ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ లో మహిళల పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో మహిళల ఏవిషయంలోను పురుషులకన్న తక్కువ కాదని ప్రముఖ రచయిత్రి జ్వలిత రాసిన 'ఫర్వానై' కథలో చదవండి:
తూర్పు పొత్తిలి కెల్లి పొద్దింకా బయటికి దుంకనేలేదు పురాగ. ఎరుపు పసుపు రంగు కలిపిన నారింజ రంగుమబ్బుల నుండి అప్పుడే తొంగి చూస్తున్నడు బాల సూరయ్య.
"డబల్ రొట్టే... పైన్ బిస్కేట్.. డబల్ రొట్టే...." అంట కేకలు ఏసుకుంట నడుస్తంది ఒక బక్క పల్చటి ప్రాణి. మధురమైన గొంతుతో 'డబల్ రొట్టే...' అని పెట్టే కేక కూడా పాట పాడి నట్టుగా కేకలేస్తూ ... చెప్పులు లేని కాళ్ళు దుమ్ము కొట్టుకొని, చౌకబారు పాత గుడ్డలు కాయి బట్టి ఉన్నా.. శుభ్రంగ ఉన్నయి. కండలేని ఒంటిమీద, ఎడమ చంకకు డబల్ రొట్టెల డబ్బా వేలాడుతంది. మూడువైపులా రేకు ఒకవైపు అద్దం ఉన్నది ఆ డబ్బాకు. లోపల ఉన్నవన్నీ కనిపించేట్టు అద్దమున్న ఇనుప రేకు బిస్కెట్ల డబ్బా... ఆ డబ్బాకు తాడుకట్టి భుజానికి తగిలించుకున్నది. హుషారైన గొంతు చురుకైన నడకలో బతుకు మీద ఆశ కనిపిస్తున్నది చూసే వాళ్ళకు. నీకు తోడుండేటందుకే వస్తున్నానులే అన్నట్టుగా ఉషాకాంతిని ఎగజిమ్ముతున్నడు సూరీడు.
ఊరింకా నిద్ర నుండి లేవలేదు. పల్లె సందడి సంతరించుకోలేదు. కొంతమంది ఆడవాళ్లు పొరకలతో వాకిళ్లు ఊడుస్తున్నరు. కొంతమంది ఊడ్చి కళాపి చల్లి, అలుకు పిడచలను ఎర్రమట్టి ముంతల ముంచి గలమల ముంగట, గోడల పక్కన అరుగులను అలుకుతున్నరు. పడుచోళ్ళు కొందరు ఇత్తడి బిందెలు, రాతెండి కుంచాలు, మట్టి కుండలు పట్టుకొని నీళ్ల బాయికాడికి నడుస్తున్నరు. ఇంకా కాసేపు ఎచ్చగా పండుకుందామని వాళ్ళ ఆశ. పొద్దెక్కుతే నీళ్ళు దొరకవు లెవ్వుండ్రీ అంటు తరుముతున్నయి పెద్దోళ్ళ గొంతులు.
"డబల్ రొట్టెలో... ఫైన్ బిస్కెట్లో" స్టైల్ మార్చింది డబల్ రొట్టెల గొంతు.
"తెల్లారిందానే బిడ్డా... అప్పుడే ఊళ్ళు పట్టినవ్, ఎంత పొద్దుగాల లేచినవే పొల్లా?" అని పలకరించింది గొల్ల కొమరమ్మ.
"పొద్దెక్కుతే మీరంత కూలికి పోతరు కద.. పెద్దమ్మా. గింత బిస్కెట్ నోట్లేసుకుంటే రోజంతా తియ్యగ గడుస్తది మీకు, రెండు రూపాయల బేరం అయితది నాకు" అన్నది డబల్ రొట్టెల ప్రాణి.
"నీ తల్లి కడుపు సల్లంగుండ, ఎంత బుద్ధిమంతురాలవే బిడ్డా... మా పోరడు చూడు, ఇంకా ముసుగు తీస్తనే లేడు. మొద్దు పోరడు" అని తిట్టుకుంది.
"డబల్ రొట్టె తీసుకో పెద్దమ్మా.. మెత్తగా దూదోతిగ ఉంటది" అన్నది డబల్ రొట్టెలు అమ్మే ప్రాణి. ఆమె పేరు పర్వీన్ .
