గుడిపల్లి నిరంజన్ కథ : రచ్చకట్ట

By narsimha lode  |  First Published Dec 31, 2023, 9:08 AM IST


అధిక సంఖ్యాకులైన బహుజనులు రాజ్యాధికారం దిశగా ఎలా  ప్రయాణించాలో నాగర్ కర్నూల్ నుండి గుడిపల్లి నిరంజన్ రాసిన కథ " రచ్చకట్ట " లో చదవండి :


రచ్చకట్ట కాడ దుమ్ము ధూళి కప్పుకొని కుక్కలు కాళ్ళల్ల తలలు వెట్టి పడుకున్నాయి. వాటిని చూస్తుంటే మలిచిన 'విల్లులాగా' ఉన్నాయి. దుప్పటి తన్నుకొని పొడుస్తున్న సూర్యుడు వేడిమిని వెదజల్లుతు బహుశా మీసాలు దువ్వు తున్నాడు..
చిత్తకార్తి కదా! ఎండ చిట చిటలాడుతుంది.
పాఠశాల ఆవరణంలో ప్రార్థన చేస్తూ ఎండలో నిలబడిన పిల్లలకు శోచల్ వచ్చి కండ్లు తిరిగి పడిపోతున్నారు.  ఎండ తాపంతో కుక్కలు నాలుకలు బయటికివెట్టి ఎగతేకుతున్నాయి. సూర్యుడి తీవ్రతలా  కుక్కలు 'మాంచి' వయసు మీద కోరికలతో రగిలిపోతున్నాయి .
బహుశా సూర్యుడిది కుక్కలది కౌమార వయస్సు.

ఒక తేజస్సు ప్రతిబింబించే విధంగా సూర్యుడి ముఖంపై నల్లగా మబ్బులు మొటిమల్లా మొలుస్తున్నాయి. చెప్పకనే ముఖముపై ఉన్న మొటిమలు వయసు గురించి చెబుతున్నాయి. కౌమారదశలో సూర్యుడు కుక్కల్లోనూ 'కామ' వేడి పుట్టిస్తున్నాడు.

Latest Videos

undefined

నిజానికి సూర్యుడు ఒక్కొక్క మండలంలో ఉన్నప్పుడు భూమ్మీద జీవరాశుల్లో ఒక్కొక్కరకమైన కోరికలు పుడతాయి.
ఆయా రకాల శారీరక గుణాలు బయటపడతాయి. ఈ చిత్త కార్తిలో కుక్కలు జత కోసం వెంపర్లాడుతుంటాయి. ఆ వాడలోని కుక్కలు ఎద్దు బొక్కల్లోని, అవు బొక్కల్లోని బర్రె బొక్కల్లోని  'ముడుసులు' జుర్రుకు తిన్నాయి. తిన్నాక కోరికలు ప్రేరేపితమై కుక్కలు తండ్లాడుతుంటాయి. అదోరకమైన శబ్దంతో కుయ్యికుయ్యి మంటాయి.  కుక్కల చిత్తమంతా జంట మీదే. దేహవాంఛల మీదే. ఎండ ఎట్లెట్ల పెరిగితే కుక్కల్లో సంభోగవాంచ అట్లట్ల  పెరిగి భరించలేనంత స్థాయికి చేరుతుంది. శరీరంలో 'ఉడుకు' పెరిగి మగకుక్క ఆడకుక్కకై అన్ని దిక్కులు వెతుకుతుంది. వెంపర్లాడుతుంది. మూతి మీదికి పెట్టి కుయ్యోమని అరుస్తుంది. దాని బాధ దానిది.

