తెలంగాణ దళిత కథ - వస్తు వైవిధ్యం

By telugu team  |  First Published Sep 29, 2020, 1:38 PM IST

బోయ జంగయ్య రాసిన కథలలో ఎన్నో విధాలుగా దళితుల జీవన చిత్రణ కలదు. వీరి కథల్లో ఎక్కువగా కుల పీడ పోవాలని ఆకాంక్ష కనిపిస్తుంది. ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని సమన్యాయం ధ్వనిస్తుంది. 


 - పరిచయం: 
 
అణగారిన జీవితాలను సంస్కృతి సాంప్రదాయాలను సామాన్య జీవనం గురించి రాసినప్పుడే ఏ రచయిత రచనకైనా సార్ధకత. అలా రాయాలంటే ప్రతి రచయితకి దళిత దృక్కోణం తప్పనిసరి ఉండాలి. ఎందరో రచయితలు సామాజిక స్పృహతో దళిత సాహిత్యంను లిఖించిన వారే.
దళితులు మొదటి నుంచి అస్పృశ్యులుగా , తక్కువ వారనే భావనతో అణిచివేయబడ్డతున్నారు. దళిత కథలలో ఏవీ కల్పితాలు కావు. ఆయా రచయిత దృష్టి కోణంలో యదార్ధ  చిత్రాలే.  హిందువులలో ఒకరైన దళితులను గాంధీజీ హరిజనులు అనీ పేరు పెట్టారు.దళిత అనే శబ్దానికి చీల్చబడిన,  ఖండించబడిన,  చేధించబడిన , సగం చేయబడిన అనే నైఘంటికార్దాలు కలవు.  1990 లో  దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక ఏర్పడింది. ఇది దళితులకు సాహిత్యంలో శిక్షణ తరగతులు నిర్వహించింది . దీనివల్ల ఎందరో దళిత రచయితలు వెలుగులోకి వచ్చారు. తెలంగాణ దళిత కథ రచయితలలో  భాగ్యరెడ్డివర్మ తొలి వారు గా మనకు  కనిపిస్తాడు.

- దళిత కథా వస్తువులు :
  
దళిత కథలలో ముఖ్యమైన విషయాలను గమనిస్తే అంటరానితనం , అభివృధి ఫలాలు అందుకోవాలీసిన తీరు, రాజకీయాలలో దళితుల పాత్ర,  కుల వృత్తుల పై చిన్న చూపు , మూఢ విశ్వాసాలు , స్త్రీలను చెరబట్టిన కథలు , లైంగిక సంబంధ కథలు , కులాంతర వివాహాలు , అగ్ర వర్ణాల దురహాంకార కథలు, పేదరికం, ఆకలి బాధలను చిత్రించిన కథలు , వెట్టి బతుకులు , ఆత్మ గౌరవము ను చిత్రించిన కథలు, ఉద్యమ చైతన్య కథలు మొదలైనవి.

Latest Videos

1.దళిత వాడ చిత్రణ కథలు :
 
బోయ జంగయ్య రాసిన కథలలో ఎన్నో విధాలుగా దళితుల జీవన చిత్రణ కలదు. వీరి కథల్లో ఎక్కువగా కుల పీడ పోవాలని ఆకాంక్ష కనిపిస్తుంది. ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని సమన్యాయం ధ్వనిస్తుంది. కొమ్ములు లేని ఎడ్లు కథలో దళితులకు అందరి పొత్తుల మూడు ఎకరాల పొలం ఉమ్మడి పట్టాగా  ఉంటుంది. వీరు అందులో కందులు, పెసర్లు పండించుకుంటారు.  ఒకరోజు పెద్దిరెడ్డి దొర పశువులు పొలంలో పడి కందినంత తుమ్మకాయ నమ్మిలినట్టుగా తినేసాయి. దీంతో దళితులు ఆ పశువులను బందెలదొడ్డిలో పడేస్తారు. అంతకు ముందే ఒకరోజు దళితుల కోళ్ళు దొర పొలంలోకి వస్తే దొర వాటికి ఎండ్రీన్ కల్పిన గింజలు చల్లి మరీ చంపించాడు. అప్పుడు మాట్లాడనీ అగ్ర కులస్తులు , దొర ఎడ్ల ను దళితులు కట్టగానే అందరూ ఏకమైనారు. మొత్తానికి దొర కక్షకట్టి తీసుకున్న అప్పులన్నీ ఇవ్వాలనీ ఘీంకరించాడు. దీంతో చేసేదేమీలేక దళితులు తమ భూమిని అప్పు కింద ఇచ్చి, దొర లేని ఊరి పొలిమేర దాటి వెళ్లిపోయారు. అలా  దళిత వాడలు ఏర్పడ్డాయని రచయిత వాస్తవిక చిత్రం చేశారు.

