ఇరుగు పొరుగు: రెండు మలయాళీ కవితలు

By telugu team  |  First Published May 11, 2021, 2:07 PM IST

ఇరుగు పొరుగు శీర్షిక కింద వారాల ఆనంద్ రెండు మలయాళీ కవితలను తెలుగులో అందించారు. వీటిలో ఒక్కటి సచ్చిదానందన్ కవిత. వాటిని చదవండి.


నేను రాసేటప్పుడు 

నేను దుఖంతో రాస్తాను.
నదులేమైనా పొంగి పొర్లుతాయా ?
లేదు, నా చెక్కిళ్ళు
తడుస్తాయంతే.
నేను ద్వేషం తో రాస్తాను.
భూమేమైనా వణుకుతుందా, కంపిస్తుందా ?
లేదు, నా దంతాలు విరుగుతాయంతే.
నేను కోపంతో రాస్తాను.
అగ్నిపర్వతాలేమైనా బద్దలవుతాయా?
లేదు, నా కళ్ళు ఎరుపెక్కుతాయంతే.
నేను వ్యంగ్యంగా రాస్తాను.
ఆకాశాన రాలుతోన్న ఉల్కలేమైనా తళుక్కుమంటాయా ?
లేదు,నా పెదాలపై
విరుపు కన్పిస్తుందంతే
నేను ప్రేమతో రాస్తాను
నా భుజాలపై పక్షులు గూళ్లు కట్టేస్తాయి
పూలూ పళ్లతో చెట్లు వంగిపోతాయి
పొట్లాడుకుంటున్న మనుషులు పరస్పరం
ఆలింగనం చేసుకుంటారు
స్పటికమంతటి స్వచ్ఛ ప్రవాహంలా
భాష తనెంత లోతైనదో వెల్లడిస్తుంది
నా దుఃఖం, ద్వేషం, కోపం, వ్యంగ్యం --
సమస్తం అర్థాన్ని సంతరించుకుంటాయి
నేనేమో
కెవ్వుమంటాను సిలువ పై నుండి
                             

Latest Videos

మలయాళ  : కె.సచ్చిదానందన్ 
ఇంగ్లిష్: కె. సచ్చిదానందన్
తెలుగు: వారాల ఆనంద్


===================

స్వేచ్ఛ 

రాతి చెరసాలలనుకున్న 
బరువయిన గేట్లు 
విశాలంగా తెరిచివున్నాయి
పై కప్పులు కూడా ఎగిరిపోయాయి 
కానీ 
ఆరుగంటలకు మోగాల్సిన 
సైరన్ మోత ఇంకా వినిపించలేదు
సూర్యుడి వెళ్తురు 
జైలు గదుల్లోకి చొచ్చుకొని వచ్చినా 
ఖైదీలు మేల్కొనలేదు పాపం 
వారంతా సైరన్ కూత కోసం 
వేచివున్నారు
అంతేకాదు 
మధ్యాహ్నా భోజనానికి 
బారులు కట్టాల్సిన వేళ కూడా 
ఖైదీలు లేవలేదు
తాము ఖైదీలమన్నది తెలీక 
వారు 
గంట మోత కోసమే వేచివున్నారు
సుధీర్ఘమయిన రోజు ముగిసి 
ఎంతో సమయం గడిచాక
కపటి అయిన చీకటి 
నక్షత్ర కాంతిని మింగేసిన తర్వాత కూడా
ఖైదీలకు ఇంకా తెల్లారలేదు
పైనుంచి ఆదేశాలు రాకుండా 
అది 'అరుణోదయమని '
వారికెట్లా తెలుస్తుంది

మలయాళం : కే.అయ్యప్ప పణిక్కర్
ఆంగ్ల అనువాదం : కే.అయ్యప్ప పణిక్కర్
తెలుగు: వారాల ఆనంద్ 

click me!