ఎందుకో ఊరి ఆడ కుక్కలు మాత్రం ' వాడ' మగ కుక్కల సహవాసమే కోరుకుంటాయి. మాదిగ వాడ కుక్కలతోనే తృప్తి పొందుతుoటాయి. సైబీరియన్ కొంగలు ఖండాంతరాలు దాటి కొల్లేటి సరస్సుకు వచ్చినట్లు ఎక్కువగేరి ఆడ కుక్కలు ఆ వాడకట్టు దాటుకుని మాదిగ వాడ  కుక్కల దగ్గరకు వస్తుంటాయి. మనుషులకుండే వివక్ష కుక్కలకు లేదు. కోరి వచ్చిన గేరి కుక్కలతో వాడ కుక్కలు హద్దులు లేకుండా సంతోషంగా జతకడుతుంటాయి. స్వర్గాన్ని చూపిస్తాయి. సంతతిని వృద్ధి చేసుకుంటాయి.

ఇదంతా చూస్తున్న ఎగువ గేరి కుక్కలకు మహా మంట. ఈర్ష్య, అసూయ ద్వేషంతో రగిలిపోతాయి. కొన్ని సార్లు కుక్కల్లో  కోపం చిర్రెత్తుకొచ్చి ఒకదానిని మరొకటి కరుస్తుంటాయి.

ఎంతైనా మూలిగలు, ముడుసు బొక్కలు, కార్జాలు, కాళ్ల గిట్టలు తిన్న కుక్క కదా !  బలంగా గేరి కుక్కల మీదికి లేస్తాయి మాదిగ వాడ కుక్కలు. ఆడ కుక్కలను వశ పరుచుకున్నట్టే మగ కుక్కల్ని భయపెడుతుంటాయి. కింద మీద ఏసి పొర్లిచ్చి పొర్లిచ్చి ఎక్కడంటే అక్కడ పీకి పీకి పెడుతాయి. 

"బావా! ఈ వాడ బాగుంటుంది. నీతో జీవితం సంతోషంగా ఉంటుంది. కోరి వచ్చిన నన్ను కొలిచి మొక్కే దయ నీది. పర్వం నాది. ప్రేమ నీది. ఈ వారమంతా ఇట్లనే ఉంటుందా? ఇక్కడి విషయాలు చెప్పవా" అని ఎక్కువగేరి ఆడ కుక్క వాడ కుక్కని అడిగింది.

"వాళ్ల గురించి ఏం చెప్పమంటావు పిల్లా! మనం కుక్కలం కాబట్టి చెళ్ళిపోతుంది.  మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.  ఎక్కువగేరి మనసు పడ్డా, మనువాడినా మరణమే బహుమానం. అంతెందుకు పిల్లా !  ప్రణయ్ ని చంపింది ఎవరనుకున్నావు? మంథని మధుకర్ అంగాన్ని కోసింది ఎవరనుకున్నావు?  అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా విను.
ఛీ, ఛీ మనుషులు.  వాళ్ల గురించి చెప్పుకోవడం సిగ్గుచేటు.  మనకు పుట్టినట్టు కొత్త సంతతి పుడుతుందో లేదో కానీ చెప్తా విను"

                                     ****

మాదిగ వాడ పక్కెంబటే మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్  పెద్ద కాలువ పోతుంది.  కాలువ పక్కన పొలాలను చూసి తరించాల్సిందే. పొలాల సేలు సోకుతోటి గాలికి ఊగుతున్నాయి.  ఊరగుట్ట పొలాలను ప్రేయసిని చూసినట్టు చూస్తుంది. గుట్టకు ఆనుకున్న చెరువుతో అలలు సయ్యాటలాడుతున్నాయి. ఎప్పుడంటే అప్పుడు మనసు గుంజినప్పుడల్లా చెరువు గుట్ట చెంతకు చేరి చెవుల ప్రేయసివలే తీయని, సన్న సన్నని జోలి చెబుతుంది.

