ముఖ్యమంత్రిపైనే పోటీ... సాహిత్యంలోనే కాదు రాజకీయాల్లోనూ కాళోజిది ఘన ప్రస్థానమే

By Arun Kumar P  |  First Published Sep 8, 2022, 4:45 PM IST

రేపు(శుక్రవారం) కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పండుగగా  అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా మహబూబ్ నగర్ నుండి గుముడాల చక్రవర్తి గౌడ్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇక్కడ చదవండి : 
     


అందరికీ కవిగానే పరిచయమున్న ప్రసిద్ధ తెలంగాణ కవి కాళోజీ ఓ ముఖ్యమంత్రి పై పోటీచేశారన్న విషయం చాలామందికి తెలియదు. కాళోజీ రాజకీయ ప్రస్థానం గురించి పెద్దగా చర్చకురాదు. కవిగానే గొప్పకీర్తిని సంపాదించారు. పద్మవిభూషణ్ బిరుదును కూడా పొందారు. 1952 తొలి సార్వత్రిక ఎన్నికల్లో  వరంగల్ లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా  పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు పైన  పోటీ చేసి ఓడిపోయారు.  1977లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 1958నుండి1960 వరకు రెండేళ్ళ పాటు శాసన మండలి సభ్యులుగా పని చేశారు. తెలంగాణా ఏర్పాటు తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ జన్మదినాన్ని తెలంగాణా భాషా దినోత్సవంగా ప్రకటించి ప్రతిఏడాది అధికారిక ఉత్సవాలను నిర్వహిస్తోంది.

పాలమూరు జిల్లాతో అనుబంధం

Latest Videos

కాళోజీ తొలి కవితా కావ్యావిష్కరణ ఉమ్మడి మాహబూబ్ నగర్ జిల్లాలోని జరిగింది. 1953లో అలంపూర్ లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ సప్తమ వార్షికోత్సవ సభల్లో ఆసక్తికర పరిణామాలమధ్య జరిగింది. వట్టికోట ఆళ్వార్ స్వామి స్థాపించిన దేశోద్దారక గ్రంథమాల సంస్థ సహకారంతో కాళోజీ నా గొడవ కావ్యాన్ని ముద్రించారు. దీని ఆవిష్కరణను అలంపూర్ లో జరిగిన సారస్వత పరిషత్ వార్షికోత్సవ సభల్లో శ్రీశ్రీ తో ఆవిష్కరింపజేయాలని దాశరథి తో పాటు ఆయన మిత్రబృందం నిర్ణయం తీసుకుంది. కానీ కావ్యావిష్కరణ అంశాన్ని వార్షికోత్సవ ఎజెండాలో చేర్చకపోవడంతో రెండవరోజు జరిగిన కవిసమ్మేళనంలో ఆవిష్కరించారు. రాత్రి భోజనాల అనంతరం పునఃప్రారంభమైన కవిసమ్మేళనంలో శ్రీశ్రీ  నా గోడవ కావ్యాన్ని ఆవిష్కరించారని పలువురు కవులు తమ స్మృతులను నెమరువేసుకున్నారు. ఆరోజు తెల్లవారుజాము వరకు కవిసమ్మేళనం జరిగినట్లు ఆనాటి సభల్లో పాల్గొన్న కవులు తమ వ్యాసాల్లో పేర్కొన్నారు.

 అలంపూర్ సభల ప్రత్యేకత

ఆంధ్రసారస్వత పరిషత్ సప్తమ వార్షికోత్సవ సభల విశేషాలను గురించి చారిత్రక పరిశోధకులు ప్రముఖ కవి పండితులు గడియారం రామకృష్ణ శర్మ తన జీవిత చరిత్ర "శతపత్రం"లో పూసగుచ్చినట్లు వివరించారు. 1953 జనవరి 11,12,13,14 తేదీలలో అలంపూర్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాక ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించి సాహిత్య చరిత్రలో మరిచిపోని ఘట్టంగా నిలిపారు. సభలు అక్కడే జరగడానికి గడియారం రామకృష్ణ శర్మ కృషి ప్రధానమైనది. కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు అప్పటి సాంస్కృతిక పర్యాటక శాఖ సంపూర్ణ సహకారాన్ని అందించింది. 200 సినిమా థియేటర్లలో స్లైడ్ల ద్వారా ప్రచారం నిర్వహించారు. పర్యాటక శాఖ  తన శాఖకు చెందిన బస్సును నెలరోజుల పాటు వినియోగించుకునేందుకు నిర్వాహకులకు ఇచ్చింది. అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ఆహ్వానించి ఆయనతో పాటు ప్రముఖ కవుల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. నిజాం నవాబు వినియోగించే ప్రత్యేక బోగీలో రాధాకృష్ణన్ అలంపూర్ సభలకు వచ్చారు. అనుకున్నదానికంటే ఎక్కువమంది సభలకు వచ్చినా ఏలోటు లేకుండా విందు భోజనం ఏర్పాటు చేసి ఏ ఆటంకం కలగకుండా చూసి సభలను విజయవంతం చేశారు.
 

 

click me!