చేతుల పొరక కింద పడేసి చీర కొంగున కట్టుకున్న ముడి ఇప్పి, నాలుగు బిళ్ళలు పర్వీన్ చేతుల పెట్టి, రెండు డబల్ రొట్టెలు తీసుకున్నది కొమరమ్మ.
"ఈగో పెద్దమ్మా.. పావలా బిళ్ళ ఎక్కువొచ్చింది తీసుకో.." అంటూ ఎనకకు ఇచ్చింది పర్వీన్.
"నీ కడుపు సల్లంగుండ, చిన్నపిల్లవయినా ఎంత నియతున్నది నీకు" అన్నది కొమరమ్మ.
"నియతి లేకపోతే బర్కతి ఉండదట పెద్దమ్మా.. మా అమ్మి చెప్పింది" అంట ముందుకు నడిచింది పర్విన్. "డబల్ రొట్టెలూ.. ఫైన్ బిస్కెట్లూ.." అంట రాగమందుకుంటూ...
అదొక పల్లెటూరు వందలోపే గుడిసెలున్నా ఒకటో రెండో పెంకుటిళ్ళు కూడా ఉన్నయి. మరో రెండు మైళ్ళు నడిస్తే మరొక ఊరు, ఇట్లా రోజు ఐదారు ఊళ్ళు తిరుగుతది పర్వీన్. పక్కనే రైల్వే స్టేషన్, తాసిలాఫీస్, పోలీస్ స్టేషన్, సర్కార్ బడి, సర్కార్ దవాఖానా వంటి అన్ని సౌలతులున్న చిన్నపాటి పట్నం నుండి డబల్ రొట్టెలు పట్టుకొని, వెలుతురు పారక ముందే, చీకటితో లేసి వస్తూ ఉంటది పర్వీన్. చుట్టూ చిన్న చిన్న తండాలు, గూడేలు ఎక్కువగా ఉన్న ఆ ఊరు పేరు గార్ల.
చరిత్ర గల్ల ఊరే.. గతంల రజాకార్ల బాధిత ప్రాంతం అది. సీతంపేట, ముల్కనూరు, దుబ్బ గూడెం, రాంపురం, అంజనాపురం, కిష్టాపురం వంటీ ఊర్లన్నీ, ఆ చిన్నది డబల్ రొట్టెలు అమ్మేందుకు తిరుగుతనే ఉంటుంది. మూడో తరగతి దాకా సర్కార్ బళ్ళె చదివింది. తల్లికి భీమారొచ్చి మంచమెక్కితే... పర్వీన్ చదువు అటకెక్కింది, ఇంటి పని కోసం. ఆ తర్వాత బతుకు బండి నడిపేందుకు, ఆకలి దయ్యం నోరు మూయించడానికి, ఫైన్ బిస్కెట్ల డబ్బా భుజానికి తగిలిచ్చుకుంది. చేతిలో ఉండాల్సిన బలపాన్ని కాళ్ళకు కట్టుకుంది.
****
పర్వీన్ తండ్రి బడేసాబ్ తోళ్ళ వ్యాపారం చేస్తడు. అన్ని ఊర్లు తిరుగుకుంట తోళ్ళను కొనుక్కొచ్చి పట్నంల అమ్మెటోడు. అట్లొచ్చిన పదో పరకో పెట్టి కుటుంబాన్ని ఎల్ల దీసెటోడు. బడే సాబుకు ఒక కొడుకు, ఇద్దరు ఆడపిల్లలు. ఆయన పెళ్ళాం గోరీబీ మిషన్ కుట్టేది. ఆయన తల్లి పాత తరాన్ని తలుచుకొని, బీరాలు చెప్పుకుంట ఉండేది. బడేసాబ్ తండ్రి ఉండగా... ఊళ్ళో అందరికీ తలలో నాలుకోతిగ అందరితో కలిసిమెలిసి ఉండెటోడు. సైకిల్ మీద ఊరూరు తిరిగి డబల్ రొట్టెలు అమ్మేటోడు. ఊళ్ళో వాళ్లకి చిన్నచిన్న రుగ్మతలకు సూరాలు చదివి ఊదు పొగ ఏసెటోడు.
