కోడం కుమారస్వామి పూల పరిమళం: జ్ఞాపకాల కవిత్వం

By Pratap Reddy Kasula  |  First Published Jan 8, 2022, 2:24 PM IST

నెల్లూరులో జరుగుతున్న విప్లవ రచయితల సంఘం 28వ మహాసభల్లో   ఈ రోజు కోడం కుమార స్వామి కవిత్వం  "పూల పరిమళం" ఆవిష్కరణ సందర్భంగా ఈ సంపుటికి చింతకింది కాశీం రాసిన ముందుమాట ఇక్కడ చదవండి


జ్ఞాపకం మధురమైనది కావొచ్చు, చేదుది కావచ్చు, మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు ఎంతకూ వదిలి పెట్టవు. కాలం గడిచేకొద్ది గాయాలు మానిపోతాయని అనుకుంటాము, నిజమే కావచ్చు, మానని గాయాలు కూడా ఉంటాయి. మనుషులు తమ తోటి మనిషితో, ప్రకృతితో నిరంతరం ఘర్షణ పడుతుంటారు. ఫలితంగా మానవులు మనిషిగా రూపొందుతారు. అందుకే అనుభవాల, జ్ఞాపకాల ఆలంబనగా పరిణామ చరిత్రను పునర్మూల్యాంకనం చేస్తుంటాం. సమాజ చరిత్రలో భాగంగానే మన జ్ఞాపకాలు, అనుభవాలు రూపొందుతాయి. అయితే జ్ఞాపకం వ్యక్తి స్థాయిలోనే ఉండిపోతే సామాజిక శక్తుల చరిత్రను నిర్మించటం అసంపూర్ణమవుతుంది. అందుకే సమిష్టి జ్ఞాపకాల కలపోత ఉత్పత్తి శక్తులను సంపదత్వం చేస్తుంది. 

అయితే భారతదేశంలో అందరి జ్ఞాపకాలకు సమాన స్థాయి ఉండదు. కొందరి జ్ఞాపకాలు – అనుభవాలు చాలా గొప్పవి. కొందరి జ్ఞాపకాలకు పట్టింపే ఉండదు. ఇక్కడి సామాజిక నిర్మాణాన్ని బట్టే జ్ఞాపకాల ప్రాధాన్యతలు ఏర్పడుతాయి. అయితే ఎవరి జ్ఞాపకాలను వాళ్లు పదిల పర్చుకుంటారు. కొందరు జ్ఞాపకాలను అల్లిక రూపంలో భద్రపరచుకుంటారు. ఇంకొందరు లేఖన రూపంలో రికార్డు చేస్తారు. లేఖన రూపంలో భద్రపరచుకున్న జ్ఞాపకాలకు ప్రధాన స్రవంతి ప్రాధాన్యత ఏర్పడుతుంది. కనుకనే అక్షరానికి దూరమైన సమూహాల జ్ఞాపకాలు అజ్ఞాతంగా ఉండి పోతాయి.

Latest Videos

జీవితం, అనుభవం, జ్ఞాపకం దండిగా ఉన్నవాళ్లు సాహిత్య మెళకువలు తెలిస్తే సృజనాత్మక వ్యక్తీకరణ సంపదత్వంగా ఉంటుంది. సారవంతమైన జీవితం ఉన్నవాళ్లు శక్తివంతమైన సాహిత్యాన్ని సృష్టిస్తారు. తెలుగు సాహిత్యంలో ఈ కాలపు వ్యక్తీకరణకు ప్రత్యేక స్థానం ఏర్పడటానికి కారణం రాపిడి పడిన జీవితంతో రాస్తున్న రచయితలు ఉండటమే. కవిత్వం, పాట, కథ, నవల, నాటకం భిన్న సాహిత్య ప్రక్రియలలో కొత్త గొంతుకలు విన్పిస్తున్నాయి. ‘గాయపడిన కవి గుండెలలో రాయబడని’ కావ్యాలే కాదు, రాస్తున్న కావ్యాలే నేటి వాస్తవికత. 

