆనదు, కానీ అది ప్రవహిస్తూనే ఉంటుంది. అాలాంటిదే తెలుగులో అఫ్సర్ కవిత్వం. అందువల్ల ఆయన కవిత్వం వెంటనే పాఠకుల దృష్టికి ఆనకపోవచ్చు, విమర్శకుల దృష్టి అటు పడకపోవచ్చు. కానీ, అఫ్సర్  కవిత్వాన్ని అంచనా వేయడానికి చాలా మందే ప్రయత్నించారు. అందులో సఫలమయ్యారు కూడా. అఫ్సర్ ను కవిత్వంలో కె. శివారెడ్డి తనంతటివాడని మెచ్చుకున్నారు. అలాంటి కవి కవిత్వం గురించి రాయడం అంత సులభమా అనిపించింది. కానీ, ఇంకా కొన్ని విషయాలు మిగిలే ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉంది. 

ఇక అఫ్సర్ కవిత్వంలో రంగం మీదికి వచ్చిన సందర్భాన్ని, ఆయన కవిత్వాన్ని ఒకసారి సమీక్షించుకుందాం. తండ్రి కౌముది సాహిత్యవేత్త కావడం వల్ల అఫ్సర్ కు బాల్యం నుంచే ఆ వాసనలు అంటాయి. ఆంగ్ల కవిత్వం రాసేంత ప్రతిభ, ఊహాశీలత ఉంది. అయితే, ఆయన తెలుగు పాఠకలోకానికి ఎక్కువ తెలిసింది రక్తస్పర్శ సంకలనంతోనే. తెలుగు సాహిత్యంలో రక్తస్పర్శను path breakingనే చూడాలి. విప్లవ కవిత్వం పెద్ద యెత్తున వస్తూనే ఉంది. ఈ కాలంలో రక్తస్పర్శ కవులు భిన్నమైన గొంతుతో వచ్చారు. అఫ్సర్ తో పాటు ప్రసేన్, సీతారాం కవిత్వం ఇందులో ఉంది. అయితే, ఈ ముగ్గురు కవులు కూడా ఎవరికి వారే భిన్నమైనవారని ఆ తర్వాత కాలంలోనే కాకుండా రక్తస్పర్శ కవిత్వంతో కూడా పసిగట్టవచ్చు. 

రక్తస్పర్శలోనే అప్సర్ కవిత్వాన్ని అనుభావ వాద కవిత్వంగా చెప్పవచ్చు. స్వీయానుభవాలను, అనుభూతులను వ్యక్తీకరిస్తూ దాన్ని సార్వజనీనం చేయడం కనిపిస్తుంది. విప్లవ కవిత్వంలో అది నిమగ్న కవుల్లో తప్ప నిబద్ధతతో రాసిన కవుల్లో కనిపించదు. రక్తస్పర్శ 1986లో వచ్చింది. దాదాపుగా ఈ కాలంలోనే విప్లవవాదంపై ప్రశ్నలు తలెత్తడం ప్రారంభమైంది. విముక్తి మార్గం ఆచరణలో ఉన్న విప్లవం ద్వారా జరగదని, విప్లవవాదంలో లొసుగులు ఉన్నాయనే వాదన ముందుకు వచ్చింది. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి "తోవ ఎక్కడ" కవితా సంకలనం 1994లో వచ్చినప్పటికీ అందులోని కవితలు ఆ కాలం నుంచే రావడం ప్రారంభమైంది. 

ప్రధానంగా చెప్పాల్సింది క్రితం తర్వాత. ఆరుగురు కవుల రచన ఇది. ఆరుగురు కవుల్లో అఫ్సర్ కూడా ఉన్నాడు. త్రిపురనేని శ్రీనివాస్, నీలిమా గోపిచంద్, నరసింహాచారి, ప్రసేన్ మిగతా కవులు. విప్లవవాదాన్ని నెగేట్ చేస్తూ వచ్చిన దీర్ఘ కవిత ఇది. మరోవైపు విపశ్యన కవులు కూడా వచ్చారు. నిరసన కవులు సైతం ఉన్నారు. అవుతుంది. విప్లవవాదాన్ని నెగేట్ చేస్తూ వచ్చిన కవులకు నిరసన కవులకు చాలా తేడా ఉంది. అందువల్ల నిరసన కవుల గురించి మరోసారి మాట్లాడుకోవచ్చు. క్రితం తర్వాత అప్పట్లో తీవ్ర సంచలనమే సృష్టించింది. ఈ ఆరుగురు కవుల్లో అఫ్సర్ కూడా ఉండడం కొంత విచిత్రమే కానీ ఆయనకు ఆ విషయంలో స్పష్తత ఉందని చెప్పవచ్చు. అందుకే తర్వాతి కవితా ప్రయాణంలో మిగతావారి కన్నా భిన్నంగా నడుస్తూ వచ్చాడు.