బడేసాబ్ కు ఒక అన్న ఉన్నడు మదార్ సాబ్ అని. అదే ఊర్ల పక్క సందుల సైకిల్ రిపేరు దుకాణం ఉండేదతనికి. నాలుగేళ్ల కింద తండ్రి చచ్చిపోయిండు. బతికి ఉన్న రోజుల్లో కూడా బడేసాబ్ దగ్గరే ఉండేటోడు. పెద్ద కొడుకు దగ్గరికి చుట్టపుచూపుగా పొయ్యి వచ్చేటోడు. బడేసాబ్ తల్లి కూడా అంతే...
పర్వీన్ అన్న జహంగీర్ అట్లా ఇట్లా చేసి పది పాస్ అయ్యిండు. ఆటెంక చదువు మానేసి ఉత్తగనే దోస్తులతో తిరుగుకుంట ఉండేటోడు. తల్లీతండ్రి గోల చేస్తంటె పట్నం పోయి, సైకిల్ రిపేరు నేర్చుకున్నడు. పది పాసైనోల్లకు లోన్లిస్తంటే తీసుకొని, ఐదు సైకిళ్ళు తెచ్చి ఇంటి ముందల పెట్టి కిరాయికి నడుపుతండు. పాత సైకిళ్లకు మరమ్మతులు చేస్తండు. కొడుకు సంపాదనకు వచ్చిండని ఖుషీ అయిన బడేసాబ్ తోళ్ళు తెచ్చి అమ్ముడు బందు చేసిండు. ముందే ఉన్న తాగుడు అలవాటు.. రికాం దొరికే టప్పటికి ఎసనంగ మారింది. సంపాదన లేకుండయినంక, తాగడానికి కొడుకుని డబ్బులు అడగలేక, పెళ్ళాంతో జగడం పెట్టుకునేటోడు. డబ్బుల కోసం ఇంట్లో గొడవలు మొదలయినయి. గుట్టుగ సాగే సంసారం రోడ్డుమీదికి నడిచింది.
'గోరుచుట్టు మీద రోకలి పోటు' అన్నట్టు, ఒక ఘోరం జరిగింది. దసరా పండగ రోజు దోస్తులతో సినిమా చూస్తానని పోయిన జహంగీర్ ఆ రాత్రి ఇంటికి రాలేదు. దోస్తులతో ఉన్నడేమోనని కుటుంబం అనుకున్నరు. కానీ తెల్లారి 'రైలు పట్టాల పక్కన గాయాలతో పడి ఉన్న యువకుడు' అని టీవీలో చూపిస్తుంటే... లబలబ మొత్తుకుంట తల్లిదండ్రులు సర్కారు దవాఖానకు ఉరికిన్రు. తలకు పెద్దకట్టుతో కాళ్లకు చేతులకు నెత్తురు గాయాలతో మంచం మీద పడున్నడు, సోయి లేకుండ.
గోరీబీ ఏడ్సుకుంట "డాక్టర్ సాబ్ నా కొడుకుకు ఏమైంది? కళ్ళు తెరుస్త లేడు ఏమైందో చెప్పండి" అన్నది.
"తలకు పెద్ద దెబ్బ తగిలింది, నెత్తురు కూడా చాలా పోయింది, మత్తిచ్చినం రెండు గంటల తరువాత స్పృహ వస్తది. పరీక్షలు చేస్తే పరిస్థితి ఏమిటో తెలుస్తది" అని చెప్పి ఎల్లిపోయిండు. బడేసాబ్ కు అక్కడే ఉండి ఏం చేయాలో తోచలేదు. మందు కోసం నాల్క పీకుతంటే ఇంటి దారి పట్టిండు. గోరీబీ ఏడ్సుకుంట కొడుకు మంచం దగ్గరే కూసున్నది.
రెండు గంటల తర్వాత జహంగీర్ కళ్ళు తెరిచి "అమ్మీ... అల్లాహ్... "అని మూల్గుడు మొదలు పెట్టిండు. గోరీబీ ఉరికి నర్సును పిలుసు కొచ్చింది.
"ఎక్కువ మాట్లాడించకమ్మా... మళ్లీ పోలీసులు కూడా వచ్చి ప్రశ్నలేస్తారు" అన్నది నర్స్ ఏ భావం లేకుండా.
" పోలీసులెందుకు వస్తరు? నా కొడుకు ఏం చేసిండు" అన్నది గోరీబీ భయంగా...