ఈ సాహిత్యావరణంలో చూస్తే కోడం కుమార స్వామికి తాను పుట్టిన కులం, అనుభవించిన జీవితం, పొందిన జ్ఞాపకాలు సాహిత్య దినుసులయ్యాయి. సాలె పురుగు తన వలయాన్ని అల్లుకున్నట్లు, నేతకాడు రంగురంగుల వస్త్రాన్ని నేసినట్లు, విలుకాడు తన లక్ష్యానికి గురిపెట్టినట్లు ఈ కవి తన జ్ఞాపకాలను ఒడుపుగా కవిత్వం చేసాడు. సమాజంలో ఏ విద్యనైనా సృజనాత్మకం చేయాలంటే దాన్నొక క్రమ పద్ధతిలో నిర్వహించాలి. కవిత్వం అంతే. దాని నిర్మాణం, దాని రూపం, దాని శిల్పం తెలిసినప్పుడే అదొక సృజనాత్మక కార్యకలాపం అవుతుంది. జ్ఞాపకమే ఒక లలితమైన సమాసం. కుమారస్వామి జ్ఞాపకాలు మధురమైనవి, సున్నితమైనవి. కవిత్వం కలనేత అతనికి జీవితమే నేర్పింది. అక్షరాలను అందుకోవడానికి ఎంతో తపించాడు. కాన్గి బడిలో అక్షరంతో చెలిమి చేసాడు. అధ్యయన సంస్కారం అతని కవిత్వంలో లోతును ప్రదర్శించింది. జీవితానికి సరైన సాహిత్యం పరిచయం కావటం అతని కవితా దారిని సులభం చేసింది. కుమార స్వామి తండ్రి చదివే చతుర, విపుల ప్రభావం నుంచి తప్పించుకొని మహా ప్రస్థానంతో పరిచయం పెట్టుకున్నాడు. బాంచెన్ నీ కాల్మొక్త నవలను తన తండ్రి అధ్యయనం చేస్తుంటే.....ఆ బాంచె బతుకులకు కారణాలను తెలుసుకునే పనిలో కుమార స్వామి పడ్డాడు.

నెల్లుట్లలో పాఠశాల విద్య అనంతరం జనగాంలో కళాశాల విద్య అతనిలోని అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పింది. కదన రంగంగా ఉండిన కళాశాలలు ఆ కాలపు యువతలో రాజకీయ చైతన్యాన్ని ప్రోది చేసాయి. సమాజం గురించి, దాని నిర్మాణం గురించి, పరిష్కార మార్గాల గురించి చెప్పే ఆలోచనల నుంచి ఆ కాలపు యువత తప్పించుకోలేక పోయింది. మౌనంగా ఉండటమంటే నేరం చేసిన వాళ్లలా భావించుకునే తాత్విక భావ ధారను సమష్టిలో భాగంగా కుమార స్వామి సొంతం చేసుకున్నాడు. అనేక అసమానతలతో నిండిన గ్రామాల నుంచి హైదరబాద్‌కు చేరుకున్న యువతకు క్యాంపస్ ఒక సాంత్వన. ఓయూ క్యాంపస్ రంగుల ప్రపంచం. రాజకీయాలు, సాహిత్యం, ఉద్యోగం కోసం ప్రిపరేషన్, ప్రేమలు, కవిత్వం ఇలా ఎవరికి ఏది కావాలంటే అది లభిస్తుంది. కుమార స్వామికి మాత్రం కవిత్వం పరిచయం అయింది. ఆర్ట్స్ కాలేజ్, ల్యాండ్ స్కేప్, ఎన్‌.ఆర్.ఎస్ హాస్టల్, త్రివేణి హాస్టల్, ఎన్.సి.సి చౌరస్తా ఇవన్ని యవ్వనంలో విద్యార్థులకు కావలసిన జ్ఞానాన్ని పరిపక్వతను, జీవితం పట్ల స్పష్టతను ఇస్తాయి. 