అఫ్సర్ కవిత్వ సృజన నిరంతర ప్రవాహం. ఈ నిరంతర ప్రవాహంలో ఆయనకు మజిలీలు ఉన్నాయి. కవిత్వం గమ్యం కాదు, మజిలీ అని అఫ్సర్ తానే చెప్పుకున్నాడు. జ్ఞాపకాలు ఆయన ముడిసరుకు. మజిలీ మజిలీకి ఒక కవితా సంకలనం వెలువరిస్తూ వచ్చాడు. ఇావాళ, వలస, ఉరి చివర, ఇంటి వైపు కవితా సంకలనాలు వెలువడ్డాయి. ఈ మొత్తం కవిత్వంలో ప్రధానంగా కనిపించేది అనుభవ వాదం. జ్ఞాపకాల నుంచి అనుభవాలను వ్యక్తీకరిస్తూ వచ్చాడు. ఆయన జ్ఞాపకాలు పలు అస్తిత్వాలకు సంబంధించింది. తన వ్యక్తిగత జ్ఞాపకాలు, అనుభవాలే కానక్కరలేదు. తనదీ, తన పూర్వీకులది, తనలాంటివారివి కావచ్చు. 

ఆ కారణంగానే అఫ్సర్ తెలంగాణ కవిగా, ముస్లిం కవిగా, భారతీయ కవిగా కనిపిస్తాడు. ఏక కాలంలో తన అస్తిత్వాలను అనుభావాల నుంచి వ్యక్తీకరిస్తూ వచ్చాడు. అందుకే ఆయన కవిత్వంలో అనేకమైన dimesions ఉన్నాయి. ఆయన రాసిన తెలంగాణ కవితలో ముస్లిం అస్తిత్వ ఛాయ కూడా కనిపిస్తుంది. ముస్లిం కవిగా తనను వేరుగా చూసే కోణాన్ని, తాను అనుభవిస్తున్న అనుమానపు భారాన్ని ఆయన వ్యక్తీకరించాడు. ముస్లిం కవిత్వం వచ్చేసరికి ఖాదర్ మొహియుద్దీన్ పుట్టుమచ్చ మిగతా కవిత్వాన్నంతటినీ వెనక్కి నెట్టేస్తుంది. మిగతా ముస్లిం కవులు ఎంత బలంగా తమ అనుభవాలను వ్యక్తీరించినప్పటికీ, కొత్త కోణాలను ఆవిష్కరించినప్పటికీ పుట్టుమచ్చ ముందుకు తోసుకుని వస్తుంది. 

అది అఫ్సర్ రాసినా, స్కైబాబ రాసినా, యాకూబ్ రాసినా, జల్ జలా కవులు, అజా కవులు రాసినా పుట్టుమచ్చ వాటిని వెనక్కి నెట్టి ముందుకు వస్తుంది. ఒక చారిత్రక సందర్భంలో, నూత్న వస్తువుతో, అభివ్యక్తితో వచ్చిన కవిత పుట్టుమచ్చు. అదు ఓ మైలురాయిలా పాతుకుని పోయింది. అందుకే ముస్లిం కవిత్వాన్ని పుట్టుమచ్చ అనంతర కవిత్వంగానే చూడడం పరిపాటి అయింది. అఫ్సర్ ముస్లిం అస్తిత్వ ప్రకటన చాలా సున్నితంగానూ మనసును తాకేదిగానూ ఉంటుంది. భిన్నమైన నిరలంకార అభివ్యక్తి కనిపిస్తుంది. కవిత్వ నిర్మాణాన్ని, వస్తు అభివ్యక్తి తీరును పరిశీలిస్తూ వాడ్రేవు చినవీరభద్రుడు అఫ్సర్ ను సూఫీ కవుల్లో చేర్చాడు. జల్ జలా కవులు కొత్త పదజాలంతో నూతన అభివ్యక్తితో తీవ్రమైన కంఠస్వరంతో మాట్లాడుతుంటే అఫ్సర్, యాకూబ్ సున్నితంగానూ మాట్లాడుతూ తమదైన ముద్రను వేశారు. 