"నీ కొడుకు ఏమి చేసిండో నాకెట్లా తెలుస్తదమ్మా...? పోలీసులు తీసుకొచ్చి దవాఖానల చేర్పించినరు. దెబ్బలు ఎట్లా తగిలాయి ? ఎవరన్నా కొట్టినరా ? రైల్లో నుంచి జారిపడ్డవా? ఇంకా ఏమేమో అడుగుతారు" అన్నది సిస్టర్.
"నా కొడుకును ఎవరు? ఎందుకు? కొడతారు. సినిమా చూసి వస్తానని దోస్తులతో పోయినోడు గిట్ల దెబ్బలతో ఇట్ల పడున్నడు" అని ఏడుపు షురూ చేసింది.
"ఏడవకమ్మా దవాఖానల లొల్లి చెయ్యద్దు" అని హెచ్చరించి నర్సు వెళ్ళిపోయింది.
"బేటా... బేటా.. మున్నా..."అని పిలిచింది. జహంగీర్ని ఇంట్లో అందరూ మున్నా అని పిలుస్తరు. జహంగీర్ కళ్ళు తెరిచి చూసినా మాట్లాడ లేక మళ్ళీ కళ్ళు మూసుకున్నడు. ఇంతల్నే జహంగీర్ దోస్తులు అక్బర్, రమణ వచ్చిన్రు. వాళ్లను చూసి గోరీబీ అక్బర్ బేటా... జహంగీర్ తో కలిసి మీరు సినిమాకు పోతిరి కదా... వీడికి ఈ దెబ్బలెట్ల తగిలినయి" అని ఏడ్సుకుంట అడిగింది.
"కాలా.. సినిమా చూసి ఇంటికి వస్తుంటే, వాళ్ల పెదనాన్న కొడుకు సలీం కలిసిండు. మేము తర్వాత వస్తం మీరు పొండి అన్నడు. మేము ఇంటికి పోయినము తర్వాత ఏమైందో మాకు తెలియదు .. ఇప్పుడే తెలిసింది జహంగీర్ దవాఖాన్ల ఉన్నాడని, ఇగో ఇట్లా వచ్చినం" అన్నడు అక్బర్. ఇంతల్నే పోలీసులు వచ్చిండ్రు, వాళ్ళెమ్మటి డాక్టర్ కూడా వచ్చిండు.
"తలకు బాగా దెబ్బలు తగిలాయి... కొన్ని నరాలు దెబ్బతిన్నాయి. అవి సరి కావడానికి సమయం చాలా పడుతుంది. కంటి చూపు కూడా పోవచ్చు" అని వచ్చిన పోలీసులతో డాక్టరు చెప్పిండు.
"ఈరోజుకు ఏమీ అడగకండి, ఎక్కువ మాట్లాడితే కోమాలకు పోయే ప్రమాదం ఉన్నది" అన్నడు మళ్ళీ డాక్టర్.
గోరిబీ ఏడుస్తనే ఉన్నది. పోలీసులు రేపు వస్తామని వెళ్ళిపోయారు. ఆ రాత్రికి గోరీబీ ఒక్కతే కొడుకు దగ్గర ఉన్నది. పక్క మంచం వాళ్లు ఒక రొట్టె ఇస్తే తిని నీళ్ళు తాగింది. జహంగీర్ కు సోయి రానేలేదు. గోరీబీకి కన్నుమూత పడ లేదు. సలీం వచ్చి జహంగీర్ ను ఎక్కడికి తీసుకుపోయిండు. ఈ దెబ్బలు ఎట్ల తగిలినయి అంతుపట్టలేదు ఆమెకు. తన కొడుకు సైకిళ్ళను అద్దెకు తిప్పడం సలీం వాళ్లకు ఇష్టం లేదు. వాళ్ళ ఆమ్దాని దెబ్బతిన్నదని కోపం.
తెల్లారి జహంగీర్ దోస్తులు మళ్ళీ వచ్చారు.
గోరీబీని బయటకు పిలిచి "కాలాజాన్ సలీం ఇంటికి పోయినం. వాడు ఇంటికాడ లేడు. వాళ్ళ నాయిన, నా కొడుకుతో మీకేం పని వెళ్ళిపొండని కోపంగా ఎల్లగొట్టిండు" అన్నాడు అక్బర్.