జొన్న సేలు జోగుతున్నాయి. సజ్జొన్న పంటపై వాలిన కాకులు 'ఆహార యుద్ధం' చేస్తున్నాయి. ఒక దశలో దంటు కంకిపై పక్షిని వాలనిస్తలేదు. పక్షి బరువుకు దంటు వాలిపోతుంది. ఒంగిపోతుంది. సన్న పిట్టలు ముక్కుతోటి పాలజొన్నల  పాలు తాగుతూ మత్తుగా   ఆకాశంలోకి లేచిపోతున్నాయి.  ఎగిరినంత సేపు ఆకాశంలో ఎగిరి, తాగిన పాలు అరిగిపోయాక, మళ్ళీ మళ్ళీ సేలల్ల వాలి పోతున్నాయి. మళ్ళీ మళ్ళీ పాలు తాగి పోతున్నాయి. పిట్ట కంకిని తొక్కుతుంటే ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో 'తెల్లజాతీయుడి 'మెడపై కాలు పెట్టి తుపాకి చూపుతున్న నల్లజాతీయుడు చేసే పోరాటం లెక్క అగుపడుతుంది.

                                     ****

మాదిగ వాడలో రచ్చకట్ట ఉంది. దానికి తోడు రచ్చకట్ట మధ్యలో నీడనిచ్చే మర్రి చెట్టు ఉంది. అది పొరుగూర్లకు ప్రయాణం చేసే ప్రయాణికుల అలసట తీరుస్తది. ఉండూర్ల  మాదిగవాడ పిల్లల ముచ్చట్లకు వేదిక అవుతది. రచ్చకట్ట పక్కనే నీళ్లటాంకి. అది దాహంతో పాటు అలసట తీరుస్తది. ఊర్లో పంచాయితీలన్నీ ఆ రచకట్ట మీదే. పండుగలకు పబ్బాలకు,  మగవాళ్ళు రాత్రిపూట కోలాటం వేస్తరు. ఆడోళ్ళు బొడ్డెమ్మ ఏస్తరు. నూనుగు మీసాల పిల్లలు కబడ్డీ  ఆడుతరు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామీణ జానపద  కళల  ప్రదర్శనలన్నీ అక్కడే జరుగుతాయి. అదే వేడుక. అదే వేదిక. ఊరి పంచాయతీలు, మంచి చెడ్డ, తలపోతలు, వలపోతలు అన్ని అక్కడే జరుగుతాయి. ఎక్కువోళ్ళకు, సూదరోళ్లకు  మధ్య జరిగే పంచాయతీలు...మాదిగలకు, సూదరోళ్లకు మధ్య జరిగే పంచాయితీలు కూడా అక్కడే తసిపె అవుతాయి.

ఊరి పటేల్ బాటెంబటి వస్తుంటే చదువుకున్న మాదిగ పోరలు రచ్చకట్ట మీద కూర్చుని లేవలేదు. పైపెచ్చు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. పైగా దండం కూడా పెట్టలేదు. పటేల్కు కోపం దంచుకొచ్చింది. కడుపులో కసబిస అవుతుంది. ఆయనే విసుగు చెంది తలదించుకొని వాళ్ళ ఇంటి వైపు వెళ్ళి పోయిoడు.

అప్పటినుండి పటేల్ కు ఈ రచ్చకట్ట లేకుండా చేయాలని మనుసుల పడ్డది. ఆలోచించిండు. ఎట్లనన్న దీన్ని కూలగొట్టాలి అనుకున్నడు. ఆ బాటెమ్మటి పోయినప్పుడల్లా రచ్చకట్టే ఆయనకు గుర్తుకొస్తుంది.‌ ఆయన టార్గెట్ అంతా రచ్చకట్టే. అది ఉండబట్టే ఈ నా కొడుకులు కూసుంటున్నారు.  రచ్చ కట్టే పరోక్షంగా నా ఆత్మ గౌరవానికి భంగం  కలిగిస్తుంది.‌ రచ్చకట్టే పటేల్ ను రెచ్చగొట్టే శత్రువు అయ్యింది. పరువు పోగొడుతుంది. మనిషి కంటే అదే కోపం దెప్పిస్తుంది. పగపట్టిండు పటేల్. ఉడికి పోతుండు. తన పనేంటో రుచి చూపించాలి అనుకుంటున్నడు. తన పరువు ముఖ్యమనుకుంటున్నడు..