2.అంటరానితన నేపధ్యం కథలు :
 
కాళోజి రాసిన తెలియక ప్రేమ తెలిసి దేశం కథలో అంటరానితనాన్ని గురించి ఉంది. గూడ అంజయ్య రాసిన గౌరడు కథలో దళితుల్ని కనీసం మనుషులుగా కూడా పరిగణించని దుస్థితిని రచయిత చిత్రీకరించారు.  బోయ జంగయ్య కథ ఉప్పు నీరు కథలో తాగే నీరు లేక కుక్క చావు చచ్చిన ఎనభై ఏండ్ల దళితుని కథ కలదు.  జూపాక సుభద్ర రాసిన కథ శుద్ధి చేయ్యాలే. కథ అంతా ఉత్తమ పురుషలో సాగుతుంది. దీనిలో కథా నాయకురాలు ఒక దళిత మహిళ.  ఈమెకు శివదేవపూర్  జూనియర్ కాలేజీలో ప్రభుత్వ లెక్చరర్ గా ఉద్యోగం  వచ్చింది. కానీ ఆమె అక్కడ ఎలా ఉండాలనేది ప్రశ్న . ఎందుకంటే దళితులకు అద్దె కూడా అక్కడ ఇవ్వరని బాధ పడుతుంది. చివరికి మొత్తానికి ఎలాగో అద్దె సంపాదించుకున్నారు.  కానీ  యజమాని వారు దళితులనీ వాళ్లు కడ జాతోల్లంట గదా అనీ సామాను వెనక్కి తీసుకు వెళ్ళమని ప్యూన్ ద్వారా చెప్పిస్తారు. సమాజంలో గౌరవమైన అధ్యాపక వృత్తిలో ఉండి కూడా అంటరానితనం వెంటాడుతున్న తీరు కథలో చిత్రీకరించబడింది.
 పసునూరి రవీందర్ రాసిన కథ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా దీనిలో కులం పేరు తెలియగానే ఛాయ్ నీళ్లు అందించిన రెడ్డెమ్మలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అంతసేపు తమలో ఒకరిగా భావిస్తూ కోడలు చేత ఛాయ్ ఇప్పించిన రెడ్డమ్మ పని పిల్ల చేత గ్లాసు తీయిస్తుంది. దళితులకి ప్రతి అడుగులో కనిపించే అంటరానితం సమస్యను రచయిత చిత్రీకరించాడు. ఊరు అడవి కథ రాసిన పొట్లపల్లి రామారావు కథలో కూడా ప్రతీకాత్మకంగా దళిత విషయంను చెప్పారు. దీనిలో కులం అడక్కుండా పల్లెలో కనీసం మంచినీరు కూడా ఇవ్వరు. అదే అడవిలోని వాగు చల్లని నీరు ఇస్తుంది. దీనికి మాత్రమే ఎలాంటి వివక్ష లేదనే సందేశం ఇచ్చాడు రచయిత.