"జహంగీర్ కు దెబ్బలు తగిలయినయి దవాఖాన్ల ఉన్నడని చెప్తే... అట్లనే అయితది ఆశ గొట్టు మొఖాలకు. అయన్ని మాకెందుకు, ఇక్కడి నుంచి పొండన్నడు మాకు ఏదో అనుమానం అనిపించింది" అన్నడు రమణ.
ఇంతలనే పోలీసులు వచ్చిండ్రు. "వీళ్లు ఎవరు?" అని అక్బర్ రమణలను చూసి అడిగిన్రు.
"నా కొడుకు దోస్తులు సాబ్, వీళ్ల తోటే సినిమాకు పోయిండు. ఆ రాత్రి ఇంటికి రాలేదు" అని చెప్పింది. పోలీసులు అక్బర్ వాళ్ళను ఏవేవో అడిగారు. గోరీబీకి చెప్పిన సంగతులే పోలీసులకు కూడా చెప్పిన్రు. వాళ్లను స్టేషన్ కి తీస్కపోయి, వాళ్లు చెప్పినవన్నీ రికార్డు చేశారు పోలీసులు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని గద్దించి, ఇంటికి పొమ్మన్నరు. వాళ్ళు "మా దోస్తు కోసం ఏమైనా చేస్తాం.." అని ఇంటికి వెళ్ళిపోయారు.
సాయంత్రానికి జహంగీర్ కి సోయి వచ్చింది. అక్బర్ తనను రైల్వే స్టేషన్కు పని ఉన్నదని, తోడు రమ్మని, తీసుకుపోయిండని, మాట్లాడుకుంట రైలు పట్టాలెంబటి నడుచుకుంట చాలా దూరం పోయినమని, అక్బర్ ఎవర్నో ప్రేమించానని చెప్పుకుంట పక్క నుంచి రైలు పోతుంటే ఒక్కసారిగ రైలు కిందకు నెట్టిండు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలవదని చెప్పిండు. పోలీసులు తమ పధ్ధతిల సలీమ్ ను పట్టుకొచ్చి నిజం కక్కిచ్చి, జైల్లో పెట్టిన్రు.
నెల రోజుల తర్వాత ఇల్లు చేరిన జహంగీర్ కి ఒక కంటి చూపు తగ్గింది. తలలో సూదులతో గుచ్చినట్టు ఎప్పటికీ నొప్పి ఉండేది. అట్లా ఏ పని చేయలేక ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. సంపాదన లేక సైకిళ్ళను అమ్మి లోన్ కట్టింది గోరీబీ. అయినా ఇంకా బాకీ మిగిలే ఉంది. బడే సాహెబ్ మానేసిన పని మళ్లీ మొదలు పెట్టలేక పోయాడు. తాగుడు తగ్గించలేక పోయాడు. మిషన్ కుడితే వచ్చిన ఆదాయం, తినడానికి చాలట్లేదు. ముగ్గురు పిల్లలు ముగ్గురు పెద్దలు మొత్తం ఆరు తల్లెల్లోకి, కనీసం రెండుసార్లు తిండి రావాలంటే కష్టమైతంది. ఒక్కొక్కసారి ఒక పూట తినేటోళ్ళు.
ఇంటి పరిస్థితిని చూస్తున్న పెద్ద బిడ్డ పర్వీన్ ఏదైనా చేయాలని అనుకున్నది.ఒకరోజు రాత్రి అన్నం తిని పండుకున్న తర్వాత తల్లితో "అమ్మీ ఈ దినం ఏక్ బార్ తిన్నము, కదా..." అన్నది.
"అవును బేటీ అల్లా దయ" అన్నది తల్లి.
"అది సరేలే.... రేపెట్లా" అన్నది బిడ్డ.
" చూద్దాం రేపటి సంగతి రేపు, పక్కింటి మణెమ్మ జాకెట్ కుట్టించుకొని నెల రోజులు అయింది. డబ్బులు రేపిస్తనన్నది బేటీ.." అన్నది తల్లి.
"ఆం... నెల నుంచి ఇయ్యలేదు కని రేపిస్తదా" అన్నది బిడ్డ.
"నారు పోసినోడు నీరు పోస్తడు... నీకెందుకు అయన్నీ... ఔరత్ బచ్చీ హో.. నోరు మూసుకొని పండుకో" అని గద్దించింది పర్వీన్ నాయినమ్మ. ఇంకా నిద్ర పోలేదీ ముసలమ్మ అనుకున్నది పర్వీన్ మనసుల.
