గజల్ రచయిత్రి బైరి ఇందిర క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఆదివారం కన్నుమూశారు.
హైదరాబాద్ : క్యాన్సర్ తో పోరాడుతూ ప్రముఖ గజల్ రచయిత్రి బైరి ఇందిర తన 61 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. హైదరాబాద్, కూకట్పల్లిలోని తన ఇంట్లో ఆమె ఆదివారం నాడు కన్నుమూశారు. గజల్ రచయిత్రిగా, కవయిత్రిగా సాహితీ సామ్రాజ్యంలో ప్రఖ్యాతిగాంచారు బైరి ఇందిర. కొంతకాలంగా ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయినా ఎప్పుడూ ఆత్మస్థైర్యాన్ని వీడలేదు. ఆదివారం ఆమె మృతితో సాహితీలోకం విషాదంలో మునిగిపోయింది. తన చావు గురించి ముందే ఆమె రాసుకున్న ఒక కవిత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#నేను పోయినప్పుడు ....
undefined
నేను పోయినప్పుడు
ఓ కాగితాన్ని కప్పండి
రాసుకోడానికి పనికొస్తుంది
మట్టిలో కప్పెట్టకండి
మరీ గాలాడదు
పురుగూ పుట్రా ఉంటాయ్!
పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్
బ్యాగులో ఉండేలా చూడండి
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను
దండలు గిండలు వెయ్యకండి
నాకు ఎలర్జీ!
పసుపు గట్రా పూసి
భయంకరంగా మార్చకండి
పిల్లలు ఝడుసుకుంటారు
పైగా నన్ను గుర్తుపట్టాలి కదా
పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నాకు చిర్రెత్తుకొస్తుంది
నా సామాన్లన్నీ పడేయకండి
అడిగినవాళ్లకు ఇచ్చేయండి
మంగళవారమైనా సరే,
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
ఇప్పుడైనా నా మాట నెగ్గనియ్యండి
డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
ఏదైనా టైం ప్రకారం జరగాలి
కాస్త చూసి తగలబెట్టండి
పక్కన మొక్కలుంటాయేమో!
బడికి ఇన్ఫామ్ చెయ్యండి
వాళ్లు సెలవిచ్చుకుంటారు
దేనికీ ఇబ్బంది పడకండి
గొల్లవాళ్ల కొట్లో ఖాతా ఉంది
పిట్టకు పెట్టేదున్నా లేకున్నా
అన్ని రోజులూ అందరు
ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి ...
పనిలో పని
కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉ(వి)న్నట్టుంటుంది!
ఈ కవితను తన వీలునామగా రాసుకున్నారు ఆవిడ. బైరి ఇందిర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో జన్మించారు. కొత్తగూడెం, వరంగల్, హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశారు. బైరి ఇందిర తండ్రి బైరి రామ్మూర్తి. ఆయన ప్రోత్సాహంతోనే బైరి ఇందిర బాల్యం నుంచే సాహిత్యంపై ఇష్టం పెంచుకున్నారు. పెళ్లి తర్వాత హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆమె భర్త రామ శంకరయ్య. బైరి ఇందిర ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ప్రధానోపాధ్యాయురాలిగా రిటైర్ అయ్యారు. గజల్ భారతం, మన కవులు, తెలంగాణ గజల్ కావ్యం, సవ్వడి వంటి గజల్స్ సంకలనాలు ఆమె రచనలు. ఇవి ఆమెకు మంచి పేరు తీసుకువచ్చాయి.
ఉమ్మడి రాష్ట్రంలో సాహితీ స్రవంతి కార్యకర్తగా ఖమ్మం, హైదరాబాద్ లలో జరిగిన జనకవనం, సాహిత్య కార్యశాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమెకు రావి రంగారావు సాహిత్య కళా పీఠం నుంచి జనరంజక కవి పురస్కారం కూడా వరించింది. మహిళా గజల్ రచయితల్లో గజల్స్ సంకలనాలను విడుదల చేసిన తొలి రచయిత్రిగా చరిత్ర సృష్టించారు. తల్లి వారసత్వాన్ని ఆమె కుమార్తె హిమజారామం అందిపుచ్చుకున్నారు. ఆమె కూడా గజల్ గాయని.