సిరిసిల్ల కార్మికుడి తాలూకు యాంత్రిక జీవనం ఎటువంటిదో, ఆ యంత్రాల మధ్య ఉంటూనే మెత్తటి హృదయాన్ని కాపాడుకుంటూ ఆధునిక తెలుగు కవిత్వంలోకి ఆనివార్యంగా ఈ కవి అత్యాధునిక ‘పవర్ లూం పోయెట్రీని ప్రవేశపెడుతున్నుడు. ఇది చాలా విశేషమైన ప్రస్థానం.
ఎందరో పద్మశాలీలు చేనేత పరిశ్రమ గురించి, పోగు బంధం గురించి కవిత్వం రాశారు. తమదైన అభివ్యక్తితో కవులుగా రాణించారు. ఐతే, ఆడెపు లక్ష్మణ్ వారికి మరొక ముందడుగు. అయన మరనేత కవి. ఆధునిక సమాజం మార్పు చెందుతూ నవ నాగరీకం అయినట్లే, చేనేత నుంచి మరనేత పరిశ్రమలోకి మారిన సిరిసిల్ల, ఈ కవిని తన అంతరంగికుడిగా ఎంచుకున్నట్లు ఉన్నది. ఇతడితో తన ప్రత్యేక వేదనను వినిపిస్తున్నది. అందుకే ఇతిడి కవిత్వంలో మర మగ్గాలకు కేంద్రమైన సిరిసిల్ల పరిశ్రమ తాలూకు అస్తిత్వ వేదన వినిపిస్తుంది. అతడి కవిత, విధి రాతను తప్పించుకోలేని ‘ఇనుప గజ్జెల రోదన’ను, అందలి నిశ్శభ్డ హింసను ఎంతో ఘాడంగా వ్యక్తం చేస్తుంది.
undefined
సిరిసిల్ల కార్మికుడి తాలూకు యాంత్రిక జీవనం ఎటువంటిదో, ఆ యంత్రాల మధ్య ఉంటూనే మెత్తటి హృదయాన్ని కాపాడుకుంటూ ఆధునిక తెలుగు కవిత్వంలోకి ఆనివార్యంగా ఈ కవి అత్యాధునిక ‘పవర్ లూం పోయెట్రీని ప్రవేశపెడుతున్నుడు. ఇది చాలా విశేషమైన ప్రస్థానం.
సిరిసిల్ల వస్త్ర ప్రపంచంలోని పాతిక వేల కుటుంబాల్లో ఆడెపు లక్ష్మణ్ కుటుంబం ఒకటి. తల్లి, భార్య, కొడుకుతో అయన రాజీవ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం ఇరవై నాలుగు సాంచాలను నడిపే అసామిగా జీవిస్తున్నాడు.
కార్ఖానా, దానికి అనుభందంగానే ఉండే యజమాని ఇచ్చిన ఇల్లు, నెలనెలా నడిపినందుకు జీతం, ఇది తనకు జీవిక ఐతే, కవిత్వం అతడికి ఊపిరి. అన్నట్టు, మరచిపోకూడని విషయం.మాలిమి ఐన శునకం ఆయనకు ఆత్మీయ చెలిమి.
సిరిసిల్ల జీవితాన్ని అడ్డుకోత, నిలువు కోత తీస్తే పురుషుడు దడదడ లాడే శబ్ద ప్రపంచంలో నిలబడి సాంచాలపైన పనిచేస్తూ కనిపిస్తాడు. స్త్రీలు బీడీలు చుడుతూ నిశ్శబ్ద చాకిరీలోనిమగ్నమై ఉంటుంది.
ఇంకా చెల్లుబడిలో ఉన్న ఇక్కడి జీవన నాణానికి ఈ రెండు దృశ్యాలు చిత్తూ బొత్తూ. ఆడెపు లక్ష్మణ్ కవిత్వంలో ఈ రెండూ రూపు కట్టడం ఒక ప్రత్యేకత. అతడి కవిత్వం అలుపెరగని పరిశ్రమకు సహజమైన స్పందన.