మళ్లీ కొద్దిసేపు అయినంక నాయినమ్మ గురక ఇనపడతాంది...
"అమ్మి పండుకున్నవా..." అని గుసగుసగ పిలిచింది పర్విన్ తల్లిని.
"పండుకోలే ఏమైంది ? నిద్ర పడతలేదా ?" అని అడిగింది తల్లి.
"చెప్తగని... బయటికి పోదాం దా అమ్మీ.." అన్నది పర్వీన్.
సరే పా... అని సప్పుడు రాకుండ ఇద్దరూ లేచి ఇంటి బయటికి వచ్చిన్రు. ఇంటి ముందు యాప చెట్టు మొదట్ల అరుగు మీద కూసున్నరు. చెట్టు మీద పచ్చ జెండా ఎగురుతంది. చీకట్ల తల్లి బిడ్డల మనసుల్లో ఆకలి సొద.
"ఏమయింది బేటి..." దగ్గరికి తీసుకున్నది బిడ్డను.
"ఏం లేదు నాకేం కాలే... నేను ఒకటి చెప్తా ఇంటావా?" "చెప్పు బేటీ.. మనం ఒకళ్ళది ఒకళ్ళం ఇనుడే తప్ప మన సొదను ఎవరు వింటరు? నువు చెప్పు" అన్నది. "మన తాత డబల్ రొట్టెలు అమ్మెటోడు కదా..."
"అవును తాతుండగా మంచిగుండె, ఊరందర మనని పలకరించెటోళ్ళు. మీ నాయన కూడా గింతగనం తాగక పోవు. అంతో ఇంతో తెచ్చెటోడు" గతంలోకి పోయింది గోరీబీ.
"అందుకే నేను కూడా..."
"ఆ... నువ్వు కూడా... ఏం చేస్తావ్ ? మీ తాతోలిగ. ఊదేస్తావా ?"అన్నది.
"ఆ.. ఏస్తా.. తాత చదువుతుంటే సూరాలు ఇనేదాన్ని. నాకు కూడా తెలుసు" అన్నది బిడ్డ.
"మన ఇండ్లల్ల మసీదుకు పోయి ఆడోళ్ళు నమాజే చెయ్యరు. బురఖా లేకుంట బయటికి పోరు. ఈడ ఇప్పుడు నువ్వు ఊర్లకు పొయ్యి ఊదేస్తవా... చిన్న పోరివి నీకు తెల్వదు.. ఎవరు నమ్మరు.. మన మతం ఒప్పుకోదు అన్నది విచారంగా.
"సరే సరే మతాన్ని కాదని మన బతుకులు ఎక్కడ ఉంటయి కానీ. సూరాలన్నీ పవిత్రంగా యాదికి చేస్తే... ఆడోళ్ళు కూడా ఊదెయ్యొచ్చని చెప్పిండు తాత. నాకయ్యన్నీ నేర్పిచ్చిండు కూడా... నీకు చెప్పనా ఇప్పుడు ఆ సూరాలన్నీ..." అన్నది పర్విన్ సంబరంగా.
"అమ్మో.. వద్దు బిడ్డా.. పానం మీదికి తెచ్తుకోకు, సంపేస్తరు మనోళ్ళు. వద్దు బిడ్డా.." అన్నది భయంగా తల్లి.
"గట్ల భయపడొద్దు అమ్మీ... ఆరోజు టీవిల చూపిచ్చలే పాకిస్తాన్ దేశపు పిల్ల 'మాలాల' మన ముసల్మాన్ అమ్మాయే... ఆడపిల్లలు చదువుకోవాలని ధైర్యంగా నిలబడింది. ఆమెకు వాళ్ళ అమ్మి అబ్బు ఎంత మద్దత్, హిమ్మత్ ఇచ్చినరు... 'తస్లీమా నస్రీన్' అనే ఆమె బంగ్లాదేశ్ అనుకుంటి "లజ్జ' అని పుస్తకంలో మతం పేరుతో మన ఆడోళ్ళ మీద జరిగే అన్యాయాలు రాసిందట.... అదేంది.. ఆం.. 'వుమన్స్ డే' నాడు రోజంత టీవీల చూపెట్టిన్రు... నువ్వు కూడ చూసినవు కదా"
గుక్క తిప్పుకోకుండ మాట్లాడుతున్న బిడ్డను భయంగా చూస్తంది గోరీబీ.
