పుస్తక సమీక్ష : సమస్యల మధ్య సంఘర్షణ " దృక్పథ సమూహం "

By Arun Kumar P  |  First Published Jun 24, 2022, 11:30 AM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బోడబండ తండా వాసి మేనావత్ రాందాస్ కవితా సంపుటి  " దృక్పథ సమూహం " పైన నాగర్ కర్నూల్ నుండి వేదార్థం మధుసూదన శర్మ చేసిన సమీక్ష ఇక్కడ చదవండి. 


ఎక్కడో అడవి తల్లి ఒడిలో, బంజారా జాతిలో పుట్టి అనేక సమస్యల సుడిగుండంలో చిక్కుకుని, పేదరికం, ఆకలి, అవిద్య, నిరుద్యోగం ఆపై నిరాశ్రయం  వంటి పలు సమస్యలను ఎదుర్కొన్నవాడిగా తన ఆవేదనను, బాధను కవిత్వ రూపంలో వ్యక్తీకరించిన ఆలోచనాలోచనాల సమాహారమే మేనావత్ రాందాస్   రచించిన  "దృక్పథ సమూహం" కవితా సంపుటి.

పూర్వపు పాలమూరు జిల్లా, నేటి నాగర్ కర్నూలు జిల్లా లోని కొల్లాపూర్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బోడబండ తండా గ్రామానికి చెందిన రాందాస్ గిరిజన ప్రాంతంలో జన్మించిన యువకిశోరం.  బాల్యము నుండి అనేక కష్టాలతో పోరాడి మనసున్న మంచి మనుషుల సహాయంతో హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్ కార్యాలయంలో చిరు ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు.

Latest Videos

భాషా సంస్కృతుల వికాసానికి వేదికగా నేటికీ తన ప్రాభవాన్ని చాటుతున్న పరిషత్తు అనే మహావృక్షం నీడలో ఉద్యోగం చేస్తూ, అక్కడే తన ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. ఎందరో కవులు, రచయితలు సాంగత్యంతో అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆ స్ఫూర్తితో కవిత్వం రాయడం అలవాటు చేసుకున్నాడు. సమాజంలోని అనేక విషయాలపై స్పందిస్తూ, తనదైన శైలిలో కవిత్వం రాస్తూ ముందుకు సాగుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొని తన కవిత్వ పటిమను ప్రదర్శించి, యువ కవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అలా వారు రాసిన కవితలలో ఉత్తమమైన 51 కవితలను ఏరి కూర్చి  " దృక్పథ సమూహం " పేరుతో ఒక గ్రంథంగా మన ముందు ఉంచాడు రామదాసు.   ఇందులోని శ్రమజీవి విముక్తి, కదిలించిన కేరళ, ఏ దారి లేని గోదారి, జలం, అవమానం, ఆర్టీసీ సమ్మె, యురేనియం- మాకు ఉరే నయం, అమ్మ పై అరాచకమా, జాలి లేని రోజు, జూలు పెంట గట్టు, కన్న తల్లి- మన పల్లె తల్లి వంటి అనేక కవితలు వివిధ సామాజిక అంశాల నేపథ్యంలో పాఠకులలో ఆలోచనలను రేకెత్తించేట్లుగా ఉన్నాయి.

కవి రాందాస్ యొక్క స్వగ్రామం సమీపంలో అనేక ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా ఆ ప్రాంతంలో ప్రజల నివాసాలు, పంట పొలాలు కోల్పోయి ఊర్లకు ఊర్లు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక  మంది నిరాశ్రయులైన వారి కన్నీటి గాథలను చూసి మనసు ద్రవించి, రాందాస్ కలం నుండి జాలువారిన కవిత ' ఏ దారి లేని గోదారి '.  ఈ కవితలో

"ఏ దారి లేని గోదారి
మా జీవితాలకు లేదా రహదారి ?
మేము పుట్టిన నేల కూడా మాకు కరువైపోయింది
మా ఊరు చుట్టూ మోగుతున్న భజనపరుల శతకాలు
శవాలను కూడా పూడ్చుకోలేని అభాగ్య జీవులము మేము
ఉన్న కాస్త భూమిని కోల్పోయిన దివాలాలము"---- అని తన పల్లె పడుతున్న  గోసను ఎంతో ఆవేదనతో,ఆర్థతతో చిత్రించాడు. 

