అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక " సంఘటిత "

By Siva Kodati  |  First Published Aug 13, 2022, 2:18 PM IST

2010 నుండి 2021 వరకు వచ్చిన స్త్రీ వాద కవిత్వాన్ని' సంఘటిత ' సంకలనంగా  జెడీ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఈ కవిత్వ సంకలనం పైన సరోజని బోయిని రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :
 


2010 నుండి 2021 వరకు వచ్చిన స్త్రీ వాద కవిత్వాన్ని' సంఘటిత ' సంకలనంగా  జెడీ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ఈ కవిత్వ సంకలనం పైన సరోజని బోయిని రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :

కాలంతో పాటు సమాజంలో ఎంతో మార్పు వచ్చింది.  అయినప్పటికీ ఇప్పటికి వివక్షను ఎదుర్కొనే  స్త్రీలు ఎందరో!  అన్యాయానికి గురవుతున్న ఆడపడుచులు ఎందరో!  మొగ్గలోనే పసి పిల్లల బాల్యం బలి అవుతున్న చోద్యం చూస్తున్న సంఘటనలు ఎన్నో...  వీటన్నిటి ఖండిస్తూ స్త్రీల సమస్యలపై  సంఘటితంగా 115 మంది కవయిత్రులు ముక్త కంఠంతో  "సంఘటిత " వేదికగా తమ అద్భుతమైన కవిత్వంతో  ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం అభినందనీయం.

Latest Videos

పుస్తక సంపాదకురాలు  జ్వలిత  ఈ పుస్తకం కోసం ఎన్నో సమస్యలను ఎదుర్కోవలిసి వచ్చిన  వాటిని సవాల్ గా తీసుకొని చివరకు ఈ పుస్తక ప్రచురణ పూర్తిగావించి తాను సాదించిన విజయంలో  115 మంది కవయిత్రులను భాగస్వాములుగా చేశారు.

ఒకరుకాదు, పదిమంది కాదు 115 మంది కవయిత్రులు వారి వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అద్భుత మైన కవితలను అందించారు.  ఒక మహిళ జీవనం నిత్యం ఎన్నో సవాళ్ళతో కూడుకున్న ప్పటికీ తను స్వార్థమే ఎరుగక  కుటుంబం, పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దుతూ సమాజంలో తన అస్తిత్వం కోసం అలుపెరగని పోరాటమే చేస్తుంది.  ఆడపిల్ల అంటే  చులకనగా చూసే ఈ సమాజాన్ని ప్రశ్నించే గొంతుకై ప్రతీ మహిళా ముందుకు అడుగువెయ్యడానికి చైతన్య పరిచే ప్రయత్నమే మన "సంఘటిత "

"సాధారణ గృహిణి కాదా సర్వోన్నత శక్తి"
ఉద్యోగం పురుష లక్షణం /అన్నది పాత తరం /
కానే కాదు స్త్రీ హక్కు కూడ అంటుంది నవ యువతీ తరం
ఆర్థిక సముపార్జన స్త్రీకి  కొంత బలాన్ని చేకూర్చడమే కాదు తనకంటూ గౌరవాన్ని కూడ తెచ్చిపెడుతుంది.
విష్ణుమూర్తి లోకకల్యాణం కోసం దశావతారాలు ఎలా ఎత్తాడో ఒక మహిళ తన కుటుంబం కోసం తన వాళ్ళ కోసం  రోజూ తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఇలా ఎన్నో అవతారాలు ఎత్తుతుంది.  అలాంటి స్త్రీని గౌరవించండి అని ఈ కవి చాల అద్భుతంగా చెప్పారు.

సృష్టిలో ప్రతీ ప్రాణికి ఉన్నట్టే /నీకు జీవించే హక్కు ఉంది/
కానీ  ఆడపిల్ల అని తెలిసి పిండంగా ఉన్నప్పుడే ఈ లోకంలోకి రావాల్సిన ఆ పసి ప్రాయాన్ని కొంత మంది మూర్ఖత్వంతో మొగ్గలోనే తుంచేస్తున్నారు.  వరకట్నం కోసం  కొందరు స్త్రీ  ఉనికినే లేకుండా చేస్తున్నారు.  కొంత మంది మృగాళ్లు పాలు గారే పసి పిల్లలను బలి పశువులను చేస్తున్నారు.  అందుకే నీ రక్షణకై  నువ్వే ఓ ఆయుధం కావాలి.  నీ బ్యాగులో కేర్ ఫ్రీ తో పాటు  నీ కేర్ కై కత్తిని, కారాన్ని ఉంచుకో ప్రాణం పొసే నువ్వు నీ ఉనికి కోసం అవరసమైతే ప్రాణాలు కూడ తీయ్ అంటూ.."జీవించే హక్కు"  కవితలో మహిళలు శివంగిలా దేనినైనా ఎదుర్కోవాలి అని అద్భుతంగా చెప్పారు..