3.నైజాం కాలం వెట్టి చాకిరీ కథలు : 

నైజాంలో వృత్తి పనుల వెట్టి చాకిరీని దొరల అహంకారాన్ని చిత్రీకరిస్తూ చాలా కథలు వచ్చాయి. వాటిలో వట్టికోట ఆళ్వారుస్వామి పరిగె,  సురవరం ప్రతాప రెడ్డి సంఘాల పంతులు , పోట్లపల్లి రామారావు న్యాయం , ఆవుల పిచ్చయ్య నార ,భాగ్యరెడ్డి వర్మ వట్టి మాదిగ  వంటి కథలు కలవు. గత దశాబ్ద శతాబ్ది వైతాళికులలో గొప్పవారు భాగ్యరెడ్డివర్మ. వీరు ఆది హిందూ సమాజాన్ని ప్రారంభించారు. బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు.1858 లో హైదరాబాద్ లో జన్మించారు. వీరు అజ్ఞాతవాసి కలం పేరుతో కథలు రాశారు. వీరు రాసిన వెట్టి మాదిగ కథ ఇలా ప్రారంభమవుతుంది -  " పోలీసు పటేలగు రామిరెడ్డి గ్రామబారిడి  పై కూర్చుని యుండెను. అతడేదో తొందర పనిచేసే మనోవైకల్యం గల వాని వలె గన్పట్టుచుండెను " కథలో రామిరెడ్డి పలుకుబడి గల కుటుంబంకు చెందిన వ్యక్తి. 200 ఎకరాల భూమి కలదు. గ్రామంలో ఒకరికి ఇంకొకరికి కలహాలు పెట్టుట ఇతని నైజం. రెడ్డి గారిచే ఎవరైనా విరోధం పెట్టుకుంటే వానిని ఏదో ఒక విధంగా శిక్షకు గురి చేసే వాడు. అందుకనే రామిరెడ్డి అంటే గ్రామస్తులకు ప్రజలకు అంతా భయం. ఈ కథంతా సరళ గ్రాంథికంలో కలదు. రచయిత పై కథలో భూస్వాముల జులుంను  చిత్రీకరించారు. ఈ వెట్టి నిర్మూలనకు 1921లో జీవో ఫర్మానా జారీ చేసినప్పటికీ స్థానిక భూస్వాములు దాన్ని ఆచరించలేదు.

 బెల్లంకొండ నరసింహాచార్యులు సీయాసి సభలు అనే కథను రాశారు.  నిజాం కాలంలో ఎగిసిన ప్రజా చైతన్యంకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం 1929 లో  గఫ్తీ నిషాన్ అనే ఉత్తర్వులను విడుదల చేసింది.  కథలో  వెట్టిచాకిరికి వ్యతిరేకంగా నిరసనగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కలదు.  కోండపల్లి నీహారిణి గారు దాదాపు తొమ్మిది కథలు రాశారు. అవి మనసు పరిమళించెనే వేళ , కథ కాని కథ , మారాకు తొడిగింది ,సత్యం వధ , మట్టి  పూలు , సంసార గీతం. ఈ కథలో నిజాం పాలనలో కమ్యూనిస్టుల అవస్థలను ,  వారిని కాపాడుకోవాలని హరిజనులు పడ్డ పాట్లు గురించి కథలు కలవు.

4.స్త్రీ వాద నేపథ్యంలో దళిత కథలు :
 
దళిత వాదంలో స్త్రీ స్వరాన్ని వినిపించిన వాళ్ళు గోగుశ్యామల , జాజుల గౌరీ , జూపాక సుభద్ర మొదలైన వారు. ముస్లింకథ లలో కూడా దళిత స్వరాన్ని వినిపిస్తున్న వారు షాజహానా , పర్వీన్.
 