                                           ***

రచ్చకట్ట రాజకీయాలకు నిలయమైంది. చైతన్యానికి దర్పణం అయింది. ఉద్యమాలకు ఊపిరిలూదే  గడ్డ అయింది. రచ్చకట్టపై వాడలో అంతో ఇంతో సదువుకున్న మాల మాదిగ పిల్లలు కూర్చొని ఊర్ల అగ్రకులాల పెత్తనం గురించి మాట్లాడుకుంటున్నారు. కులతత్వాన్ని భరించలేని స్థితిని మాట్లాడుకుంటున్నారు. సామాజిక ఆర్థిక అంతరాలు ఎలా తొలగిపోయి సమతా జీవితం జీవించాలో మాట్లాడుకుంటున్నారు. అంబేద్కర్ పోరాటాన్ని మాట్లాడుకుంటున్నారు. కలగా మిగిలిపోయిన అంబేద్కర్ రాజ్యాధికారం గురించి మాట్లాడుకుంటున్నారు. కుల వ్యవస్థ నీచత్వాన్ని చూసి పళ్ళు పటపట కొరుకుతున్నారు.

వాడ మనుషులు అభివృద్ధి చెందకపోవడానికి కులంలో 'పరివర్తన' లేకపోవడం అనే నిర్ధారణకు వచ్చారు. చదువు విలువ అందరికీ సమానంగా తెలువాలంటే ఏమి చేయాలో చర్చిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి డెబ్బయి ఏళ్లకు పై బడ్డా, పట్టుమని పదిమంది కూడా దళితుల్లో ఉద్యోగులు లేకపోవడం ఏమిటి? ఈ ద్రోహం ఎక్కడ జరుగుతుంది? ఈ అన్యాయం ఎలా సరిదిద్దాలి. దీనికి మూలం ఎక్కడ? అంతం ఎక్కడ? ముఖ్యంగా పరిష్కారం ఎలా? అనే సైద్ధాంతిక చర్చల్లోకి వెళ్లిపోవడానికి 'రచ్చకట్ట' ఆసరా అవుతుంది. తమ వెనుకబాటుకు కారణాలు విశ్లేషించుకుంటున్నారు.  కులంలో సామాజిక ఆర్థిక సాధికారత ఎందుకు నెరవేర్చలేదు అనే ధర్మ సందేహాన్ని సిపిఎం రాజకీయ అవగాహన ఉన్న కొడిదల రవి కమ్యూనిస్ట్ పరిభాషలో వ్యక్తం చేశాడు.

ఆ యువక గ్రూపులో కొడిదల రంజన్ కొద్దిగా కులచట్రాన్ని దాటి ఉస్మానియా యూనివర్సిటీ వరకు వెళ్లి చదువుకోగలిగాడు. అక్కడ చదువుతో పాటు రాజకీయం నేర్చుకున్నాడు. ఆ ఊర్లో మొదటి పీ.జీ హోల్డర్ కాబట్టి అతనంటే ఊరివాడ మనుషులకు కొంచెం గౌరవం కూడా ఎక్కువే. అట్లో ఇట్లో కష్టపడి ఉద్యోగం కూడా సంపాదించిండు. అంబేద్కర్ చెప్పిన మార్పులు వాడల్లో జరగాలంటే నిర్మాణాత్మక మార్పులు జరగాలని బలంగా నమ్మి ఆ పిల్లలకు అదే విషయాన్ని నూరిపోసిండు.

చెప్పనైతే చెప్పిండు కానీ ఆ రాజకీయ మార్పులు నిజంగా వాడలో జరగాలంటే మరి ఏమి చేయాలని దీర్ఘంగా ఆలోచించాడు. ఆ  ఊళ్ళో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు దళితుడు సర్పంచి కాలేదు. ఏ ఒక్కరు కూడా రాజకీయంగా ఎదగలేదు. గుర్తింపు పొందలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళను ఎదగనివ్వలేదు. చైతన్యం వారి దరికి చేరనివ్వలేదు. ఊర్లో సగం జనాభా దళిత జనాబే, కానీ ఇంతవరకు దళితుడు సర్పంచ్ ఎందుకు కాలేదు?  సామాజిక కోణంలో పరివర్తన జరగాలని భావించాడు.