పర్విన్ అది పట్టిచ్చుకోకుండా "దుబై దేశంల 'జోకా' అంటామె పుస్తకం రాస్తే పెద్ద ప్రైజొచ్చిందట.. చాన డబ్బులిచ్చిన్రట. నేను సదువు కుంట అనట్లేదు.. మనందరి కడుపు నిండెటందుకు పని చేస్తా అంటున్న అమ్మీ..." అంట కదలకుండా చూస్తున్న తల్లిని పట్టుకుని ఊపింది.
"ఉష్ జోరుగ మాట్లాడకు.. ఇంత తెలివిగల పిల్లవు నా కడుపున ఎందుకు పుట్టినవు బేటీ.. " అని కావలిచ్చుకుంది బిడ్డను.
" సరెగని.. అదంత కాదులే... తాత లెక్క నేను కూడా డబల్ రొట్టెలు అమ్ముతా"
కొద్దిగ మెత్తబడ్డ గోరీబీ "ఒక్క దానివి ఎక్కడ అమ్ముతవు" అన్నది.
"ఒక్క దాన్ని కాదు, చెల్లెని బీ తీస్కపోతా.. ముందు మన ఊర్లనే ఊరు చివర బస్తీలల్ల అమ్ముత.. ఆటంక దగ్గర దగ్గరున్న ఊర్లకు పోత అన్నది సంబరంగ.
"బాగుంటదా... అట్ల చేస్తే.. చిన్న పిల్లవి. ఆడపిల్లవి. ఎవరేమన్న అంటే?" తల్లి భయం.
"ఎవరేమనరు.. మనకు ఆకలయితాంటే ఎవరన్న పెడుతన్నరా.. కష్టం చేసుడు తప్పుకాదని, నువ్వే చెప్పినవ్ కదా.." అని ప్రశ్నలతో ధైర్యం నింపింది తల్లికి.
బిడ్డ చెప్పిన మాట తల్లికి కూడా నిజమే అనిపించింది. ఆశ పుట్టింది. కొడుకు ఇట్ల అయ్యిండు.. భర్త అట్ల అయ్యిండు.. ఒక్కదాన్ని ఎన్నాళ్ళు మిషన్ కుట్టి కుటుంబాన్ని సాదాలె.. అనే భయం ఆమె మనసులో సుడి తిరిగేది. కానీ బయటకి ఆడపిల్లను పంపుతెట్లా అనిపించింది.
" సరేలే మీ నాయనమ్మకు చెప్పుదాం, ఆమెనే మీ నాయనకు సముదాయిస్తది"అన్నది తల్లి.
తల్లిని కావలించుకుని "మేరి ప్యారి అమ్మీ" అన్నది బాధ్యత మోయడానికి ముందుకురికకే మనుషులు కొందరు. ఉన్న బరువు తగ్గించుకోవడానికి పారిపోయే వాళ్ళు కొందరు. పర్వీన్ మొదటి కోవకు చెందినది. పాపం పర్వీన్ కు తెలవదు ఒక్కసారి భుజాన ఎత్తుకుంటే చచ్చేదాకా బాధ్యతలు మోయాల్సిందేనని.
ఇద్దరు ఇంట్లోకి పోయి పండుకున్నరు.
తెల్లారి అత్త కోసం తల్లెల అన్నం పెట్టి చేతికిచ్చుకుంట విషయం చెప్పింది గోరిబీ.
"చత్.. ఔరత్ బచ్చీని, బయటకు పంపుతవా.. బురఖా ఎయ్యాల్సింది పోయి" అన్నది ముసలమ్మ.
"ఒక్కో పూట గడవడం కష్టమయితంది. నువ్వు చూస్తలేవా.. దిన దిన గండం అయితంది. నా మిషిన్ గిరాకీ తగ్గింది, రెడీమేడ్ జాకెట్లు వచ్చినయ్. ముందు ముందు ఎట్లా అని భయమైతంది" అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది గౌరీబీ.
పిల్లకు ఏమన్నా అయితే..? పిల్ల ఏమన్నా చేస్తే...? కులపోళ్లు ఏమన్నా అంటే...? " అనుకుంట మెత్తబడ్డది. ముసలమ్మ.