లక్ష్మణ్ శ్రీమతి అరుణ ఇక్కడి కుటుంబాలకు అచ్చమైన ప్రతీక. అందుకే అతడి కవిత్వం కేవలం వైయుక్తికం కాదు, తానూ తన కుటుంభం, సంస్థ పద్మశాలీ ప్రపంచానికి ప్రతిబింబం. అందుకే ఈ కవి అనివార్యమైన సిరిసిల్ల ఎదురీతను తన అక్షరాల్లో ఆవిష్కరిస్తాడు.
లక్ష్మణ్ మరమగ్గం సృష్టించిన కవే కాదు, తునికాకు, తంబాకుల నుంచి జనించిన కవిత్వ ధార కూడా. బీయస్ రాములు ఒక నాటి వచనం ఐతే, ఇతడు ఇక్కడి వర్తమాన కవిత్వం.
ఈ సామాన్యుడు నేడు ఒక లూన. ఒక మగ్గం. తన రోజువారీ జీవితం ఇప్పుడు సారస్వతం. తానొక కార్మికుడు, ఆసామి. కొడుకూ, తండ్రి. ఆయన కవితా సంపుటి శీర్షికలు బలంగా ఎదుగుతున్న ఒక సిరిసిల్ల కవిని పట్టిస్తాయి.
తెలుగు కవిత్వంలోకి అత్యంత బలంగా అయన ఇక్కడి డ్యూటీల గురించి ‘రాత్ పైలీ ’, ‘దివస్ పైలీ ’ అన్న పదాన్ని శీర్షికగా ప్రవేశపెట్టడం అన్నది కేవలం ఒక పద బంధం కాదు. అధిక్కడి అవిశ్రాంత జీవితానికి ప్రతీక. కటిన శ్రమకు ఉదాహరణ.
తొలి కవితా సంపుటి ‘సిరిసిల్ల నానీలు’ అయన తన అస్తిత్వాన్ని, సరళ హృదయానికి మార్మికంగా చెబితే, ‘రాత్ పైలీ ’, ‘దివస్ పైలీ ’ గుండెల్ని పిండేసే జీవన గీతాన్ని వినిపిస్తుంది. ఇక, తాజాగా , అచ్చుకు సిద్దమైన తన కవితా సంపుటి కామ్ గార్’. ఇందులో తనను తాను పూర్తిగా కార్మికుడిగా మార్చిన మొత్తం పరిశ్రమను, అందులో తాను అణువణువూ అంకిత మొనర్చిన విధానాన్ని అపూర్వంగా అవిష్కరిస్తున్నడు.
విశేషం ఏమిటంటే రాను రాను నిర్దిష్టత వైపు కవి ప్రయాణించడం. విశ్వ మానవుడి నించి కార్మిక గీతంలోకి పూర్తిగా ప్రవేశించడం. ఇదీ ఆడెపు లక్ష్మణ్ ను సిరిసిల్ల ఆధునిక కవిగా, మరమగ్గ కవిగా మార్చుతున్నది. మానవీయం కావలసిన పారిశ్రామిక యంత్ర భూతాన్ని రక్త మాంసాలతోనూ, కదిలోపోతున్న ఆత్మతోనూ ఆవిష్కరించేలా చేస్తున్నది.
తాను ఉదయం పూట దినపత్రికలు చదవడం, గురువులైన సుప్రసిద్ధ కవి శ్రీ జూకటి జగన్నాథం, తదితర సోదర కవులతో కరచాలనం, సాయంత్రం లోకల్ కేబుల్ లో వార్తలు రాయడం, వీటి మధ్య జరిగే జీవన యానం అంతా కూడా తన కవిత్వంలో మనం చదువుకోవచ్చు. ఒక్కమాటలో సిరిసిల్ల గతానుగతం, వర్తమానం అయన నేసిన తీరుకు మనం ముగ్ధులం కాకతప్పదు.
త్వరలో అచ్చుకు వెళుతున్న నూతన కవితా సంపుటి సందర్భంగా ఇది అచ్చమైన జీవకవి ఆత్మీయ పరిచయం. పుస్తకం వచ్చాక వారి కవిత్వం లోతుల్లోకి వెళ్లి చర్చిద్దాం.
-కందుకూరి రమేష్ బాబు
(వ్యాసకర్త ఇండిపెండెంట్ జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్)