హీనంగా చూడబడుతున్న ఆచారాలు సాంప్రదాయాలను వాడనుండి తరమాలని అనుకున్నాడు. ఉన్నతమైన జీవన విధానం వాడ మనుషులకు నేర్పాలనుకున్నాడు.
మహానీయుల 'ఆత్మను' అర్థం చేసుకుని వారి త్యాగాలను గడపగడపకు చేర్చాలనుకున్నాడు. జాంబవంతుడిని తిరిగి
సమాధిలో నుండి లేపాలనుకున్నాడు. అయన గొప్పతనాన్ని గుండె గుండెకు పరిచయం చేయాలను కున్నాడు.

                                           ****
ఆరోజు రాత్రి రంజన్ అందరిని రచ్చబండ పైకి
రావాలని వాట్సప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడు. అది చూసుకున్న యువకులు అందరూ అనుకున్నట్టుగానే రాత్రికి రచ్చబండపైకి చేరుకున్నారు.  మొదటగా రంజన్ ఆ పిల్లల్ని ఉద్దేశించి 'జాంబవంతుడు ఎవరో మీకు తెలుసా'? అని ప్రశ్నించాడు.
'తెల్వద్' అని కొంతమంది సమాధానం.
ఆశించిన సమాధానం రాలేదు ఆ వాడ పిల్లల నుంచి.
అప్పుడు 'షాక్' అయ్యాడు రంజన్.
"అరే" వాడ బిడ్డలు జాంబవంతుడి తల్లి పేగు నుండి దూరమయ్యారని దుఃఖపడ్డాడు. మనల్ని మన సంస్కృతిని వేరు చేస్తున్నది ఏదో ఇక చెప్పడం షురువు  జేసిండు. ఎందుకు వేరు చేస్తున్నారో కూడా ఆలోచిద్దామని జాంబవంతుడి గురించి చెప్పడం ప్రారంభించాడు.

మొదట డక్కలి వారు చెప్పే జాంబవంతుని పటం, సిందోళ్ళు ఆడే బాగోతం, నులక చెందయ్యల ప్రవచనాలు, మాష్టీ గానాలు, జాంబ పురాణంల గురించి వివరించాడు.

వీటిని భద్రపరిచిన  జయధీర్ తిరుమల్ రావు సార్ రాసిన  'జాంబవ పురాణం'  పుస్తకాలను తెచ్చి చూపించాడు. అదేవిధంగా పులికొండ సుబ్బాచారి, గడ్డం మోహన రావు రాసినటువంటి 'జంబూ పురాణం '  పుస్తకం కూడా తీసుకొచ్చి చూపించాడు. ఆ పుస్తకంలో జాంబవంతుడి గొప్పతనం గురించి ఉంది. అయితే జాంబవంతుడి గొప్పతనం గురించి ఎవరూ నమ్మడం లేదు. అతడు ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి సాంస్కృతిక మనిషి అంటే అసలే నమ్మట్లేదు. స్వయంభుగా వెలసిన ప్రభువు. దేవదేవుడు. ఆదిదేవుడు మాదిగలకు మహాప్రభువు 'జాంబవంతుడు' అనే సత్యాన్ని చెప్పినా నమ్మడం లేదు.

వాడ పిల్లలు ఎక్కువగా కమ్యూనిస్టు అవగాహన ఉన్నవాళ్లు. ' దేహే ..ఇవి పుక్కిటి పురాణాలు. నమ్మొద్దు ' అని కొట్టి పడేస్తున్నారు.
నిజమే అష్టాదశ పురాణాలు, వాయు పురాణం, విష్ణు పురాణం, ఇలాంటివి పుక్కిటి పురాణాలు ఏమో కానీ 'కుల పురాణాలు' నిజమైనవి. వాస్తవికమైనవి అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు రంజన్.

