"ఎర్రగాలు"లో మత్తడి దుంకిన తెలంగాణ మట్టిపదాలు

By telugu team  |  First Published May 12, 2021, 3:52 PM IST

కూకట్ల తిరుపతి కవితా సంపుటి "ఎర్రగాలు" పైన కందుకూరి భాస్కర్ చేసిన సమీక్ష


తెలంగాణ మట్టి గట్టితనాన్ని,  తెలంగాణ మట్టి వాసనలను,  తెలంగాణ తెగింపును, తెగతెంపుల కొట్లాటను, తెలంగాణ పండుగలను, పబ్బాలను, గంగాజమునా తహజీబ్ వంటి సంస్కృతిని, తెలంగాణ మట్టి మనుషుల భాషలో  కవిత్వంగా మలచడంలో కూకట్ల తిరుపతి చేయి తిరిగినకవి.  పురాగ ఖుల్లం ఖుల్లాగా మెదిలే తెలంగాణ జనాల   నైల్లమెరుగని నైజాన్ని కైతలు కట్టడంలో ఈయన దిట్ట.  కూకట్ల తిరుపతి వృత్తిరీత్యా ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడు.   ప్రవృత్తిరీత్యా తెలంగాణ అస్థిత్వవాద రచయిత.   ఇటూ వృత్తి నిబద్ధత, అటూ సామాజిక బాధ్యతలను గుర్తెరిగి రచనలు చేస్తూ, తెలంగాణ మట్టి కవిగా రాణిస్తున్నాడు.

ఈయన మారుమూల పల్లెటూరు మద్దికుంటలో పుట్టి పెరిగిన వాడవుటచే, పల్లె పదజాలాన్ని ఒంటబట్టించుకొన్నాడు.  మేలుకొలుపు వచన కవిత్వం, చదువులమ్మ శతకం, పల్లెనానీలు అనే పుస్తకాలలో తెలంగాణ నుడిని విరివిగా వాడి,  సాహితీ లోకంలో తెలంగాణ మట్టిపదాల కవిగా గుర్తింపు పొందారు.  ఈ తెలంగాణ జానుడి కవి కూకట్ల తిరుపతి కలం నుండి ఇటీవలి కాలంలో జాలువారిన వచన కవితా సంపుటియే ఎర్రగాలు.

Latest Videos

undefined

ఈ "ఎర్రగాలు" పుస్తక రచనతో అతను సాహిత్యంలో మరో మెట్టు పైకెదిగినాడని చెప్పొచ్చు.  ఒక ఏడాదిలో వచ్చే ప్రధాన పంట కాలాలను తాబి/ఖరీఫ్(వాన కాలం పంట), ఆబి/రబీ(వేసవి కాలం పంట) అని పిలుస్తారు. ఎర్రగాలు అనేది ఏసంగి పంటకాలం తర్వాత వానకాలం పంట వేయడానికి ముందు వచ్చే ప్రత్యేకమైన పంటకాలం. "ఎర్రకారు" రూపాంతరమే "ఎర్రగాలు".  కారు అంటే కార్తె అని అర్థం.  దీన్నే కొన్ని దుక్కల్ల చింతపువ్వు కార్తె అని అంటరు.  ఈ పదంల "కా-గా" గా మారుడు గసడదవాదేశం. "రు-లు" గా మారుడు. రలయో రభేదః అనే సూత్ర ప్రకారం "ర-ల"గా మారుతుంది.  కాబట్టి "కారు" అనే పదం కాల గమనంలో "గాలు"గా మారుంటుంది. "ఎర్ర" అంటే ఎరుపు. ఎండను ఎర్రటి ఎండ అనడం తెలంగాణల రివాజు.  కాబట్టి ఎర్రగాలు అనగా మండుటెండ కాలంగా, ఎర్రటి ఎండల పంటగా చెప్పుకోవచ్చు.

