పసిపాపల నవ్వుల వంటి పువ్వులు : ‘పూలపూలవాన’

By SumaBala BukkaFirst Published Nov 23, 2022, 12:41 PM IST
Highlights

ఏనుగు నరసింహారెడ్డి ఇటీవల వెలువరించిన కవిత్వ సంపుటి ‘పూలపూలవాన’ పైన  గోపగాని రవీందర్‌ రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :

కొందరి కవుల కవిత్వం ద్రవింపజేస్తుంది. కొందరి కవుల కవిత్వం ఉత్తేజితులను చేస్తుంది. కొందరి కవులకవిత్వంలోద్రవింపజేసే, ఉత్తేజితులను చేసే రెండు లక్షణాలు ఉంటాయి. ఆధునిక తెలంగాణ తెలుగు కవిత్వంలో ఆర్థ్రతతో కూడిన మానవీయమైన కవిత్వానికి అచ్చమైన దాఖలా ఏనుగు నరసింహారెడ్డి కవితలు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రము లేదు. నిరంతర చదువరి ఆయన. కాలాన్ని ప్రయోజనాత్మకంగా ఉపయోగించుకునే అధికారిగానే కాకుండా సాహితీవేత్తగా కూడా మనకు దర్శనమైతారు. అనువాదాలు చేయడం, ప్రసంగాలు చేయడం, కవిత్వంలో ప్రయోగాలు చేయడమంటే ఆయనకు అమితమైన ఆసక్తి.  ‘రుబాయిలు’ వంటి ఉత్తమ గ్రంథాన్ని వెలువరించి పురస్కారాన్ని అందుకున్నారు. ముక్తకాల వంటి 285 చిన్న కవితలను సృజించి ‘పూల పూల వాన’ పేరుతో కవిత్వ ప్రేమికులకు కానుకగా అందించారు.

‘కొత్త ప్రదేశాల్ని చూసినప్పుడు, కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు, కొత్త అనుభవాలకు గురైనప్పుడు, పరవశించినప్పుడు,  పస్తాయించినపుడు, ప్రకృతి దినం దినం తనను తాను సజాయించుకుంటూ ఎదురైనప్పుడు, నాలో కొన్ని ఊహల ముత్యాలు రాలుతుంటాయి. సమయం రాత్రీ, పగలు ఎంతమాత్రం ఆగకుండా నడుస్తుండడం వల్ల అవి కొన్ని సార్లు పెద్ద కవితలుగా ఎదగలేదు. కానీ వస్తు మననం సందర్భపుటూహనైతే స్థిరపరుస్తూ వచ్చింది. భావ రమణీయకత ఎగిరిపోకుండా ఒడిసి పట్టుకోవడం వల్ల అవి ఇలా కాగితం చెట్టు మీద తమకు తాము పోత పోసుకున్న పూలైపోయాయి’ యని ‘ఊహల ముత్యాలు’ అంటూ రాసుకున్న మాటలో ఈ కవితల నేపధ్యాన్ని వివరించారు ఏనుగు  నరసింహారెడ్డి. మొత్తం మీద ఈ కవిత్వ పాదాలు మనతో పూల వంటి సంభాషణలు చేస్తాయి.

‘అంత విశాలమంటారా ఆకాశాన్ని / ఆనందంతో  గంతులేయడానికి / అంతరంగమంత పెద్దదేది /నాకింతవరకు కనపడనే లేదు’ అని తన చుట్టూ ఆవరించిన పరిసరాలు అంతరంగం కంటే పెద్దవి కావని తాత్వికతతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆకాశం వైశాల్యాన్ని కనుక్కోవచ్చు కానీ అంతరంగం లోతును తెలుసుకోలేమని అందుకనే అంతరంగమంతా పెద్దది ఏది లేదని అంటున్నారు. మనిషి జీవన ప్రయాణంలో అనేక అవరోధాలను ఎదుర్కొని ముందుకు సాగుతున్నట్లుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా చీల్చుకుని ముందుకు ప్రవహించేవి నదులు. అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నదులను ఆదర్శంగా తీసుకోవాలంటారు. అట్లాంటి వాటి గూర్చి పరవశంతో ఈ కవితలో చెట్లు ఎదగడానికి టానిక్‌ లాంటి నీరును అందిస్తుందని అంటున్నారు కవి.  ‘పారితే సరిపోయే కాలువ / పాట కూడా పాడుతుంది / ఆగితే సరిపోయే జలరాశి /చెట్లకు టానిక్కౌతుంది’.