"ఏమీ కాదు. ఎవరన్న ఏమన్నా అంటే ? ఎంతమంది మన ఆడోళ్ళు కూలి నాలి చేయడం లేదు. గల్ఫ్ దేశాలకు పని కోసం పోవటం లేదు. అని నువ్వు కూడా అడుగు అత్తమ్మా... మన కళ్ళ ముందే డబల్ రొట్టె అమ్ముతా అంటంది తప్పేముంది? అని నువ్వే చెప్పాలి. పెద్ద దానివి నీ కొడుకును కూడా ఒప్పిచ్చాలె" అన్నది గోరీబీ.
ఆకలి అన్ని నిబంధనలను అతిక్రమిస్తది. ముసలమ్మ ఏపాటిది..? సరేనన్నది. పర్వీన్ కి డబల్ రొట్టె డబ్బా భుజానికి చేరింది. ఊర్లకు పోయినప్పుడు తాత లాగా ఊదు ఊదతాంది, సూరాలు చదువుతోంది ఇంట్లో వాళ్ళకు తెలవకుండ. నమ్మిన వాళ్లకు బేదులు, దడుపు జరాలు తగ్గుతున్నయి. పన్నెండు కొట్టే దాకా ఊళ్ళమ్మటి డబల్ రొట్టె అమ్మి ఇంటికి వచ్చేది పర్వీన్. సాయంత్రం నాలుగు గంటలకు సమోసాలు, ఫైన్ బిస్కెట్లు చాంద్ బిస్కోట్లు పట్టుకొని పొయ్యేది. సర్కారు దవాకాన గేటు దగ్గర, సర్కార్ బడి గేటు దగ్గర అమ్మేది. అప్పుడప్పుడు తల్లి కూడా ఆమెకు తోడు పోయేది. మిషిన్ గిరాకీ మునుపటోలె లేదు.
జహంగీర్ కొంచెం బాగయినంక ఒకరోజు "జీవితంల ఒక్కసారన్నా మక్కాకు పోయి రావాలని తాత చెప్పేటోడు. చచ్చి బతికిన అల్లాకు షుకర్ చెప్పి వస్తా.. మళ్ళీ వచ్చి ఏదన్నా పని మొదలు పెడతా.. అమ్మ, చెల్లె కష్టపడుతంటే చూడలేకపోతున్నా" అన్నడు నాయనమ్మ తో ..
ముసలమ్మ మెడల బంగారు గుళ్లు అమ్మి ఇచ్చింది. తల్లి కొంత అప్పు చేసి ఇచ్చింది. మక్కా యాత్రకు పోయిన జహంగీర్ మూడునెలలైనా తిరిగి రాలేదు. ఒకరోజు ఒక కవరు ఒక వార్తను మోసుకొచ్చింది.
'జహంగీర్ ప్రయాణిస్తున్న రైలులో ఉగ్రవాదులు కూడా ఉన్నారని పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులతోపాటు జహంగీర్ కూడా చనిపోయాడని. అతని జేబులో ఉన్న ఆధార్ కార్డు, మక్కా యాత్ర టికెట్ ఆధారంగా ఆ సమాచారాన్ని అధికారులు పంపించారని. ఆ వార్త సారాంశం.
కొడుకు శవాన్ని కూడా తెప్పించుకునే ధైర్యం లేని తల్లిదండ్రులు వాళ్ళు. మనవడి చావుతో ముసలమ్మ ఊపిరి బిగబట్టింది. పర్వీన్ ఒక్కతే ఆధారమైంది ఆ కుటుంబానికి. ఐదారేళ్లు గడిచాయి పర్వీన్ వయస్సు ఇరవై దాటింది. ఊర్లకు పోవడం లేదు ఇప్పుడు. దవాఖాన దగ్గరే చిన్న చాయ్ కొట్టు పెట్టింది. గోరీబీ కూడా సర్కార్ దవాఖాన్ల, సర్కార్ బడిల చాయ్ ఫ్లాస్కు పట్టుకొని తిరుగుతోంది. ఇట్లాంటి గోరీబీలు పర్వీన్ లు దేశమంతటా చాలాచోట్ల మనకు ఎదురవుతూనే ఉంటరు.