మూలకు కూర్చోడానికో
ముడుచుకు పడుకోవడానికో
మూడు రోజుల ముట్టు కాదు -

బహిష్టు సమయంలో ఆడవాళ్లు   పడే బాధలు , ఆ సమయంలో వారి అనారోగ్య పరిస్థితి గురించి వాటన్నిటిని అధిగమించి స్త్రీ ఎలా నిలదొక్కు కుంటుందో అద్భుతంగా వర్ణించారు "శ్వేత రుధిరం" కవితలో.

అన్నీ తానై అవనికి వెలుగై/ ఆమెకు కావాల్సింది -
ఒక మహిళకు కావాల్సింది అవార్డులు, ప్రశంసా పత్రాలు కాదు. తాను కోరుకునేది గుప్పెడంత ప్రేమ. తనకు తగిన గౌరవం.  బాధలో వున్నప్పుడు నేను ఉన్న  అనే ధైర్యం..!
తన అస్తిత్వానికి భరోసా.!  కానీ  ఆ మహిళ  అనుభవించే బాధలు ఎన్ని?  యాసిడ్ దాడులు,  గునపంలాంటి మాటలు, వికారపు చూపులు - ఇలాంటి వేధింపులు ఎన్నెన్ని!??? కానీ తానూ మనిషే , తనకు జీవించే హక్కు ఉంది. తనకూ మనసు ఉంటుంది. అని ఆడవాళ్లు కోరుకునే జీవితాన్ని అద్భుతంగా చెప్పారు  "ఆమె కోరిక" కవితలో .

మోటలు కొట్టే రాత్రి లేచి బండెడు చాకిరి చేసి/బాధలను,కష్టాలను-కడుపులో దాచి/
ఒక భర్త ఎంత హింసించిన ఆ బాధలన్నీ భరిస్తూ తన వాళ్ళ కోసం బండెడు చాకిరి చేసిన తనకు కనీసం ఒక మనిషిగా అయిన గౌరవం ఇవ్వని ఈ సమాజం నుండి నిన్ను నువ్వే రక్షించుకో అని "నిర్మించొద్దు గాని"కవితలో చెప్పుకొచ్చారు.

కంటికంటిన నిద్దుర వీడనేలేదు/అవలింతలతో కంటి కొనల్లో/ఏకధాటిగా కారే నీటి ధార -
రంజాన్ మాసపు ఉపవాసాలు చేస్తూ ఒక మహిళ మిగితా కుటుంబ సభ్యుల కోసం తీరిక లేని పనులతో తాను ఎంత శ్రమ పడిన..సేద తీరని దేహం స్వేదం చిందిస్తున్న  చిరునవ్వుతోనే తను రంజాన్ మసాన్ని ఎలా ఫలప్రదం చేస్తుంది  చాలా  బాగా చెప్పారు "నిరామయ సైరన్ ' ఆమె' " కవితలో.

"సంఘటిత "స్త్రీ వాద కవితలకు ఆహ్వానం పలకడమే కాక 2010 తరువాత స్త్రీ వాద కవితలను రికార్డ్ చేయడమే దీని ముఖ్యఉద్దేశం. "సంఘటిత " కోసం   జ్వలిత  ఒక సమూహాన్నీ ఏర్పాటు  చేసి స్త్రీ వాద కవితలపై చర్చలు జరిపి,  కొన్ని కవితలను సేకరించారు.  ఇందులో భాగంగా కొత్త వారికి అవకాశం కల్పించాలి అన్న సదుద్దేశంతో దాదాపు 40 కొత్త కవయిత్రుల కవితలకు "సంఘటిత" లో స్థానం కల్పించారు.

స్త్రీ యొక్క సహనం, త్యాగం, శాంతి వంటి మంచిని ఆదర్శoగా చూపించే కవితలతో పాటు స్త్రీ తన హక్కుల కోసం , ఆత్మ గౌరవం కోసం, అన్నిటిలో సమానత్వం కోసం పోరాడే ఆత్మ విశ్వాసాన్ని పెంచే కవితలు  "సంఘటిత "వేదికగా మన ముందు నిలిచాయి. ఎన్నో ఒడిదుడుకుల తరువాత మన ముందుకు వచ్చిన సంఘటిత భాగస్వాములందరికి, మరియు  ఒక సవాల్ గా తీసుకొని ఈ సంకలనానికి పుస్తక రూపం ఇచ్చిన జ్వలితకు హృదయ పూర్వక అభినందనలు.

300 పేజీలున్న 'సంఘటిత' వెల రూ.300/- లు.  వివరాలకు ఫోన్ నంబర్  9989198943 ను సంప్రదించండి.

click me!