స్థానీయతంతా ఈ కవి అంతర్లోకాలలో భాగమయింది. కుమార స్వామి హైదరాబాద్‌కు వచ్చిన కాలంలో సీరియస్ సాహిత్య చర్చలు జరుగుతుండేవి. దళిత, స్త్రీవాద, విప్లవ, తెలంగాణ సాహిత్య పరిమితులు, కొనసాగింపు, అనివార్యతలు మొదలైన విషయాల మీద ప్రెస్ క్లబ్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభలు, చర్చలు జరుగుతుండేవి. ఈ ప్రభావమంతా ఈ కవి మీద, అతని కవిత్వం మీద వస్తువు నాశ్రయించిన రూపంలా ఉంది. ముఖ్యంగా త్రివేణి హాస్టల్‌లో విపరీతమైన సాహిత్యం చదువుకొని ‘అన్ రెస్ట్’ తో ఉన్న కవులు, విమర్శకులు కలుస్తుండే వాళ్లు. వారి తీవ్రమైన చర్చలకు కుమార స్వామి మౌన శ్రోత. ఫలితంగా బాల్యంలోనే పరిచయమైన మహా ప్రస్థానాన్ని ఎన్ని కోణాలలో చదువవచ్చో, విశ్లేషించవచ్చో అర్థమయింది. ఇదిగో ఇంత నేపథ్యం తెలిస్తే తప్ప కుమార స్వామి కవిత్వం అర్థం కాదు.

పాతిక సంవత్సరాల అతని జ్ఞాపకాలన్ని "పూలపరిమళం"  కవిత్వంలో విస్తరించాయి. తల్లి, తండ్రి, తెలంగాణ, నిరుద్యోగం, కవులు, ఖైదీ, విప్లవం, అమరత్వం, దండ కారణ్యం మొదలైన కవితా వస్తువులు అతని కవితా వైవిధ్యానికి అద్ధం పడుతాయి. కుమార స్వామి కవిత్వ ఎత్తుగడ చిక్కగా ఉంటుంది. ఒకోసారి కథనాత్మక శైలిని వ్యక్తం చేస్తుంది. ప్రసన్న కథ దానికదిగా పొందుతూ అక్షరరమ్యతను పొదుగుతుంది. పట్నంలో చదువుకునే పిల్లల మీద తల్లులకు ఎన్నో ఆశలు. ఆ ఆశలను డబ్బు చేసుకునే కోచింగ్ సెంటర్లు, వందల ఉద్యోగాల కోసం లక్షల మందిని పరుగు పందెంలో నిలబెట్టే ప్రభుత్వాలు, ఇవేవి తలియని అమాయక తల్లిందండ్రులు..... కనిపించని దేవున్ని వేడుకుంటారు.

“ఓ ముడుపు కలను వేలాడదీస్తావు
అది నాలాగే ఎండకు ఎండి
వానకు తడిసి ఫలించని కాయలాగే
రాలుతుందని తెలియదేమో” (కారటు)

ఈ కవిత కలత నిద్రలో రూపొందుతుంది. చదువుకునే యువకులకు సహజంగా ఉండే కలత ఇది. తల్లికి మాత్రమే చెప్పుకోగలిగిన గుండె గాయం. తల్లి జ్ఞాపకం వస్తే కొడుక్కు దుఃఖం. కొడుకు కన్నీరు రాలితే తల్లి పేగు కదులుతుంది. ఈ పరస్పర ఆత్మీయ స్పర్శను కుమారస్వామి కవితాగానం చేసాడు.

సమస్త ప్రపంచంలో భౌతిక శక్తి ప్రజ. పాలక వర్గాన్ని కూల్చి ప్రజారాజ్యాన్ని నిర్మించే శక్తి ప్రజలకు ఉంటుంది. అయితే ప్రజలను మానసికంగా ఆచరణాత్మకం చేయాలంటే, వారి ఆలోచనలకు పదును పెట్టాలంటే ఒక సిద్ధాంతం అవసరం, దానిని రూపొందించే బుద్ధి జీవులు చేసే కృషి ఉద్యమానికి ఆధారంగా ఉంటుంది. ఒక్కోసారి పోరాటంలో ఒరిగిపోయిన వీరుల జ్ఞాపకాలను కూడా భౌతిక శక్తిగా మార్చే పనిని కవులు, రచయితలు చేస్తారు. కవి మనసులో అలజడి చెలరేగితే కవిత్వమై ప్రవహిస్తారు.

“నిద్రలేని ప్రతి అర్థరాత్రుల్లో
నా జ్ఞాపకాల్లో నీ ఆలోచనల పేజీలనే
అధ్యయనం చేస్తున్నాను.” (కలం కలలు)

వేళ్ల సందులో కలాన్ని ప్రసవించిన కాలం అక్షరాన్ని సుతారంగా ఆయుధం చేస్తుంది. అది నడుస్తున్న కాల వైచిత్రి. వీరులు పోతూ పోతూ దారి వేస్తారు. ఆ దారి వెంట నడుస్తున్న కవి ఇరువైపుల విత్తనాలను చల్లుతాడు. వీరుల పోరాటం ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. అలాంటి జ్ఞానాన్ని కవి పొందితే పూల పరిమళ కవిత్వం వికసిస్తుంది.