 జూపాక సుభద్ర రాసిన కథ బల్లనే  దోస్తు వూల్లే కాదు. శీర్షికను బట్టే కథ ఇతివృత్తం మనము అర్థం చేసుకోవచ్చు. దీనిలో సువర్ణ శ్రీలత స్నేహితులు. దీనిలో సువర్ణ పద్మశాలి అమ్మాయి, శ్రీలత దళిత కుటుంబం అమ్మాయి. శ్రీలత జెండా వందనంకు డ్రస్సు అవసరం వస్తుంది. తల్లికి తెలియకుండా శ్రీలతకు డ్రెస్ తెస్తుంది సువర్ణ . ఆ  తర్వాత సువర్ణ తల్లీకి విషయం తెలిసి " నీకేం బుట్టిందే.....మాదర్యోదా ముండ గా మాదిగోల్ల పిల్ల కిచ్చి మల్ల దెచ్చుడేంది అంటుంది. సువర్ణ వాళ్ళమ్మ ఆ బట్టల పై కిరోసిన్ పోసి తగల పెడుతుంది. అంటరానితనం అమాయకపు పిల్లలను ఎట్లా వేధిస్తుందో ఈ కథలో కనబడుతుంది. ఊళ్లోని దొర ఆగడాలను భరించలేక ఊరు విడిచిన స్త్రీల కష్టాలను వారి ప్రతిఘటనను వూరు విడిచిన ఉత్తరం కథలో జ్వలిత చిత్రీకరించారు.

 కాలువ మల్లయ్య రాసిన ఎంగిలి చేత్తొ కథలో నేతగాని దుబ్బమ్మ అనే దళిత స్త్రీ జీవితంలో కడగండ్లు చిత్రీకరించబడ్డాయి. పంట మార్పిడి తర్వాత మట్టితో కలిసిన గింజల్ని చెరిగి పోసుకోవడం నేతగాని వృత్తి.  పిడికెడు వడ్లు కూడా రాకుండా  అవుతున్నయని, రైతులు పిసినారులు అవుతున్నారని  వారి జీవనమెట్లు  సాగాలని నేతకాని దుబ్బమ్మ  బాధ పడే  కథ ఇది.  దళితకోణంలో రైతు కోణంలో చూస్తే ఇది ప్రత్యేకమైనదే. అంపశయ్య నవీన్ రాసిన కథా సంపుటి ఎనిమిదో అడుగు. దీనిలో శిక్ష అనే కథలో రాధను తెలివిగా సర్పంచ్ కొడుకు శ్రీధర్ పొందాలని అనుకుంటాడు. ఆయితే అతనిని వివాహబంధంలో రాధ ఇరికించి న్యాయం పొందుతుంది . దీనిలో దళిత స్త్రీ పరిస్థుతులను ఎదిరించి తన సమస్యను తానే ధైర్యంగా పరిష్కరించుకోవడం ఇతివృత్తం. పేదరికంతో వచ్చిన రాధ లైంగిక దోపిడీ ఎదుర్కోవాల్సి వస్తుంది . దళిత చైతన్యం  ఈ కథలో కనిపిస్తుంది.

5.ప్రేమ - లైంగిక దోపిడి నేపథ్య కథలు:

1948 లో పోలీసు యాక్షన్ తర్వాత బూర్గుల రామకృష్ణారావు అమలు చేయబడ్డ కౌలుదారీ చట్టంను దానిలో లోటుపాట్లను  చిత్రీకరించిన కథ విద్యుల్లత. దీనిలో అగ్ర వర్ణ యువతిని  ప్రేమించిన దళిత యువకుని  జీవితం ఆధారంగా రచయిత ఈ కథను నడిపారు. ఇందులో దళిత ఆదిమ వాసీ స్త్రీల సమస్య చిత్రణ కలదు. ఈ కథను రాసిన వారు ఎన్.కె.రామారావు.  జూపాక సుభద్ర రాసిన కథ ఆదర్శ వివాహం  లో ప్రేమించి పెళ్ళాడి మోసపోయిన స్త్రీ కథ కనబడుతుంది.
 కాలువ మల్లయ్య రాసిన కథ  నిర్ణయం ప్రేమ వివాహాలకు సంబంధించిన కథ. ఇది దళితులు మంచి ఉద్యోగం పొందినప్పుడు పై కులాలకు చెందిన స్త్రీలు వాళ్ళను పెళ్లి చేసుకోవడంకు ముందుకు రావడం జరుగుతుంది. అయితే వారు ఇచ్చే విలువ దేనికి ? ప్రేమకా?  లేదా ఉద్యోనికా అనే ప్రశ్నలు లేవనెత్తారు రచయిత. అలాగే దళితుడి సంఘర్షణను చిత్రీకరించారు.