' మనసుతో గెలవాలి' అనే కవితలో కవి
"నా తల్లి గర్భంలో నేను పెరుగుతున్నప్పుడు
నా చుట్టూ ఉమ్మనీరు సముద్రం
అవనిపై నేను అడిగినప్పుడు నా చుట్టూ ఉప్పునీటి సంద్రం
ఏ దిక్కున చూసినా కుల మతాల పేరుతో ఉగ్రవాదం
మనిషికి మనిషికి మధ్య పెను విషాదం
ఏ మూలన వెతికినా అవినీతి చిహ్నాలే
మంచు కొండల గుండెల్లో దిగుతున్న కత్తులు "
అని చెప్తూ -

" ఎన్ని చట్టాలు వచ్చినా రైలు పట్టాలుగా మారడమే
సూక్తులకు ఆచరణకు పొంతన లేదు
నీతి నియమాలు పుస్తకాలకే అంకితం
తాము చెప్పే సిద్ధాంతాలు పాటించని మహనీయులెందరో "---
అని నాయకుల పై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించాడు.

ఇదే సందర్భంలో
" బాధితుల కన్నీటి ధారలను తుడవడానికి ప్రతి ఒక్కరు అంబేద్కరులై వెలగాలి
మనిషిని మనసుతోనే గెలవాలి "
అని ప్రజల బాధ్యతలను కూడా ఈ సందర్బంగా గుర్తు చేశారు రాందాస్.

బాలికలపై జరుగుతున్న అమానుష  అకృత్యాలను ఖండిస్తూ కవి  ' అందమైన గులాబీ ' అనే కవితలో తన అభిప్రాయాలను ఇలా వెలిబుచ్చారు. బాలికలను సున్నితమైన అందమైన గులాబీలతో పోల్చడం అనేది వారి భావ వ్యక్తీకరణ నైపుణ్యం.

"హాయిగా వికసించే ఆ అందమైన గులాబీకి
దుర్మార్గులు అందిస్తున్న రక్తపు మరకలు
మానవ మృగాలకు అది శాపం
మెత్తని పూలరేకులను చిదిమేసిన పాపం
అంతరించి పోతున్నది పుష్పాల పరిమళం
ఫలితం- మృదు హృదయాల కలవరం"
....అంటాడు.

అలాగే
" మాయమైపోతున్నది
మనిషీ మనుషుల బంధం
అది ఎవరికీ ఉపయోగపడని బూటకపు నాటక రణరంగం
పసి మొగ్గల గుండెను నిమురుతూ అరాచకం  అంతుచిక్కని పెంట కుప్పలో పురుగుల ప్రయాణం
దుర్మార్గుల పన్నాగాల రహస్య కోణం
వారి నరనరాల్లో ఉప్పొంగే విషం
ఇంకెప్పుడు ఈ ఎర్ర గులాబీకి రక్ష?"... అంటూ ప్రశ్నిస్తున్నాడు కవి.

' స్త్రీ యే ఆధారం 'అనే మరో కవితలో

"స్త్రీ యే సృష్టికి మూలాధారం
ఆమే ఈ ప్రపంచానికి సింధూరం"
అని స్త్రీ గొప్పతనాన్ని అని చెప్పారు.  ఇదే సంపుటిలో మరో చోట స్త్రీలపై జరిగే అత్యాచారాలు, అరాచకాలను ఖండిస్తూ, ' అమ్మ పై అరాచకమా? '  అనే కవితలో 
"ఒంటరి మహిళను పసిగడుతున్న గుంట నక్కలు
తడబడే బుడిబుడి అడుగులపై నెత్తురు చిమ్మిన ఊర కుక్కలు
తామరులకూ, కలువలకూ చెదిరిన కల
భారతావని కన్నీరు కాలువలై ప్రవహించింది
గుండె గుండె లోన"...
అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇలా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి తనదైన శైలిలో అసహనం వ్యక్తం చేశాడు.  అలాగే ఏదో రూపంలో తనకు జరుగుతున్న అవమానాన్ని కూడా  ' అవమానం '  అనే శీర్షికలో ఇలా తన బాధను వెలిబుచ్చాడు.
"అడుగడుగునా జరుగుతున్న అవమానం
ఆ అవమానమే నాకు దొరికిన బహుమానం
నిరంతరం సాగుతున్న నా అక్షరాలకు
అప్పుడప్పుడు అక్కడక్కడా జరుగుతున్న సన్మానం "