కుల పురాణాలు ఆయా కులాల వీర గాథలను నొక్కి చెప్పుతున్నాయి అని మరింత గట్టిగానే కసిరించి చెప్పాడు.
"అట్లనా"? అన్నాడు గుడిసెల రవి.
" మరి ఇదంతా ఇంతకు మునుపు మేము ఎక్కడా వినలేదే" అన్నాడు మొఖం అదోలా పెట్టి.

సత్యాన్ని మనం విన్నా నమ్మనంత పరాయిదిగా చేసి చూపెట్టారు కొందరు అన్నాడు రంజన్.
అవును బాబాయ్ మీరు జాంబూ పురాణం చదివారా?
" చదివాను"....
'విన్నారా'?
'విన్నాను….!'
'చూశారా'?
'చూసాను'
'ఎక్కడ విన్నారు ?'
'నేను చిన్నగా ఉన్నప్పుడు మన మాది గేరిలకు డెక్కలి రాములు అని వస్తుండే. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఏడు ఎనిమిదిగల గాడిదలు ఉంటుండే. ఎల్లమ్మ ఆట వేస్తుంటే.... అబ్బా ఎంత గమ్మిరమో ఆటను పండించడంలో వాళ్లకు వాళ్లే సాటి. ఇప్పుడు వాళ్లలాగా ఏ సినిమా చూసినా ఆ మధురం, ఆ రుచి దొరకడం లేదు. మీరు నమ్మరు గాని ఒక్క విషయం చెప్పనా?! '
"చెప్పండి బాబాయి."
'చెప్పమంటారా చెప్పండి.'
'అరె తొందరగా చెప్పండి.'
ఇప్పటివరకు ఏ చరిత్రకారుడు చెప్పని విషయం ఒకటి ఉంది చెప్పనా అని  మళ్ళీ అన్నాడు రంజన్.
అరే మళ్లీ మళ్లీ అదే అడుగుతున్నావ్ తొందరగా చెప్పండి బాబాయ్.
"చరిత్రకు" ఆధారం మాట కూడా. అదే "శబ్దం" కూడా చరిత్రే. మరి చరిత్ర పుస్తకాల్లో కోటలు, వస్తువులు, అని మా చరిత్ర సారు కూడా అదే చెప్పాడు కానీ శబ్దం కూడా చరిత్రకు ఆధారమని కొత్తగా వింటున్నామే అని అక్కడున్న పిల్లలందరూ పెద్ద అనుమానాన్ని వ్యక్తం   చేశారు.
మన చరిత్ర ఎక్కడ రికార్డ్ కాలేదు. మన జాతి సత్యాలను సజీవంగా ఉండనివ్వలేదు.
' మాదిగలు ఈ భూమండలం మీద మొట్టమొదట మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన మహారాజులు' అని రంజన్ చెబుతున్నప్పుడే అటు నుంచి డక్కలి రాములు వస్తున్నాడు. ఈ మాట డక్కలి రాములు చెవిలో పడగానే టక్కున ఆగిపోయాడు. ' ఎవరయ్యా స్వామి ఏదో మాట అంటూరి ' అని మళ్లీ తిరిగి డక్కలి రాములు అడిగాడు.
' నేనే నే పెద్దమనిషి, ఏంటి చెప్పు' అని రంజన్ అన్నాడు.
అయ్యా నువ్వు మాట్లాడిన మాట 5000 సంవత్సరాల నుంచి డక్కలి వాళ్ళుగా మేము మోసక తిరుగుతూనే ఉన్నాం. ఈ మహాసత్యాన్ని ఈ ఊరికి వచ్చినప్పుడల్లా  మాదిగ వాడకపోయి మేము ప్రకటిస్తూనే ఉంటాము.
డక్కలోళ్ళు ఊర్లో ఎవరివద్దా అడుక్కోరు. మాదిగ వాడలో మాత్రమే అడుక్కుంటారు. కారణం మహారాజులు వీళ్లే కాబట్టి. అందుకే మేము "మహారాజా" అని నోటి నిండా  పిలుస్తాం అని రాములు చెప్పి జంబూ పురాణం ఘోషస్తున్న 'మాదిగలే మహారాజులన్న' సత్యాన్ని రాత్రంతా పిల్లలకు చెప్పిండు.  'మీరు దయాగుణం కలిగినవారు. మీది పెట్టే చెయ్యే గానీ అడుక్కునే చెయ్యి కాదు. మహాప్రభువులు మీరు. ఈ భూమoడలం మీద మీరే మొదటి పాలకులు' అని ఏడ్చినంత పని చేసిండు.
                                       ***

కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సాధించాలంటే మనం ఏమి చేయాలి అని పిల్లలు ఆలోచించసాగారు.  మన ఊరి జనాభాలో  మనం ఎక్కువ శాతం ఉన్నాం కాబట్టి ఎట్లనైనా సరే వచ్చే సర్పంచ్ ఎలక్షన్ల మనo మన సత్తా ఏంటో నిరూపిద్దాం -  అని ఆ 20 మంది పిల్లలు ఒక "సంకల్పం" తీసుకున్నారు.   ఒకనాడు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి మనం మన ఊర్లోనే నిర్మించడం ఎలా అనే దీర్ఘ మైన ఆలోచనల్లో పడిపోయారు. అందుకోసం మొదటగా ' జంబూ పురాణాన్ని ' ఇంటింటికి ఇవ్వాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఒక 150 పుస్తకాలను హైదరాబాద్ నుండి తెప్పించారు.  ప్రతి గడపకు ఆ పుస్తకాన్ని చేర్చారు. చేర్చడమే కాకుండా ఆ పుస్తకంలో ఉన్న తత్వాన్ని ఆ ఊర్లో  పెద్ద వయసున్న మాదిగలకు బోధించారు.

తర్వాత ఇంటింటికి జాంబవంతుడి నిలువెత్తు రూపంలో ఉన్న ఫోటోను బహూకరించారు. ప్రతి ఇంట్లో జాంబవంతుడిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. వారిలో ఉన్న బానిస గుణాలను అన్నింటిని వదులుకొని, మేము మహారాజులo అన్న ప్రతిజ్ఞ  ప్రార్థన రూపంలో రోజు పండుకునేటప్పుడు చేస్తున్నారు. ఆ గ్రామ యువకులు ఉదయం పూట తమ తమ పనులు చేసుకుంటూనే రోజూ రాత్రిపూట మాదిగ గృహాలను సందర్శించి, మాదిగల యొక్క గొప్పతనాన్ని, ఆ కులం యొక్క వీర గాధలను ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి తెలియజేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత  అంబేద్కర్ ఫోటోను ఇవ్వడం మొదలు పెట్టారు.   అంబేద్కర్ కు జాంబవంతుడు అర్థం అయ్యి మనం తిరిగి రాజులం కావాలని రాజ్యాంగం రాసిండు అని చెప్పారు. అందుకే మనకు "ఓటు హక్కు" అంబేద్కర్ ఇచ్చిండు. ఈ ఓటు హక్కు ఎందుకిచ్చిండటే  "మన ఓటు మనమే వేసుకొని మనం తిరిగి రాజులం కావాలని" ఓటును అమ్ముకుంటే మన ఆడ పిల్లలను అమ్ముకున్నట్టే అని చెప్పారు.
పిల్లలంతా వాళ్ళ తల్లిదండ్రులకు, పెద్దలకు  ఓటు ప్రాధాన్యత గురించి చెప్పి ఒప్పిస్తున్నారు. ఇంటికి ఒక రాజ్యాంగం ఇచ్చారు.  అంతే గాకుండా వారి ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు. రోజూ నువ్వులు, తేనే,  బెల్లం తినమని చెప్పిండ్రు. అంతే గాకుండా మునగాకులో ఉండే పోషకాలు ఎంత మంచివో చెప్పి తినమని సూచించారు.