శ్రమజీవుల ఆకలి పోరాటం అందరిని కలిచి వేస్తుంది. పనులు చేయక తప్పదు. చేసే పనిలోని సౌందర్యాన్ని చూడడం కవుల ప్రత్యేకత అనవచ్చును.  ఏర్చి కూర్చిన అక్షరాల్లో చెమట చుక్కల గుభాళింపులుంటాయి. ఎవరి కుల వృత్తి అయినా కూడా కష్టసాధ్యమే. ఏదైన సాధనతోనే సాధ్యం. గీతకార్మికుల వృత్తి నిత్యం చావుబతుకులతో పోరాటమే. తాటిచెట్టుపైకి ఎక్కడం దిగడం నిత్యకృత్యమే. చెట్టుపై నుండి పడటం, జారడం వలన ఎందరో గౌడులు చనిపోయారు.  వాళ్ళ జీవనమే ఒక సాహసం.    రోజు తాటిచెట్టు ఎక్కినప్పుడు కనిపించే ఊరు దృశ్యంను గూర్చి ఇలా అంటున్నారు కవి.  ‘ఊరిని లాంగ్‌ షాట్‌లో / గీతన్నకు చూపించడమే కాదు / మాకు లోకాన్ని ఊపి చూపిస్తది / మా వూరి ఎవరెస్టు’ తాటిచెట్టును మా ఊరి ఎవరెస్టు అని చక్కగా పోల్చారు. మరోకవితలో -  ‘తాటి చెట్టులో/ కల్లొక్కటే చూస్తే ఎలా/ఆ తల్లి / కావ్యాల్ని మోసింది’ అని గౌడుల జీవన రాగాల్ని వర్ణించారు. గౌడన్నల గూర్చి మరో కవితలో ఇలా రాసారు. ‘గౌడు చెట్టెక్కి / చుక్కల్ని చూస్తాడు / మోకు విప్పి /అంపశయ్యపై పవళిస్తాడు’

సాహిత్య సభల్లో ఎక్కువగా పాల్గొని ప్రసంగాలు చేస్తుంటారు ఈ కవి. కవిసమ్మేళనాలు జరుగుతున్న తీరును తన చిన్న కవితల్లో ఉటంకించకుండ ఉండలేకపోయారు. ‘‘కవిత్వం సభలు / ఎలా ఉంటాయంటే ఏం చెబుదాం / పచ్చిక బయళ్ళలో / పసి పిల్లలు దొర్లినట్లు’ అని మనతో ముచ్చటించారు.  ‘ఏ సమ్మేళనంలోనూ / కవులందరూ పట్టరు / గొనిగే కవులు మిగలరు’ అని స్పష్టంగా తన భావాలను వ్యక్తీకరించారు. సాధారణంగా ఒక హోదాలో ఉన్న వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి ప్రశంసలు కురిపిస్తుంటారు. ఒక్కొక్కసారి అవి అతిగా కూడా అనిపిస్తాయి. తన పని తాను సక్రమంగా చేసుకుంటుపోయే ఈ కవికి ఆ పొగడ్తల పట్ల కలవరపాటు కూడా ఉన్నది. అందుకే ఈ వాక్యాల్లో తన భయాన్ని మనతో పంచుకుంటున్నారు.  ‘ఎప్పుడూ ప్రశంసించే వాళ్లంటే / నాకు మహా భయం / ఎన్నడైనా/విరుద్ధంగా మాట్లాడతారో ఏమోనని’.

మాటలు కోటలు దాటుతాయంటారు. చేతలు గడప కూడా దాటవని తరచుగా మనం వింటూవుంటాం. తోటి వారికి సహాయం చేయలనే ఆశయం ఉండడం అభినందనీయమైనదే.  మన చుట్టూ ఉన్న మనుషుల్లోని స్వభావాలు మనకు తెలియాలంటే ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఆచరణతోనే అంచనా వేస్తాం.  తుఫాను వచ్చినప్పుడే ఎవరేంటో తెలుస్తుందని ఈ కవితా పాదాల్లో ‘ పెను తుఫాను రావలసిందే / ఎవరు ముఖం చాటేస్తారో /ఎవరు చేయి చాపి / ఆసరా ఇస్తారో చూడాలిగా’   అంటున్నారు. మనుషుల చేష్టలు అందరివి ఒకే రకంగా ఉండవు. అవసరాల రీత్యా మారుతుంటారు. వారి పట్ల కవి గారికి సానుభూతి ఉన్నది. వాళ్ళతో కాని పనులు చేయిస్తున్నది ఆకలి  అని గుర్తించారు.  ‘ మనుషుల చర్యలంటే / నాకు కోపమే / వాటి వెనకనున్న / ఆకలంటేనే ఇష్టం’ మని ప్రకటించారు.

తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శిగా పనిచేసిన కాలంలోనే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు.  తెలంగాణలోని కవులు, రచయితలు రవీంద్రభారతిలో జరిగే సాహిత్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుకుంటారు. కానీ అది అందరికి సాధ్యం కాదు. అక్కడ నిర్వహించే కార్యక్రమాల గూర్చి ప్రత్యక్ష అనుభవంతో ఎవరిని నిందించకుండానే ఆ వ్యవహారాలను ఈ కవితలో ఇలా చెప్తున్నారు -  ‘రవీంద్రభారతి /ఒక కంప్రెస్డ్‌ వరల్డ్‌ / మిగితా లోకం కన్నా ఎక్కువ / ఇగోలు, అవసరాలు’ అంటున్న ఈ కవితా పంక్తులే కాదనలేని వాస్తవాలు.

మానవీయమైన సంబంధాలు సమాజంలో బలపడాలనే అందరు కోరుకుంటారు. రక్త సంబంధాలు, కుటుంబ అనుబంధాలు, స్నేహ బంధాలు దృఢంగా ఉన్నప్పుడే ప్రశాంతమైన సంబంధాలు మనుషుల మధ్యన వెల్లివిరుస్తాయి. కవుల,రచయితల సృజనాత్మకమైన రచనలు అందుకు దోహదపడాలని కోరుకుంటారు. ఒక శాంతియుతమైన సమాజ నిర్మాణాన్ని కాంక్షిస్తున్న నరసింహారెడ్డి  కుటుంబ బంధాలు విచ్చిన్నమౌతున్న వైనానికి కలత చెందుతూనే ఈ కవితను రాసారు. ‘అన్నకు / ఆయుధమైన తమ్ముడు / అక్కను అనుసరించే చెల్లెలు / ఆధునికంలో కాటగలిసిండ్రు’.          

లోకంలోని మనుషుల పోకడను అర్థం చేసుకోవడం అంత సరళమైన విషయం మాత్రం కాదు. భిన్నమైన ప్రవర్తనలతో ఎదురైన అనుభవాలకు చక్కని అక్షరాల కూర్పు ఈ కవిత -  ‘లోకం / అసలే అర్థం కావట్లేదు / ఇక లోలోపలికి / తొంగి చూసుకోవాలి’ అని అంటున్నారు.     జన్మించిన వారికి మరణం తప్పదు. ఈ లోకం నుండి విడిచిపోయే ముందుగానే అందరి ఋణం తీర్చుకోవాలని కవి ఆరాటం ఈ కవితలో చదువుతాము - ‘తిరుగు ప్రయాణం లేని /చివరి రైలెక్కక ముందే / ఎవరికైనా బాకీ పడ్డామేమో /తరచి తరచి చూసుకోవాలి’.

‘కొమ్మ ఊపినట్లు ఊగాలని / కోయిల చెట్టెక్కింది / కొమ్మ అసలే కదల లేదు / ఊపాల్సింది గాలి కదా’ అన్న ఈ కవితలో ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుంటే కూడా మనమే బాధపడితే ఎలా అన్నట్లుగా ఉన్నది. ‘ఏ పడవా లేకుంటే / నది మాత్రం ఎలా శోభిస్తది / నింగి నది అద్దంలో మెరవాలంటే / ఒక్క మేఘమైనా ఉండాలి కదా’ నదిలో పడవ వుంటేనే అందం, ఆకాశంలో మేఘాలు వుంటేనే శోభిల్లునట్లుగా మనిషికి ఆశయం వుండాలని అప్పుడే జీవితం శోభిల్లుతుంటారు.  ‘ఇంత అనుభవమున్నా / రోజు మర్చిపోతూనే ఉంటా / అసలు ముచ్చట చెప్పటానికి ముందు / తేనె పూసిన సుదీర్ఘ ఉపోద్ఘాతాలుంటాయని’ - ఏదైనా విషయాలను సూటిగా చెప్పాలని, అనుభమున్నవారు సైతం అనవసరమైన విషయాలను ప్రస్తావించడాన్ని గూర్చి వివరించారు. 

ఎవరికైనా అధ్యయనం అవసరం. ఏది చదవకుండానే  గొప్పవారు అనిపించుకోవడం సరైనది కాదని ‘ఒక్క కావ్యమైనా చదివావా / అంతరిక్ష లోతుల్లోకి ఇంకే దాకా /ఒక్క రోజైనా గడిపావా / మనసే చెప్పిన మాట విని’ చురకలు అంటించారు.  ప్రకృతిలోని రమణీయతకు ముచ్చటపడని వారు ఉండరు. ‘ప్రకృతి పూసిందని కాదు / పాప నవ్విందని / కురిసింది / పూలపూలవాన’ పసిపాపల నవ్వుల వంటి పువ్వులే ఈ ‘పూలపూలవాన’ కవితలు. కవి భావాల అక్షరానుభూతుల్లో తడిసిముద్దకావాల్సిందే..! ఈ కవితా సంపుటిని పాలపిట్ట బుక్స్ ప్రచురణగా వెలువరించిన గుడిపాటి గారికి అభినందనలు.

click me!