అశ్వనీకార్తెలో ఈ పంట వేసుడు సురువైతది.  నీటి ఎద్దడి కాలంలో తక్కువ రోజులలో పండే వరి పంటను ఈ కాలంలో వేసేవారు.  తెలంగాణ రైతులు వాడే పదం ఎర్రగాలును కూకట్ల తిరుపతి పుస్తకం పేరుగా పెట్టి, మరుగున పడిపోయిన దేశీపదాన్ని వెలుగులోకి తెచ్చాడు.   ఈ పుస్తకములో ఇలాంటి అనేక పల్లె పదాలను, మరుగున పడిపోతున్న తెలంగాణ పదాలను కవి తన కవిత్వం ద్వారా ఇప్పటి ప్రపంచానికి తెలియజేశాడు.  ఎర్రటి ఎండాకాలంలో  వచ్చే ఈ పంటపై కొందరు రైతులు ఆధారపడేవారు. కానీ ఎర్రగ బుర్రగ ఎర్ర  తేలోలె వున్నా/ ఎండి ఎర్రగప్పవుడే/ ఎర్రగాలు దెబ్బకు.... అని రైతుల యొక్క దీనస్థితిని కవిత్వ రూపంలో మన కళ్లముందుంచాడు  కూకట్ల తిరుపతి.

పుస్తకంలో మొదటి కవిత "కవిత్వం".  ఇందులో "సామాన్యుని తలలో నాలుక/ గాయపడిన  ఉవిదలకు ఓదార్పు/ అణచబడినోడి కరాయుధం/ జన చైతన్యం కవిత్వ పరమార్థం" అని ఆనాటి వెట్టి చాకిరిని, కట్టు బానిసత్వాలను నిరసించాడు.  ప్రజలను చైతన్య పరిచేదిగా,  సమాజంలో అణచబడిన వారికి,  చెరచబడినవారికి కవిత్వం ఒక ఆయుధంగా ఉండాలని కవి కాంక్షించాడు.  అమ్మ కవితలో "కడగండ్లను కంటి రెప్పల/ మాటున ఒడిసిపట్టి/ సతతం అమృతం కురిపించడం/ కమ్మని అమ్మ మనసుకే సాధ్యం"  అంటూ కన్న పేగు మమకారాన్ని హృద్యమైన రీతిలో కవీత్వకరించాడు.  తన రక్తమాంసాలను ధారవోసి, మనకు జన్మనిచ్చి, కంటికి రెప్పోలే కాపాడుతూ, పెంచి పెద్ద జేసిన అమ్మ తనాన్ని అర్ద్రంగా ఆవిష్కరించాడు.

వ్యవసాయంలో వెన్నుదన్నుగా ఉంటూ, కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఇంటికి దీపమై వెలుగుతున్న తన భార్య కూకట్ల లక్ష్మి గురించి తిరుపతికవి "ఆదరించే అమ్మ/ సేవలందించే చెల్లెలు/  మార్గదర్శనంలో మిత్రురాలు/ ఆదమరిచే వేళ మేలుకొలుపుతూ/ గమ్యాన్ని చేర్చు పునర్భలనమౌతుంది".  అని ఆమె చేసే సేవలను కొనియాడుతూ చెప్పిన తీరు ఆలోచనాత్మకం. ఎవుసపు పనుల్లో మహిళల భాగస్వామ్యాన్ని, అవసరాన్ని ఈ కైత ఎరుకపరుస్తుంది.   రైతులు అంటే మగవారు మాత్రమే కాదు ఆడవారు కూడా అని గుర్తెరుగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.  నాగటెడ్ల వోలే ఆలుమగలు తండ్లాడితేనే ఎవుసం నడుస్తదని వివరించిండు.  బాల కార్మికులు కవితలో "కూడు గుడ్డ కరువైన తరుణంలో/ పశువుల మంద దాపు చేరినం/ బడి సంచికి బదులు/ గొంగడి భుజానికేసినం/ పలుకా బాలుపానికి బదులుగా/ కర్ర చేత బట్టినం" అని తను బాల్యంలో చవిచూసిన చేదు సంఘటనలను  స్పృశిస్తూ, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, మానవతను మేల్కొల్పాలని ఎలుగెత్తి చాటుతాడు.