6.దళితులపై తప్పుడు కేసుల నేపథ్యంలో కథలు:

కాలువ మల్లయ్య రాసిన అగ్ని గుండం కథలో అగ్రవర్ణాల వారు తమ పెత్తనాన్ని దోపిడీనీ  ప్రశ్నించినందుకు దళితులపై కుట్రపన్ని వారిని ఉద్యమకారులనే ముద్రవేసి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించే వైనాన్ని రచయిత చిత్రీకరించాడు. దీనిలో డప్పు కొట్టి బతికే మాదిగ అంజయ్య కొడుకు పెద్ద చదువు చదివి ఎదిగిన వస్తుంటే దొరలు అన్యాయంగా దొంగ కేసులో ఇరికించి కక్షతో దళిత యువకుణ్ని ఎదగనీయ్యకుండా  అగ్నిగుండంలో సమిధ వల్లే పడదోస్తున్నారనీ  రచయిత చెప్పారు.

7.చదువు నేపధ్యం లో కథలు:

 కాలువ మల్లయ్య మస్కట్ మల్లయ్య కథలో దళితునిగా పుట్టిన మల్లయ్య ఊర్లో ఉన్నంతవరకూ నికృష్టంగా బతికిండు.  ఊరు వదిలి లిబియా వెల్లి తిరిగి డబ్బు సంపాదించుకుని ఊరికి వెళ్తే దొంగ మల్లిగా అంటూ అవహేళన చేసినవారే "మస్కట్ మల్లయ్య...అగు బిడ్డా  " అనీ గౌరవంగా పిలిచారు. దళితులకు జీవితాన్నీ  గెలిచినప్పుడే గుర్తింపు అనీ రచయిత చెప్పారు.  బోయ జంగయ్య శిథిల విగ్రహాలు కథలో కథానాయకుడు గోపాల్ దళితుడు చదువుకున్నవాడు. పండుగలలో గావు పట్టి జంతువులను చంపి వేయడం అమానుషమని , ఆ పని చేయనీయ్యడు. దాంతో ఆ వూరి దొర , పూజారి ,ఇద్దరు కలిసి గోపాల్ ని అరెస్టు చేయిస్తారు.  చివరికి జడ్జి న్యాయంగా గోపాల్ ని నిర్ధోషిగా నిర్ణయించి,  ఆచారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు, ఇలాంటి దళిత కథలు అరుదుగానే ఉంటాయి. దళితుల పక్షాన తీర్పు రావడం అనేది రచయిత ఇలాంటి మార్పు కోరుకుంటున్నారనీ తెలుస్తోంది.

8..ఆకలి కేకలు పేదరిక నేపథ్యంలో కథలు: 
 
జాజుల గౌరి రాసిన కథ మన్ను బువ్వ. ఇది దళితుల పేదరికం ఆకలి చావులు ఆర్తనాదాలను చెప్పింది. కథలో తమ తల్లిదండ్రులు ఇంట్లో ప్రతి రోజు గొడవ పడుతుంటే నిశ్శబ్దంగా భరిస్తుంది దళిత బాలిక .అలా ఆకలి కూడా మరిచిపోతుంది . మన్నుతో ఆడుకున్న కడుపులో ఆకలి తక్వకాలే నన్ను ఎవరు చూస్త లేరు అని బాలిక బాధపడింది. దళితుల పేదరికాన్ని తెలుపుతూ జాజుల గౌరీ రాసిన మరో కథ దవఖాన. కథ ప్రారంభం లో  " దవఖాన్ల నూకుడు బండి మీద పీనుగని ఏసుకోస్తుంటే ఒక్కసారిగా అదిరిపడింది పక్కకు జరిగింది యాదమ్మ. కొడుకు ఆరోగ్యం బాగా లేకపోతే మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చింది యాదమ్మ . శవం ఎదురు వస్తే  యాదమ్మ పక్కవాళ్ళని ఎవరనీ అడుగుతుంది, కానీ కథ చివర్లో ఆ ఎదురు వచ్చిన శవం తన భర్తదే అని తెలుసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. దళితుల పేదరికాన్ని, నిస్సహాయతను , ప్రేమ అనుబంధంను ఈ కథ తెలిపింది.
 