అలాగే  ' నన్ను నమ్ము ' అనే కవితలో
"ఆ పూట దళారులు పెంచుకున్న ద్వేషం
నమ్మిన అన్నార్తులకు చేసిన మోసం
అక్షర రూపంలో నైనా అందరికీ చెప్పకపోతే నా దోషం"... అని, కవిగా సమాజంపై తనకున్న బాధ్యతను గుర్తు చేసుకున్నాడు.

ఇలా అనేక సామాజిక అంశాల ప్రస్తావన చేసిన రాందాస్ తెలుగు భాష గొప్పతనాన్ని గురించి గొప్పగా చెప్తూ, తెలుగు భాషను కాపాడుకోవడంపై ప్రతి ఒక్కరి బాధ్యతను  ' తేట తేనే తెలుగు '  అనే కవితలో ఇలా సం భోధించాడు.

"పరాయి భాషతో జీతం
మన భాషతో మాత్రమే సంపూర్ణ జీవితం
ఇంటా బయట  ప్రతిచోటా తెలుగెత్తి జైకొట్టు
మహనీయులు శోధించి సాధించిన పరిశోధన ఫలితాలపై గురి పెట్టు
నీ మేధస్సును విల్లుగా నీ కలాన్ని బాణంగా చేసి ఎక్కు పెట్టు
తల్లి భాషతోనే కదా ప్రతి ఒక్కరు ఎక్కాల్సింది మెట్టు మెట్టు".... అన్నాడు.

అంతేగాక మంచి కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలను         ' కవిత్వం ' అనే కవితలో

"నిబిడీకృతమైన భావుకతే  కవిత్వం
లావాలా పెల్లుబుకి పారేదే కవిత్వం
అక్షర వస్త్ర అక్షయాస్త్ర  రూపమే కవిత్వం
సజ్జన సృష్టికి సోపానమే కవిత్వం" -
అని నొక్కి వక్కాణించాడు.

తెలుగు భాషా వికాసానికి తమ రచనలతో కృషిచేసిన, అజరామరమైన సాహితీ మూర్తులకు వివిధ కవితల ద్వారా అక్షర నీరాజనాలు అర్పించాడు ఈ కవితా సంపుటిలో.   జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య  సి.నారాయణ రెడ్డి  గురించి -
"మనకందరికీ దేవుడిచ్చిన వరం
వారి కలం మనకు ఎంతో బలం...."
అంటూ రాందాస్ జీవితానికి మార్గదర్శకులైన సినారెకు ఈ కవితా సంపుటిని అంకితమిచ్చాడు. అంతేగాక మహాత్మా గాంధీ, కందుకూరి వీరేశలింగం పంతులు, దాశరధి కృష్ణమాచార్య, డాక్టర్ బోయి భీమన్న, కాళోజి నారాయణ రావు వంటి ప్రముఖులతోపాటు ముప్పవరపు వెంకయ్య నాయుడు, డా. సిల్మా నాయక్ వంటి వారి ద్వారా తాను పొందిన స్పూర్తిని పేర్కొంటూ వివిధ కవితలలో తనదైన రీతిలో వారిని ప్రస్తుతించారు.

" కశ్మీరు అమరవీరులు  త్యాగాల సూర్యులు
పుల్వామాలో రాలిన పున్నమి నాటి చంద్రులు... "
అని పుల్వామా దాడిలో అమరులైన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ తన కవిత్వం ద్వారా వారికి వందన సమర్పణ చేశాడు కవి.

ఇలా చిక్కని కవిత్వంతో, భిన్నమైన కవితా వస్తువులతో, వైవిధ్యమైన కవితా లక్షణాలతో యువ కవి మేనావత్ రాందాస్ రచించిన "దృక్పథ సమూహం " అనే ఈ గ్రంథం పాఠకాదరణ పొందడం ఖాయం.

click me!