                                        ***

మాదిగ వాడ పిల్లలు ఆరు నెలలు అట్లా కష్టపడి ప్రతి మనిషి గుండెలోకి జాంబవంతుడి తత్వాన్ని పంపించారు. ఆరునెలల్లో అనుకున్నట్లుగానే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు రానే వచ్చాయి.  ఇంతలోనే ఊరి పటేల్ రచ్చకట్టను కూలగొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మాదిగలలోనే ఒక ' బాంచన్ ' మాదిగను తయారుచేసి ఆయనకు ఏమేమో ఎర చూపి, మాదిగలకు వ్యతిరేకంగా మాట్లాడించడం ప్రారంభింపజేశాడు. ఒకనాడు ఒక మాదిగకు ఫుల్లుగా తాపిండు. లక్ష రూపాయలు ఇచ్చిండు. గడ్డపార ఇచ్చిండు. రచ్చకట్టను కూలగొట్టమని చెప్పి పంపిండు. ఆ డబ్బులు తీసుకున్న 'తుప్పలిగాడు' అనుకున్నట్టుగానే రచ్చకట్టను రాత్రికి రాత్రే కూలగొట్టాడు. పటేల్ కల ఫలించింది.
                                        ****
కూలిన రచ్చకట్ట మాదిగల్లో పౌరుషాన్ని మరింత పెంచింది.   ముఖ్యంగా యువకుల్లో.  ఎలక్షన్లో మాదిగలతో పాటు మాలలు కూడా కలిసి వచ్చారు. ఈ రెండు కులాలు కలిసి బీసీలలో ఎక్కువ జనాభా ఉన్న గౌడ కులాన్ని సంప్రదించారు. ఎప్పుడు రెడ్ల, పటేళ్ల ప్రాధాన్యమేనా? మనము ఈ ఊరిని పరిపాలించొద్దా? అని గౌడ బీసీలను ఇటువైపు తిప్పారు. బీసీ గౌడ కులం, మాదిగలు, మాలలు కలిస్తే ఆ ఊరు వన్ సైడ్ గా డిసైడ్ అయిపోతుంది. ఎక్కువ జనాభా ఉన్న మాదిగలకు సర్పంచ్, గౌడ కులానికి ఉపసర్పంచ్ ఒప్పందం జరిగింది. అనుకున్నట్టుగానే ఒప్పందం ప్రకారము  చక్కగా ప్రయాణం చేశారు. ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా  మాల, మాదిగ, గౌడ ఓట్లు అన్నీ  జాంబవంతుడికే పడ్డాయి. అప్పుడు ఓట్ల పెట్టెలో నుండి "మహారాజు" బయటికి వచ్చాడు. "జాంబవంతుడికి"  మళ్ళీ పూర్వవైభవం వచ్చింది.    కోల్పోయిన కిరీటం తిరిగి దక్కింది. ఆ ఊరి సర్పంచ్ పీఠాన్ని మాదిగ, ఉపసర్పంచ్ పీఠాన్ని గౌడ అధిరోహించారు.

ఈ ముచ్చట అన్ని ఊర్లకు తెలిసింది. ఈ ప్రయత్నం అన్ని ఊర్ల అంబేద్కర్ సంఘాలకు స్ఫూర్తి నింపింది.  మాదిగ యువకులు ఈ ప్రయత్నాన్ని తమ తమ ఊర్లలో కూడా  చేయాలనుకున్నారు. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇదే ఫార్ములాను ఉపయోగించి ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకోవాలని కూడా ప్లాన్ చేశారు.  అప్పుడు జాంబవంతుడు, భారత రాజ్యాంగం, అంబేద్కర్, ఫూలే  తమ కలలు ఫలించబోతున్నాయి అని తెలిసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నరు.

click me!