ఈ కవికి అక్షరాల మీద ఎనలేని పావురం. నిజమే అక్షరాన్ని ఆబగా అందుకున్న వాళ్లకే దాని విలువ తెలుస్తుంది. కుమార స్వామి తన బాల్యమంతా అక్షరాల కోసం తపించాడు. పుట్టిన కులం అక్షరానికి, సంపదకు నిషిద్ధం. రాజ్యాధికారం మరీ నిషేధం. ఈ పరంపరలో నడుస్తున్న కవి అక్షర ఆవేదనను కలం కూలీగా వ్యక్తీకరించాడు. దేహానికి సందేహానికి జరిగే ప్రచ్ఛన్న యుద్ధంలో నలుగుతున్న జర్నలిస్టు జీవితాన్ని ఈ కవితలో చూడవచ్చు. నెత్తుటితో ముఖం కడుకుంటున్న సూరీడు వెలుగుకు బదులు శూన్యాన్ని ఉదయిస్తే జీవితాలలో ఎంతటి విషాదం నెలకొంటుందో దాచేస్తే దాగని సత్యం. అభివృద్ధి వెలుగు నీడలలో మనిషి ఎక్కడ? అనే ప్రశ్న వేసుకుంటే విషాదకరమైన సమాధానమే వస్తుంది. 

ఏ కవి అయినా మానవీయ స్పర్శను కలిగి ఉంటారు. మనిషి కోసం ఆరాటమే కవితా లక్ష్యం. మానవుడు మనిషిగా ఎదిగే క్రమంలో మానవ సంబంధాలు, ఉత్పత్తి సంబంధాల నుంచి ఏర్పడ్డాయి. ఉత్పత్తి శక్తుల మధ్య ఏర్పడే సంబంధాలే సజీవ సంబంధాలు. సమాజాన్ని ఉన్నతీకరించడానికి ఉత్పత్తి శక్తులే కృషి చేస్తాయి. అయితే అసమాన ఉత్పత్తి సంబంధాలను మార్చడానికి వర్గ పోరాటం అనివార్యం. అలాంటి పోరాట క్రమంలో ఉండే సున్నితపు విషయాలను కుమార స్వామి కవిత్వం చేసిన తీరు అభినందనీయం. వర్గపోరాటాన్ని మొరటుగా లేదా నిగూఢంగా వ్యక్తీకరించి ఇదే కవిత్వమని  చెప్పేవారికైనా, విప్లవ కవిత్వంలో శిల్పం పాత్ర శూన్యమని రాసే విమర్శకులకైనా ఈ కవిత్వం సరైన సమాధానం చెబుతుంది.

కవితను ఎత్తుకున్న తీరు, దానిని నిర్వహించిన వ్యూహం, సంవిధానం ఉద్దేశ్యపూర్వక ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతున్నాయి. కవికి, కవిత నిర్మాణానికి తాత్విక పునాది ఉంటే అది వ్యక్తం చేసే భావ సంచయం గంభీరంగా ఉంటుంది.

“రాత్రొక మరణం
ఉదయమొక జననం
పొద్దస్తమానమే జీవితం”

ఈ కవితా పాదాల గురించి విశ్లేషణ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే కవితలో మార్మికతను జయించిన తీరు భావాల ప్రవాహానికి అడ్డు తగలలేదు.

“చావుకీ బతుక్కీ
మధ్య గీసుకున్న
సరిహద్దు గీతను చెరిపేస్తే
మనిషొక జీవశిలాజం”

సమాజాన్ని క్రియాశీలం చేసి మార్చే శక్తి మనిషికి ఉంటుంది. ఆ మనిషి నిత్యం యుద్ధంలో ఉంటే నమ్మకమే రక్షిస్తుంది. యుద్ధ భూమిలో ఏర్పడే సంబంధాలు జీవిత చరమాంకం వరకు ఉంటాయి. అడవిలోనైనా, మైదానంలోనైనా మనిషికీ మనిషికీ మధ్య విరబూసేది పలకరింపేనని ఈ కవి అంటాడు.