అది సరైంది కూడా. కానీ ఆ అస్తిత్వంతో పాటు ఇతర అస్తిత్వాల ప్రకటన కూడా అఫ్సర్ చేశాడు. దళితుల పట్ల సహానుభూతి వ్యక్తం చేస్తూ రాసిన కవిత్వం కూడా ఉంది. ఇకపోతే అమెరికాకు, ఇతర దేశాలకు వెళ్లిన కవులు వెలువరిస్తున్న సాహిత్యాన్ని డయాస్పొరా సాహిత్యం అంటున్నాం. ఇంటిపైనా, మాతృదేశంపైనా బెంగటిల్లి రాసిన కవిత్వం అఫ్సర్ రచనల్లో చూడవచ్చు. ఇంటి వైపు అందులో ప్రధానమైంది. అమెరికా వలస వెళ్లిన అఫ్సర్ తన బెంగను కవిత్వంలో వ్యక్తీకరించారు. తెలుగులో హైదరాబాదు లేదా ఇతర నగరాలకు వలస వచ్చిన కవులు గ్రామాలపై ప్రేమతో రాసిన కవిత్వం చాలానే ఉంది. కానీ, వలస కవిత్వం అందుకు భిన్నమైంది. అఫ్సర్ కవిత్వం ద్వారా మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 

అఫ్సర్ ది ముందే చెప్పినట్లు కవిత్వంలో సుదీర్ఘమైన ప్రయాణం. కవిత్వంలో తనదైన ముద్ర వేసినవాడు. ఆయన వాడిన పదాలు, రాసిన వాక్యాలు మనకు తెలిసట్లే అనిపిస్తాయి. కానీ చదువుతున్న కొద్దీ, నెమరు వేసుకుంటున్న కొద్దీ కొత్త అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. అందుకే ఆయన కవిత్వం నరిలంకారంగా కనిపిస్తుంది. కానీ ఆయన వాడి ఇమేజరీలు ఆ కొత్త అర్థాలను స్ఫురింపజేస్తూ ఉంటాయి. అలతి అలతి పదాల్లో అనల్పార్థాలను పలికించే కవిగా అఫ్సర్ ను భావించడానికి వీలుంది. అందుకే ఆయన అలంకారాలన్నీ వొలుచుకున్న మాట కోసం చూస్తున్నా అని అన్నాడు. చిత్రిక పట్టని/ ఒకే ఒక గరుకుపదం కోసం చూస్తున్నా అని కూడా అంటాడు. అదే అఫ్సర్ కవిత్వంలోని మార్మికత. ఓ కొత్త నిరలంకారమైన అభివ్యక్తితో మననం చేసుకుంటున్న కొద్దీ లోలోతు అర్థాలను స్ఫురింపజేసే కవిత్వం అఫ్సర్ ది. 

అసలు సిసలైన వచన కవిత్వ లక్షణం అతి సాధారణంగా కనిపించే పదాలూ వాక్యాలతో కొత్త అర్థాలను స్ఫురింపజేయడం. ఇందులో పరిణతి సాధించిన కవి అఫ్సర్. తాను అనుభవించి పాఠకుల అనుభవంలోకి ప్రయాణం చేసే కవి అఫ్సర్. అందుకే అఫ్సర్ స్వీయానుభవాలు కూడా సార్వజనీనం అయ్యాయి. కావాలంటే ఆయన కవిత్వం "అప్పటి నుంచి ఇప్పటి దాకా" చదివి అనుభవించవచ్చు. 

- కాసుల ప్రతాపరెడ్డి

click me!