 చదువుల పూదోట అనే కవితలో "కులపు కుటిలం సోకనివ్వదు/ మతపు మకిలి అంటనివ్వదు/ పేద గొప్పల విషం చిమ్మదు/ బడి చదువులమ్మ ఒడి" అంటూ కుల, మత, వర్గ, వర్ణ, లింగ వివక్షల వల్లనే మానవత్వం దెబ్బతింటున్నదనీ, అలాంటి కులమతాల గొడవలు లేకుండా, పేద గొప్పల తేడా లేకుండా, కల్మషమనేది అంటకుండా,  తల్లి ఒడిలాగా పాఠశాల ఉంటుందని వర్ణించారు రచయిత.  పల్లె పల్లెన ప్రభుత్వ బడుల అవసరాన్ని యాజ్జేశాడు.  బీదాబిక్కి జనాలకు చదువు ఒక ఆసరా.  "అప్పుల ఊబి/ తిప్పల తాబి/ భరోసా లేని ఆబి/ ఎసరుకు రాని ఎర్రగాలు/ విగత జీవిగా అన్నదాత" అంటూ అకాలం కవితలో రైతుల కడగండ్లను మన కళ్ళముందుంచాడు.  అతారెలు పతారెలు కవితలో "గోచి, గొంగడి, రుమాలే/ మా నిత్య వస్త్రాలు/ కర్ర, కమ్మ కత్తి, గొడ్డలే/ మా వృత్తి అస్త్రాలు" అంటూ గొల్ల, కురుమల రూపాన్ని అక్షరాలలో చక్కగా పొదిగాడు. వాళ్ళు వాడే ఇసిరెలు పసిరెలను అన్నింటిని పేరుపేరునా పేర్కొన్నారు.  ఏ మకిలి అంటకుండా ప్రకృతితో మమేకమైన వారి ఉదాత్త జీవితాలను అచ్చంగా రాశిపోసిండు.

వివిధ సందర్భాలలో రచయిత కూకట్ల తిరుపతి హృదయం నుండి సామాజిక ప్రయోజనం కోసం వచ్చిన కవితల సంకలనమే ఈ ఎర్రగాలు.  ముప్పై ఏడు కవితలు గల ఎర్రగాలు పుస్తకంలో ప్రతి కవిత దేనికదే ప్రత్యేకమైనది.  ఇందులో అన్ని కవితల సారాన్ని గ్రహించాలంటే ఎర్రగాలు పుస్తకాన్ని చదువలసిందే.  ఉపమా, ఉత్పేక్ష, రూపక, స్వభావోక్తులతో పాటు  అంత్యప్రాసలతో పాఠకున్ని అలరిస్తాడు.  సొక్కం లాంటి పల్లె పదాల సొగసులతో ఎర్రగాలు పుస్తకాన్ని అపురూపంగా తీర్చిదిద్దారు రచయిత కూకట్ల తిరుపతి.   కరీంనగర్ కు చెందిన సాహితీ సోపతి ముద్రించిన ఈ పొత్తం చదివితే పల్లె బతుకులలోని తాత్వికత తెలుస్తుంది.   తెలంగాణ తనాన్ని తేట తెల్లం చేసే, ఇలాంటి అచ్చ తెలుగు పల్లె పదాలతో కూడిన రచనలు కూకట్ల తిరుపతి కలం నుంచి అలుగులు దుంకాలని మనసార కోరుకుంటున్న.

ప్రతులకు:
కూకట్ల సాయి భారవి
8-3-207/2/4/E/1,
రోడ్ నంబర్ 7,
వాసుదేవ కాలని,
కట్ట రాంపూర్,
కరీంనగర్ - 505001.
తెలంగాణ రాష్ట్రం

click me!