మనకు తెలియక ముందే అసత్యం ఊరేగుతుందని అంటారు. అసత్యానికి సోకులు ఎక్కువ. ఆర్భాటం కూడా ఎక్కువే. కానీ సత్యం నిప్పు లాంటిది. దానిని తాకడానికి ధైర్యం కావాలి. అయితే సమాజంలో అసత్యానికి ఉన్నంత నమ్మిక సత్యానికి ఉండదు. సత్యానికి, అసత్యానికి మధ్య విభజన రేఖను గీసి ఎటు నిలబడాలో తేల్చుకోమని సవాలు వచ్చినప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజంగా సత్యం వైపు నిలబడాలని కుమారస్వామి ఆశ.

“పాల తడారని లేత పెదవి నవ్వులతో మాట్లాడాలి
మృత్యు ఒడి చేరుతూ అలసిన కనుపాపతో మాట్లాడాలి
మనో పుటలో రాసుకున్న అక్షరాలతో మాట్లాడాలి
సత్యం అసత్యమై ఊరేగుతున్నప్పుడు మాట్లాడాలి”

     
ఈ కవితను కవి జాగ్రత్తగా నిర్మాణం చేసాడు. కవితా పాదాలను మాగపెట్టాడు. “గుండె పటువ కన్నీటి నెత్తురు బరువైనపుడు సుట్ట కుదురై మాట్లాడాలి” ఈ పాదం బరువైన ప్రతీక, సున్నితపు ఊహ కలిసి చిక్కటి కవితను రూపొందించాయి.

శాంతికోసం యుద్ధం జరుగుతుంది. ఈ సూత్రీకరణ ప్రజల వైపు నుండి ఉంటుంది. పాలకులైతే ఏ కాలంలో నైనా సరే మార్కెట్ కోసం, ఆధిపత్యం కోసం ప్రజల మీద యుద్ధం చేస్తారు. ఈ కవి అల్లూరి, ఆజాద్, బుద్దుని సమన్వయం చేసింది ఈ అర్థంలోనే. బీభత్సం ఉన్న చోట శాంతి కపోతాలు ఎగురాలంటే సామూహిక గానం అవసరమొస్తుంది. కవి సమస్త ప్రకృతితో సంలీనం చెందాలి. రైతు కళ్లలో ఆనందం కోసం గొంతు కలిపే మౌలిక లక్షణం కలానికి ఉండాలనే అవగాహన ఈ కవికి ఉంది.

“వెన్నెలధారను ఆవహిస్తున్న
నిషేధ రాత్రిలో సామూహికంగా
ఓ కలకు ప్రాణమిద్దాం”    

ఈ కవితా పాదాలను అలంకరించిన సున్నితపు భావన కవిత్వాన్ని ఉన్నతీకరించింది. మునుపటి కవి సమయాలను కూడా పూర్వ పక్షం చేసేలా కుమార స్వామి ఒడపుగా కవిత్వాన్ని అల్లాడు. ‘రాజరికం లేని రాజ్యం, సైన్యం లేని యుద్ధం’ ఈ కవి కల. దానిని సాకారం చేసుకోవాలనే తపననే ఈ కవిత్వం.

భారతదేశంలో ఉత్పత్తి శక్తులంటే వృత్తులే. ఉత్పత్తి సంబంధాలంటే కుల సంబంధాలే. ఇక్కడ కులమే వర్గం, వర్గమే కులం. భారతదేశ చరిత్రలో బానిస సమాజానికి బదులు వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది. ఈ పునాది అవగాహన ఉండటం ప్రగతిదాయక శక్తులకు బలాన్నిస్తుంది. ఇక్కడ చెప్పులు కుట్టిచ్చినవాడు అంటరాని వాడయ్యాడు. శరీరాన్ని, బట్టలను శుభ్రం చేసిన వాడు అతి శూద్రులయ్యారు. ప్రకృతి వైచిత్రిని మనోఫలకంపై ఆవిష్కరించుకొని వ్యక్తమయ్యే మనుషులు ఉత్పత్తి కులాలలో ఉంటారు. కవిత్వంలో వస్తు శిల్ప కలనేతను సాధించటం కూడా కుమారస్వామికి సహజంగా అబ్బిందే తప్ప ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాస హేతువుల వలన కాదు. ‘మా నరాలే దారాలుగా’ అని ఒక సందర్భంలో చెరబండరాజు రాసింది కూడా ఈ అర్థంలోనే. ఈ కవి కవితా వాక్యాలు చూడండి.