గోగు శ్యామల రాసిన కథ "ఏనుగంత తండ్రి కన్నా యేకులబుట్టంత తల్లి నయం"  దీనిలో
ఓరోరి సాయన్న ఓ పండుగ సాయన్న
పాలమూరి ఈడి  గోల్లాయి
బియ్యం బండ్లు పోతున్నాయి
పన్నెండు పుట్లు బియ్యంబండ్లు
తాండూరుకు పోతున్నాయ్
పట్టు విడవక సాయన్న 
 అనే పాట ఆధారంగా రచయిత్రి దళితుల ఆకలి చావులను చెబుతూ వారిలో చైతన్యం నింపారు.

9.మత మార్పిడిల నేపధ్యంలో కథలు:

 హిందు మతంలో దళితులు ఆశించిన మార్పులు పొందలేక , పర మతాన్ని ఆశ్రయించే సందర్భాలు కోకొల్లలు.  అలాంటి కథ ఇది. నిజాం రాజ్యంలో దళిత కులంలో మత మార్పిడులు జరిగాయి. గూడ అంజయ్య ఇనాం శిలుక అనే కథను రాశారు . 1945 ప్రాంతంలో దళితుల్ని ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చారు. భూమిని ఇస్తాము అని  చెప్పారు .కానీ తీరా మత మార్పిడి తర్వాత దళితులకు భూమి దక్కలేదు మాల-మాదిగల నోట్లో మన్ను పడ్డట్లయింది అనే వాక్యం దగాపడ్డ దళితులను సూచిస్తుంది.

10.కుల వృత్తి నేపథ్యంలో కథలు:

గోగు శ్యామల రాసిన కథలన్నీ దళిత నేపథ్య కథలు. వీరి బడేయ్య కథలో దళితులు జంతు కళేబరాల నుండీ చెప్పులు సేకరించే విధానం చెప్పబడుతుంది. అలా వారి వృత్తి జీవితం గురించి కలదు.  నందిని సిధారెడ్డి రాసిన కథ చిత్రకన్ను . ఒక శవం తగులబెట్టుటకు దళితులకు  80 రూపాయలు ఇవ్వడానికి నిరాకరించాడు నరసయ్య.  అలా వారి ఇంటివారే రాత్రి చింతలు కొట్టి కట్టెలను తెచ్చి వచ్చి పడుకున్నారు. మా కులవృత్తిని కోల్పోయామని మాదిగలు రాత్రికి రాత్రే శవం కోసం వున్న కట్టెలను మంటలో కాల్చేసారు. ఇక పిసినారి నరసయ్యకు  అడిగినన్ని డబ్బులు ఇచ్చి శవదహనం చేయించక తప్ప లేదు. మాదిగలు తాము గెలిచామని సంతోషంతో ఇంటికి వెళ్లేసరికి అక్కడ తమ గుడిసెలు అగ్గిలో మండిపోతున్నాయి. నరసయ్య మనిషి ముత్తడు వాటిని అంటించిండు.  ధనికులు మాదిగలను ఎంత హీనంగా చూస్తారో , ఎలా ప్రతీకారంతో విచక్షణ కోల్పోతారో నందిని సిధారెడ్డి చిత్రీకరించారు. జూకంటి జగన్నాథం రాసిన కథ కళేబరం. దీనిలో పెరిగిన చైతన్యంతో దళితులు తమ కులవృత్తి అయిన చచ్చిన శవాలను తామెందుకు తీసేయాలి అని నిలదీయడంతో , ఆ సమస్య ఎంత పెద్దదో అప్పుడు అగ్రకుల వారికి తెలిసి వస్తుంది.