“అతని చూపులకు ప్రకృతి
పరవశించి నెమలి వెన్నెల ఒన్నెలు 
సమ్మోహనమై ఆకాశమే బంగారు
వెండి పడుగు పేకలై తీరొక్క పూల
చీర ఇంట్లో సింగారిచ్చుకుంటది”    

ఈ సంస్కృతికి బట్టను కట్టడం నేర్పిన తాత్వికుడైన నేతన్న జీవితాన్ని ఎవరు ఆవిష్కరించగలరు....? అందుకే ఆర్తిగా అతని గురించి

“బొంత పేగుల జీవన సమరంలో
మీ ఇంటికొస్తే చేనేత వస్త్రమై
ఆలింగనం చేసుకొండ్రి”

ఈ వాక్యం ఇంకెవరైనా రాయాలంటే చచ్చి పుట్టాలి. సిద్ధాంతాలు చెప్పినంత సులభం కాదు, ఆచరించడం. స్వావలంబనను దెబ్బతీసే పాలకులు పెట్టుబడికి అమ్ముడుపోతారు. మరి ప్రజల సంగతి!? కనీసం ఆ మనిషి ఆవేదనను పట్టించుకొమ్మని కవిగాడి ఆర్తి. “గొంతులో ఉరుములకు, చేతి బరిగె మెరుపులకు, మెలిపెట్టిన బాధకు కన్నీటి వాన” గా కవి జీవితాన్ని తీర్చిదిద్దిన కలనేతగాడు అతని తండ్రి.

కుమారస్వామి జీవితం మీద పోరాటం మీద అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఆయనకు ఇది తప్ప ఇంకోదారిలేదు. కాస్త నిదానంగానైనా కాళ్లు, చేతులు సరి చేసుకొని నడిచే వ్యక్తిత్వం ఆయనది. పవిత్ర ఆశయంగా కాకుండా, పరివ్యాపితమైన ఆచరణగా వ్యక్తమయ్యే కవి ఆలోచనలు విశాలం, ఆచరణ విస్తృతం, ఆకాశమంత కవిత్వం. అందుకే ఆయన కవిత్వంలో వస్తువు వైవిధ్యం ఉంది.

“ఆకురాలిన శబ్దానికి ఉలిక్కిపడి
చెట్టు ఎండిపోతుందని” అనుకునే వాళ్లకు ప్రకృతి పులకరిస్తుందనే కార్యాకారణ సంబంధాన్ని శాస్త్రీయంగా చెప్పాడు. వృక్షశాస్త్ర పరిభాషలోనే వ్యక్తమయ్యాడు.
కుమార స్వామి జీవితం చాలా సరళమయింది, సౌందర్యాత్మకమయింది. కవిత్వం కూడా అంతే. కానీ, కొన్ని చోట్ల కవిత్వంలో అన్వయ క్లిష్టత ప్రవేశించింది. ప్రారంభం ఎంత గంభీరంగా ఉంటుందో రాను రాను కొన్ని కవితలలో పట్టు సడలుతుంది. అల్లికలో సాంద్రతను సాధించే క్రమంలో మార్మికతను ఆశ్రయించినట్లు తెలిసిపోతుంది. ఈ పరిమితిని ఆయన దాటాలని, దాటగలడనే విశ్వాసం ఉంది.

‘రాలిన పూలను వీడని త్యాగ పరిమళాన్ని’ కవిత్వమై విస్తరించిన కోడం కుమార స్వామి ‘పూల పరిమళం’ వెదజల్లుతూ తన ఇరవై ఏళ్ల కవిత్వాన్ని తెలుగు పాఠకుల ముందుకు తెస్తున్నాడు. మేము 1998 కాలంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో తలమునకలై ఉన్నప్పుడు తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ (TSF) కార్యక్రమాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటూ అమరుడు రమణయ్య, ప్రసాద్‌లతో దగ్గరి స్నేహం కలిగి ఉండి క్యాంపస్ జీవితాన్ని చైతన్యంగా మార్చుకున్న ఈ కాలపు కవి కుమార స్వామి. ‘మనిషి పూల పరిమళం’ కావాలని కోరుకుంటున్న అతని పూల పరిమళ గ్రంథంలోకి మీకు స్వాగతం పలుకుతూ...
 

click me!