11.ఇతర కథలు:

 కాలువ మల్లయ్య దళిత బహుజన కులాల ను చైతన్యపరిచే ఎన్నో కథలు రాశారు. వీరు రాసిన వెలి (1983) కథలో  తెనుగు నరసయ్య బిడ్డ మల్లి విధివశాత్తు భర్తను కోల్పోతుంది. పసివాడైన కొడుకుతో పుట్టింటికి చేరుతుంది. అప్పుడు మేనమామ కోడుకు రాజయ్య మళ్లీ మారు మనువు ఆడతాను అంటాడు. అలా  ఇద్దరూ శారీరకంగా ఒకటి కావడం , మల్లిగర్భం దాల్చడం జరుగుతుంది. ఈ విషయం బయటికి పొక్కడంతో ఊరి దొర దగ్గరకు పోతుంది. ఊరి పెద్ద కుల కట్టుబాట్లు అతిక్రమించాడు అని మళ్ళీ కులంలోకి రావాలంటే కుల తప్పు కింద 500 రూ , మరియు మరో 500 పెద్దలకు కట్టాలని పంచాయతీ బోర్డు తీర్పు చెప్పింది. డబ్బులు కట్టలేక రాజయ్య కాళ్ళ బేరానికి వస్తాడని దొర భావించాడు. కానీ రాజయ్య " ఏ కులంలున్నా ,  ఏ ఊర్లో ఉన్న , ఏ పట్టణంలో ఉన్న రెక్కలు నమ్ముకొని బతకాలే, గటంటప్పుడు నీకు దండుగట్టే కులంకు అచ్చుడెందుకు అని దొరకు సవాల్ విసరడం కథలో ఇతివృత్తం.  దొరల అధికారాలను వెలి వేసే చైతన్యంతో మార్పును చిత్రీకరించారు రచయిత. కాలువ మల్లయ్య రాసిన మరో కథ యుద్దభూమి. ఈ కథలో పల్లెలలో ఉద్యమాలు వ్యాప్తి  చెందు విధానంను చెప్పాడు.

 బోయ జంగయ్య రాసిన మరో కథ ఎదురుతిరిగిన ఆయుధాలు. ఈ కథలో చౌదరి గారి అమ్మాయిని ఒక దళితుడు అవమానించాడని దళితుల పది మందిని ఊచకోత కోసారు. చౌదరి, రెడ్లు,  నాయళ్లులు. ఈ అగ్ర కులస్తులు దళితులను చంపి తమ పలుకుబడితో హత్యలు చేసి పోలీసులకు దొరకకుండా చేస్తారు. ఎందరో దళిత యువతులను విధవరాలు చేస్తారు. కథ చివర్లో మర్రి చెట్టు పై దళితులను చంపిన కత్తులు దొరుకుతాయి. వాటిపై చౌదరి పేర్లు ఉండటం. అవి  దొరకడం కొంత ఊరట కలుగుతుంది.అలా వారికి శిక్ష పడుతుంది.

-ఇతర దళిత కథా రచనలు:

 బోయ జంగయ్య - బొమ్మలు , నల్లాల లక్ష్మీ రాజ్యం -మా వూరి ముచ్చట్లు , కాలువ మల్లయ్య - కర్రోడు , సి.యస్.రావు - ఊరుమ్మడి బతుకులు , సిహెచ్.మధు - బావి , పప్పుల నరసింహం-ఇప్పుడు ఉదయిస్తున్న సూర్యుడు , జాజుల గౌరీ - గండం,నీళ్ల బాయి, గోగు శ్యామల-బాయి తలం,గండాలు,రడం,బైండ్లామే భూవడు గదా మరి, గుండెడప్పు కనకయ్య-దోషులెవరు,మాతంగి దాసు,చెప్పిచ్చు కొడతాం,మేమిట్లుండం, పడాల రాములు - బలి,  డప్పోల రమేష్-దునియాల, మాస్టార్జీ-ఆ  వరమొస్తే , గుర్రం సీతా రాములు - కొన్ని ఎముకలు , 
కె.వి.నరెందర్-బర్రె,చక్రవర్తి లింగస్వామి -వెన్నెల వాడ కథలు, సిద్దెంకి యాదగిరి - పంచుకోండ్రీ (వర్గీకరణ ఉద్యమం పై), బతుకుమ్మ పండుగ నేపధ్యం లో సమ్మెట ఉమాదేవి - బతుకమ్మ. ఇంకా  వేముల ఎల్లయ్య , యెన్నేం ఉపేందర్ , బి.ఎస్.రాములు , డా.కేశ రెడ్డి , సి.యస్.రావు, దార్ల రామ చంద్ర , నల్లాల లక్ష్మీ రాజం , కె.పి.లక్ష్మీ నరసింహ మొదలైన వారు కలరు.
-పరిశోధనలు:
 - తెలంగాణ దళిత కథ సాహిత్యం అధ్యయనం (ప్రస్తుతం,ఉస్మానియా యూనివర్సిటీ)-ఇ.స్వామి.
- తెలంగాణ కథ వివిధ దృక్పథం (ప్రస్తుతం-ఉస్మానియా యూనివర్సిటీ)-బి.మాధవి.
-  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దళిత రచయిత్రుల పాత్ర(ప్రస్తుతం-ఉస్మానియా యూనివర్సిటీ)-జి.ప్రతాప్.
-  దళితస్త్రీ సమస్త కథలు పరిశీలన -(2002ఆంధ్ర యూనివర్సిటీ) -జె.నిర్మల. 
- తెలుగు కథలలో దళిత స్త్రీ చిత్రణ (2002-ఎం.ఫిఎల్)-ఎన్.వసంత కుమారి.
- తెలుగు కథానిక దళిత చిత్రణ పాత్ర చిత్రణ (1998-ఉస్మానియా యూనివర్సిటీ)-జె.మురళీ కృష్ణ.
- హరిజనాభ్యుదయం-తెలుగు కథానిక - (1996-శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ)-కె.లక్ష్మీ నారాయణ.

-ముగింపు:
 
తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్యం మరింత కొత్త కోణంలో రావలిసి వుంది. వారి చైతన్యంనే కాదు.  దళితులలో ఐక్యత లేక పోవటం , మత మార్పిడి , విద్యా విధానం , కుటుంబ సంబంధం ఇలా ఇతరేతర విషయాలలో కథలు చాలా రావాలిసి వుంది. తెలంగాణలో దళితులే కాదు దళితేతరులు కూడ దళితవాదంతో కథలు రాస్తున్నారు. కానీ ఎవరి వాదం వారే వినిపించాలి అనే వాదన లేకపోలేదు. దళిత కథ రచనలలో వస్తు , శైలి, శిల్పం ఏంతో గొప్పవి. వాటి ప్రభావం సహజంగా దళితేతర రచయితలపై  తప్పక పండిందనే చెప్పవచ్చు.

దళిత కథలు రాసిన దళితులు కేవలం కథలు రాసి చేతులు దులుపుకోవడం లేదు. ఏదో ఒక విధంగా తమ వంతుగా దళితాభ్యునిధి కి కృషి చేస్తునే వున్నారు. ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో నేడు దళితులందరు విద్యావంతులై అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఎవరికి తల వంచకుండా తమ అస్థిత్వాన్ని నిలుపుకోవడం జరుగుతుంది. కానీ ఇంత విద్యావంతులై రాజకీయ రంగంలో చైతన్యవంతులు అవుతున్నా కూడా ఇంకా సమాజంలో సమాన గౌరవ మర్యాదలు లభించడం లేదనే చెప్పాలి. ఇదీ ఒక విధంగా దళితులకు అసంపూర్ణ విజయమే.
                        
*ఉపయుక్త గ్రంధ సూచి*
* తెలుగు కథకులు - కథన రీతులు - బి.యస్.రాములు
* తెలంగాణ కథానిక వికాసం (వ్యాసం)-డా.బి.వి.ఎన్.స్వామి
* తెలంగాణ కథ-వర్తమాన జీవన చిత్రణ - ఎం.దేవేంద్ర
* బోయ జంగయ్య కథలు (వ్యాసం)-డా.మంథని శంకరయ్య

- ఐ.చిదానందం

click me!